veernapally
-
అనుమానిస్తున్నాడని చంపేసింది?
సాక్షి, వేములవాడ: అనుమానం..వేధింపులు పెరిగిపోవడంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల21న అగ్రహారం గుట్టల్లో వ్యక్తి శవమై కనిపించిన లక్ష్మణ్ (27)ను అతడి భార్య మౌనిక (25)నే కడతేర్చిందని ఆరోపిస్తూ గురువారం వీర్నపల్లి గ్రామస్తులు వేములవాడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం... వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ (27) ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. నాలుగేళ్లక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న క్రమంలో సెల్ఫోన్లో సంభాషణపై దృష్టి పెట్టాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని, ఎవరితో నీకు సంబంధాలు ఉన్నాయని, నీకు వ్యాధి సోకిందని నిత్యం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. తనకు చెకప్ చేయించాలని మౌనిక భర్తను ప్రాధేయపడింది. లక్ష్మణ్‌కు భార్య మౌనిక ప్రవర్తనపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం గొడవలు జరగడం కొనసాగాయి. ఈ క్రమంలో గతనెల16న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనంకోసం లక్ష్మణ్, మౌనికతోపాటు కుమారుడు, కూతురు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని వేములవాడకు చేరుకుని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. 17న ఉదయం ఇద్దరు పిల్లల్ని లాడ్జి వద్దనే ఉంచి భార్యభర్తలిద్దరూ అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భర్తతో చనువుగా మాట్లాడుతూ అగ్రహారం గుట్టపై ఉన్న క్వారీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మద్యంలో తాను వెంట తెచ్చిన గడ్డి ముందు కలిపి లక్ష్మణ్‌కు తాగించి గుట్టపైనుంచి నెట్టేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. మంచాల లక్ష్మణ్(ఫైల్): గతనెల 21న అగ్రహారం గుట్టల్లో లభ్యమైన మృతదేహం అనంతరం వీర్నపల్లికి చేరుకున్న మౌనిక తన భర్త లక్ష్మణ్ తిరిగి గల్ఫ్‌కు వెళ్లాడని చెప్పింది. అనుమానం వ్యక్తం చేసిన లక్ష్మణ్ కుటుంబసభ్యులు, బంధువులు మౌనికపై ఒత్తిడి పెంచారు. పలుమార్లు హెచ్చరించడంతో గతనెల 29న పోలీస్‌స్టేషన్‌లో తన భర్త లక్ష్మణ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు 30న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మౌనికను విచారణ చేపట్టగా జరిగిన విషయం పోలీసులకు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వేములవాడలోని పలు ప్రాంతాలను గురువారం పరిశీలించినట్లు తెలిసింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వీర్నపల్లి గ్రామస్తులు ఠాణా నుంచి వెళ్లిపోయారు. కాగా హత్య ప్రమేయంలో మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎవరేది పోలీసులు విచారిస్తున్నారు. -
మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం
-
ఎల్లారెడ్డిపేటలో పోలీస్ సర్కిల్
కార్యాలయాలకు భవనాల పరిశీలన సర్కిల్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ కార్యాలయ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిపేటలో సీఐ కార్యాలయాన్ని మంజూరు చేయించాలని అధికార పార్టీ నాయకులు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తున్నారు. ఈక్రమంలోనే సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు కానుండడం, వీర్నపల్లి మండల కేంద్రంగా ప్రకటించడంతో సర్కిల్ ఆఫీస్ ఆచరణకు నోచుకోనుంది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను బుధవారం కలిసిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై విన్నవించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి పోలీస్స్టేషన్లను కలిపి సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీర్నపల్లిలో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఒక ఎస్సైని కేటాయించి ఎల్లారెడ్డిపేటలోని సిబ్బందితోనే కొద్దికాలం విధులు నిర్వర్తించనున్నారు. వీర్నపల్లి ఎస్సై సైతం ఎల్లారెడ్డిపేటలోనే ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షించనున్నారు. స్థల పరిశీలన వీర్నపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు రెవెన్యూ, మండల పరిషత్, సాగునీటిశాఖ అధికారులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం మాడల్ పాఠశాలలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను కొనసాగించాలని, ప్రభుత్వ పాత ఉన్నత పాఠశాలలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశాలతో కార్యాలయాలకోసం భవనాలు పరిశీలించినట్లు తహసీల్దార్ పవన్‌కుమార్, ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. -
వీర్నపల్లికి జాతీయ అవార్డు
నేడు అవార్డు ప్రదానం ఎల్లారెడ్డిపేట: అక్షరాలతోనే మహిళా సాధికారిత సాధ్యమంటున్నారు వీర్నపల్లి మహిళలు. వివిధ మహిళా గ్రూపుల్లో ఉన్న వారంతా ఒకప్పుడు నిరక్షరాస్యులు కాగా.. నేడు అక్షరాలు నేర్చుకుని బ్యాంకుల్లో రుణాలకోసం సంతకాలు చేస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకున్నాక అందరికీ అక్షరాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో వీర్నపల్లి అక్షరాస్యతలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. ఏటా అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయిలో ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేస్తుండగా.. ఈసారి అరుదైన అవకాశం వీర్నపల్లికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, దుండిగల్, నల్లగొండ జిల్లా దామెరచర్ల, సబ్దుల్లాపురం, పుట్టపాక, కరీంనగర్ జిల్లాలో వీర్నపల్లిని వందశాతం అక్షరాస్యత గ్రామాలుగా ఎంపికచేశారు. ఇందులో వీర్నపల్లిని జాతీయస్థాయి అవార్డు దక్కించుకుంది. అవార్డును గురువారం అందుకోవడానికి సాక్షరభారత్ జిల్లా డైరెక్టర్ జయశంకర్, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్, సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి ఢిల్లీకి వెళ్లారు. -
సాక్షరభారత్ అవార్డుకు వీర్నపల్లి
కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్/ఎల్లారెడ్డిపేట: వందశాతం అక్షరాస్యత సాధించిన ఎంపీ వినోద్‌కుమార్ దత్తత గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి సాక్షరభారత్ అవార్డుకు ఎంపికైందని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అవార్డును ఈనెల 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో భారత రాష్ట్రపతి అందజేస్తారని వివరించారు. వీర్నపల్లిలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషిచేసిన వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు, గ్రామప్రత్యేకాధికారి, డిప్యూటీ సీఈవో, సంబంధిత జిల్లా అధికారులు, సిరిసిల్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, గ్రామ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. సాక్షరభారత్ అవార్డు రావడం జిల్లాకు గర్వకారణం అని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ఇతర అన్ని గ్రామాలు 100 శాతం అక్షరాస్యత సాధించుటకు పోటీతత్వంతో కషి చేయాలని పిలుపునిచ్చారు. అవార్డు రావడంపై ఎంపీడీవో చిరంజీవి, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ హర్షం వ్యక్తంచేశారు. -
వీర్నపల్లిని సందర్శించిన అమెరికా బృందం
అభివృద్ధి పనుల పరీశీలన గిరిజనులతో కలిసి నృత్యాలు ఎల్లారెడ్డిపేట : కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ సంసద్ ఆదర్శ గ్రామయోజన ద్వారా దత్తత తీసుకున్న వీర్నపల్లిని అమెరికా బృందం సభ్యులు గురువారం సందర్శించారు. యూఎస్ఏ స్మిత్ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెషనల్ మెంటోర్ డానియల్‌మర్గీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాయలగ్రేస్లీ, మికెలాజఫక్సన్ బృందం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిపనులు, చెరువుల నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. మాడల్‌స్కూల్, గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడీ, సాక్షరభారత్, మిషన్ కాకతీయ పథకంలో మరమ్మత్తు చేస్తున్న పులిచెరువుతో పాటు గ్రామీణ బ్యాంకును పరిశీలించారు. స్వచ్ఛ భారత్ ద్వారా అమలవుతున్న పారిశుధ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీర్నపల్లి అభివృద్ధిలో దేశంలోనే 11స్థానంలో రాణించడంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులను వారు అభినందించారు. గ్రామంలో భూగర ్భ జలాలను బృందం సభ్యులు పరిశీలించారు. భూగర్భ నీటిమట్టం పెంచడానికి అమెరికా కళాశాల 95శాతం నిధులు ఇస్తే, గ్రామపంచాయతీ 5శాతం నిధులు సమకూర్చాలన్నారు. గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా అంతర్జాతీయ స్థాయిలో నిధులను కేటాయించే విధంగా గ్రామస్తులు సహకరించాలని సూచించారు. నీటిని ఎలా పొదుపు చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు. బృందం సభ్యులు గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. మారుమూల పల్లెలో గిరిజన నృత్యాలు చూసిన బృందం సభ్యులు సెల్ఫీలు దిగారు. వీర్నపల్లిని స్ఫూర్తిగా తీసుకుంటాం ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే 11వ స్థానంలో నిలిచిన వీర్నపల్లిని స్ఫూర్తిగా తీసుకుంటామని అమెరికా బృందం ప్రతినిధి డెనియల్ మర్ఫీ అన్నారు. గ్రామపంచాయతీలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని ఎంపీలు దత్తత తీసుకున్న ఆదర్శ గ్రామాల్లా పర్యటిస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్ సూచన మేరకు వీర్నపల్లికి వచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై నివేధికలను తమ సంస్థకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కుమారుడు ప్రణయ్, వాసన్ సంస్థ ప్రతినిధులు యుగేంధర్, మదన్మోహన్, గీతారెడ్డి, హాసిని, సిద్దార్థరాయ్, జెడ్పీ డెప్యూటీ సీఈవో గౌతంరెడ్డి, జెడ్పీటీసీ ఆగయ్య, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ పవన్‌కుమార్, సర్పంచ్ సంజీవలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘ఆదర్శం’.. వీర్నపల్లి
నాడు నక్సల్స్ ప్రభావిత ఖిల్లా... నేడు అభివృద్ధిలో దూసుకెళుతున్న పల్లె సారా తయారీ బంద్.. సంపూర్ణ మద్యపాన నిషేధం ఫోన్ సౌకర్యం కూడా లేని పల్లెలో నేడు 3జీ సేవలు ఆదర్శ గ్రామాల్లో దేశంలోనే వీర్నపల్లికి 11వ స్థానం ప్రకటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లి... ఈ పేరు వినగానే ఒకనాడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా, పోలీసు బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిన గ్రామమే గుర్తుకొస్తుంది. నక్సల్స్, పోలీసుల కాల్పుల్లో 17 మంది యువకులు బలైన విషాదం గుండెలను పిండుతుంది. బతుకుదెరువుకు నాటుసారాను నమ్ముకున్న గిరిజనులను అదే నాటుసారా ఎనిమిది మందిని కాటేసిన విషయం కన్నీళ్లు పెట్టిస్తుంది. నిన్నటివరకు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు దేశంలోనే ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. దాని కథేమిటో తెలుసుకోవాలని ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (సాగి) ఈ గిరిజన పల్లె రూపురేఖలనే మార్చివేసింది. దేశంలోనే 11వ స్థానం.. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా ఈ గ్రామాన్ని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ గతేడాది దత్తత తీసుకున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, అక్షరాస్యతాపరంగా అత్యంత వెనుకబడిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే సాహసం అని చెప్పొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మారుమూల అటవీ ప్రాంతంలోనున్న ఈ గ్రామం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడి నివసిస్తున్న ప్రజల్లో 98 శాతం దళిత, గిరిజన, బీసీలే. రెండు శాతం మాత్రమే అగ్రవర్ణాల ప్రజలున్నారు. సరైన వ్యవసాయం, ఉపాధి లేక బతుకుదెరువుకు కొందరు దుబాయ్ వెళితే, మెజారిటీ కుటుంబాలు నాటుసారానే నమ్ముకున్నారు. గత ఏడాది జనవరి 18న ఈ గ్రామాన్ని సందర్శించిన ఎంపీ వినోద్‌కుమార్ తన నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన గ్రామం ఇదేనని భావించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఏడాదిన్నరలో ఈ గ్రామ రూపురేఖలు మారుస్తానని ప్రకటించారు. అందుకనుగుణంగా సంవత్సరకాలంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామంలో చేపట్టారు. దేశవ్యాప్తంగా 702 మంది ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందులోని వాస్తవాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం దేశవ్యాప్తంగా టాప్ 15 గ్రామాల జాబితాను రూపొందించారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం దక్కడం విశేషం. గంగదేవిపల్లి స్ఫూర్తిగా.... గ్రామాభివృద్ధిలో వరంగల్ జిల్లా గంగదేవిపల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ వినోద్‌కుమార్ వీర్నపల్లి గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని ప్రత్యేక బస్సుల్లో గంగదేవిపల్లికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధిని, అమలవుతున్న పథకాలను, గ్రామస్తుల భాగసామ్యాన్ని, జాతీయస్థాయిలో ఈ గ్రామానికి గుర్తింపు రావడానికి గల కారణాలను వీర్నపల్లి వాసులకు అర్థమయ్యేలా వివరించారు. అదే తరహాలో వీర్నపల్లిని అభివృద్ధి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ గ్రామంలో ప్రజల స్థితిగతులపై బేస్‌లైన్ సర్వేను చేయించారు. గ్రామంలో పారిశుధ్యం, అక్షరాస్యత, సారా నిషేదం, మంచినీటి సరఫరా, ఉపాధిహామీ అమలు కోసం 168 మందితో 18 మంది కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పర్యవేక్షణలో అభివృద్ధికి బాటలు వేశారు. కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి పలుమార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మారిన ముఖచిత్రం ఎంపీ దత్తత తీసుకున్నాక వీర్నపల్లి ముఖచిత్రమే మారిపోయింది. గ్రామానికి 3జీ సౌకర్యం కల్పించారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పిల్లలు పాఠశాల మైదానంలో ఆటలాడుకోగలుగుతున్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించిన గ్రామంగా జాతీయ అవార్డుకు పోటీ పడుతోంది. గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. అంతకుముందు బ్యాంకింగ్ అవసరాల కోసం స్థానికులు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. గ్రామీణ బ్యాంకు ఏర్పడ్డాక రూ.1.80 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.1.30 కోట్లు రుణాలను అందజేశారు. గ్రామంలో 1109 మంది మహిళలుండగా వారంతా 80 స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. 2015–16లో రూ.68 లక్షలు, 2016–17లో ఇప్పటివరకు రూ.80 లక్షల మొత్తాన్ని జమ చేశారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాయితీ విత్తన, వ్యవసాయ, వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు భూసార పరీక్షలు నిర్వహించి కార్డులను ఆందజేశారు. విత్తనాలను పంపిణీ చేశారు. 80 మంది రైతులతో కలిసి సొసైటీని ఏర్పాటు చేశారు. రైతులకు రూ.80 లక్షల మేరకు పంట రుణాలిచ్చారు. గ్రామంలో భూముల గురించి రెవెన్యూ అధికారులు పూర్తి సర్వే నిర్వహించి బినామీ పేర్లతో ఉన్న పట్టా పుస్తకాలను రద్దు చేశారు. ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న 191 మంది రైతులకు వారి పేరిట పట్టా పాసుపుస్తకాలు అందజేశారు. ఈ గ్రామంలో ఏకంగా 70 మంది యువత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 200 మందికిపైగా యువత కంప్యూటర్లో నైపుణ్యత సాధించారు. 25 మందికి ముద్ర రుణాల పేరిట రూ.20 లక్షలిచ్చారు. పీఎంజేజేవై కింద 600 మంది, పీఎంఎస్బీవై కింద 3వేల మందికి బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. 65 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిరంతరం వాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 23 స్వయం సహాయ సంఘాల సభ్యులకు 50 శాతం సబ్సిడీ చొప్పున 54 యూనిట్ల కోడిపిల్లలను, 23 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.30 వేల విలువ చేసే గొర్రెపిల్లలను 50 శాతం సబ్సిడీపై అందజేశారు. 20 కుటుంబాలకు 50 శాతం సబ్సిడీపై 40 గేదెలను అందించారు. మరో 50 కుటుంబాలకు వంద గేదెలను మంజూరు చేశారు. తద్వారా ప్రతిరోజు ఈ గ్రామంలో వెయ్యి లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 45 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతోపాటు కుట్టుమిషన్లను అందజేశారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు ఆమ్ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం పథకాలను వర్తింపజేశారు. అభివృద్ధి పనులివీ.. గ్రంథాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ కింద వెంకటరాయని చెరువు పునరుద్ధరించారు. రూ.68 లక్షలతో అంగన్వాడీ, రూ.13 లక్షలతో పంచాయతీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రామంలో 500 మీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం రూ.52 లక్షలు ఖర్చుతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చారు. ఎన్టీపీసీ సహకారంతో పాఠశాలకు ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. చుట్టుపక్కలనున్న ఎనిమిది తండాల నుంచి వీర్నపల్లికి వచ్చేందుకు అనువుగా రూ.9 కోట్ల వ్యయంతో రింగురోడ్డును నిర్మిస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో ఒకే రేషన్ దుకాణం ఉండేది. ఎంపీ దత్తత తీసుకున్నాక అదనంగా మరో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ అవుట్లెట్ మంజూరైంది. -
దత్తత గ్రామాల్లో వీర్నపల్లికి 11వస్థానం
తెలంగాణలో ఎంపికైన ఏకైక దత్తత గ్రామం సాగి వెబ్సైట్లో పొందుపర్చిన అధికారులు మండల పరిషత్‌లో సంబరాలు ఎల్లారెడ్డిపేట: ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లి గ్రామానికి దేశంలో 11వస్థానం దక్కింది. దేశంలో ఎంపీలు 756 గ్రామాలను దత్తత తీసుకోగా.. అభివృద్ధిలో 50గ్రామాలను ఎంపిక చేశారు. మొదటిదఫాలో 15 దత్తత గ్రామాలను అభివృద్ధిలో ఎంపిక చేయగా.. అందులో 11వ స్థానంలో వీర్నపల్లికి చోటు లభించింది. కేంద్ర ప్రభుత్వ సాగి వెబ్సైట్లో ఎంపిక గ్రామాలను పొందుపర్చారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం లభించడంతో బుధవారం మండల పరిషత్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు. నాడే సాగి బృందం ప్రశంస ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సాగి బృందం సభ్యులు పర్యటించారు. గతనెల 28న వీర్నపల్లిలో సభ్యులు కుషాల్పతాక్, సతీష్రాజన్సిన్హా, అమీత్జైన్ వీర్నపల్లికి వచ్చారు. వీర్నపల్లికి జాబితాలో చోటు ఉంటుందని వారు అప్పుడే చెప్పారు. అదేరోజు మంత్రి కేటీఆర్ ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. అభివృద్ధి పనులు, వందశాతం అక్షరాస్యత, బ్యాంకు, కుట్టు శిక్షణకేంద్రం, రోడ్లు ఇతర సౌకర్యాలపై సాగి సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం సాగి వెబ్సైట్లో దత్తతలో వీర్నపల్లికి 11వ స్థానం కల్పించడంతో తెలంగాణలోనే ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏకైక గ్రామంగా ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
దత్తత గ్రామాలకు ఆదర్శం వీర్నపల్లి
సాగి డైరెక్టర్ కుషాల్పతాక్ గ్రామాన్ని సందర్శించిన కేంద్రబృందం పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ ఎల్లారెడ్డిపేట : ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ యోజనలో దేశవ్యాప్తంగా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లోకెళ్లా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రబృందం ప్రశంసించింది. సాగి డైరెక్టర్ కుషాల్పతాక్తోపాటు సభ్యులు గురువారం మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌లతో కలిసి వీర్నపల్లిని సందర్శించారు. ఇప్పటివరకు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 707 గ్రామాలను ఎంపీలు దత్తత తీసుకోగా, 56గ్రామాలు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయని, అందులో వీర్నపల్లి ఏ–ప్లస్ కేటగిరీలో ముందంజలో ఉందని తెలిపారు. జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాయింట్ల ఆధారంగా దత్తత గ్రామాలకు గ్రేడ్లు ఇస్తున్నట్లు తెలిపారు. వీర్నపల్లి ప్రజలు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ గ్రామంగా వీర్నపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ వీర్నపల్లిలో బ్యాంకు, మాడల్ పాఠశాల, కళాశాల, త్రీజీ సేవలు, కుట్టుశిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలకు భూముల కేటాయింపు, గ్రామాభివృద్ధి కమిటీల ఏర్పాటు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో సీతాఫలాల సేకరణకేంద్రం, పెట్రోల్‌పంపు, 15 పడకల ఆస్పత్రి ఏర్పాటుతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధిచూపుతామని, బ్యాంకుసేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పలువురికి స్వయం ఉపాధికోసం బ్యాంకు రుణాలు అందించారు. అనంతరం హరితహారంలో భాగంగా గ్రామంలో మెుక్కలు నాటారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు సతీష్రాజన్సిన్హా, అమిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.