సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి అందింది. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ వేసినట్లు తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జవరి 16న హత్యకు కుట్ర చేయగా.. వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది.
బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది.
రిమాండ్ రిపోర్టు ప్రకారం..ఈ నెల 17వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్ తిరుమల వైన్స్ వద్ద నవీన్, హరిహర కృష్ణ మద్యం సేవించారు. ఎల్బీనగర్, నాగోల్, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట పప్రాంతాల్లో నవీన్‌తో కలిసి తిరిగాడు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగింది. తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరుచేశాడు. బ్యాగ్‌లో తలతో సహా శరీర విడిభాగాలను తీసుకెళ్లాడు.
ఫోన్ హైదరాబాద్ నివాసంలో ఉంచిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్‌లో రెండు రోజులు గడిపాడు. ఈనెల 23న తిరిగి వరంగల్ చేరుకొని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పాడు. ఈనెల 24న తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలోనవీన్ శరీర భాగాలతోపాటు ఆధారాలను తగలబెట్టిన హరిహరకృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment