సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు.
ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి..
విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్
వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’...
వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు.
ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు.
సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి...
దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు.
ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment