YS Vivekananda Murder Case: Journalist Bharath Yadav Comments On His Death - Sakshi
Sakshi News home page

హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్‌ భరత్‌

Published Mon, Nov 22 2021 4:30 AM | Last Updated on Mon, Nov 22 2021 3:47 PM

Journalist Bharath Yadav Press Meet On YS Vivekananda Assassination - Sakshi

పులివెందుల: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిలను నిందితులుగా పేర్కొనగా.. నాలుగు రోజుల కిందట దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అయితే, వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఒక పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న భరత్‌యాదవ్‌ ఆదివారం స్థానిక అర్‌ అండ్‌ బీ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ వివరాలన్నింటితో కూడిన లేఖను ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. భరత్‌యాదవ్‌ తన లేఖలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ముద్దాయి అయిన దస్తగిరి స్టేట్‌మెంట్‌ చూసి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. అందులో నా పేరు మీడియాలో రావడంతో తీవ్ర అవమానంగా భావిస్తున్నాను. దీంతో ఈ కింది విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నాను.  వివేకానందరెడ్డిని 2019 మార్చి 14 రాత్రి హత్యచేసిన విషయం తెలిసిందే.

ఈ హత్యకు సంబంధించిన విషయాలను సీబీఐ దృష్టికి తెచ్చింది నేనే. ఆ తర్వాత వాచ్‌మన్‌ రంగన్న ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా,  మా తాతగారైన గోర్ల చెంచురెడ్డితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల మా తాత మరణించాక నేను వివేకానందరెడ్డితో అప్పుడప్పుడు కలిసేవాడిని. నా స్థల వివాదం విషయమై 2019 జనవరిలో ఆయన్ను పలుమార్లు కలిసి వివరించాను.

అయితే, ఆయన చూద్దాం చూద్దాం అంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పీఏగా చెప్పుకుంటూ తిరుగుతున్న సునీల్‌యాదవ్‌ను కలిసి నా సమస్యను వివేకా దృష్టికి తీసుకెళ్లాలని కోరాను. కానీ, సునీల్‌యాదవ్‌ కొంత మొత్తాన్ని ఆశించగా.. పంచాయతీ అయిపోయిన తర్వాత ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చాక ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత మార్చిలో మళ్లీ సునీల్‌ను కలిసి నా స్థల వివాదం విషయాన్ని సార్‌ (వివేకా)కు చెప్పమని అడగ్గా కచ్చితంగా చెబుతానన్నాడు. కానీ, ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌చేసినా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. మర్నాడు ఉదయం నాకు వైఎస్‌ వివేకానందరెడ్డి మరణ వార్త తెలిసింది. 

హత్య తర్వాత సునీల్‌ అనంతపురానికి..
ఆ తర్వాత సునీల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లాను. అప్పుడు.. నీ విషయాన్ని సార్‌తో మాట్లాడాను.. పంచాయితీకి సంబంధించిన ఒరిజనల్‌ పేపర్లు 11 గంటలకు వస్తాయి.. ఇస్తానన్నాడు. సరేనని నేను 11గంటలకు వెళ్తే సునీల్‌యాదవ్‌ లేడు, అనంతపురం వెళ్లాడు, సాయంత్రం వస్తాడని అతని తల్లి చెప్పింది. ఆ తర్వాత సునీల్‌ను పోలీసులు అరెస్టుచేసినట్లు అతని తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి మా ఇంటికొచ్చి చెప్పారు.

అలాగే, రూ.60 వేలు నగదు, కొన్ని పేపర్లు ఉంచమని ఇచ్చారు. వారికి అవసరం ఉన్నప్పుడల్లా తీసుకువెళ్లేవారు. అయితే, వివేకా హత్య విషయంలో ఏం జరుగుతుంది.. మా మీదకు వస్తుందేమోనని అనుమానం వ్యక్తంచేసేది. మరోవైపు.. వివేకా హత్య కేసులో సునీల్‌యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, కృష్ణారెడ్డిలను అరెస్టుచేసినట్లు వార్తలు వచ్చాయి. 

సునీల్‌యాదవ్‌పై అనుమానం పెరిగింది
25రోజుల తరువాత సునీల్‌యాదవ్‌ ఇంటికి వచ్చాక అతనిని చూడటానికి వెళ్లాను. సునీల్‌యాదవ్‌ నడవలేని పరిస్థితిలో గాయాలతో ఉన్నాడు. పోలీసులకు ఒక్క మాట కూడా చెప్పకుండా బయటకు వచ్చానన్నాడు. ఎందుకంటే.. డబ్బుకోసం ప్రాణాలకు తెగించి ఇదంతా చేశామని. మా దేవుడు కావల్సినన్ని డబ్బులు ఇచ్చాడన్నాడు. దేవుడు ఎవరంటే వైఎస్‌ వివేకానందరెడ్డి అని చెప్పాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు.

కానీ, నాకు అతనిపై అనుమానం ఎక్కువైంది. ఆ తర్వాత సునీల్‌యాదవ్‌ను పోలీసులు మళ్లీ మళ్లీ తీసుకెళ్లేవారు. దీంతో.. పోలీసులు రాకుండా ఉండేందుకు సునీల్‌యాదవ్‌ పెళ్లి దగ్గరుండి జరిపించాను. వివాహ ఖర్చులకు రూ.3.30 లక్షలు అప్పుగా ఇచ్చాను. ఈ మొత్తాన్ని నాలుగు నెలల్లో ఇస్తానని చెప్పినప్పటికీ ఇవ్వలేదు. పైగా ఎర్ర గంగిరెడ్డి మాకు ఇస్తాడు.. అవి రాగానే ఇస్తామంటూ మరో లక్ష తీసుకున్నారు. ఆ తర్వాత.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సునీల్‌యాదవ్‌ను మోసం చేశారంటూ మళ్లీ డబ్బు అడిగారు. దీంతో మీరు ఏదో తప్పుచేస్తున్నారని నేను గట్టిగా ప్రశ్నించాను. వివేకా హత్య కేసు తేలేవరకూ డబ్బులు ఇవ్వబోమని వారంటున్నారని సునీల్‌యాదవ్‌ చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నిన్ను, నన్ను చంపుతారేమోనన్నాడు. మొత్తం మీద నేను రూ.16.50 లక్షలు సునీల్‌కు ఇచ్చాను. 

వివేక హత్య వెనుక నర్రెడ్డి, గంగిరెడ్డి!
ప్రతీసారి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పేర్లు వాడుతుండడంతో వివేకా హత్య వెనుక వీరున్నారని నాకు పూర్తిగా అర్ధమైంది. ఎందుకు ఈ పనిచేశారని సునీల్‌యాదవ్‌ను అడిగితే.. వివేకా మాకు చాలా అన్యాయం చేశారని.. బయటనుండి ఏదో డబ్బు వస్తే మా వాటా ఇవ్వనని అనడంతో ఈ పనిచేశామని చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పనిచేశామన్నాడు. నేను డబ్బులు అడుగుతున్న ప్రతిసారీ వివేకానే చంపాం.. నిన్ను కూడా క్షణంలో చంపుతామని హెచ్చరిస్తూ రెండుసార్లు నాపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు.

వివేకా హత్యకు ప్రధాన కారణం డబ్బులు, సెక్స్‌ అని కూడా సునీల్‌యాదవ్‌ చెప్పాడు. ప్రతి పనికీ మమ్మల్ని వాడుకుని డబ్బులు వచ్చిన తరువాత అందులో సగం పూర్తిగా తన సన్నిహితురాలైన షమీమ్‌కు ఇవ్వాలని వివేకా చెప్పేవారన్నాడు. వివేకా తన ఆస్తులను షమీమ్‌కు బదలాయిస్తున్నారనే విషయంపై నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వివేకా తరచూ గొడవ పడేవారని సునీల్‌యాదవ్‌ చెప్పేవాడు. ఇలా వివేకా హత్యకు కుటుంబ, ఆస్తి తగాదాలు కారణమని.. ఈ విషయం ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేక ఈ పనిచేసినట్లు సునీల్‌యాదవ్‌ చెప్పాడు. చివరికి.. నా డబ్బులు ఇవ్వకుండా నన్ను కూడా చంపుతామని చాలాసార్లు బెదిరించాడు. 

దస్తగిరి ఖాతాలో సీబీఐ డబ్బులు జమ
నన్ను సీబీఐ వారు పిలిచినçప్పుడు.. ఈ విషయాలన్నీ వారికి చెప్పాను. ఈ మధ్య దస్తగిరిని కలువగా.. భరతన్న నీకు ఏమీ తెలీదు, నాకు సీబీఐ వారు కోటి రూపాయలు ఇస్తామన్నారు, నువ్వు సైలెంట్‌గా ఉండకపోతే నిన్ను కూడా వారు ఏమైనా చేస్తారు అన్నాడు. సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ తన అకౌంట్లో రూ.75వేలు జమచేసినట్లు కూడా దస్తగిరి తెలిపాడు. ఇదంతా చూస్తుంటే.. పైన పేర్కొన్న పెద్ద మనుషులే దస్తగిరితో కావాలని ఇవ్వన్ని చేయిస్తున్నారని మా పత్రికల వారంతా అంటున్నారు. నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన సీబీఐ వివేకా కుమార్తె సునీత చెప్పినట్లు నడవడం విడ్డూరంగా ఉందని కూడా వారు అంటున్నారు.

అలాగే, మేమంతా ఒక్కటే.. నిన్ను ఏంచేస్తామో చూడు అని సీబీఐ డీఎస్పీ దీపక్‌ సారు సమక్షంలోనే సునీల్‌యాదవ్‌ నాతో అన్నాడు.  సునీతమ్మకు ఇవన్నీ చెప్పాలని ప్రయత్నించినా నన్ను కలవడానికి అవకాశమివ్వలేదు. సునీల్‌యాదవ్‌ గురించి పూర్తిగా తెలుసుకుని సీబీఐ వారికి విన్నవించాను. ఇక సీబీఐ విచారణ తర్వాత నుంచి దస్తగిరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకు డబ్బులు ఎవరిస్తే వారికే అనుకూలంగా మాట్లాడతానని నాతో చెప్పేవాడు. దస్తగిరి, సునీల్‌లను సీబీఐ వారు ఢిల్లీకి పిలిపించినప్పుడు.. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని వారిద్దరూ చెప్పినట్లు నాతో దస్తగిరి అన్నాడు. దస్తగిరి భార్య కూడా ఇలాగే అనడం నాకు ఆశ్చర్యం కలిగించింది. వాస్తవ విషయాలన్నీ దస్తగిరికి, అతని భార్యకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా అసలైన వారిని గుర్తించి విచారణ చేయవలసిందిగా కోరుతున్నాను.

నాకూ చావు తప్పదని బెదిరించారు
నాకు రావల్సిన డబ్బుల విషయాన్ని ఎర్ర గంగిరెడ్డిని అడిగాను. దీంతో.. సునీల్‌ను ఇబ్బంది పెట్టొద్దు.. మాకు ఓ సెటిల్‌మెంట్‌ డబ్బులు రావాలి, అవి రాగానే అన్నీ ఇస్తామన్నారు. మళ్లీ సునీల్‌యాదవ్‌ నా వద్దకు వచ్చి.. నన్ను డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టొద్దు.. నా వెనకాల చాలా పెద్దమనిషి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నాడని గట్టిగా చెప్పాడు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు నీకు కూడా చావు తప్పదని నన్ను బెదిరించసాగాడు.  
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement