నిందితుల వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ సీఐ సీతారాంరెడ్డి, ఎస్‌ఐ శివప్రసాద్, ఇతర సిబ్బంది
సాక్షి, పులివెందుల(కడప) : వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. అయితే ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినా.. పోలీసుల దర్యాప్తుతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి రెండవ కుమారుడు కంచర్ల జయశేఖరరెడ్డి(21) జులై 7వ తేదీన ఇంట్లో ఉండగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదేనెల 10వ తేదీన తండ్రి చంద్రశేఖరరెడ్డి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడు కనిపించలేదని ఎస్‌ఐ శివప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి మృతుడి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి పీఏగా వ్యవహరిస్తున్న సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన జక్కిరెడ్డి పెద్దిరెడ్డి హత్య చేసినట్లుగా గుర్తించారు.
పెద్దిరెడ్డి గుంటూరుకు చెందిన తన స్నేహితులైన కనపర్తి శ్రీను, వెంకటేష్, జగదీష్‌ల సాయంతో జయశేఖరరెడ్డిని హత్య చేసినట్లు తెలిసింది. జులై 7వ తేదీన వీరు నలుగురు కలిసి జయశేఖరరెడ్డిని పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు పిలిపించుకుని అక్కడి నుంచి ఏపీ02ఏకే 8614 అనే నెంబర్ గల స్కార్పియో వాహనంలో జయశేఖరరెడ్డిని ఎక్కించుకుని సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో మద్యంలో విషపు గుళికలు కలిపి జయశేఖరరెడ్డికి తాపించారు. అనంతరం జయశేఖరరెడ్డిని స్కార్పియో వాహనంలో ముద్దనూరు మండలంలోని శెట్టివారిపల్లె రైల్వే ట్రాక్‌పై పడుకోబెట్టి రైలు ప్రమాద సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో జయశేఖరరెడ్డిది హత్యగా తేలడంతో నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment