నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీసు అధికారులు
కడప అర్బన్: పగటి పూట తాళం వేసి ఉన్న ఇంటిని రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లి ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళుతూ గత ఆరేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాసాపేట దొరల ఘోరీల వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కడప నగరం కుమ్మరికుంట వీధికి చెందిన షేక్ మహమ్మద్ హుసేన్ స్కూటిలో వెళుతూ అనుమానంగా ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తాను 2012 నుంచి దొంగతనాలకు పాల్పడేవాడినని, 2018లో కూడా దొంగతనానికి పాల్పడ్డానని పోలీసులకు తెలిపాడు. ఈ సందర్భంగా నిందితుని అరెస్టు వివరాలను శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎ.శ్రీనివాసరెడ్డి వివరించారు.
♦ కడప నగరానికి చెందిన షేక్ మహమ్మద్ హుసేన్ అనే ఘరానా దొంగ 2012 నుంచి 53 దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. వీటిల్లో కడప టుటౌన్ పరిధిలో 32, తాలూకా పరిధిలో 14, వన్‌టౌన్ పరిధిలో 4, చిన్నచౌకు పరిధిలో 3 దొంగతనాలు చేశాడని తెలిపారు.
♦ నిందితుడు గతంలో స్వర్ణకారుడిగా పని చేసేవాడని, బెట్టింగ్ వ్యసనంతో అప్పులపాలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇతను విలక్షణమైన శైలిలో దొంగతనాలు చేస్తూ 53 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడన్నారు.
♦ పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో తాను లక్ష్యం చేసుకున్న ఇళ్లల్లో ఎంచక్కా తన పని ముగించేవాడని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్దనుంచి 2.054 కిలోల బంగారు ఆభరణాలు, 4.743 కిలోల వెండి ఆభరణాలు, 1,47,140 రూపాయలు నగదు, స్కూటీ, ఇనుపరాడ్డు, మూడు తాళం చెవుల గుత్తులు, రెండు ఉలులు, పాస్‌పోర్టు సీజ్ చేశామన్నారు.
♦ నిందితుడు దొంగతనాలకు పాల్పడుతూనే పాస్‌పోర్టు, వీజాలను తెప్పించుకుని గల్ఫ్ దేశాలకు కూడా వెళ్లి వచ్చేవాడని విచారణలో తేలిందన్నారు.
♦ చాకచక్యంతో ఘరానా దొంగ షేక్ మహమ్మద్ హుసేన్‌ను అరెస్టు చేసిన కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, సీసీఎస్ డీఎస్పీ జి.నాగేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, టుటౌన్ ఎస్‌ఐ జి.అమర్‌నాథరెడ్డి, టుటౌన్ హెడ్ కానిస్టేబుల్ చాంద్‌బాషా, కానిస్టేబుళ్లు బాలకృష్ణారెడ్డి, భాస్కర్, డీఎస్పీ క్రైం పార్టీ కానిస్టేబుళ్లు హుసేన్, నరేంద్ర, శేఖర్, గోపినాథ్, సుధాకర్‌లను జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీనివాసరెడ్డి అభినందించారు.
దొంగ ఎలా దొరికాడంటే..
ఈ సంఘటనలో నిందితుడైన షేక్ మహమ్మద్ హుసేన్ గతంలో చోరీలకు పాల్పడినప్పుడు ఓ ఇంటి సీసీ కెమెరాలో చిక్కాడు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ మహమ్మద్ హుసేన్‌పై పోలీసులు నిఘా పెంచారు. దీంతో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment