దత్తత గ్రామాల్లో వీర్నపల్లికి 11వస్థానం
-
తెలంగాణలో ఎంపికైన ఏకైక దత్తత గ్రామం
-
సాగి వెబ్‌సైట్‌లో పొందుపర్చిన అధికారులు
-
మండల పరిషత్‌లో సంబరాలు
ఎల్లారెడ్డిపేట: ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లి గ్రామానికి దేశంలో 11వస్థానం దక్కింది. దేశంలో ఎంపీలు 756 గ్రామాలను దత్తత తీసుకోగా.. అభివృద్ధిలో 50గ్రామాలను ఎంపిక చేశారు. మొదటిదఫాలో 15 దత్తత గ్రామాలను అభివృద్ధిలో ఎంపిక చేయగా.. అందులో 11వ స్థానంలో వీర్నపల్లికి చోటు లభించింది. కేంద్ర ప్రభుత్వ సాగి వెబ్‌సైట్‌లో ఎంపిక గ్రామాలను పొందుపర్చారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం లభించడంతో బుధవారం మండల పరిషత్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు.
నాడే సాగి బృందం ప్రశంస
ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సాగి బృందం సభ్యులు పర్యటించారు. గతనెల 28న వీర్నపల్లిలో సభ్యులు కుషాల్‌పతాక్, సతీష్‌రాజన్‌సిన్హా, అమీత్‌జైన్ వీర్నపల్లికి వచ్చారు. వీర్నపల్లికి జాబితాలో చోటు ఉంటుందని వారు అప్పుడే చెప్పారు. అదేరోజు మంత్రి కేటీఆర్ ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. అభివృద్ధి పనులు, వందశాతం అక్షరాస్యత, బ్యాంకు, కుట్టు శిక్షణకేంద్రం, రోడ్లు ఇతర సౌకర్యాలపై సాగి సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం సాగి వెబ్‌సైట్‌లో దత్తతలో వీర్నపల్లికి 11వ స్థానం కల్పించడంతో తెలంగాణలోనే ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏకైక గ్రామంగా ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.