అక్షరాస్యతలో తెలుగు రాష్ట్రాల వెనుకడుగు
నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యువతకు ప్రాథమిక నైపుణ్యాలు అందించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని పెంచి జీవితంలో నిలదొక్కు కునే సామర్థ్యాన్ని ఇవ్వాలన్నది యునెస్కో భావన. కానీ, మన దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యత సాధనలో చాలా వెనుకబడి ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభాలో అక్షరాస్యత శాతం 67.41 శాతం ఉండగా తెలంగాణలో 66.46 శాతం నమోదైంది. దేశం మొత్తంమీద అక్షరాస్యతలో ఏపీ 30వ స్థానంలో ఉంటే, తెలంగాణ 32వ స్థానంలో ఉంది. ఝార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ మాత్రమే తెలు గు రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నాయి.
ముఖ్యంగా 7-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరూ పాఠశాలల్లో ఉన్నట్లయితే మనం ఎప్పుడో అధిక అక్షరాస్యత సాధించేవాళ్లం. 15-24 ఏళ్ల మధ్య వయసు కలవారు అభివృద్ధికి కీలకమైన మానవ వనరులు. వీరి విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు 80 శాతం అక్షరాస్యత సాధించలేక పోయాయి. పైగా స్త్రీపురుషుల మధ్య అక్షరాస్యత విషయంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో 16.25 శాతం నమోదు కాగా ఏపీలో 14.82, తెలంగాణలో 17.03 శాతం నమోదైంది. అంటే జాతీయస్థాయి కంటే తెలంగాణ అక్షరాస్యత శాతం కాస్త ఎక్కువగా ఉండగా ఏపీ కాస్త వెనుకబడింది.
జిల్లాల విష యానికి వస్తే ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం వెనుకబడి ఉండగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలు రాష్ట్ర అక్షరాస్యత స్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు జాతీయస్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించగా, మిగి లిన జిల్లాలన్నీ రాష్ట్ర అక్షరాస్యతస్థాయి కంటే ఎక్కువగా ఉన్నా యి. పాలకులు చిత్తశుద్ధితో పాఠశాల విద్యను పరిపుష్టం చేయ కపోవడం, విద్యకు జాతీయాదాయంలో కనీసం 6 శాతం నిధు లు కేటాయించకపోవటం వల్లే దేశవ్యాప్తంగా అక్షరాస్యత తగ్గుస్థాయిలోనే ఉంది.
తెలుగు రాష్ట్రాలయితే ఒకప్పటి వెనుకబడిన రాష్ట్రాల కంటే ఇంకా వెనుకబడిపో యాయి. పైగా పాఠశాలల్లో చదివే పిల్లల స్థాయి చాలా దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. పాఠశాల విద్యను పరిపుష్టం చేయడం ద్వారానే అక్షరాస్యతలో ముందుకెళ్లగలం. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు, వివిధ శాఖలు కలిసి కృషి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందుకెళ్లే అవకాశం ఉం ది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వాలు ఆ దారిలో ముందుకు సాగుతాయని ఆశిద్దాం.
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
ఎన్.సీహెచ్. వరదాచార్యులు మొబైల్: 94407 45469