
మృతులు సుబ్బరాయుడు, యశ్వంత్ (ఫైల్ ఫోటోలు)
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ ఇంట విషాదం ఆవరించింది. సరదాగా మనవడిని తీసుకుని స్కూటీపై బయటకు వెళ్లిన వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో తాతా మనవడు దుర్మరణం చెందారు.
వైఎస్‌ఆర్ జిల్లా , రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ నెంబరు జాతీయ రహదారిపై రామాపురం మండలం గువ్వలచెరువు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం స్కూటీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు(55), అతని మనవడు యశ్వంత్(4) అక్కడికక్కడే మృతి చెందారు. రామాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు తన మనవడైన యశ్వంత్‌తో స్కూటీలో పెట్రోల్ పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డుపైకి రాగానే కడప వైపు నుంచి వస్తున్న ఏపీ 04బీఎల్ 4915 నెంబరు గల కారు అధిక వేగంతో వచ్చి స్కూటీని ఢీ కొంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రామాపురం ఎస్‌ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలకు అంతరాయం లేకుండా చూశారు.
గువ్వలచెరువులో విషాదం
ఈ ప్రమాద విషయం తెలియగానే సంక్రాంతి పండుగ రోజున గువ్వలచెరువులో విషాదం చోటు చేసుకుంది. చిన్నారి యశ్వంత్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గడికోట దార్వకనాధరెడ్డి ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment