సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్‌లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేసినా.. ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment