దత్తత గ్రామాలకు ఆదర్శం వీర్నపల్లి
-
సాగి డైరెక్టర్ కుషాల్‌పతాక్
-
గ్రామాన్ని సందర్శించిన కేంద్రబృందం
-
పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్
ఎల్లారెడ్డిపేట : ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ యోజనలో దేశవ్యాప్తంగా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లోకెళ్లా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని కేంద్రబృందం ప్రశంసించింది. సాగి డైరెక్టర్ కుషాల్‌పతాక్‌తోపాటు సభ్యులు గురువారం మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌లతో కలిసి వీర్నపల్లిని సందర్శించారు. ఇప్పటివరకు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 707 గ్రామాలను ఎంపీలు దత్తత తీసుకోగా, 56గ్రామాలు ప్రగతిపథంలో కొనసాగుతున్నాయని, అందులో వీర్నపల్లి ఏ–ప్లస్ కేటగిరీలో ముందంజలో ఉందని తెలిపారు. జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాయింట్ల ఆధారంగా దత్తత గ్రామాలకు గ్రేడ్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. వీర్నపల్లి ప్రజలు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ గ్రామంగా వీర్నపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ వీర్నపల్లిలో బ్యాంకు, మాడల్ పాఠశాల, కళాశాల, త్రీజీ సేవలు, కుట్టుశిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నిరుపేదలకు భూముల కేటాయింపు, గ్రామాభివృద్ధి కమిటీల ఏర్పాటు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో సీతాఫలాల సేకరణకేంద్రం, పెట్రోల్‌పంపు, 15 పడకల ఆస్పత్రి ఏర్పాటుతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధిచూపుతామని, బ్యాంకుసేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. పలువురికి స్వయం ఉపాధికోసం బ్యాంకు రుణాలు అందించారు. అనంతరం హరితహారంలో భాగంగా గ్రామంలో మెుక్కలు నాటారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు సతీష్‌రాజన్‌సిన్హా, అమిత్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.