
అరెస్ట్ వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ మాసుంబాషా (ఇన్‌సెట్) స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు
కడప అర్బన్ : జల్సాల కోసం చోరీలు చేయడం మొదలుపెట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను చిన్నచౌక్ సీఐ ఎస్. పద్మనాభన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆర్‌వీ కొండారెడ్డి, తమ సిబ్బందితో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,03,000 విలువైన 101గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలను కడప డీఎస్పీ సేక్ మాసుంబాషా తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం వెల్లడించారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోటగుడి బండగ్రామం, చొక్కనవారిపల్లెకు చెందిన పిట్టి శరత్‌కుమార్, మదనపల్లె, ఎంఎస్‌ఆర్ వీధికి చెందిన కొట్టి నరేష్ జల్సాలకు అలావాటు పడ్డారు. డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడేవారన్నారు. శరత్‌కుమార్ తన మామ ఇంటిలో రూ.80 వేలు నగదు చోరీ చేసి కేసులో మదనపల్లి సబ్‌జైలులో శిక్ష అనుభవించి విడుదల అయ్యి, తర్వాత రెండవ నిందితుడితో స్నేహం చేశాడన్నారు. ఇద్దరు కలిసి కడపకు వచ్చి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృత్యుంజయకుంటలో ఓ చోరీ, ఒన్‌టౌన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడ్డారన్నారు. చిన్నచౌక్ పరిధిలో ఒక కేసు, ఒన్‌టౌన్ పీఎస్‌లో రెండు కేసులలో పై బరువున్న, విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.
చోరీకి పాల్పడిన దొంగ అరెస్టు
కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంకరాపురానికి చెందిన మంద వంశీకృష్ణ అనే యువకుడు 2016లో ఓ వివాహానికి వెళ్లి అక్కడ గదిలో ఓ బ్యాగ్‌ను చోరీ చేశాడు. బ్యాగ్‌లో రూ. 95,100 విలువైన 31.700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5000 నగదుతో పరారయ్యాడు. నిందితుడిని ఈనెల 5 వ తేదీ కడప నగర శివార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నగదు, ఆభరణాలు రికవరీ చేశారు. పైరెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన చిన్నచౌక్ సీఐ పద్మనాభన్, ఎస్‌ఐ ఆర్‌వీ కొండారెడ్డిలతో పాటు సిబ్బందిని డీఎస్పీ షేక్ మాసుంబాషా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment