మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్) రోడ్డు ప్రమాదం దృశ్యం , ప్రమాదంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
కుటుంబ పోషణ కోసం అయినవారికి దూరంగా వెళ్లాడు. మూడేళ్లు దుర్భర జీవనం తర్వాత కలలు కంటూ ఇంటికి పయనమయ్యాడు. విమానం దిగగానే కళ్లెదుట భార్య.. తమ్ముడు, అతని భార్య, వారి ఏకైక సంతానం. మూడేళ్లపాటు వారి ఊహలతో గడిపిన అతని మది ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆనందంగా అందరూ కలిసి ఓ వాహనంలో ఇంటికి పయనమయ్యారు. కుమారులను చూడాలన్న తాపత్రయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతలోనే రెప్పపాటులో జరిగిన ప్రమాదం.. ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. అయిన వారి ఆక్రందనలను ఆపడమెవరి తరమూ కాలేదు.. కారణమేదైనా తెల్లవారక ముందే ఇంటికి చేరాల్సిన వారంతా కాలగర్భంలో కలసిపోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది.
రేణిగుంట : రేణిగుంట–కోడూరు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలితీసుకుంది. వారిలో ఇప్పుడిప్పుడే ముద్దులొలికే మాటలు నేర్చుకుంటున్న ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుల కుటుంబ నేపథ్యం ఇదీ..
వైఎస్సార్ జిల్లా సీకే దిన్నెకు చెందిన గంగాధరం ఆరేళ్ల కిందట జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. మూడేళ్ల కిందట ఓ సారి ఇంటికి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లాడు. ఆయనకు భార్య విజయమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్‌కుమార్(24) ఇటీవలే వివాహం చేసుకుని బెంగళూరులో ల్యాబ్ టెక్నీషియన్‌గా స్థిరపడ్డాడు. రెండో కుమారుడు ప్రదీప్‌కుమార్ (15) స్థానికంగా 10వ తరగతి చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో గంగాధరంతో పాటు అతని భార్య విజయమ్మ, సోదరుడు ప్రసన్న, అతని భార్య మరియమ్మ, వారి ఒక్కగానొక్క చిన్నారి ప్రజ్వన్‌కుమార్ మృతి చెందారు. ప్రసన్న వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
నిద్రమత్తు– అతివేగమే కారణమా?
కువైట్ నుంచి మూడేళ్ల తర్వాత తిరిగి వస్తున్న గంగాధరాన్ని కళ్లారా చూడాలన్న ఆతృత ఆయన భార్యకే కాదు... సోదరుడు, అతని భార్యకు కలిగింది. వారంతా కలసి శనివారం ఉదయం కారులో ఇంటి నుంచి బయల్దేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గంటల తరబడి నిరీక్షించి విమానం దిగిన గంగాధరాన్ని చూసి మురిసిపోయారు. అక్కడ నుంచి అందరూ కలసి కారులో మాట్లాడుకుంటూ బయల్దేరారు. తాను తెచ్చిన బంగారు ఆభరణాలను కుటుంబీకులకు చూపించాడు. సుమారు మూడున్నర గంటల పాటు వారి ప్రయాణంలో పిచ్చాపాటి మాటలతో మొదలై అప్పుడప్పుడే కొద్దిపాటి కునుకు తీస్తూ సాగింది.
వారి వాహనం రేణిగుంట మండలం మామండూరు దాటాక ఎదురుగా ఓ లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. కారులో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దుర్ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను కారులోంచి బయటకు తీశారు. మృతుల బంధువులకు సమాచారం అందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించారు. మితిమీరిన వేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. లారీ కోడూరు వైపు నుంచి సున్నపురాయి లోడుతో రేణిగుంట వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
మృత్యుంజయుడు ప్రదీప్‌కుమార్
గంగాధరం చిన్నకుమారుడు ప్రదీప్‌కుమార్ నాన్నను చూసేందుకు కారులో తాను చెన్నైకు వస్తానని మారాం చేశాడు. 10వ తరగతి చదువుతుండడంతో క్లాసులకు గైర్హాజరు కావడమెందుకన్న కారణంతో వీరి వెంట రాకుండా ఆగిపోయి స్కూల్‌కు వెళ్లాడు. మృత్యుంజయుడుగా మారినా.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలాడు.
మృతదేహాల అప్పగింత
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మృతుల బంధువులు రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పోస్ట్‌మార్టం చేస్తున్న తిరుపతి ఎస్‌వీ వైద్య కళాశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను అప్పగించినట్లు రేణిగుంట సీఐ శివరాముడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుమారకాల్వలో మిన్నంటిన రోదనలు
చక్రాయపేట : రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చక్రాయపేట మండలం కుమార కాల్వకు చెందిన గంగాధర కుటుంబ సభ్యులు ప్రస్తుతం వేంపల్లె మండలం శ్రీరాం నగర్‌లో నివసిస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామమైన కుమారకాల్వకు తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మృతదేహాలను చూసి బంధువులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment