
పులివెందుల/రూరల్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. పులివెందులలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, ఆయన హత్య గురించి తన బావమరిది చెబితేనే తెలిసిందని అన్నారు. వివేకా తనకు దేవుడు లాంటి వారని, ఆయనకు దగ్గరగా ఉన్నందువల్లనే తనపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. రంగయ్య ఎవరో తనకు వ్యక్తిగతంగా తెలియదని గంగిరెడ్డి పేర్కొన్నారు.
తరచూ వస్తూ పోతుండేవాడు : వాచ్‌మెన్ రంగయ్య
వైఎస్ వివేకా ఎక్కడికి వెళ్లాలన్నా ఎర్ర గంగిరెడ్డి కారు డ్రైవర్ ప్రసాద్‌తో మాట్లాడి కారు పంపించేవాడని వాచ్‌మన్ రంగయ్య మీడియాకు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎర్ర గంగిరెడ్డి తరుచూ వివేకా ఇంటికి వచ్చేవారని, వచ్చినప్పుడల్లా ఆయనను చూసేవాడినని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన రాత్రి కొత్త వ్యక్తులు ఎవరూ ఇంటికి రాలేదని, తాను ఇంటి ముందర మెట్ల వద్ద పడుకున్నానని చెప్పారు. కాగా.. కొత్త వ్యక్తులు లేదా రాజకీయ నాయకులు ఎవరూ తనతో మాట్లాడలేదని తెలిపారు. నాలుగైదు రోజులు సీబీఐ అధికారులు తనను విచారణ చేశారని, తనకు ఏదీ గుర్తు లేదని రంగయ్య చెప్పాడు. కాగా, వాచ్‌మన్ రంగన్న ఇంటి వద్ద శనివారం ఉదయం నుంచి ఇద్దరు పోలీసులు మఫ్టీలో కాపలాగా ఉన్నారు.