Literacy
-
ఏఏఐ చైర్మన్‌గా విపిన్ కుమార్
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి విపిన్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన ఈ పదవిలోకి రాక ముందు కేంద్ర విద్యాశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌లో జిల్లా మెజి్రస్టేట్‌గా, బిహార్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. ఏఏఐ పూర్తి స్థాయి చైర్మన్ సంజీవ్ కుమార్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఏఏఐ సభ్యులు ఎం.సురేశ్ తాత్కాలిక చైర్మన్‌గా ఇప్పటి వరకు వ్యవహరించారు. మినీ రత్న అయిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 137 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్‌గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్‌స్థాన్‌లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
ఘనంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు!
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకల్లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో అంతర్జాతీయ సాహితీ సదస్సును ఏర్పాటు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి ప్రారంభించగా, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్ సభ అధ్యక్షత వహించారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీ నటుడు, కవి రచయిత తనికెళ్ళ భరణి, ప్రముఖ కవి, రచయిత కొలకలూరి ఇనాక్లు ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ వుందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో అమెరికా భారతి పేరుతో మాస పత్రిక ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ తెలుగు పై వారికి వున్న ప్రేమకి నిదర్శనం అని అన్నారు. అలాగే అమెరికాలో తెలుగు చదువుకోవడానికి యువతకు అన్ని విధాల సహకరిస్తున్న ఘనత ఆటా దేనని అన్నారు. అలాగే తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేసి వెలికితీసే ప్రక్రియను ఆటా చేయడం గొప్పగా ఉన్నదన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మీడియా రంగం అనే అంశంపై ప్రముఖ రచయిత కాసుల ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించగా టీవీ ప్రసారాలు అప్పుడు-ఇప్పుడు అనే అంశంపై శాంతి స్వరూప్, శ్రోతల జీవితాన్ని నిర్దేశించిన రేడియో అంశంపై అయినంపుడి శ్రీ లక్ష్మి, నూతన మాధ్యమాలు సత్యసత్యాలు అంశంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, ఇవాళ్టి తెలుగు పరిశోధకులకు మార్గదర్శనం అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్, సాంకేతిక యుగంలో సాహిత్య పాత్ర అంశంపై స్వామి ముద్దం తమ భావనలను వివరించారు. అనువాదం, నాటకం అవధానం అనే అంశంపై రూప్ కుమార్ డబ్బికార్ అధ్యక్షతన రెండవ సమావేశం నిర్వహించగా, అనువాదంలో చిక్కులు సమస్యలు అంశంపై జే.ఎల్ రెడ్డి, అనువాద సాహిత్యం-అవశ్యకత అంశంపై నలిమెల భాస్కర్, తెలుగు నాటకం తీరు తెన్నులు అంశంపై దెంచానాల శ్రీనివాస్, పరిశోధన, విమర్శ, సమాలోచనలు అంశంపై కొలకలూరి మధుజ్యోతి, అవధానంలో చమత్కారం అంశంపై నరాల రామ్ రెడ్డి వారి ఆలోచనలను పంచుకున్నారు తెలుగు కథలు, నవల, విశ్లేషణ అనే అంశంపై వెల్దండి శ్రీధర్ అధ్యక్షతన 3వ సమావేశం నిర్వహించగా జీవన స్రవంతి నవల-అనుభవాలు అనే అంశంపై టేకులపల్లి గోపాల్ రెడ్డి, నవల సాహిత్యంలో కొత్త పోకడలు అంశంపై మధురంతకం నరేంద్ర, యువతపై నవల సాహిత్య ప్రభావం అంశంపై మధుబాబు, తరాల తెలుగు కథ అంశంపై పెద్దింటి అశోక్ కుమార్, తెలుగు సాహిత్యంలో నవల ప్రాధాన్యత అంశంపై సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి, కథల్లో కొత్తదనం అనే అంశంపై మొహమ్మద్ గౌస్, కథ-సమాజం అంశంపై హుమాయూన్ సంఫీుర్ తమ భావనలను వివరించారు. ఆధునిక కవితా పరిణామాలు అనే అంశంపై కవి యాకూబ్ అధ్యక్షతన 4వ సమావేశం నిర్వహించగా ఎస్.వి సత్యనారాయణ, మువ్వా శ్రీనివాస్ రావు, నాలేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, మందారపు హైమవతి, కొండపల్లి నిహరిని, కందుకూరి శ్రీరాములు, పద్య కవితా శిల్ప సౌందర్యం అంశంపై జిల్లేపల్లి బ్రహ్మం తమ భావాలు వివరించారు. గేయ సాహిత్యం అనే అంశంపై రవీందర్ పసునూరి అధ్యక్షతన 5వ సమావేశం నిర్వహించగా ప్రముఖ గేయ రచయితలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాసు, కాసర్ల శ్యామ్ తమ పాటలతో ఉర్రూతలూగించారు. సినిమా సాహిత్య మేళవింపు అనే అంశంపై సినీ నటుడు తనికెళ్ళ భరణి అధ్యక్షతన 6వ సమావేశం నిర్వహించగా జనాభా దృశ్య కళా రూపాలు-ప్రదర్శన పద్దతులు అనే అంశంపై తప్పెట రామ్ ప్రసాద్ రెడ్డి, సినిమాల్లో జానపద కళారూపాలు అంశంపై బలగం వేణు, దృశ్య మాధ్యమంలో చారిత్రక అంశాలు అంశంపై అల్లని శ్రీధర్, సినిమా విమర్శ అంశంపై మామిడి హరికృష్ణ, దృశ్య మాధ్యమంలో తెలుగు కవిత్వం అంశంపై మొహమ్మద్ షరీఫ్ తమ భావనలను వివరించారు. ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ముగింపు వేడుకలకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విసి టి.కిషన్ రావు సభ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాజీ తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ జులురు గౌరీశంకర్, మాజీ బాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆటా చేస్తున్న సాహిత్య సేవ మరువలేనిది అన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసిన ఆటా వారికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: టీటీఏ సేవాడేస్.. నెక్లెస్ రోడ్లో 5కె రన్!) -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రజా ఉద్యమాలే తీర్చిదిద్దాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఒక ఒంటరిని, ఏకాకిని అయిన నన్ను సాహిత్య, ప్రజా ఉద్యమాలు సామూహికం చేశాయి. నల్లగొండ జిల్లా మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన నన్ను ప్రజాఉద్యమాలు అక్కున చేర్చుకొని సమష్టి జీవితాన్ని అందించాయి.’ అని ప్రముఖకవి, రచయిత నిఖిలేశ్వర్ అన్నారు. తన జీవన ప్రస్థానంపై రాసిన ‘నిఖిలలోకం’ (జీవితచరిత్ర)తోపాటు ఆయన రాసిన మరోగ్రంథం ‘సాహిత్య సంగమం’ పుస్తకాల ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ శివంరోడ్డులోని ఓ హోటల్లో జరిగింది. ప్రముఖకవి కె.శివారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నగ్నముని రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన దిగంబర సాహిత్యం మొదలుకొని విరసం, అరసం, తదితర సాహిత్య ఉద్యమాలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీరవల్లి తన సొంత గ్రామమైనా, హైదరాబాద్‌లోనే తన జీవితం ఆరంభమైందన్నారు. నగ్నముని మాట్లాడుతూ సామాజిక వైరుధ్యాలు, సంక్లిష్టతలను అవగాహన చేసుకొనేందుకు జీవితచరిత్రలు దోహదం చేస్తాయన్నారు. అరవయ్యోదశకం నాటి ఆరుగురు దిగంబర కవుల్లో ప్రస్తుతం తాను, నిఖిలేశ్వర్ మాత్రమే ఉన్నట్టు గుర్తు చేశారు. శివారెడ్డి మాట్లాడుతూ దిగంబర కవుల సాహిత్యం నుంచి తాను గొప్ప స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు చెప్పారు. తెలుగుభాష, సాహిత్యాన్ని నవ్యపథంలో నడిపించిన ఘనత వారిదేనన్నారు. తన పదహారో ఏట మొట్టమొదటిసారి దిగంబర కవులను సంభ్రమాశ్చర్యాలతో చూసినట్టు ప్రముఖ రచయిత్రి ఓల్గా గుర్తు చేసుకున్నారు. నిఖిలేశ్వర్, శివారెడ్డి వంటి ప్రముఖుల జీవితాలను విద్యార్ధిదశలో ఎంతో దగ్గరగా చూసే అవకాశం తనకు లభించిందని నందిని సిధారెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్,తెలకపల్లి రవి, మానవహక్కుల వేదిక కార్యకర్త ఎస్.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, జతిన్‌కుమార్, నిఖిలేశ్వర్ కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్షర పూదోటలో విహారం
‘తోటలో అడుగుపెట్టినప్పుడు చెట్లకు పూచిన అందమైన పూలను చూస్తాం, వాటి పరిమళాలను ఆస్వాదిస్తాం. ఎండి రాలిన ఆకులను చూసి బాధపడుతూ కూర్చోం. జీవితమూ అంతే... మనం దేనిని తీసుకోవాలో తెలిస్తే అదే మన జీవితం అవుతుంది’ అంటారు అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన సాహితీ ప్రేమికురాలు ఆమె. అక్షరం అమూల్యమైనది. మనసు పలికిన అక్షరాలను మాలలుగా అల్లుతున్న ఈ కవయిత్రి... విశ్రాంత జీవనాన్ని హైదరాబాద్‌లో ఆమె అల్లుకున్న అక్షర పూదోటలో విహరింప చేస్తున్నారు. రాయాలి... ఏం రాయాలి? రాయాలంటే... రాయాలనే తపన ఉండాలి. అంతకంటే ముందు చదవాలనే తృష్ణ దహించి వేయాలి. అలా లైబ్రరీ మొత్తం చదివేసిందామె. ‘పెద్ద లైబ్రరీలో తనకు నచ్చిన రచనలకు మాత్రమే పరిమితమై ఉంటే... సాహిత్యంలో కొన్ని కోణాలను మాత్రమే స్పృశించగలిగేదాన్ని. లైబ్రరీ మొత్తం అక్షరం అక్షరం చదివేశాను... కాబట్టి, అందులో కొన్ని రచనల మీద పెద్దవాళ్ల విశ్లేషణను, అభిప్రాయాలను విన్నాను కాబట్టి ఏం రాయకూడదో తెలిసివచ్చింది. నా బాల్యంలోనే జై ఆంధ్ర ఉద్యమాన్ని చూశాను, ఇండో – పాక్ యుద్ధాన్ని చూశాను... కాబట్టి మనిషి ఎదుర్కొనే అసలైన కష్టం ఏమిటో అర్థమైంది. మనం కష్టాలుగా భావించే ఏదీ నిజానికి కష్టం కాదు. ఇవన్నీ మనకు మనంగా కల్పించుకున్న వెతలు మాత్రమే. వాటికి పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. ఆ పరిష్కారం కోసం మనలోకి మనం తరచి చూసుకుంటే సరిపోతుంది. నా రచనల్లో అదే చెప్పాను’ అన్నారామె. చిన్న జీవితం మనది, ఆ చిన్న జీవితాన్ని హాయిగా, ఆహ్లాదంగా జీవించాలి. ఇదీ ఆమె ఫిలాసఫీ. ‘మగాడు’ కథ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం అమ్మాయి... గోదావరిలో ఈతకొడుతూ పెరిగిన అమ్మాయి, చెట్టునే మగ్గిన మామిడి పండును కొరికి తిని టెంకను చెట్టుకే వదిలేసిన అందమైన అల్లరి బాల్యం, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల్లోని అక్షరాల్లో ప్రపంచాన్ని చూసింది. ఆ అక్షరాలతోనే స్నేహం చేసింది. ముగ్గురు అక్కలు, అన్న పెంపకంలో ఒకింత పెద్ద లోకాన్ని అర్థం చేసుకుంది. వాళ్ల ఊరి నుంచి పొరుగూళ్ల థియేటర్లలో కూడా మారిన సినిమాలన్నీ చూసేసింది. ఆడపిల్ల చదువుకోవడానికి పొరుగూరికి వెళ్తుంటే ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేసి చూసే అతి చిన్న ప్రపంచంలో ఆమె సైకిల్ మీద కాలేజ్‌కి వెళ్లి ఓ ట్రెండ్‌ను సెట్ చేసింది. డిగ్రీ చదివిన తొలి అమ్మాయిగా ఊరికి ఒక రికార్డునిచ్చింది. గోదావరి నదిని ఈదినంత సునాయాసంగా సాహిత్యసాగరంలో ఈదుతున్నప్పుడు కూడా ఆమెలో రాయాలనే ఆలోచన కలగలేదు. మనసును చివుక్కుమనిపించిన ఓ రచన ఆ పని చేసింది. ఆ కథ పేరు ‘ఆడది’. ‘‘మల్లిక్ గారు రాసిన ‘ఆడది’ కథలో భారతీయ సమాజంలో సగటు గృహిణి పాత్రను వర్ణిస్తూ కథ చివరిలో ‘పాపం ఆడది’ అని ముగించారు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. ‘మగాడు’ అని హెడ్డింగ్ పెట్టి ‘పాపం ఎంతైనా మగాడు’ అని చివరి వాక్యం రాశాను. కానీ ఎలా మొదలుపెట్టాలో, కథనం ఎలా సాగాలో తెలియదు. పూర్తి చేయడానికి నెలలు పట్టింది. ‘విజయ’ మాస పత్రికకు పంపిచాను. వాళ్ల నుంచి రిప్లయ్ లేదు. నా కథ చూసి నవ్వుకుని ఉంటారని తలచు కుని తలచుకుని సిగ్గుపడిపోయాను. ఆరు నెలలకు పోస్టులో ‘విజయ’ మంత్లీ మా ఇంటికి వచ్చింది. అందులో నా కథ. అలా మగాడు కథతో రైటర్నయ్యాను’’ అన్నారు గౌరీ లక్ష్మి నవ్వుతూ. చేయి చాచవద్దు! ‘‘ఆడవాళ్లు సమానత్వ సాధన కోసం శ్రమిస్తున్నారు. వాణిజ్య ప్రపంచంలో స్త్రీ అయినా పురుషుడైనా ఒక మనిషి గుర్తింపుకు సంపాదనే కొలమానం అవుతోంది. కాబట్టి ఆర్థిక స్వావలంబనతోనే సమానత్వ సాధన సాధ్యమవుతుందంటారు గౌరీలక్ష్మి. సంపాదనలో పురుషుడికి దీటుగా నిలిచినప్పుడు ‘మమ్మల్ని గౌరవించండి, సమానమైన అవకాశాలివ్వండి’ అని ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదంటారామె. ‘‘సమానత్వం కోసం చేయి చాచి యాచించవద్దు... అంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించినప్పుడు ఇక సమానత్వ సాధన కోసం పిడికిలి బిగించి పోరాడాల్సిన అవసరమూ ఉండదు. వరకట్నం అనే దురాచారం కనుమరుగయ్యే మంచి తరుణం కూడా అప్పుడే వస్తుంది. కన్యాశుల్కంతో పోరాడి బయటపడేటప్పటికి వరకట్నం రూపంలో మరో దురాచారం కోరల్లో చిక్కుకుంది భారతీయ స్త్రీ. చదువుకుంటే అన్నీ చక్కబడతాయనుకుంటే... మహిళ ఎంత సాధించినా పని చేసే చోట వివక్ష, లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇంకా ఉంది. అదే పిటీ. అలాగని మహిళలు సెల్ఫ్ పిటీలోకి వెళ్లకుండా ధైర్యంగా నిలబడాల్సింది ఇక్కడే. నేను 36 ఏళ్లు ఉద్యోగం చేసిన అనుభవంతో చెప్తున్నాను. మహిళ తన ఉనికిని నిలుపుకోవడానికి అవసరమైతే ఎన్ని ఉలి దెబ్బలను తట్టుకోవడానికైనా సరే సిద్ధంగా ఉండాలి’’ అన్నారామె. ఆమె రచనల్లో స్త్రీ ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, వైవాహిక జీవితంలో అపసవ్యతలు ఎదురైన మహిళగా సమాజంలో ఎదొర్కొనే రకరకాల సమస్యలను ప్రస్తావించారు. సరైన నిర్ణయమే! గౌరీ లక్ష్మి తన ముఖంలో ప్రసన్నతకు కారణం జీవితం పట్ల ఎటువంటి ఎక్ట్పెక్టేషన్లు లేకపోవడమేనంటారు. ‘‘ఉద్యోగం మానేసి పూర్తి సమయాన్ని రచనల కోసమే కేటాయించమని యండమూరి సూచించినప్పుడు... ‘నాకు చదవడం, రాయడం ఇష్టం. అక్షరాలంటే ప్రేమ. అక్షరాలను కమర్షియల్‌గా మార్చుకోవడం ఇష్టం లేదు. ఉద్యోగం చేసుకుంటూ, రాయాలనిపించినప్పుడు రాస్తుంటాను’... అని చెప్పాను. అది సరైన నిర్ణయమే. నా రచనకు ఎంత గుర్తింపు వచ్చింది, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి, రివ్యూలు ఎలా వచ్చాయి, ఎంత పారితోషికం వస్తోంది... వంటి లెక్కలేవీ ఉండవు నాకు. కీర్తికాంక్ష కోసం వెంపర్లాట కూడా లేదు. నా స్పందనకు అక్షరరూపమిస్తున్నాను. ఆ స్పందనకు ఏ కమర్షియల్ కొలమానాలూ అక్కరలేదు. అందుకే హాయిగా ఉన్నాను’’ అన్నారామె. గౌరీలక్ష్మితో మాట్లాడినప్పుడు వృత్తి ప్రవృత్తి మధ్య సమతూకం తెలిసినప్పుడు జీవితంలో అన్నీ తూకంగానే ఉంటాయనిపించింది. తామరాకు మీద నీటి బిందువులా జీవించడానికి సద్గురువుల బోధనలు అక్కరలేదు, అనవసరపు అంచనాల, ఆకాంక్షల పరిభ్రమణానికి దూరంగా ఉండగలిగితే చాలు... అని తెలిసింది. అక్షరాల మడి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉండేవాళ్లం. సిటీలోకి వచ్చి వెళ్లడానికి రోజూ నలభై కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి ఉద్యోగం చేశాను. వారాంతాల్లో కథా సదస్సుల్లో పాల్గొంటూ నా అభిరుచిని చిగురింపచేసుకున్నాను. ఇవన్నీ భర్త, ఇద్దరు పిల్లలతో ఇంటిని చక్కబెట్టుకుంటూనే. వీటి మధ్యలోనే పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాను. సాహిత్యపరంగా నాలుగు కథా సంపుటాలు, మూడు నవలలు, రెండు కవితా సంపుటాలు, రాజకీయ వ్యంగ్య కథనాలు కూడా రాశాను. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కాలమ్స్ రాస్తున్నాను. నన్ను నిత్యనూతనంగా ఉంచుతున్నది సాహిత్యమే. మనిషి వ్యక్తిత్వాన్ని చక్కటి శిల్పంలా తీర్చిదిద్దగలిగిన గొప్ప సాధనం సాహిత్యం. అందుకే సాహిత్యంతో స్నేహం చేయడం అందరికీ మంచిదని చెబుతాను. నాకంటూ నేను పెంచుకున్న సాహిత్యవనంలో విహరిస్తూ విశ్రాంత జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాను. – అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి, జనరల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్‌లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్‌బుక్స్‌లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్‌షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్‌చైర్‌కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్‌గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్‌గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు
సాక్షి, మాడ్గుల: తగుళ్ల ఎల్లమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్ ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఎంఏ తెలుగు పూర్తి చేసి పరిశోధన ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన రాసిన ‘దండ కడియం’ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపిక కావడంతో అటు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కలకొండలో, ఇటు అజిలాపూర్‌లో హర్షం వ్యక్తమవుతోంది. ‘‘ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్క అయి ఉంటుంది’’ అని తన కవిత్వంలో మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను బతికించుకొనే ప్రయత్నం చేశారు గోపాల్. ‘తీరొక్క పువ్వు’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. రాష్ట్ర సాహితీ యువ పురస్కార్, మహబూబ్‌నగర్ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కార్, రొట్టెమాకురేవు సాహితీ అవార్డు అందుకున్నారు. నా గ్రామమే నాకు స్ఫూర్తి మా ఊరు కలకొండలో నేను చవిచూసిన జ్ఞాపకాలు, పల్లెటూరి ప్రజల కష్టసుఖాలు, శ్రామికుల జీవన విధానాలే ‘దండ కడియం’ రాయడానికి స్ఫూర్తి. దండ కడియంలో ఓ పల్లెటూరి పిల్లోడి జీవనవిధానం ప్రతిబింబించేలా అక్షర రూపం ఇచ్చాను. ఇది నా ఆత్మకథ. – తగుళ్ల గోపాల్ దేవరాజు ‘నేను అంటే ఎవరు’ సాక్షిప్రతినిధి, వరంగల్: ఆధునిక, వైజ్ఞానిక పరమైన అంశాలను ఓ తాత ఇద్దరు పిల్లలకు వివరించేదే డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు’. ఒక తాతను పిల్లలు అడుగుతుంటే.. ‘ఆధ్యాత్మికత, దేవుడు, దయ్యం కాదు...నిన్ను నీవు తెలుసుకోడానికి నీ శరీరం జీవ కణాలతో ఎలా ఏర్పడింది ?హృదయం, మెదడు ఎలా ఏర్పడ్డాయి ? మనసు అనేది ఎక్కడా ఉండదు. అది మెదడులోనే ఒక భాగం’.. అంటూ అనేక సున్నిత, వాస్తవమైన అంశాలను ఇందులో వివరించారు. దేవరాజు 1951 ఫిబ్రవరి 21న వరంగల్ జిల్లా (జనగామ తాలూకా) కోడూరులో జన్మించారు. 1972లో హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ లోని ఓయూ పీజీ సెంటర్లో ఎమ్మెస్సీ జువాలజీ ఫస్టియర్ చదువుతుండగా.. ఉగాది సందర్భంగా ‘పాలు ఎర్రబడ్డాయి’అనే కవిత రాశారు. ఇది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం కావడంతో ప్రాచు ర్యం పొందారు. తర్వాత తెలంగాణ మాండలికంలో రాసిన ‘గుండె గుడిసె’కు మంచి ఆదరణ లభించింది. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రం థమే అయినా.. సంపాదకుడిగా దానిని ఐఏఎస్ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. రాజముద్ర, మధుశాల, నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది.. ఇలా 85కి పైగా రచనలు చేశారు. గౌరవాలు.. గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును 1991లో పొందారు. హరివంశరాయ్ బచ్చన్ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హిందీ ఆకాడమీ వారి సౌజన్యంతో ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు వంటివెన్నో అందుకున్నారు. దశాబ్ద కాలంగా నేషనల్ బుక్ ట్రస్ట్వారికి న్యూఢిల్లీ సలహా సంఘ సభ్యులుగా ఉన్నారు. -
సీమ నేలను కథగా చూపినవాడు
కేతు విశ్వనాథ రెడ్డికి 80 ఏళ్లు. తెలుగు కథా సాహిత్యంలో భీష్మ పితామహుడి వంటి ఆయనకు ఇప్పుడు సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం విశేషం కాదు. కాని ఆయనను సత్కరించుకోకుండా ఎవరిని సత్కరించుకోగలం? తెలుగు కథను, రాయలసీమ కథను సగర్వంగా, సమున్నతంగా గౌరవించుకోవాలని అనుకున్న ప్రతిసారీ ఆ పూలహారం వెళ్లి పడేది కేతు విశ్వనాథరెడ్డి మెడలోనే. సీమ కథకు చేవ ఆయనది. చేర్పు ఆయనది. నేల మీద గట్టిగా నిలబడి చెప్పిన సాహిత్యమంతా నిలిచింది. కేతు విశ్వనాథరెడ్డి తన చూపును నేలన గుచ్చి కథలు రాశారు. నేల మీద తిరుగాడే మట్టి పాదాలు, రైతు పాదాలు, స్త్రీల పాదాలు, తెలియకనే బానిసలుగా బతుకుతున్నవారి పాదాలు... ఇవి ఆయన కథా వస్తువులు. రాయలసీమ కథలో మధురాంతకం రాజారాం గారిది ఒక కథాధోరణి అయితే కేతు విశ్వనాథ రెడ్డిది మరో కథాధోరణి. మధురాంతకం రాజారాం పాఠకుణ్ణి ఒప్పించడం కూడా అవసరమే అనుకుంటారు. కేతు విశ్వనాథ రెడ్డి ‘నేను జీవితాన్ని చూపుతాను... చూడగలిగిన వారంతా చూడండి’ అని ములాజా లేని ధోరణి పాటించారు. కఠిన సత్యాలను, నిష్టూర సత్యాలను సీమ ప్రజల తరఫున పాఠకుల ముందు పెట్టారు. రైతుకు, నేలకు ముడి తెగితే ఆ రైతు ఎలా గాలికి కొట్టుకుపోయి పతనమవుతాడో కేతు తన ‘నమ్ముకున్న నేల’ కథలో చూపుతారు. ఆ కథ రాసే సమయానికీ ఇప్పటికీ పరిస్థితి మారి ఉండొచ్చు. కాని ఆ సమయంలో ఆ కథ మొత్తం రాయలసీమ నేల పెట్టిన వెర్రికేక. కరువు నేలలో మనిషిలో జడలు విప్పే స్వార్థం పశుస్థాయి కన్నా ఘోరమైనది అని ‘గడ్డి’ కథలో ఆయన చూపుతారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు ప్రజల వరకూ చేరడం లో, ఆఖరుకు గడ్డి పంపకంలో కూడా భాగాలుంటాయని కేతు చెప్తే పాఠకునికి కడుపు తరుక్కుపోతుంది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కేతు నిశితమైన వ్యాఖ్యానం వంటి కథలు రాశారు. ‘కూలిన బురుజు’ అందువల్లే గొప్ప కథగా నిలిచిపోయింది. ఆ కథలో ఒక డాక్టరు చేత ‘జబ్బు ఉంది అని కనిపెట్టడం గొప్ప కాదు. ఆ జబ్బుకు మందు కనిపెట్టడం గొప్ప’ అనిపిస్తారు. ఆ కథలో చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన డాక్టరు పాత్ర ఊరిని చూసి దిగ్భ్రమ చెందుతుంది. ఊళ్లో ఎక్కడ చూడు కొట్లాటలూ కార్పణ్యాలే. తలాన్ని మార్చి చూస్తే సమస్య సరిగ్గా అర్థమవుతుంది. ఊరిలో ఉన్న వాళ్లకు తాము అలా ఎందుకున్నామో తెలియదు. ఊరు వదిలి వెళ్లిన డాక్టరుకు అర్థమవుతుంది. మగవాళ్ల పంతాలలో నలిగిపోయే స్త్రీలను ఈ కథలో కేతు గొప్పగా చూపుతారు. కేతు విశ్వనాథరెడ్డి రాయలసీమలోని ఆత్మీయ జీవనాన్ని మతాల మధ్య ఉండే సహనపూర్వకమైన జీవనాన్ని కథల్లో చూపారు. ‘పీర్లసావిడి’, ‘అమ్మవారి నవ్వు’ ఆ విషయాన్ని నిరూపిస్తాయి. ఆయన స్త్రీవాద దష్టితో రాసిన కథలూ విలువైనవి. స్త్రీలు చదువులో, ఉపాధిలో వివక్ష అవసరంలేని, లైంగిక వేధింపులకు తావు లేని జీవనం పొందాలని బలంగా కోరుకున్నారు. ‘రెక్కలు’ కథ అందుకు ఉదాహరణ. ‘సతి’, ‘ఇచ్ఛాగ్ని’... ఆ వరుసలో ఎన్నో. రాయలసీమ వాసికి వాన ఎంత ముఖ్యమో వాన కోసం ఎన్ని అగచాట్లు పడతాడో ‘వాన కురిస్తే’ కథలో దుఃఖం కలిగేలా చెబుతాడాయన. కేతు విశ్వనాథ రెడ్డి కేవలం కథకుడు కావడం వల్ల మాత్రమే తన సాహితీ జీవనాన్ని సాఫల్యం చేసుకోలేదు. అరసంలో పని చేశారు. కొ.కు. సంపుటాలకు సంపాదకత్వం వహించారు. వత్తి రీత్యా అధ్యాపకుడైనందున కథకునిగా కూడా శిష్యులను ప్రశిష్యులను తయారు చేశారు. కేతు ప్రోత్సాహంతో కథా సాహిత్యంలో కషి చేసిన, చేస్తున్న మేలిమి కథకులు ఇవాళ ఉన్నారు. హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించి, తన నేల– కడపలో విశ్రాంత జీవనం గడుపుతున్న కేతు విశ్వనాథ రెడ్డి కథాలోకానికి ఒక పెద్ద దిక్కు. నేడు ఆయనకు జరుగుతున్న సత్కారం తెలుగు కథకు జరుగుతున్న సత్కారం. ఆ సభకు ఆయన కథలూ బారులు తీరుతాయేమో. పాఠకులమైన మనం ఆ సమూహంలో మెడ నిక్కించకుండా ఎలా ఉండగలం? కేతుగారికి హదయపూర్వక శుభాకాంక్షలు. డాక్టర్ తుమ్మల రామకృష్ణ వ్యాసకర్త, వైస్ చాన్సలర్, కుప్పం యూనివర్సిటీ (కేతు విశ్వనాథరెడ్డికి నేడు అనంతపురంలో ‘విమల సాహిత్య జీవిత పురస్కారం’ బహూకరిస్తున్న సందర్భంగా...) -
ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు
సంపూర్ణ అక్షరాస్యత.. వర్తమాన అంశాలపై పూర్తి అవగాహన కేరళ ప్రజల సొంతం.. రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే గత 40 ఏళ్లుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఎందరో రాజకీయ చతురులు.. మరెందరో ఉద్దండులకు కూడా అది సాధ్యపడలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి శక్తిమంతమైన కమ్యూనిస్టు నేతలే అక్కడి ప్రజల నాడి పట్టలేకపోయారు. దీన్ని బట్టే కేరళ ప్రజల రాజకీయ చైతన్యం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 1980 నుంచి ఏ ఒక్కరిని కూడా కేరళ ప్రజలు వరుసగా రెండోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టలేదు. అలాంటిది 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. రెండోసారి అధికారంలోకి రానున్నారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్ పినరయి విజయన్. గతంలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏ రాజకీయ నేతకూ సాధ్యంకాని ఈ అరుదైన రికార్డు.. విజయన్ను ఎలా వరించింది..? అఖండ విజయ సాధనకు తోడ్పడిన అంశాలేంటి..? గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి ఎలా విజయ పతాకా ఎగరేయగలిగారు..? సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్ నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడ్డాయని అనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందే విజయన్ రచించిన వ్యూహాలు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో విభేదాలు పినరయికి బాగా కలిసొచ్చాయి. కష్టకాలంలో ముందుండి.. సమస్య వచ్చినప్పుడే అసలైన లీడర్ ఎవరో తెలుస్తుంది అంటారు. గత ఐదేళ్లుగా కేరళలో ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్న ఉపద్రవాలను చాకచక్యంగా, విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు పినరయి విజయన్. సమస్యలు, ఇబ్బందులు ఉన్న చోట తాను ఉన్నానంటూ ధైర్యం ఇచ్చారు. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018, 2019లో వరదలు, 2020లో కరోనా మహమ్మారి.. ఇలా అన్ని విపత్తులనూ విజయన్ సమర్థం గా ఎదుర్కొన్నారు. సైక్లోన్ సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు. విపత్తు నిర్వహణలో దిట్ట.. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.. కానీ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. అడ్వాన్స్‌గా పెన్షన్ ఇవ్వడం, ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో ప్రజల బాగోగులు చూసుకోవడం ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు విజయన్. రేషన్ సరుకుల పంపిణీ లాక్డౌన్ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. హామీలన్నీ నెరవేర్చే దిశగా.. గత ఎన్నికల్లో తాను చేసిన 600 హామీల్లో.. ఏకంగా 570 హామీలను నెరవేర్చిన ఘనత విజయన్‌కే దక్కింది. ఎన్నో పథకాలను ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎంతో దూరదృష్టితో రూపొందించారు. ‘లైఫ్ మిషన్’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ‘అర్ధ్రమ్ మిషన్’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు. ‘ఎడ్యుకేషన్ మిషన్’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ క్లాస్‌రూమ్స్, హైటెక్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్. అయితే విజయన్ ప్రస్థానం నల్లేరు మీద నడకేమీ కాదు. ఆయనా ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతెందుకు సొంత పార్టీలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీపీఐఎం సీనియర్ నేత అచ్యుతానందన్‌కు, పినరయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోల్డ్ స్మగ్లిం గ్ కేసులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఒకానొక సందర్భంలో పినరయిని మీడియా విలన్‌గా చిత్రీకరించింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా, పవర్ హౌస్లా నిలబడ్డారు రియల్ కామ్రేడ్. కేరళలో మత రాజకీయాలకు స్థానం లేదని ప్రజలు నిరూపించారు. ఎల్డీఎఫ్ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నా. ప్రభుత్వ ఇమేజీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బురద చల్లేందుకు పలు మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రంలో లౌకికవాదం కొనసాగాలంటే లెఫ్ట్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనం నమ్మారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు లేనిపోని ప్రచారాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వేరే రాష్ట్రాల సీఎంలు కేరళకు వచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు చాలా తాపత్రయపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ మత రాజకీయాలు చెల్లినట్లు కేరళలో చెల్లదని మరోసారి రుజువైంది’. – పినరయి విజయన్, కేరళ సీఎం -
‘రంగినేని’ పురస్కారానికి కథా సంపుటాలకు ఆహ్వానం
సాక్షి, సిరిసిల్ల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో ‘రంగినేని ఎల్లమ్మ’సాహిత్య పురస్కారాన్ని ఏటా అందిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షుడు రంగినేని మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్య పురస్కారం కోసం 2018, 2019, 2020 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు ఐదు ప్రతులు అక్టోబర్ 31లోగా పంపించాలని అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ కోరారు. రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం కింద రూ.21 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రాన్ని 2021 జనవరిలో అందిస్తామని పేర్కొన్నారు. కథా సంపుటాలు పంపాల్సిన అడ్రస్ రంగినేని ఎడ్యుకేషనల్ ట్రస్ట్, బాలాజీ నగర్, సిరిసిల్ల–505 301, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇతర వివరాలకు 94416 77373ని సంప్రదించాలని కోరారు. -
అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి
ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుంది. అక్షరా స్యులైన ప్రజలు వస్తుసేవల ఉత్పత్తిలో పాల్గొని దేశ జీడీపీ పెరుగుదలకు తమ వంతు సహకారాన్ని అందిస్తారు. అభివృద్ధిలో మాత్రమే కాదు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ఆరోగ్యకరమైన మార్పులకు తోడ్పడుతారు. యునెస్కో తన 14వ సర్వసభ్య సమా వేశం అక్టోబర్ 26, 1966న జరిపి, సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా జరు పుకోవాలని ప్రకటించింది. తరువాతి సంవత్సరం 1967 నుంచి జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 86.3 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అక్షరాస్యత 99.2 శాతంగా ఉంది. ప్రపంచంలోని 78.1 కోట్ల నిరక్షరాస్యుల్లో 75 శాతానికి పైగా దక్షిణాసియా, పశ్చిమాసియా, ఉప సహార ఆఫ్రికాల్లో ఉన్నారు. యునెస్కో వారి ‘గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ఆన్ ఎడ్యుకేషన్’ ప్రకారం దక్షిణాసియా అత్యల్ప ప్రాంతీయ వయోజన అక్షరాస్యతా శాతాన్ని కలిగి ఉంది. దేశాల జాబితాలో చైనా 62, శ్రీలంక 93, బంగ్లాదేశ్ 129, నేపాల్ 137, భూటాన్ 138, పాకిస్తాన్ 148వ స్థానాల్లో ఉంటే, భారత్ 128వ స్థానంలో ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వృద్ధి రేటు పురుషుల్లో 6.9 శాతంగా, మహిళల్లో 11.8 శాతంగా, ఉమ్మడిగా 9.2 శాతంగా ఉంది. మహిళల వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం శుభపరిణామం. ఈ వృద్ధిరేటుతో భారతదేశం నూరు శాతం అక్షరాస్యత సాధించాలంటే 2060 వరకూ ఆగాల్సిందే. ఏడు సంవత్సరాల పైబడ్డవారు ఏ భాషలోనైనా చదవగల, రాయగల వారిని అక్షరాస్యులు అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 74.04 శాతం ప్రజలు అక్షరాస్యులుగా ఉన్నారు. ఇది పురు షుల్లో 82.14 శాతం, మహిళల్లో 65.46 శాతం. అత్యధికంగా కేరళలో 93.4 శాతంగా, అతి తక్కువగా బిహార్‌లో 63.82 శాతంగా నమోదైంది. దేశంలో అక్షరాస్యతా స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 32, తెలంగాణ 35, బిహార్ 36వ స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ అక్షరాస్యత 2011 లెక్కల ప్రకారం 66.46 శాతం. అత్యధికంగా హైదరాబాద్‌లో 80.96 శాతం ఉండగా, అతితక్కువగా మహబూబ్‌నగర్‌లో 56.6 శాతంగా ఉంది. తెలంగాణ ఆర్థిక సర్వే 2018 ప్రకారం రాష్ట్రంలో 2018 నాటికి అక్షరాస్యత 84.11 శాతానికి పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరక్షరాస్యతకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యా ఉపయోగాలు తెలియకపోవటం, పేదరికం, వలసలు, తల్లిదం డ్రులు ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి పిల్లలను ఆయా పనుల్లో నిమగ్నం చేయడం, పాఠ శాల సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అసమాన తలు ముఖ్యమైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ విద్యా సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొంది. కొఠారి కమిషన్ విద్యకు జీడీ పీలో 6 శాతం నిధులను ఖర్చు చేయాలని చెప్పింది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా 4 శాతం కంటే ఎక్కువగా ఖర్చు చేయలేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి సుస్థి రాభివృద్ది ఎజెండా– 2015 నాలుగవ లక్ష్యంగా అందరికీ నాణ్యమైన విద్యను 2030 నాటికి సాధిం చాలని నిర్దేశించింది. దీనికిగానూ తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి పిల్లల చదువుపై అవగాహన పెంచడం, సౌకర్యవంతమైన పాఠశాల సమయాన్ని అందించడం, పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యా శిక్షణ ఇవ్వడం మొదలైన చర్యలు అవసరం. నూతన విద్యా విధానం 2020లో పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యా స్థాయిలో ఆశించిన సంస్కరణలు ఉన్నప్పటికీ ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒక దృఢ ప్రణాళికతో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ప్పుడే భవిష్యత్ తరం తమ కాళ్ళపై తాము నిల బడుతుంది, దేశాన్ని నిలబెడుతుంది. వ్యాసకర్త : జుర్రు నారాయణ యాదవ్, టీటీయూ జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్ ‘ మొబైల్ : 94940 19270 -
పరీక్ష రాస్తావా తల్లీ పడవ రెడీ
కేరళరాష్ట్రం అక్షరాస్యతలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. దాదాపు 94 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అది. అందరూ చదువుకుంటున్నారు కాబట్టి అక్షరాస్యతలో తొలిస్థానంలో నిలిచిందా? లేక ఆ సమాజంలో చదువుకునే వాతావరణం వల్లనే ఆ రాష్ట్రం ముందంజలో ఉందా? అదీ కాకపోతే పాలకులు కూడా ప్రతి విద్యార్థి చదువునీ తమ పిల్లల చదువులాగానే భావించి బాధ్యత తీసుకుంటున్నారా? కేరళ అక్షరాస్యతలో అగ్రభాగాన నిలవడానికి పైవన్నీ కారణాలే. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక అమ్మాయి పరీక్షలు రాయడానికి ప్రభుత్వం ఒక పడవనే ఏర్పాటు చేసింది. డెబ్బైమంది ప్రయాణించగలిగిన సామర్థ్యం కలిగిన ఆ పడవలో ఆమె ఒక్కర్తే వెళ్లి పరీక్ష రాసి తిరిగి అదే పడవలో ఇంటికి వచ్చింది. ఆమె పరీక్ష రాసినంతసేపు ఆ పడవ ఆమె కోసం నిరీక్షిస్తూ ఏటి గట్టున ఉండేది. పడవతోపాటు పడవ నడిపే ఇంజన్ డ్రైవరు, పడవలో టికెట్ ఇచ్చే కండక్టర్ కూడా ఆమె పరీక్ష కోసమే పని చేశారు. ఆ అమ్మాయి పేరు సాండ్రా. అక్షరం అమూల్యం సాండ్రా పదకొండవ తరగతి విద్యార్థిని. ఆమె పరీక్షలు రాస్తున్న సమయంలో కరోనా విజృంభించింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా చివరి రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షలు గడచిన మే నెల చివర్లో జరిగాయి. ఆ పరీక్షలకు వెళ్లడానికి ఆమెకు రవాణా సాధనమేదీ అందుబాటులో లేదు. నీటిలో ఈదుతూ వెళ్లడం ఒక్కటే ఆమె ముందున్న మార్గం. ఆ పరిస్థితిలో ఆమె నివసించే దీవి నుంచి పరీక్ష రాయాల్సిన స్కూలుకు తీసుకెళ్లడానికి వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. ఆమె నివసించే దీవి అలప్పుళ జిల్లాలో ఉంది. ఆమె చదివే ఎస్ఎన్డీపీ హయ్యర్ సెకండరీస్కూల్ కొట్టాయం జిల్లా కంజీరమ్‌లో ఉంది. ప్రభుత్వం నడిపే రవాణా పడవలో స్కూలుకెళ్లేది. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా బోట్లు ఏవీ తిరగడం లేదు. సాండ్రా పరిస్థితి తెలుసుకున్న ప్రభుత్వం కేరళ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బోట్‌ను ఆమెకోసం కేటాయించింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఆమె ఆనందం పట్టలేకపోయింది. పరీక్షలను సంతోషంగా రాసింది. నిజానికి ఆ బోట్‌కు జిల్లాలో నడుపుకునే అనుమతి మాత్రమే ఉంది. సాండ్రా పరీక్షల కోసం జిల్లా దాటి ప్రయాణించడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ‘ఆర్థికంగా ఎంత ఖర్చు అనేది అస్సలు విషయమే కాదు, ఒక విద్యార్థి చదువుకంటే డబ్బు ముఖ్యం కాదు’ అన్నారు ప్రభుత్వ అధికారులు. అత్యంత సామాన్యకుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చదువు కోసం ప్రభుత్వం చూపించాల్సిన శ్రద్ధనే చూపించింది. -
గిరిజన విద్య.. కాదిక మిథ్య
సాక్షి, అమరావతి: గిరిజన బిడ్డలను విద్యావంతుల్ని చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల్లో అక్షరాస్యత శాతం పెంచాలనే పట్టుదలతో ముందడుగు వేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27,39,920 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం 48.98 మాత్రమే. సగానికి పైగా గిరిజనులు విద్యకు దూరంగా ఉంటున్నారు. 2,678 గిరిజన విద్యాసంస్థలు గిరిజన పల్లెల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాసంస్థలున్నాయి. వీటిలో 2,05,887 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 189 గురుకులాలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. వీటిలో పూర్తిగా సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతల చొప్పున స్కూల్ యూనిఫారాలు సమకూరుస్తోంది. ఒక సెట్ బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేసింది. నోట్ పుస్తకాలను ఇప్పటికే అందజేసింది. ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు సైతం ఇచ్చింది. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా కాస్మొటిక్ చార్జీలు అందజేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలోనూ చదివిస్తోంది అత్యున్నతమైన ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద విద్యార్థులను వాటిలో ప్రభుత్వం చేర్పించింది. ఆ పిల్లలకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వమే నిధులు ఇస్తోంది. ప్రతిభ చాటే గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు కల్పించింది. కార్పొరేట్ కాలేజీల పథకం కింద ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఆయా కాలేజీల్లో చేర్పించింది. ఇందుకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద గిరిజన విద్యార్థులను విద్యాభ్యాసం కోసం విదేశాలకు ప్రభుత్వ ఖర్చులతోనే పంపిస్తోంది. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు ఇవ్వడం ద్వారా ఆయా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 237పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు 184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి 237 స్కూళ్లల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిలో 80,091 మంది గిరిజన విద్యార్థులు వృత్తి విద్య నేర్చుకుంటున్నారు. మెటీరియల్‌ను నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సమకూరుస్తోంది. -
పల్లెకింకా పాకాలె..
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగంలో గ్రామీణ, పట్టణ భారతాల మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉందని తేలింది. ‘హౌస్‌హోల్డ్ సోషల్ కన్జంప్షన్: ఎడ్యుకేషన్’పేరుతో 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు 4 దశల్లో నిర్వహించిన 75వ రౌండ్ సర్వేను ఎన్ఎస్వో ఇటీవల విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఎన్ఎస్వో అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాలను పలకరించి సమాచారం సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 8,097 గ్రామాలతో పాటు 6,188 పట్టణ బ్లాకుల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని ప్రతి కుటుంబం వినియోగిస్తున్న కంప్యూటర్ లెక్కలతో పాటు విద్యకు సంబంధించిన పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఇంట్లో కంప్యూటర్ను కలిగి ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అది 23.4 శాతమని తేలింది. ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను వినియోగించే వారి శాతం 14.9గా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 42 శాతంగా ఉంది. వయసులోనూ ఆంతర్యం.. వయసు రీత్యా పరిశీలిస్తే ఐదేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. అదే సమయంలో 13 శాతం ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించే వెసులుబాటును కలిగి ఉన్నారు. గత 30 రోజుల్లో ఇంటర్నెట్ను క్రమం తప్పకుండా ఉపయోగించిన వారి శాతం 10.8గా నమోదైంది. అదే పట్టణ ప్రాంతాలను పరిశీలిస్తే 32.4 శాతం మందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉందని, 37.1 శాతం మంది ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండగా, అందులో 33.8 శాతం మంది గత 30 రోజుల్లో క్రమం తప్పకుండా ఇంటర్నెట్ను వినియోగించారని ఎన్ఎస్వో సర్వేలో తేలింది. ఎన్ఎస్వో సర్వేలోని అంశాలు.. – ఏడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో అక్షరాస్యతా శాతం: 77.7 – అక్షరాస్యతా శాతం: గ్రామీణ ప్రాంతాల్లో 73.5, పట్టణ ప్రాంతాల్లో 87.7 – 15 ఏళ్లు నిండిన వారిలో సెకండరీ విద్య పూర్తి చేసిన వారి శాతం: 30.6 (గ్రామీణ), 57.5 (పట్టణ) – ఇదే వయసు నిండిన వారిలో గ్రాడ్యుయేషన్ చదివిన వారి శాతం: 5.7 (గ్రామీణ), 21.7 (పట్టణ) – పాఠశాలల్లో అసలు పేర్లు నమోదు కాని వారి శాతం: 15.7 (గ్రామీణ), 8.3 (పట్టణ) – ప్రాథమిక స్థాయిలో పాఠశాలలకు హాజరవుతున్న వారి శాతం: 86.1 – జనరల్ కోర్సులు చదువుతున్న వారు: 96.1 శాతం – టెక్నికల్/ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు: 3.9 శాతం – జనరల్ కోర్సుల్లో చదువుతున్న వారికి సగటున ఏడాదికి అవుతున్న ఖర్చు: గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5,240, పట్టణ ప్రాంతాల్లో రూ. 16,308. -
వయసు 105 తరగతి 4
తిరువనంతపురం: కేరళలోని కొల్లాంకు చెందిన 105 ఏళ్ల భగీరథీ అమ్మ.. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత మిషన్‌లో భాగంగా నిర్వహించే నాలుగో తరగతికి సమానమైన పరీక్ష రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారు. చదువంటే ఎంతో ఇష్టపడే భగీరథీ చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తోబుట్టువుల ఆలనపాలనా కోసం చదువుకు దూరమయ్యారు. దీంతో కలగానే మిగిలిపోయిన తన చదువును ఈ వయసులో పరీక్ష రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరీక్ష రాసిన అతిపెద్ద వయస్కురాలు భగీరథీ అని అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ శ్రీకళ తెలిపారు. భగీరథీకి ఆరుగురు పిల్లలు, 15 మంది మనువలు, మనువరాళ్లు ఉన్నారు. పరీక్షరాసిన బామ్మతో అధికారి -
ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
స్టాక్‌హోమ్: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది. జ్ఞానపిపాసతో ఆమె చేసిన సృజనాత్మక రచనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అద్భుతమైన భాషా పరిజ్ఞానంతో మానవ అనుభవాల విశిష్టతను ప్రభావవంతంగా చాటి చెప్పినందుకు ఆమెకు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. 15 మంది స్త్రీలకే నోబెల్ పురస్కారం ఇప్పటి వరకు సాసాహితీరంగంలో కేవలం 14 మంది మహిళలనే నోబెల్ పురస్కారం వరించింది. ఈ రంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా టోర్కార్క్విజ్ 15వ వారు. ఈమె రచనల్లో భిన్నత్వం ఉంటుంది. రెండు విభిన్న అంశాల మధ్యనున్న అంతరాన్ని ఉద్వేగపూరితంగా వర్ణిస్తారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి ఓల్గా టోర్కార్క్విజ్ని కొంత ఆలస్యంగా ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు. చంపేస్తామన్నారు.. జీవితంలో ఎన్నో చీకటి కోణాలను చూసిన 57 ఏళ్ళ పర్యావరణ వేత్త, శాఖాహారి అయిన ఓల్గా టోర్కార్క్విజ్ పోలండ్ మతతత్వ ప్రభుత్వ విధానాలనూ, చట్టాలనూ తూర్పారబట్టేందుకు వెనకాడని రాజకీయవేత్త. సాహసోపేతమైన, నిర్భీతితో కూడిన ఆమె రచనలు పోలండ్ సమాజాన్ని కుదిపేసాయి. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి. దీంతో ప్రచురణకర్తలు ఆమెకు బాడీగార్డులను సైతం ఏర్పాటుచేశారు. సృజనాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆమె రచనల్లోని పాత్రల కవితాత్మకత వర్ణన పాఠకులను కట్టిపడేస్తుంది. 1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్లో ఓల్గా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో ఆమె చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది. హండ్కే – వివాదాస్పద రచయిత.. పీటర్ హండ్కే రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 1990లో యుగోస్లేవియా యుద్ధ సమయంలో సెర్బ్ల పక్షాన్ని వహించినందుకు ఆయనపై అనేక విమర్శలొచ్చాయి. మానవ హననం సాగించాడని, యుద్ధనేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్న మాజీ సెర్బ్ నేత స్లోబోదన్ మిల్సేవిక్ అంతిమయాత్రలో ఆయనకు మద్దతుగా ప్రసంగించడం కూడా పీటర్ హండ్కే వివాదాస్పదుడవడానికి మరో కారణం. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని కూడా పీటర్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు. సాహితీరంగంలో నోబెల్ పురస్కారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ‘ఇది ఒక్క క్షణం ఆసక్తికీ, ఆరుపేజీల పత్రికా వార్తకీ’ సంబంధించినదంటూ 2014లో అన్నారు. హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. బాల్యం యుద్ధ వాతావరణంలోగడిచింది. ఆ తరువాత ఆయన ఆస్ట్రియాలో ఆయన పెరిగి పెద్దయ్యారు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు. -
ఆ ఊరు అక్షరానికే ఆదర్శం
శామీర్‌పేట్: ఓ అక్షరం ఇంటికే కాదు.. ఊరంతా వెలుగినిచ్చింది.. అక్షర చైతన్యాన్ని పెంచింది. స్వాతంత్య్రం రాకపూర్వం నలుగురితో మొదలైన ఆ యజ్ఞం ఊరినే అగ్రభాగాన నిలిపింది. ఇప్పుడా పల్లెలో అంతా సరస్వతీ పుత్రులే. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని, నాగిశెట్టిపల్లి గ్రామం నూరు శాతం అక్షరాస్యతతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. స్వాతంత్య్రం రాక(1947) పూర్వం గ్రామంలోని రామిడి ఆగంరెడ్డి, రామిడి సత్తిరెడ్డి, రామిడి యాదగిరిరెడ్డి, దాసరి గండారెడ్డిలు వ్యవసాయం చేస్తూ తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. వారు నేర్చుకున్న చదువును గ్రామస్తులకు పంచి ప్రోత్సహించారు. ఆనాడు వారిచ్చిన ప్రోత్సాహం నేడు గ్రామం చదువులో వంద శాతం అక్షరాస్యతకు చేరింది. హైదరాబాద్– కరీంనగర్ జాతీయ రహదారికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నాగిశెట్టిపల్లి. 92 గడపలు గల ఈ ఊళ్లో 600 మంది జనాభా. వారంతా చదువుకున్నవారే. పైగా మండలంలో ఆదర్శ గ్రామంగా పేరు గడించింది. గ్రామం అంతా పచ్చదనం.. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్క డ చదువుకున్న వారిలో 55 మంది ప్రభుత్వ ఉపా« ద్యాయులు, మరో పది మంది బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు, 8 మంది బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్నవారు ఉన్నారు. ఒకరు పీహెచ్డీ, ఎంబీబీఎస్ ఒకరు ఉన్నారు. వీరే కాకుండా విదేశాలలో (యుఎస్) ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే స్థిర పడినవారూ ఉన్నారు. దాసరి యాదిరెడ్డి గ్రామంలోనే మొదటి ఉపాద్యాయుడు. ఆయన ఇప్పటికీ విశ్రాంత ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. వేసవి సెలవుల్లో గ్రామంలో సందడే.. సహజంగా వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులతో వారి తల్లిదండ్రులు వేరే ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ ఈ గ్రామంలోని ప్రజలు వేసవిలో వేరే ప్రాంతాలకు వెళ్లరు. కానీ పట్టణాలు, బయటి దేశాల్లో ఉండే నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన వారి బంధువులు ఈ గ్రామంలో వేసవి సెలవులు గడిపేందుకు ఇష్టపడతారు. కారణం.. ప్రతీ ఇంటా పచ్చని చెట్లు(కనీసం 10 చెట్లు) ఉంటాయి. అంతేకాకా ఇంటి చుట్టుపక్కల పచ్చని తోటలు, కూరగాయలు పండించే పోలాలే ఉంటాయి. దీంతో మండు వేసవిలోనూ గ్రామంలో చల్లని వాతావరణం ఉంటుంది. పాలకవర్గం సైతం ఎకగ్రీవం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల(పంచాయతీ) ఎన్నికల్లో నాగిశెట్టిపల్లి గ్రామం సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సైతం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని మండలానికే ఆదర్శంగా నిలిచారు. పంచాయతీ నిధులు లేకున్నా ప్రజల సొంత డబ్బులతో గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. గ్రామ పాలవర్గాన్ని రాష్ట్ర మంత్రులు సైతం అభినందించారు. మొదటి ఉపాధ్యాయుడిని నేనే.. ఆ రోజుల్లో చదువుపై ఎవరికీ అంతగా అవగాహన ఉండేది కాదు. మా తల్లిదండ్రులు నన్ను కేశవరంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అక్కడ నాలుగో తరగతి వరకే ఉండేది. చదువుపై నా ఆసక్తితో బొల్లారంలో చేర్పించారు. ఐదు నుంచి 11వ తరగతి వరకు చదువుకుని ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం టీచర్‌గా అపాయింట్ అయ్యాను. మండలంలో మొదటి ఉపాధ్యాయుడిని నేనే. చాలా ప్రాంతాల్లో పనిచేశాను. – దాసరి యాదిరెడ్డి, రిటైర్డ్ టీచర్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపీహెచ్డీ చేశా.. మా తల్లిదండ్రులు చదువుకున్నారు. వారికున్న అవగాహనతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇంటర్ కేశవరం గ్రామంలో చదివా. తర్వాత రాజేంద్రనగర్‌లోని ఇండియన్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్)లో వ్యవసాయ వ్యర్థాల నుంచి విత్తనాల పరిశోధనలో పీహెచ్డీ పూర్తి చేశాను. ప్రస్తుతం సొంతంగా పాలిహౌజ్ నిర్మించి తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్దతులతో వ్యవసాయం చేస్తున్నా. – రామిడి మధుకర్‌రెడ్డి, పీహెచ్డీ -
బాల్యం పెరుగుతోంది
గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నవలలో బుచ్చమ్మకి బాల్య వివాహం చేస్తాడు తండ్రి అగ్నిహోత్రావధాని. బాల్యంలోనే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరుతుంది బుచ్చమ్మ. కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం’లో కాళింది నూతిలో దూకి మరణిస్తుంది. ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఆరు పదులు నిండిన వృద్ధులకిచ్చి వివాహం చేయడం అప్పట్లో ఓ దురాచారం. జీవితం అంటే ఏంటో తెలిసే లోపుగానే వారి జీవితం ముగిసిపోయేది. సుమారు యాభై ఏళ్ల క్రితం వరకు కూడా బాల్య వివాహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఎంతోమంది సంస్కర్తలు ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి, రూపుమాపేందుకు కృషి చేశారు. ప్రభుత్వాలు కూడా చట్టాలు తెచ్చాయి. ఫలితంగా బాల్యవివాహాలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత తగ్గిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అక్షరాస్యత, జీవన ప్రమాణాల స్థాయి వంటివి పెరగడం కూడా ఇందుకు కారణం. బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 15–19 మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లల వివాహాలు 6.4 శాతానికి తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్లో ఈ శాతం మరింత తక్కువగా ఉంది. బాల్యంలోనే వివాహాలు కావడం వల్ల టీనేజ్‌లోకి వచ్చేసరికి గర్భం ధరించి, మాతృత్వం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే తల్లులైపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఉన్నత పదవులు అలంకరించలేకపోతున్నారు. ఆడపిల్లలు ఉన్నతవిద్యలు అభ్యసించాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో అర్థం చేసుకోవాలి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. అవన్నీ జరగాలంటే.. బాల్య వివాహాల నుంచి వారిని కాపాడే చట్టాలు మాత్రమే కాదు, మనుషులూ ఎప్పుడూ నిఘావేసి ఉంచాలి. – రోహిణి -
మగ్గిపోతున్న ‘పసి మొగ్గలు’
ఆదిలాబాద్‌టౌన్ : పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లో రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపుగా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లే దు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పిల్లలు బందీలుగా మిగులుతున్నా రు. బాలల దినోత్సవం సందర్భంగా మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్పా వారికి అక్షరాలు దిద్దించేలా పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమాలు అమలుకు నోచుకోవడంలేదు. బాట పట్టినా.. బడికి రాని పిల్లలు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతియేటా బడిబాట కార్యక్రమాలను చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని కోరుతున్నా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనేక కార్యక్రమాలను చేపడుతున్నన్నా పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండుగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 500లకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 144 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. గత మూడు నాలుగు నెలల క్రితం నిర్వహించిన బడిబాటలో పిల్లల్ని చేర్పించలేక పోయారు. విద్యాహక్కు చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి. నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం.. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. కొన్నేళ్లుగా విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చిన విషయం విదితమే. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 ఆగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికీ ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. పిల్లల్ని బడిలో చేర్పించాలి బడి బయటి పిల్లల్ని ఉపాధ్యాయులు బడిలో చేర్పించాలి. జిల్లాలో 144 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గుర్తించాం. 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనులకు పంపకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలి. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ, ఆదిలాబాద్ -
వయసు 96.. మార్కులు 98
తిరువనంతపురం : చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించిందో బామ్మ. సెంచరీ కొట్టేందుకు చేరువలో ఉన్న ఈ బామ్మ.. ఎగ్జామ్‌లో మాత్రం సెంట్ పర్సెంట్ స్కోర్ చేసి టాపర్‌గా నిలిచింది. దాంతో ఈ బామ్మ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదగా రేపు (గురువారం) మెరిట్ సర్టిఫికెట్ అందుకోనుంది. వివరాలు.. కేరళ అలప్పుజ జిల్లా ముత్తం గ్రామానికి చెందిన కార్థియాని అమ్మ(96)... ఆలయాల్లో శుభ్రం చేస్తూ జీవనం గడిపేది. బాల్యంలో బడి ముఖం చూడని ఈ బామ్మ చదువుపై మక్కువతో కేరళ ప్రభుత్వ ప్రారంభించిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధించేందుకుగాను కేరళ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షరతా మిషన్‌లో భాగంగా ఈ ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాలుగు, ఏడు, పది, ఇంటర్ తరగతులకు సంబంధించి దాదాపు 42, 933మంది పరీక్షలు నిర్వహించారు. కార్థియాని అమ్మ నాలుగో తరగతి పరీక్షలకు హాజరయ్యింది. అంతేకాక ఈ పరీక్షలో ఆమె 98 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది. ఈ విషయం గురించి బామ్మ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చదవగలను, రాయగలను లెక్కలు కూడా చేయగలను. చదువులో నాకు నా ముని మనవరాళ్లు సాయం చేసేవార’ని ముసిరిపోయింది బామ్మ. కాగా కార్థిమణి అమ్మ పట్టుదలను పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు. వీరిలో మహీంద్ర గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్ర, కేరళ పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్స్ ఉన్నారు. కార్థిమణి అమ్మ పట్టుదలకు ముగ్దులైన వీరు... ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
తల్లి చదివితేనే పిల్లాడికి పెళ్లి..!
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్ళుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం. భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతోన్న పెళ్ళిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యత ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే మన దేశంలో 73 శాతం పెళ్ళిళ్ళు పెద్దలు కుదిర్చినవే. వీరిలో అతి కొద్దిమందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది. 63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. అయితే తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది. తల్లి చదువు కులాంతర వివాహాలకు ప్రోత్సాహం... భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తోన్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే కులాంతర వివాహాల సానుకూలతను సృష్టిస్తోంది పెళ్ళికొడుకు చదువో, పెళ్ళికూతురు చదువో అనుకుంటే పొరబడ్డట్టే. పెళ్ళి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఏర్పడుతున్నట్టు ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011-12 ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే-2 గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థ కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులో వరుడి తల్లి విద్యాస్థితి కులాంతర వివాహాలపై ప్రభావితం చూపుతోందని వెల్లడించింది. అందుకు కారణం కుటుంబ బాధ్యతలు మోస్తోన్న చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఈ అధ్యయన వెల్లడించింది. వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ళ ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్ళికొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్టు వెల్లడయ్యింది. అయితే పెళ్ళి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం. కుటుంబాల మధ్యనా, దగ్గరి బంధువుల మధ్యనా, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికీ ఇతర దేశాలకీ పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి కారణం మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యత లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది. సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధీ, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు సుదీర్ఘకాలంలో కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్ థియరీ తప్పని తేలింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది. పెళ్ళి కొడుకు, పెళ్ళికూతురి తరఫు ఆర్థిక స్థోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయడంలేదు. పైగా ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి. దళితుల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. అగ్రకులాల్లో ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు అధ్యయనం తేల్చి చెప్పింది. -
ఆమె నా రోల్ మోడల్ : ఆనంద్ మహింద్రా
‘పట్టించుకుంటే వయసు సమస్య అవుతుంది. ఒక్కవేళ దాన్ని పట్టించుకోకపోతే అది అసలు సమస్యే కాదు’ అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త మార్క్ ట్వైన్ చెప్పిన సంగతి సుపరిచితమే. అచ్చం ఆ రచయిత చెప్పిన మాదిరి తన వయసు గురించి అసలు పట్టించుకోకుండా.. అటూ ఇటూ సరిగ్గా నడవలేని స్థితిలో కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన ఓ 96 ఏళ్ల బామ్మ నాలుగు తరగతి చదువుతోంది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తూ.. పలువురికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది. కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ వాళ్లు నిర్వహించిన అక్షర లక్ష్యం లిటరసీ పరీక్షల్లో కార్త్యాయిని అమ్మ వందకు వంద మార్కులు సాధించింది. ఈ మిషన్ ఆధ్వర్యంలోనే ఆమె నాలుగో తరగతి చదువుతోంది. అక్షర లక్ష్యం స్కీమ్ టెస్ట్‌లో పాల్గొన్న పెద్ద వయసున అభ్యర్థి ఈ బామ్మనేనని తెలిసింది. ఈ బామ్మ ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌గా నిలువడం విశేషంగా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రాకు కూడా ఈమెనే రోల్ మోడల్ అట. ‘ఇది నిజం, ఆమెనే ఇప్పుడు నా రోల్ మోడల్. ఆమెలాగా నేర్చుకోవాలనే తపన ఉంటే నా మెదడు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది’ అని మహింద్రా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా కార్త్యాయిని అమ్మనే నిలిచింది. ట్విటర్ యూజర్లు ఆమెను పొగడ్తతలతో ముంచెత్తుతున్నారు. నేర్చుకోవాలనే తపన ఉండే వారికి, వయసు ఎప్పుడూ సమస్యే కాదడానికి కార్త్యాయిని అమ్మ ఉదాహరణగా నిలుస్తుందని యూజర్లు అంటున్నారు. కేరళ అంటేనే అక్షరాస్యతకు పెట్టింది పేరని తెలుసు. అక్షరాస్యతలో దేశంలోనే ఆ రాష్ట్రం టాప్‌లో ఉంటుంది. అయితే.. వృద్ధుల్లో చాలా మంది చదువుకున్న వాళ్లు లేకపోవడంతో బ్యాలెన్స్ చేయడం కోసం కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ ద్వారా అక్షర లక్ష్యం స్కీమ్‌ను ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ మిషన్‌లోనే ఇప్పుడు కార్త్యాయిని చదువుతుంది. ఆమెతో పాటు మొత్తం 40,363 మంది వృద్ధులు ఈ మిషన్ ద్వారా తమ చదువును కొనసాగిస్తున్నారు. కాగ, ప్రతిభను ఆనంద్ కొనియాడటం ఇదే తొలిసారి కాదు. సుమారు 15 భాషలు మాట్లాడే రవి చేకల్యా అనే యంగ్ బాయ్‌ను కూడా ఆనంద్ ప్రశంసించారు. Now if this is true she is my role model. My brains will stay alive if I stay as hungry to learn as she is..👏👏👏 https://t.co/Tct1G2sqpr — anand mahindra (@anandmahindra) August 10, 2018 She got to be a role model for every individual who wants to achieve anything, how ever late in life. Salute to her spirit — Utpal Bhowmick (@UtpalBhowmick6) August 10, 2018 Age is only number and nothing else....👍💐 — Sanket shelke (@Sanketshelke9) August 12, 2018 Truly agree ..Dedication personified..without commitment you will never start ...without consistency you will never finish.. — prakhar (@prakhard) August 11, 2018 -
96 ఏళ్ల వయసులో ‘లిటరసీ’ పరీక్షకు..
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరైన 96 ఏళ్ల కార్తియాని అమ్మ..చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది. చదవడం, రాయడం నేర్చుకోవాలనే బలమైన కోరికతో కార్తియాని ఆరు నెలల క్రితం అక్షరాస్యత కార్యక్రమం ‘అక్షరలక్షం’లో పేరు నమోదు చేయించుకుంది. శిక్షణా కాలంలో గణితం, చదవడం, రాయడంపై పట్టు సాధించిన ఆమె..ఆదివారం తిరువనంతపురంలో పరీక్ష రాసి కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసింది.