బెడ్ రూంలో సుజాత మృతదేహంపై చీరలు కప్పిన దృశ్యం (ఇన్‌సెట్) సుజాత (ఫైల్)
వైఎస్‌ఆర్ జిల్లా , రాజంపేట: రాజంపేట పట్టణం నడిబొడ్డున నూనివారిపల్లెరోడ్డులోని నలందా స్కూలు వీధిలో ఓ ఇంటిలో మహిళ దారుణహత్యకు గురైన సంఘటన బుధవారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసులరెడ్డి, సుజాత దంపతులు నలందనగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో కిషోర్‌కుమార్‌రెడ్డి గల్ఫ్‌కు వెళ్లగా, మరొక కుమారుడు దినేష్‌రెడ్డి వేరే ఊరిలో చదువుకుంటున్నాడు. సుజాత ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఇంటి బెడ్ రూమ్‌లో శవమై కనిపించింది. అక్కడి సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచం కింద రక్తం ప్రవహించింది. మృతదేహంపై ఉన్న గాయాలు కనిపించకుండా దుండగులు ఆమెపై చీరలు కప్పి వెళ్లారు. రాజంపేట రూరల్ సీఐ నరసింహులు సుజాత మృతి చెందిన గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణ ఎస్‌ఐ చెన్నకేశవ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కడప నుంచి క్లూస్‌టీంను రప్పిస్తున్నట్లు ఆయన వివరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హత్య ఎలా వెలుగు చూసిందంటే..
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సుజాత ఇంట్లోనుంచి బయటకు రాకపోగా.. ఆమె ఉం టున్న ఇంటికి బయట తాళం వేసి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఆమె ఒంటిపై చీరలు కప్పి ఉండటంతో ఎక్కడెక్కడ గాయాలైంది అర్థం కాలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగిందా? లేక బుధవారం రోజు పగలే జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు దొంగలు చొరబడి నగలు దోచుకునే క్రమంలో ఆమెను హత్య చేశారా లేక ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పనా అనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికితోడు ఇంటి బయట తాళం వేసి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.
బండరాయితో మోది చంపి..
పోరుమామిళ్ల(కలసపాడు): కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లె దళితవాడకు చెందిన ఓబు ళాపురం థామస్(26) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లారేటప్పటికే ఈ వార్త పరిసర గ్రామాల్లో సంచలనమైంది. చెన్నారెడ్డిపల్లె – నల్లగొండుపల్లె మధ్య చెరువు సమీపంలో గజ్జ రాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య మంజుల, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. థామస్‌కు మద్యం తాగే అలవాటు తప్పితే ఏ ఇతర అలవాట్లు లేవని, ఇతర విషయాల్లో తలదూర్చేవాడు కాదని సమాచారం. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో తేరు ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో ఉన్న థామస్ ఊరి బయటకు ఎందుకు వెళ్లాడో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. అతని బలహీనత తెలిసిన వ్యక్తులు మద్యం సేవిద్దామని ఊరికి దూరంగా తీసుకెళ్లి రాయితో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో పెనుగులాట జరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ హత్యలో ముగ్గురు, నలుగురు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయని, పోలీస్ స్టేషన్ వరకు ఈ తగాదా వెళ్లినట్లు తెలిసింది. మృతుని భార్య మంజులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ కేసు నమోదు చేసుకున్నారు.
ఏమీ తేల్చని డాగ్‌స్క్వాడ్: సంఘటన సమాచారం తెలిసి బుధవారం ఉదయం డాగ్‌స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. మృతదేహం వద్ద వాసన చూసిన కుక్కలు ఆ తర్వాత చెరువు కట్టపై తారాడి మహనందిపల్లె వరకు వెళ్లాయి. అయినా అవి ఏమీ నిర్ధారించలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment