ప్రొద్దుటూరు క్రైం : మట్కా, క్రికెట్ పందేలు, పేకాట ఈ మూడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. సామాన్యుడి నుంచి కోట్లకు పడగలెత్తిన వారు సైతం వీటిలో ఏదోఒక జూదం ఆడుతున్నారు. కొందరు నిర్వహిస్తున్నారు. వీటిని నియంత్రించడంలో పోలీసుల కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. కానిస్టేబుల్ మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అసాంఘిక కార్యకలాపాలను రూపు మాపడానికి అహర్శిశలు కృషి చేస్తున్నారు. రోజు వారి విధులు, ఉత్సవాలు, వీఐపీల బందోబస్తులు ఎన్ని ఉన్నా మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు సిబ్బంది పోలీసు శాఖకు మాయని మచ్చ తెస్తున్నారు. పోలీసుల్లో కొందరు క్రికెట్ పందేలను ఆడటమే గాక బుకీలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రికెట్ బుకీలపై దాడి చేసిన నేపథ్యంలో పోలీసు– బుకీల బంధం బయట పడింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బుకీ ల్యాప్‌టాప్‌లో పోలీసుల నెంబర్లు
కొన్ని రోజుల క్రితం కడప పోలీసులు బెంగళూరులో దాడులు నిర్వహించి పలువురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. కొంత డబ్బుతో పాటు వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రొద్దుటూరులోని 30 మందికి పైగా క్రికెట్ బుకీలు, సబ్ బుకీలు, బాయ్‌ల పేర్లు, సెల్‌నెంబర్లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లు కూడా ఉన్నాయి. పోలీసుల పేర్లను పక్కన పెట్టిన అధికారులు ముందుగా ల్యాప్‌టాప్‌లో ఉన్న బుకీల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని రోజుల క్రితమే బుకీలకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టిన అధికారులు పోలీసుల పాత్రపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ప్రొద్దుటూరులోని ముగ్గురు కానిస్టేబుళ్లను పలు మార్లు విచారణ కూడా చేసినట్లు తెలుస్తోంది. కానిస్టేబుళ్లతో సంబంధాలు ఉన్న ప్రధాన బుకీల వివరాలను అధికారులు సేకరించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన స్థానిక అధికారులు నివేదికను జిల్లా అధికారులకు పంపినట్లు సమాచారం.
బుకీలకు సమాచారం ఇవ్వడంపై సీరియస్..
మట్కా, క్రికెట్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. అయితే మట్కా కంపెనీ నిర్వాహకులు, క్రికెట్ బుకీలతో సంబంధాలను కొనసాగించడాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. దాడుల సమాచారాన్ని వారికి చేరవేయడం, వారితో నెల మామూళ్లు తీసుకోవడం తదితర అంశాల పట్ల జిల్లా ఎస్పీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఒక లాడ్జిలో క్రికెట్ బుకీలు ఉన్నారని ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. పక్కా ప్లాన్‌తో పోలీసులు బెంగళూరుకు వెళ్లగా అక్కడి లాడ్జీలో ఎవ్వరూ లేరు. స్థానికంగా ఉన్న కొందరు పోలీసులు బుకీలకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గ్రహించారు. ఇలా అనేక సార్లు దాడుల సమాచారం బుకీలకు, మట్కా కంపెనీ నిర్వాహకులకు అందడంతో ప్రొద్దుటూరు పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుకీలతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న కొందరిని పిలిపించి అధికారులు విచారణ చేశారు.
కానిస్టేబుల్‌పై వేటుతోనైనా మారతారా..
ఈ క్రమంలోనే ఒంటిమిట్టకు చెందిన ఓబులేసు అనే కానిస్టేబుల్‌పై పోలీసు అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రీ టౌన్ పోలీసులు కొందరు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకొని విచారించగా ఒంటిమిట్ట కానిస్టేబుల్ పేరు బయటికి వచ్చింది. త్రీ టౌన్ పోలీసులు కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి వారం రోజుల క్రితం రిమాండుకు పంపించారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇంటికే
ఒంటిమిట్ట కానిస్టేబుల్‌కు బుకీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టాం. క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ,బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశాం. క్రికెట్ బుకీలకు సహకరించే వారు, అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు ఇంటికి వెళ్తారు. ఎవ్వరిని వదలం.– శ్రీనివాసరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment