జగన్‌ చిన్నాన్న దారుణ హత్య... | YS Vivekananda Reddy Brutal Murder YSR Kadapa | Sakshi
Sakshi News home page

వైఎస్‌ వివేకా దారుణ హత్య...

Published Sat, Mar 16 2019 2:00 AM | Last Updated on Sat, Mar 16 2019 3:23 PM

YS Vivekananda Reddy Brutal Murder YSR Kadapa - Sakshi

3. వివేకానందరెడ్డి పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి

వైఎస్‌ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నారు. ఎన్నికల రణరంగంలో ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పిరికిపందల్లా దొంగ దెబ్బ తీశారు. ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు చిమ్మచీకట్లో దారుణంగా హత్య చేశారు. ఈసారి కడప జిల్లాను ఎలాగైనా సొంతం చేసుకుంటామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలే వివేకానందరెడ్డి ప్రాణాలను బలిగొన్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు కంటతడి పెడుతున్నారు.

అత్యంత సౌమ్యుడు, మృదుస్వభావి, స్నేహశీలి అయిన తన చిన్నాన్న విగతజీవిగా మారడం చూసి జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. మొదట తన తాతను చంపారని, తర్వాత తనపై హత్యాయత్నం చేశారని, ఇప్పుడు చిన్నాన్న ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయని అన్నారు. అసెంబ్లీకి మళ్లీ ఎలా వస్తావో చూస్తానంటూ చంద్రబాబు హెచ్చరించిన మరుసటి రోజే తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారని గుర్తుచేశారు.
 

సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్‌ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. పులివెందులలోని తన ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ను శుక్రవారం వేకువజామున దుండగులు తలపై నరికి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా తలపై నరకడంతోనే మృతి చెందినట్లు రిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. ఆయన శరీరంపై మొత్తం ఏడు చోట్ల నరికిన గాయాలు ఉన్నాయి. ఒక్క తలపైనే ఐదు చోట్ల గాయాలు ఉన్నాయి. గురువారం మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పలు సమీకరణలు, సంప్రదింపులు అనంతరం రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న వివేకాను అత్యంత పథకం ప్రకారం అతి కిరాతకంగా హత్య చేశారు. వైఎస్‌ కుటుంబసభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

 రక్తపు మడుగులో వివేకా.. 
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ వివేకానందరెడ్డి గురువారం మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీలో చేరికలు, పలువురితో సంప్రదింపులు అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్‌ ప్రసాద్‌ ద్వారా అల్పహారం తెప్పించుకున్నారు. అల్పహారం తిన్న అనంతరం కర్టెన్స్‌ సర్ది ఇంటికి వెళ్లమని వివేకానందరెడ్డి సూచించడంతో డ్రైవర్‌ ఆ పని పూర్తి చేసి వెళ్లిపోయాడు. అనంతరం వివేకానందరెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇంటి వరండాలో వాచ్‌మన్‌ రంగన్న పడుకున్నాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వ్యక్తిగత కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు.

సాధారణంగా అప్పటికే నిద్ర లేచే వివేకానందరెడ్డి లేవకపోవడంతో.. రాత్రి పొద్దుపోయాక వచ్చారని తెలుసుకున్న కృష్ణారెడ్డి న్యూస్‌ పేపర్లు చదువుతూ ఉండిపోయారు. ఈలోపు వంట మనిషి తన కుమారుడు అశోక్‌తో కలసి ఇంటికొచ్చింది. ఆరు గంటలు దాటిన తర్వాత ఇంతవరకూ సార్‌ నిద్రపోయింది ఎప్పుడూ లేదు.. ఎంత ఆలస్యంగా వచ్చినా లేస్తారని చెప్పి వంట మనిషి పిలువసాగారు. అయితే ఎంతకూ లోపలినుంచి అలికిడి లేకపోగా.. ప్రక్కన ల్యాన్‌లోకి వచ్చే తలుపు తెరిచి ఉండడాన్ని వాచ్‌మన్‌ రంగన్న గమనించాడు.

తలుపు తెరిచి ఉండడంతో ఆ దారి గుండా ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో బెడ్‌రూమ్‌ తలుపు కూడా తెరిచి ఉంది. లోపలకు వెళ్లగానే రక్తపు మడుగు కనిపించింది. కానీ బెడ్‌ మీద వివేకానందరెడ్డి కనిపించలేదు. దీంతో వారు బాత్‌రూంలోకి వెళ్లారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించి కంగుతిన్నారు. వెంటనే పీఏ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేశారు. తర్వాత మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిర్జీవంగా పడి ఉన్న పెదనాన్నను చూసి నిర్ఘాంతపోయారు. అనంతరం సీఐ శంకరయ్య వచ్చి అంబులెన్స్‌ తెప్పించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పార్థివదేహాన్ని  అభిమానుల కోసం వివేకానందరెడ్డి ఇంటికి తీసుకొచ్చారు.

అత్యంత పథకం ప్రకారమే హత్య.. 
స్వతహాగా వైఎస్‌ వివేకానందరెడ్డి అజాతశత్రువు. తనను ఆశ్రయించిన వారికి చేయూతనివ్వడం ఆయన నైజం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవ్వరైనా నేరుగా వెళ్లి వారి ఇబ్బందులను వివరిస్తారు. అందుకు తగిన పరిష్కార మార్గం చూపించడంలో వైఎస్‌ వివేకానందరెడ్డి ముందూ వెనుకా ఆలోచించరు. అలాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి వెనుక ఏకైక కారణం రాజకీయం మినహా మరే కారణం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకే పార్టీలో చేరిన తర్వాత అక్కడ మరే పార్టీ బతికి బట్టకట్టదని అందరూ భావించారు. అందుకు కారణం అక్కడి ఫ్యాక్షన్‌  రాజకీయాలే.

అయితే జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీకి అపారంగా జనాదరణ లభిస్తోంది. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీలో చేరికలతో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు పక్కా పథకం ప్రకారం ఆయన్ను అంతమొందించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉంటారని అందరికీ తెలుసు. గన్‌మన్‌ లేకుండా ఎక్కడికైనా స్వయంగా వెళ్లే గుణం ఉందని తెలుసు. దీన్ని అదునుగా తీసుకుని పక్కా పథకం ప్రకారం ఆయన్ను అంతం చేసినట్లు భావిస్తున్నారు. కరడుగట్టిన నేర స్వభావం ఉన్నవారే ఇలా కిరాతకంగా హత్య చేయగలిగే అవకాశముందని, టార్గెట్‌ మిస్‌ కాకుండా ఉండేందుకు తలపైనే నరికారని వారు చెబుతున్నారు.
 
జమ్మలమడుగు నుంచి వెంబడించిన 2 వాహనాలు
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి గురువారం రాత్రి జమ్మలమడుగు పరిధిలోని ఓ కోల్డ్‌ స్టోరేజీలో పలువురితో చర్చించిన తర్వాత పులివెందులకు బయల్దేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరేందుకు పలువురితో సంప్రదింపులు నిర్వహించారు. అనంతరం పులివెందులకు పయనమవగా.. జమ్మలమడుగు నుంచి రెండు వాహనాలు వైఎస్‌ వివేకానందరెడ్డి వాహనాన్ని వెంబడించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వివేకా వాహనంలో ఆయనతోపాటు తొండూరు మండల నాయకులు ఎర్రగంగిరెడ్డి, రవీంద్రారెడ్డి ఉన్నట్టు సమాచారం. వారిద్దర్నీ పులివెందుల మార్గంలోని మల్లేల గ్రామంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. తర్వాత ఆయన పులివెందులకు వెళ్లారు. దీంతో వెంబడిస్తూ వాహనాల్లో వచ్చిన వ్యక్తులే, సమయం చూసి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పదునైన కత్తితో తలపై దాడి చేయడంతోనే: ఎస్పీ 
మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి తలపై పదునైన కత్తితో నరకడం వల్లే చనిపోయారని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మీడియాకు శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించారు. ‘ఉదయాన్నే తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఘటనాస్థలం పరిశీలిస్తే హత్య చేసినట్లుగా స్పష్టమైంది. తలపై బలమైన గాయాలవడం వల్లే మృతి చెందారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. హత్య ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది.. వారికి కొన్ని ఆధారాలు లభించాయి. డ్రైవర్‌ పేరు మీద లెటర్‌ ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’అని సాయంత్రం మరోమారు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతుండగా పదేపదే వివిధ ఫోన్‌కాల్స్‌ రావడం గమనార్హం.

చలించిపోయిన వైఎస్‌ జగన్‌.. 
వైఎస్‌ వివేకా హత్య వార్త విని యావత్తు వైఎస్సార్‌ జిల్లా వాసులు నిశ్చేష్టులయ్యారు. పులివెందుల కన్నీటి సంద్రంగా మారింది. తన చిన్నాన్న హత్య విషయం తెలియడంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల్లో అజాతశత్రువుగా కీర్తించబడ్డ తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని నిర్జీవ స్థితిలో చూడడంతో ఆయన చలించిపోయారు. తన చిన్నాన్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు భౌతిక కాయాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, భారతమ్మ మరిది మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. విజయమ్మతోపాటు ఆమె తనయ షర్మిలమ్మ, వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్‌ సోదరులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది తరలివచ్చి వివేకా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వీరిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరులు, బొత్స సత్యనారాయణ, సినీ నటుడు, వైఎస్‌ కుటుంబం సమీప బంధువు డాక్టర్‌ మోహన్‌బాబు, మంచు విష్ణు, పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు తదితరులు ఉన్నారు.

సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్‌ రెడ్డి
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకరరెడ్డిని తానే బయటకు తీసుకొచ్చానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్‌.వి.సతీష్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సతీష్‌రెడ్డి, సుధాకరరెడ్డి ఆరోపణలెదుర్కొంటున్న సంగతి తెల్సిందే. శుక్రవారం ఓ చానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న సతీష్‌ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకరరెడ్డిని బయటకు తీసుకొచ్చానని సతీష్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిన వెంటనే తాను శుక్రవారం ఉదయం డీజీపీ ఠాకూర్‌కు ఫోన్‌ చేశానని సతీష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు.  
 
నేడు అంత్యక్రియలు 
వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి శనివారం ఉదయం 11 గంటలకు పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. 

తెరపైకి లెటర్‌..  
‘‘డ్రైవర్‌ ప్రసాద్‌ రోజూ త్వరగా రమ్మంటున్నానని నన్ను కొట్టాడు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టోదు.. వదిలిపెట్టోద్దు.’అంటూ ఓ లెటర్‌ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాస్తవంలో డ్రైవర్‌ ప్రసాద్‌ అల్పాహారం తెప్పించి.. చివరగా ఇంటికెళ్లారు. ఒకవేళ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి నిజంగా లెటర్‌ రాసినా... దుండగులే ఆయనతో ఇలా బలవంతంగా రాయించే అవకాశం కూడా ఉంది. లెటర్‌ రాయించిన తర్వాత అంతమొందించి ఉండవచ్చు. ఒకవేళ ప్రసాద్‌కు ఏమాత్రం సంబంధం ఉన్నా ఎప్పుడో పరారీ అయ్యే అవకాశముంది. కానీ ప్రసాద్‌ ఉదయం నుంచీ రాత్రి వరకూ అన్నీ కార్యక్రమాల్లో ఉన్నాడు. దుండగులు వ్యవహారాన్ని పక్కదారి పట్టించే లక్ష్యంతోనే ఇలా పక్కాగా లెటర్‌ సృష్టించి ఉంటారని పలువురు చెబుతున్నారు. ఈ మొత్తం తతంగం వెనుక భారీ స్కెచ్‌ ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  

గన్‌మన్‌ లేకపోవడం, ఎస్పీని బదిలీ చేయడం.. 
వైఎస్‌ వివేకానందరెడ్డి ఒకసారి సమితి ప్రెసిడెంటుగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు మార్లు ఎంపీగా పనిచేశారు. అంతేగాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయానా సోదరుడు. పైగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వయానా చిన్నాన్న. ఇన్ని అర్హతలున్నా చంద్రబాబు సర్కారు ఆయనకు గన్‌మన్లను ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. జిల్లా ఎస్పీగా నిష్పక్షపాతంగా పనిచేసిన అభిషేక్‌ మహంతిని కొద్దిరోజులపాటే కొనసాగించడమూ అనుమానాలకు తావిస్తోంది.

మహంతి కేవలం 42 రోజులు మాత్రమే జిల్లాలో పనిచేసినా, తనదైన శైలిలో నిష్పక్షపాతంగా విధి నిర్వహణ చేపట్టారు. అధికారపార్టీకి ఇది మింగుడు పడలేదు. ఆయన్ను అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆయన్ను బదిలీ చేసిన నెలలోపే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కోణం దాగి ఉన్నదనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కన్నీరుమున్నీరవుతున్న చిన్నమ్మ (వైఎస్‌ వివేకానందరెడ్డి భార్య) సౌభాగ్యమ్మను ఓదారుస్తున్న జగన్‌ , వివేకా పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement