వీర్నపల్లికి జాతీయ అవార్డు
-
నేడు అవార్డు ప్రదానం
ఎల్లారెడ్డిపేట: అక్షరాలతోనే మహిళా సాధికారిత సాధ్యమంటున్నారు వీర్నపల్లి మహిళలు. వివిధ మహిళా గ్రూపుల్లో ఉన్న వారంతా ఒకప్పుడు నిరక్షరాస్యులు కాగా.. నేడు అక్షరాలు నేర్చుకుని బ్యాంకుల్లో రుణాలకోసం సంతకాలు చేస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకున్నాక అందరికీ అక్షరాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీంతో వీర్నపల్లి అక్షరాస్యతలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. ఏటా అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయిలో ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేస్తుండగా.. ఈసారి అరుదైన అవకాశం వీర్నపల్లికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, దుండిగల్, నల్లగొండ జిల్లా దామెరచర్ల, సబ్దుల్లాపురం, పుట్టపాక, కరీంనగర్ జిల్లాలో వీర్నపల్లిని వందశాతం అక్షరాస్యత గ్రామాలుగా ఎంపికచేశారు. ఇందులో వీర్నపల్లిని జాతీయస్థాయి అవార్డు దక్కించుకుంది. అవార్డును గురువారం అందుకోవడానికి సాక్షరభారత్ జిల్లా డైరెక్టర్ జయశంకర్, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్, సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి ఢిల్లీకి వెళ్లారు.