సాక్షి, కడప: భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న వరుసకు వదినైన మహిళపై వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన టీడీపీ జిల్లా కార్యదర్శి వీరభద్రారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలాగే ఆమెను ఒప్పించాలంటూ మరో మహిళపై బెదిరింపులకు దిగారు. దీంతో పులివెందుల మహిళా సంఘాలకు ఆర్పీగా వ్యవహరిస్తున్న మల్లేశ్వరి, ఆర్పీ మస్తానమ్మ సోమవారం ఎస్పీ అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి తన ఫిర్యాదులో తన భర్త జయరామిరెడ్డి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించాడని.. తాను ఆర్పీగా పనిచేస్తున్నట్లు వివరించారు. అయితే తన చెల్లెలు భర్త అయిన వీరభద్రారెడ్డి తనను మానసికంగా వేధిస్తూ దుర్బుద్ధితో లోబరుచుకునేందుకు బెదిరిస్తున్నాడన్నారు.
స్నేహితురాలైన మస్తానమ్మ ద్వారా రాయబారం పంపిస్తూ.. లొంగకపోతే తన కుమారులిద్దరిని బండితో గుద్ది చంపుతానని బెదిరిస్తున్నాడని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బ్యాంక్ వద్ద కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దూషించాడన్నారు. అతని మాట వినకపోతే తమ ఇద్దరి గురించి పత్రికల్లో వేయిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. మహిళా సంఘాల్లోని కొంత మంది ఆర్పీలు తమకు అండగా నిలబడటంతో.. వారిని కించపరిచే విధంగా అసభ్యంగా ప్రచారం చేస్తూ ఉద్యోగాలనుంచి తీయిస్తానని వారిపై కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోయారు. అలాగే మెప్మాలో పనిచేసే సిబ్బంది గురించి, ఆర్పీల గురించి వాట్సాప్ ద్వారా అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడన్నారు. తమను వీరభద్రారెడ్డి బారినుంచి కాపాడాలని ఎస్పీకి మల్లేశ్వరి, మస్తానమ్మలు సోమవారం ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎస్పీ విచారణ చేయాల్సిందిగా పులివెందుల పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పులివెందుల పోలీసులు వీరభద్రారెడ్డి, మల్లేశ్వరి, మస్తానమ్మలతో పాటు మెప్మాలో పనిచేస్తున్న ఇతర ఆర్పీలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, వీరభద్రారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు మల్లేశ్వరిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పోలీసులు విచారించి వీరభద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment