సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : సొంత ఊరిలోని భూములను చూసుకుని తిరిగి వస్తూ ఆ ముగ్గురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ కుటుంబ సభ్యులే. వివరాలివి. లక్ష్మిదేవి(45) , ఆమె భర్త వెంకట సుబ్బయ్య, ఈశ్వరమ్మ(65), అంజనమ్మ(35)లు వై. కోడూరుకు చెందిన వారు. ఉపాధి నిమిత్తం కడప సమీపాన చలమారెడ్డి పల్లెకు వచ్చేశారు. స్వస్థలమైన వై.కోడూరులో బంధువు మృతి చెందడంతో వీరంతా శనివారం చూసేందుకు వెళ్లారు. ఎలాగూ వచ్చామని పనిలో పనిగా గ్రామంలో తమకున్న కొద్దిపాటి స్థలాన్ని చూసుకున్నారు. ఈ లోగా చీకటిపడుతుండటంతో స్వగ్రామానికి బయలుదేరారు. కోడూరు గ్రామంలో ఒక సప్లయర్ ఆటోలో ఎక్కారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు.
ఎర్రగుంట్ల– వై కో డూరు గ్రామాల మధ్య వేంపల్లె మార్గంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు ఆటో చేరుకోగానే ఎర్రగుంట్ల నుంచి వేంపల్లెకు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంజనమ్మ, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మలు అక్కడికి అక్కడే మృతి చెందారు. వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్, మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుడు వెంకటసుబ్బయ్యను వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. వెంకటసుబ్బయ్య దంపతులు, అంజనమ్మలు పొట్టకూటికి పదేళ్ల కిందటే కడప దగ్గర ఉండే చలామరెడ్డి పల్లెకు వచ్చేశారు. అక్కడే కూలి పనులు చేసుకుంటు బతుకుతున్నారు. లక్ష్మిదేవి మేనత్త ఈశ్వరమ్మ ఎర్రగుంట్ల పట్టణంలోనే నివాసం ఉంటోంది.
ఈమె భర్త బాలసుబ్బయ్య గతంలోనే చనిపోయాడు. అనుకోని సంఘటన ముగ్గురి ప్రాణాలను బలిగొన్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రుష్యేంద్రబాబు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డంతో వెంట వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment