human resources
-
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు. విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు. -
కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు
ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్స్ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్ 20 నుంచి సెపె్టంబర్ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్ కన్సల్టెంట్స్ ఈ వివరాలు విడుదల చేసింది. బీఎఫ్ఎస్ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు. ► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు. ► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు. ► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు. -
హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..
న్యూఢిల్లీ: మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. కంపెనీ హెచ్ఆర్ కావడంతో ఎటువంటి ఉద్యోగం లేని తన భార్యకు తాను పనిచేస్తోన్న కంపెనీ నుండి జీతం వచ్చేలా చేసి పదేళ్లలో నాలుగు కోట్ల కంపెనీ సొమ్మును కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును ఎలాగోలా తన కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్లో జమయ్యేది. కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు. మొదటగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు యధాప్రకారమే జీతాలు చెల్లించేవారు. ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడటంతో కంపెనీ యాజమాన్య నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు. ఇది కూడా చదవండి: కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
రాజకీయాల్లోనూ యువతను ప్రోత్సహించాలి
భారతదేశ జనాభాలో 15–29 ఏళ్ల మధ్య ఉన్న యువత 27.5 శాతం ఉన్నారు. యువత జాతి ప్రగతికి సోపానం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల సంఖ్య పెరుగు తోంది. మన దేశంలో యువత శాతం పెరుగుతోంది. 2020 నాటికి ప్రపంచములో అత్యంత ఎక్కువ మంది యువత ఉన్న దేశంగా భారత్ నిలిచింది. దేశ అభివృద్ధిలో ఈ యువ మానవ వనరు కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం వారిని ఆర్థిక లేదా ఉత్పత్తి రంగంలోనే ఉపయోగించుకోవడం సరికాదు. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రాజకీయాల్లోనూ యువతకు తగిన స్థానం కల్పించవలసి ఉంది. అప్పుడే నిజమైన నవ సమాజ నిర్మాణం సాధ్యమ వుతుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అనేక పార్టీలకు అనుబంధంగా ఉంటున్నాయి. వీటి నుంచే చాలా రాజకీయ పార్టీలకు నాయకులు లభించిన, లభిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆయా సంఘాలలో పనిచేసేవారికే కాక... చురుకుగా పని చేయ గలిగిన సామాజిక స్పృహ ఉన్న యువతనంతా అన్ని రాజకీయ పక్షాలూ ప్రోత్సహించాలి. ఎన్ని కల సమయంలోనో... లేదా ఏవో కొన్ని ఉద్య మాల సందర్భంగానో యువతను, వారి ఆవేశాన్నీ వాడుకుని వదిలేస్తుండటం రాజకీయ పక్షాల్లో కనిపిస్తున్న ట్రెండ్. ఈ ధోరణిని రాజకీయ పార్టీలు విడనాడాలి. మైఖేల్ గ్రీస్ రాసిన ‘సామాజిక రాజకీయ మార్పులో క్రియాశీలక ప్రతినిధులుగా యువత’ అనే పుస్తకంలో యువతలో సానుకూల దృక్పథం కలిగించి, అభివృద్ధికి అనువుగా మలుచు కోవ డాన్ని ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో బలీ యమైన ఉద్యమంగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గమ నించాలి. ఇప్పటివరకూ యువతను సంకుచిత రాజకీయాల కోసం వాడుకుంటున్న పార్టీలకు ఇకనైనా కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు యువతకు అన్ని స్థాయుల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. గ్రామ వార్డు మెంబర్ నుంచీ అత్యు న్నత పార్లమెంట్ సభ్యుని వరకూ వారికి అవకాశం ఇవ్వాలి. యువతీ యువకులు భవి ష్యత్ రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజా ప్రతి నిధులుగా ఎదగడానికి శిక్షణా ప్రాంగణాలుగా స్థానిక సంస్థలు ఉపయోగపడతాయి. అలాగే అట్టడుగు స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్లా ఎన్నికైన యువ ప్రతినిధులకు అవగాహన కలగడానికి అవి ఉపయోగపడ తాయి. వార్డు మెంబర్లుగా, గ్రామ సర్పంచ్ లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా, మున్సిపల్ ఛైర్మన్లుగా, జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మహా నగరాలకు మేయ ర్లుగా... ఇలా వివిధ పదవులను పొంది... పాలనలో ప్రాథమిక అనుభవం పొంద డానికి రాజకీయ పార్టీలు ముందు యువతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్ ఉభయ సభలకూ పోటీ చేయించాలి. దీనివల్ల కింది స్థాయి నుంచీ ఢిల్లీ వరకూ వివిధ పాలనా వ్యవస్థల పట్ల యువతకు అవగాహన పెరిగి మంచి పాలకులుగా ఎదుగుతారు. నేదునూరి కనకయ్య వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం ‘ 94402 45771 -
మానవ వనరుల కొరత.. పేటెంట్లపై ప్రభావం!
న్యూఢిల్లీ: మానవ వనరులు, నిబంధనలను పాటించడానికి కష్టతరమైన పరిస్థితులే దేశీయంగా పేటెంట్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది. అత్యవసరంగా పేటెంట్ వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంపై దీన్ని ఈఏసీ–పీఎం రూపొందించింది. భారత్‌లో ఇటీవలి కాలంలో దాఖలైన, మంజూరైన పేటెంట్ల సంఖ్య పెరిగినప్పటికీ .. అమెరికా, చైనా లాంటి వాటితో పోలిస్తే తక్కువగానే ఉందని ఇందులో పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి పేటెంట్ ఆఫీసులో 860 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. చైనాలో ఈ సంఖ్య 13,704 కాగా అమెరికాలో 8,132గా ఉందని వివరించింది. చైనాలో సగటున పేటెంట్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి 20–21 నెలల సమయం పడుతుందని.. భారత్‌లో ఇందుకు 58 నెలలు పడుతోందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆఖరు నాటికి పేటెంటు కార్యాలయంలో కంట్రోలర్ స్థాయిలో 1.64 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. వచ్చే రెండేళ్లలో పేటెంట్ ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య కనీసం 2,800కి పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
వేగంగా సమగ్ర పారిశ్రామిక సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు, ఇతర అవసరాలు తెలుసుకునేందుకు చేపట్టిన ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే–2020 వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,948 యూనిట్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే 9,010 యూనిట్లకు సంబంధించి సర్వే పూర్తయింది. సర్వేలో కృష్ణా, అనంతపురం జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,254, అనంతలో 1,183 యూనిట్లలో సర్వే పూర్తయింది. సర్వే సందర్భంగా ప్రతి పరిశ్రమకూ ఆధార్ నంబర్లా 11 అంకెలతో ఓ ప్రత్యేక అంకెను కేటాయించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు సంబంధించిన తొమ్మిది రకాల కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికే సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కరోనా, వరదల కారణంగా కొన్ని చోట్ల సర్వే ఆలస్యమవుతోంది. అవసరమైతే గడువు తేదీని పెంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
ఐదు లక్షల మంది నిపుణులు అవసరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఇక్రా (ఐసీఆర్ఎ) ద్వారా ఏడు జిల్లాల్లో వచ్చే ఐదేళ్లకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు ఎంత మేర అవసరం ఉందనే విషయాన్ని అధ్యయనం చేశారు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా స్థానిక పరిశ్రమలకు ఏ రంగాల్లో నైపుణ్యత గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పరిశ్రమలకు, కంపెనీలకు నైపుణ్యం గల మానవ వనరులు లభ్యత, వ్యత్యాసంపై ఇక్రా ద్వారా ప్రభుత్వం అధ్యయనం చేయించింది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నైపుణ్యం గల మానవ వనరులు ఏడాదికి లక్ష చొప్పున అవసరమని అధ్యయనంలో వెల్లడైంది. ఏ జిల్లాలో ఏఏ రంగాల్లో నైపుణ్యం గల మానవ వనరులు అవసరమో కూడా అధ్యయనంలో గుర్తించారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతోంది. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనిర్సిటీని, విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ సాంకేతిక కోర్సులను నేర్చుకున్నవారికి మరింత నైపుణ్యాన్ని వీటిద్వారా కల్పిస్తారు. స్కిల్ యూనివర్సిటీలో నిర్మాణ రంగం, పరిశ్రమల ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, పరిశ్రమల ప్లంబింగ్, ఆటోమోటివ్, మెటల్ కన్స్ట్రక్షన్, ఐటీ–నెట్వర్క్ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఢిల్లీ టాప్
న్యూఢిల్లీ: అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించగల రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఎన్సీఏఈఆర్ (నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్) 2016 నుంచి ఈ జాబితాను రూపొందిస్తుండగా 2016, 17లలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఢిల్లీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడు రెండో స్థానంలో నిలవగా గుజరాత్ మూడో స్థానానికి పడిపోయింది. తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. వ్యాపార సంస్థలకు స్థలం, మానవ వనరులు, మౌలిక వసతుల లభ్యత, ఆర్థిక వాతావరణం, పరిపాలన, రాజకీయ సుస్థిరత, వాణిజ్య దృక్పథం అనే 6 అంశాల ఆధారంగా జాబితా రూపొందించింది. -
అక్షరాస్యతలో తెలుగు రాష్ట్రాల వెనుకడుగు
నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యువతకు ప్రాథమిక నైపుణ్యాలు అందించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని పెంచి జీవితంలో నిలదొక్కు కునే సామర్థ్యాన్ని ఇవ్వాలన్నది యునెస్కో భావన. కానీ, మన దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యత సాధనలో చాలా వెనుకబడి ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభాలో అక్షరాస్యత శాతం 67.41 శాతం ఉండగా తెలంగాణలో 66.46 శాతం నమోదైంది. దేశం మొత్తంమీద అక్షరాస్యతలో ఏపీ 30వ స్థానంలో ఉంటే, తెలంగాణ 32వ స్థానంలో ఉంది. ఝార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్ మాత్రమే తెలు గు రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా 7-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరూ పాఠశాలల్లో ఉన్నట్లయితే మనం ఎప్పుడో అధిక అక్షరాస్యత సాధించేవాళ్లం. 15-24 ఏళ్ల మధ్య వయసు కలవారు అభివృద్ధికి కీలకమైన మానవ వనరులు. వీరి విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు 80 శాతం అక్షరాస్యత సాధించలేక పోయాయి. పైగా స్త్రీపురుషుల మధ్య అక్షరాస్యత విషయంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయస్థాయిలో 16.25 శాతం నమోదు కాగా ఏపీలో 14.82, తెలంగాణలో 17.03 శాతం నమోదైంది. అంటే జాతీయస్థాయి కంటే తెలంగాణ అక్షరాస్యత శాతం కాస్త ఎక్కువగా ఉండగా ఏపీ కాస్త వెనుకబడింది. జిల్లాల విష యానికి వస్తే ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం వెనుకబడి ఉండగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలు రాష్ట్ర అక్షరాస్యత స్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు జాతీయస్థాయి కంటే ఎక్కువ అక్షరాస్యతను సాధించగా, మిగి లిన జిల్లాలన్నీ రాష్ట్ర అక్షరాస్యతస్థాయి కంటే ఎక్కువగా ఉన్నా యి. పాలకులు చిత్తశుద్ధితో పాఠశాల విద్యను పరిపుష్టం చేయ కపోవడం, విద్యకు జాతీయాదాయంలో కనీసం 6 శాతం నిధు లు కేటాయించకపోవటం వల్లే దేశవ్యాప్తంగా అక్షరాస్యత తగ్గుస్థాయిలోనే ఉంది. తెలుగు రాష్ట్రాలయితే ఒకప్పటి వెనుకబడిన రాష్ట్రాల కంటే ఇంకా వెనుకబడిపో యాయి. పైగా పాఠశాలల్లో చదివే పిల్లల స్థాయి చాలా దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. పాఠశాల విద్యను పరిపుష్టం చేయడం ద్వారానే అక్షరాస్యతలో ముందుకెళ్లగలం. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు, వివిధ శాఖలు కలిసి కృషి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందుకెళ్లే అవకాశం ఉం ది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వాలు ఆ దారిలో ముందుకు సాగుతాయని ఆశిద్దాం. (నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం) ఎన్.సీహెచ్. వరదాచార్యులు మొబైల్: 94407 45469 -
హ్యూసిస్ ఆటోమేషన్ బాట
- వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్ఆర్ మేనేజ్మెంట్ సేవలందిస్తున్న హ్యూసిస్ ఆటోమేషన్ బాట పట్టింది. హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) రంగంలో రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీకి అనుసంధానం చేసింది. ఇందుకోసం పలు సేవలందిస్తున్న కంపెనీలతో చేతులు కలిపింది. పేరోల్, బెనిఫిట్స్, హైరింగ్, ట్యాక్సెస్ ఇలా 150 రకాల అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చామని హ్యూసిస్ వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. తాము సేవలందిస్తున్న కంపెనీలకు మరింత మెరుగ్గా వన్ స్టాప్ సొల్యూషన్స్‌ను ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుందని చెప్పారు. ‘ఐఎస్బీ, ఆస్ట్రాజెనికా వంటి 400 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలేని కంపెనీలకు హెచ్ఆర్ ఫంక్షన్ మేనేజ్మెంట్ సేవలను థర్డ్ పార్టీగా అందిస్తున్నాం. ఏడాదిలో 100 నగరాలకు చేరుకోవడం ద్వారా క్లయింట్లకు చెందిన 5 లక్షల మంది ఉద్యోగులకు సేవలను అందించాలన్నది లక్ష్యం’ అని తెలిపారు. -
కుటుంబ వ్యవస్థే సరైన సంపద: బాబు
‘ఇదం కౌటిల్యం’ పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: భారతదేశానికి కుటుంబ వ్యవస్థే సరైన సంపదని, కుటుంబ విలువలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హితవు పలికారు. శనివారం హైదరాబాద్‌లో ఎమెస్కో బుక్స్, ఐ ఫోకస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థికవేత్త కె.నరసింహమూర్తి రచించిన ‘ఇదం కౌటిల్యం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశం’లో సహజ వనరులు, మానవ వనరులు ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థే ముఖ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కౌటిల్యుడి విధానాలతో ముందుకుపోతున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, పుస్తక రచయిత కె.నరసింహమూర్తి, మాజీ డీజీపీ కె. అరవిందరావు, ఐ ఫోకస్ అధినేత వాసుదేవశర్మ, ఎమెస్కో చీఫ్ ఎడిటర్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనసొకటి... మాటొకటి!
అపారమైన ప్రకృతి వనరులు, మేలురకం మానవ వనరులు ఏపీలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త ఏడాది ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడంవల్ల అయోమయం తప్ప ఫలితముంటుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానే లేదు. ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప. ఢిల్లీ దర్బార్‌లో ఇటీవల ఒకరోజు. సింహాసనం ఎదుట ఆం.ప్ర. ఏలిక. ‘దేవరా, మోదీవరా! కొత్తరాష్ర్టంగా ఏర్పడ్డాం, పీకల్లోతు కష్టాల్లో వున్నాం. పెద్ద మనసుతో ఆదుకోవాలి’. ‘మీ అర్జీ మాకు తెలుసు. మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగేందుకు వచ్చారు. కానీ...’ ‘అయ్యో, ఎంత మాట! అది అయ్యేపనికాదని మీకూ తెలుసు... మాకూ తెలుసు’. ‘మరి?... పోలవరం తక్షణం పూర్తి చేయమంటారు. అంతేనా?’ ‘తొందరేమి లేదు. ప్రస్తుతానికి ఎత్తిపోతల స్కీముతో ఎత్తిపోసుకునే ఆలో చన చేస్తున్నాము. ఆ విషయాన్ని మీరు సావకాశంగా పరిశీలించవచ్చు.’ ‘అయితే మీ మనసులోని మాటేమిటో... ఎన్టీఆర్‌కు భారతరత్న అడిగేం దుకు వచ్చారు. ఔనా?. కానీ, ఈసారికి నిర్ణయం జరిగిపోయింది. భవిష్యత్తులో చూద్దాం.’ ‘నా మనసేమిటో తెలిస్తే మీ నోటి వెంట ఇలాంటి ప్రశ్న వచ్చేదే కాదు.’ ‘మరి మీ కోరికేమిటో మీరే సెలవీయండి.’ ‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్‌ను చేపట్టాము. మావాళ్లంతా ఈ ప్రాజెక్టు మీద గంపెడాశలు పెట్టుకు న్నారు. భూసమీకరణకు ప్రత్నిస్తున్నాము. కానీ భూసేకరణ చట్టాన్ని అలుసుగా తీసుకొని కొందరు సహకరించడం లేదు. మీరు తక్షణం ఆ చట్టం కోరలు పీకేయాలి.’ ‘మేమూ అదే ఆలోచిస్తున్నాము. మా మీదా ఒత్తిడి పెరుగుతోంది. తప్పని సరిగా సవరిద్దాం. వచ్చే బడ్జెట్లో సుమా...’ ‘అప్పటి దాకా ఆగలేము. అతి పే...ద్ద ప్రాజెక్టు. ప్రారంభం కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాము. మిమ్మల్ని ఇంకే కోరికా కోరము. హుద్‌హుద్ తుపాను సాయం కోసం కూడా పట్టుబట్టలేదు. ఈ విషయంలో మాత్రం తక్ష ణం ఆర్డినెన్స్ బాణాన్ని ప్రయోగించాలి. తప్పదు.’ ‘మాకూ అవసరం... మీకూ అవసరం. అలాగే చేసేద్దాం. అభివృద్ధికి అడ్డంగా నిలిచే ఎనభై శాతం మంది సమ్మతి, సామాజిక ప్రభావాల అంచనా వంటి నిబంధనల్ని తొలగిద్దాం’. ‘చట్టంలో మరో దుర్మార్గ నిబంధన కూడా వుంది. ముక్కారు పంటలు పండే భూములను అభివృద్ధి కోసం సేకరించవద్దట. ఆ నిబంధన కూడా తొల గించాలి. మా రాజధాని భూముల్లో మూడు పంటలూ పండుతాయి...’ ‘ఇంకేమీ అడగనన్నారుగా... మీ కోసం అలాగే... ఆల్ ది బెస్ట్’ కేంద్ర సర్కార్‌తో ఏపీ ప్రభుత్వం జరిపిన సంభాషణలేమిటో మనకు తెలియదు కానీ, సారాంశం మాత్రం పైన చెప్పిందేనని ఢిల్లీ రాజకీయవర్గాల భోగట్టా. అపార రాజకీయానుభవశాలి, అపర చాణక్యుడు, హైదరాబాద్ నవ నిర్మాత వగైరా బిరుదులతో మీడియా చేత పిలిపించుకోవాలని తెగ ఉబలాట పడే చంద్రబాబునాయుడు గడచిన ఏడు మాసాల పాలనలో కేంద్రంలోని మిత్రపక్షం వద్ద చక్రం తిప్పి సాధించిన ఏకైక ఘన కారం్య- భూసేకరణ చట్టం కోరలు పీకే ఆర్డినెన్స్‌ను ఆగమేఘాల మీద జారీ చేయడమే. రాజధాని హడావుడిని మినహాయిస్తే, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా నిస్తేజమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలు అటకెక్కాయి. ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన సంతకాలకూ దిక్కులేదు. సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచనైతే పెంచారు కానీ, ఈ జాబితా నుంచి 18 లక్షల మందిని తొలగించారు. పునరుద్ధరణ కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేక, జీవనాధారం కోల్పోయిన షాక్‌ను తట్టుకోలేక గుండెపగిలి చనిపోతున్న వార్తలు ప్రతిరోజూ వినవస్తున్నాయి. రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాబు రుణమాఫీ మాటను నమ్మి తన విజయానికి తొలి కారణంగా నిలిచిన రైతు లోకాన్ని ఆయన వంచించిన తీరు రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నమ్మినందుకు ‘అన్న’కు వెన్నుపోటు తప్పనట్టే అన్నదాతకూ బాబు వెన్నుపోటు తప్పలేదు. బాబు వాగ్దాన భంగం దెబ్బకు మహిళల పొదుపు సంఘాలు కుదేలయ్యాయి. వారి పొదుపులు సగానికి సగం పడిపోయాయని ఒక అధ్యయనంలో తేలింది. రైతులకు పాత అప్పులు మాఫీకాక, కొత్త అప్పులు దొరకక వ్యవసాయం మూలనపడింది. దాంతో ఉపాధి లేక లక్షలాది మంది వలస బాట పట్టారు. ఒక్క అనంతపురం జిల్లా నుంచే రెండున్నర లక్షలమంది కర్ణాటకకు వలస పోయారంటే గ్రామాల పరిస్థితి ఎంత దైన్యంగా ఉందో తెలుస్తుంది. ఇంకా శీతాకాలంలోనే ఉన్నాం. వేసవికాలం రానే లేదు. అప్పుడే మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సుమారు రెండు వేల గ్రామాల గొంతు తడవాలంటే నీళ్ల ట్యాంకర్లు రావాల్సిందే. రక్షిత మంచినీటి వసతి లేక కలుషిత నీటి వాడకంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రాథమిక వైద్యం పడకేసింది. బెజవాడ వంటి నగరంలోనే కుక్కకాటుకు మందులేక నిండు ప్రాణం బలైపోయిన సంఘటనను మనచిపోలేము. ఒక్క కర్నూలు జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే గడచిన సంవత్సరం 12 వేల మంది ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకొని బయటకొచ్చారు. వీరిలో కేవలం ఐదువందల మందికి మాత్రమే చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరికాయి. అవి కూడా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో. మిగతా ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగుల్లో కొందరు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుం టున్నారు. ఎక్కువ మంది నిరుద్యోగ సైన్యంలో కలసిపోయారు. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఇప్పటికే లక్ష మంది నమోదయ్యారు. ఇదే పరిస్థితి కొద్దిపాటి హెచ్చుతగ్గులతో రాష్ట్రమంతటా ఉంది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించేది. రాజకీయ కారణాలతో దాన్ని అటకెక్కించారు. హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో 1,500 కోట్ల నష్టం జరిగిందని అధికారులే తేల్చారు. ఇప్పటికీ పైసా పరిహారం రాలేదు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 670 మెకనైజ్డ్ బోట్లు ధ్వంసమై మత్స్యకారులు వీధినపడితే ఇప్పటికీ సాయం అందలేదు. పదమూడవ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీల కోసం విడుదల చేసిన నిధులను కరెంటు బిల్లుల కింద ప్రభుత్వం కట్టేసుకుంది. ఇప్పుడు చీపుర్లుకొనే డబ్బులు కూడా లేని పంచాయతీలు స్వచ్ఛ భారత్ కోసం ఎలా కృషి చేస్తాయో చూడాలి. రాష్ట్ర వాస్తవ పరిస్థితులు ఇలావుంటే పూర్తి అసత్యాలతో కొత్త సంవత్సరం రోజున రాష్ట్రముఖ్యమంత్రి కొన్ని పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ప్రజల వివేకాన్ని, జ్ఞాపక శక్తిని కూడా ఎగతాళి చేసేదిగా ఉంది. జనవరి ఒకటో తేదీనాడు చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన సారాంశం- ‘‘2004 నాటికి నేను రాష్ట్రంలో ఒక స్వర్గాన్ని నిర్మించాను. ఆ తరువాత పాలకులు దానిని నరకంగా మార్చారు. సుదీర్ఘ పాదయాత్రలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగుల దుర్భర జీవితాలను చూసి చలించిపోయాను. వారి మోముల్లో వెలుగులు పూయిస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందుకే అధికారంలోకి రాగానే రైతు రుణ విముక్తి, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల పెంపు, ఉద్యోగుల పదవీ విరమణ పెంపు, స్వచ్ఛమైన మంచినీరు, బెల్టుషాపుల రద్దు వంటి అంశాల ఫైళ్లపై సంతకం చేశాను. ఆ మేరకు రైతుకు రుణ ఉపశమనం చేశాను. తుపానును ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. యువశక్తి ఉంది. ఖనిజసంపద ఉంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుదాం.’’ కాబట్టి 2004 నాటికి రాష్ట్రాన్ని చంద్రబాబు ఏ మేరకు అగ్రస్థానంలో నిలిపారో, ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో సూచించే కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. * చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఆఖరు సంవత్సరం (2003- 04) రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల టన్నులు కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న చివరి సంవత్సరం (2008-09) ఆహార ధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులు. * బీటీ పత్తి విత్తనాల ధర ప్యాకెట్‌కు చంద్రబాబు హయాంలో రూ. 1,850. రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 650. * రాష్ర్ట ఆర్థికవృద్థి చంద్రబాబు చివరి ఐదేళ్లలో 5.72% వైఎస్ ఐదేళ్ల కాలంలో 9.54%. * రాష్ర్ట ఆస్తులు- అప్పుల నిష్పత్తి చంద్రబాబు పాలనలో 45 :100, వైఎస్ పాలనలో 120 :100. * వరి కనీస మద్ధతు ధర చంద్రబాబు పాలనలో క్వింటాల్‌కు రూ. 490. వైఎస్ పాలనలో రూ. 1,000. * ఐటీ ఉద్యోగుల సంఖ్య 2004 నాటికి 85,000. అదే 2009 నాటికి 2,50,000. * ఆర్టీసీ చార్జీలు చంద్రబాబు కాలంలో(1995-2004) ఐదుసార్లు పెరిగితే వైఎస్ కాలంలో (2004-2009) ఒక్కసారి కూడా పెరగలేదు. * అదే కాలంలో విద్యుత్ చార్జీలు చంద్రబాబు ఎనిమిదిసార్లు పెంచితే వైఎస్ ఒక్కసారి కూడా పెంచలేదు. * బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు. వైఎస్ మాత్రం ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, ఈబీసీ విద్యార్థు లకు ఈ పథకాన్ని అమలు చేశారు. * చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేశారు. వైఎస్ అమలు చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వ్యవసాయం చతికిలపడి, కులవృత్తులు మూలనపడి వయసొచ్చిన జనమంతా వలసబాట బట్టి కదల్లేని వృద్ధులతో, మొండి గోడలతో మిగిలిపోయి కళ తప్పిన నాటి గ్రామాలపై మహాకవి గోరటి వెంకన్న రాసిన ‘పల్లే కన్నీరు పెడు తుందో’... అన్న గేయం ఒక్కటి చాలదా? చంద్రబాబు పాలనపై అంతకు మిం చిన అభిశంసన పత్రం ఇంకేముంటుంది? అపారమైన ప్రకృతి వనరులు- మేలు రకం మానవ వనరులు రాష్ర్టంలో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అగ్రస్థానానికి చేరుకోవాలని చంద్రబాబు కొత్త సంవత్సరం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడు మాసాల్లో అందుకోసం ఏమైనా కృషి చేశారా? కనీసం ప్రణాళికల స్థాయికైనా వచ్చారా? రాష్ట్రాభివృద్ధికి ఫోకస్ ఏరియా (దృష్టిని కేంద్రీకరించాల్సిన రంగం) ఏమిటి? వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ (హార్డ్‌వేర్- సాఫ్ట్వేర్)-ఫార్మా, పోర్టులు, ఎయిర్ పోర్టులు, పవర్ప్లాంట్లు- ఇలా అన్నీ కలిపేయడం వల్ల అయోమయం తప్ప ఫలితముం టుందా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పరిపాలన... పరిశ్రమలు... అభివృద్ధి... వగైరా ఏదీ ఇంకా ప్రారంభం కానేలేదు. ఒక్క రియల్ ఎస్టేట్ ‘రాజధాని’ కార్యక్రమం తప్ప. కొసమెరుపులాగా చంద్రబాబు పేద ప్రజలందరూ సంక్రాంతి రోజున పప్పన్నంలో నెయ్యి వేసుకొని తినాలని కోరుకుంటున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా ఆ ‘సంక్రాంతి గిఫ్ట్’ను అందజేయనున్నట్టు చెప్పారు. ఆయన అధికార దండం పట్టిన ఈ ఏడు మాసాల్లో రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం, పంచదార తప్ప మరే సరుకూ అందలేదు! ‘పండక్కి పప్పన్నం, నెయ్యి’కి కూడా ఎన్నికల వాగ్దానాల గతే పట్టదనుకుందాం! - వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
కెరీర్‌కు ధీమానిచ్చే ‘బీమా’!
ప్రతి వస్తువుకూ ఎంతో ధీమా ఇచ్చేదిగా మారింది. ఆర్థిక అవగాహన పెరగడంతో నిత్యావసరంగా మారింది. విలువైన జీవితం దగ్గరి నుంచి మొబైల్ ఫోన్ వరకూ బీమా పెనవేసుకుంది. ఇదే క్రమంలో ప్రైవేటు బీమా సంస్థల ప్రవేశం, ఎఫ్‌డీఐల పెంపు తదితర కారణాలతో ఈ రంగంలో సుశిక్షితులైన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. అందుకే యువతకు ఉత్తమ కెరీర్ మార్గంగా వెలుగొందు తోంది. దేశంలో బీమా రంగం మార్కెట్ విలువ 2013-14 ఆర్థిక సంవత్సరంలో 66.4 బిలియన్ డాలర్లు. ఇది 2020 నాటికి 350-450 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా... బీమా రంగంలో 147 దేశాల జాబితాలో భారత్ పదో స్థానంలో ఉంది. ఇంతలా ఆశావహ పరిస్థితులున్న ఈ రంగం యువతకు ఓ ఉత్తమ కెరీర్ వేదికగా నిలుస్తోంది. ఈ రంగంలో 2030 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అసోచాం సర్వే పేర్కొంది. విస్తరణ శరవేగం: 36 కోట్ల పాలసీలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా రంగంగా గుర్తింపు పొందింది. 50కిపైగా వివిధ బీమా సంస్థలతో మార్కెట్ ప్రగతి పథంలో పయనిస్తోంది. గతంలో వ్యక్తిగత జీవితానికి ఆర్థికపరమైన రక్షణ ఇచ్చేదిగా మాత్రమే బీమా ఉండేది. ప్రస్తుతం మారుతున్న అవసరాల మేరకు ఏ కొత్త వస్తువును కొనుగోలు చేసినా బీమా అవసరమవుతోంది. ఈ క్రమంలో వాహన బీమా, ఆరోగ్య బీమా, గృహ బీమా, వ్యాపార బీమా, ప్రయాణ బీమాలుగా శరవేగంగా విస్తరిస్తోంది. ‘‘బీమా రంగంలో ప్రత్యక్షంగా పది లక్షల మంది, పరోక్షంగా మరో 50 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ రంగం రాబోయే రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. గ్లోబల్ సిటీగా పేరున్న హైదరాబాద్‌లో దాదాపు అన్ని బీమా కంపెనీలు తమ కేంద్రాన్ని ప్రారంభించాయి’’ అంటున్నారు భారతి యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ శిల్పా వైద్. కోర్సుల స్వరూపం: బీమా రంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విద్యా సంస్థలు కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. ‘‘ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పోటీ కూడా తీవ్రంగా పెరిగింది. దాంతో బాధ్యతల నిర్వహణ కత్తిమీదసాములా మారింది. అందుకే అకడమిక్‌గా, ప్రాక్టికల్స్ పరంగా పదునుపెట్టేలా ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అంశాల్లో నిత్యనూతన కోర్సులకు రూపకల్పన చేశారు. సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ స్థాయిలో ఇవి అందుబాటులో ఉన్నాయి’’ అంటున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) దూరవిద్యా విభాగం అధిపతి ఎన్.వి.డి.ఎస్.రాజు. పెద్దన్న ఐఐఆర్ఎం: హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్(ఐఐఆర్ఎం) అంతర్జాతీయ గుర్తింపున్న సంస్థ. ఇందులో కోర్సులు పూర్తిచేసిన వారికి బహుళజాతి సంస్థల్లో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇది అందించే కోర్సుల్లో ముఖ్యమైనవి.. ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్(జనరల్ అండ్ లైఫ్)/ రిస్క్ మేనేజ్మెంట్. ఇవే విభాగాల్లో ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్లస్ స్థాయిలోనూ కోర్సులను అందిస్తోంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ కోర్సులకు కనీస అర్హత 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్స్ డిగ్రీ వరకు అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటితోపాటు ఇన్సూరెన్స్ రంగంలో, విధుల్లో ఎంతో కీలక విభాగంగా పేరొందిన యాక్చుయేరియల్ సైన్స్‌కు సంబంధించి కూడా కోర్సును అందిస్తోంది. కోర్సు పీజు రూ.2.5లక్షల నుంచి రూ.3 లక్షలు. వెబ్సైట్: www.iirmworld.org.in - నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ -పుణె; అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ యాక్చుయేరియల్ సెన్సైస్ తదితర సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. వెబ్సైట్: www.niapune.com కొలువులు విభిన్నం: బీమా సంబంధిత కోర్సులు పూర్తిచేసిన వారికి వివిధ ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇన్సూరెన్స్ సంస్థలతో పాటు సాఫ్ట్వేర్, బ్యాంకింగ్-ఫైనాన్షియల్ రంగ సంస్థలు కూడా కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. జాబ్ ప్రొఫైల్స్: - అనలిస్టు - అండర్ రైటర్ - కంప్లయిన్స్ ఆఫీసర్ - క్లెయిమ్స్ మేనేజర్ - సేల్స్ టీమ్ మేనేజర్/లీడర్ - రిస్క్ మేనేజర్ - సర్వేయర్. విధులు: వ్యాపార పరంగా సంస్థ ఉన్నతికి నిర్ణయాలు తీసుకోవడంలో అనలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. వీరు ఎప్పటికప్పుడు మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులను విశ్లేషించి, నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడతారు. అండర్ రైటర్.. బీమా కవరేజీకి సంబంధించిన చెల్లింపులు, లాభనష్టాలను అంచనా వేస్తాడు. మిగిలిన విభాగాల్లో మార్కెటింగ్ ముఖ్యమైన విధి. వయోపరిమితి లేకుండా ఉపాధి లభించే రంగాల్లో బీమా ఒకటి. తాత్కాలిక ప్రాతిపదికన గృహిణులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగులు పనిచేసేందుకు వీలున్న రంగం. గతంలో ఏజెంట్‌గా పనిచేసేందుకు పదోతరగతి కనీస విద్యార్హతగా ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇంటర్, గ్రాడ్యుయేషన్ స్థాయికి మార్చారు. వేతనాలు: కోర్సులు పూర్తిచేసిన వారికి రూ.2.5 లక్షల కనిష్ట వేతనం, రూ.5 లక్షల గరిష్ట వేతనం లభిస్తోంది. మొత్తంగా చూస్తే సగటున రూ.3.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలు, అనుభవంతో స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరొచ్చు. విస్తరణకు అవకాశమున్న రంగం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న రంగం.. ఇన్సూరెన్స్. ప్రతి వస్తువుకూ బీమా అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా పల్లెలకు తమ సేవలు విస్తరించేందుకు అవసరమైన మానవ వనరుల కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోకి విదేశీ సంస్థలు మరిన్ని వస్తే అవకాశాలు పెరుగుతాయి. సమర్థతకు నైపుణ్యాలను జతచేసుకోగలిగితే ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇన్సూరెన్స్ రంగంపై అవగాహన పెంచుకోగలిగితే మంచి కెరీర్ సొంతమవుతుంది. టెక్నాలజీపై పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా కెరీర్లో పోటీని తట్టుకొని నిలదొక్కుకోవచ్చు. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ వంటి సంస్థలు పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఇటీవల ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ మేనేజ్మెంట్ స్కూళ్లతో కలిసి కోర్సులను అందిస్తున్నాయి. - శిల్పా వైద్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ (హెచ్ఆర్); భారతి యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ -
డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం
ఐటీ కంపెనీల సీఈవోల సదస్సులో సీఎం చంద్రబాబు హైటెక్ సిటీని తలదన్నే రీతిలో విశాఖలో ‘సిగ్నేచర్ టవర్’ ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిని చేస్తాం ప్రతి ఇంటిని ఒక ఐటీ కేంద్రంగా మారుస్తాం సిలికాన్ కారిడార్‌గా విశాఖ అభివృద్ధి చేస్తాం గూగుల్, విప్రో తదితర సంస్థలతో ఒప్పందాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని అతి త్వరలోనే ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకర్ని ఈ-ఆక్షరాస్యునిగా చేయడంతోపాటు ఒకర్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఐటీ కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్-స్టార్ట్ అప్ విధాన పత్రాలను విడుదల చేశారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకుగాను విప్రో, సమీర్, టెక్ మహేం ద్ర, టిస్సాల్వ్, మోబ్మి సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. అదే విధంగా 16 ఐటీ కంపెనీలకు విశాఖపట్నం, విజయవాడలలో భూములు, ఇంక్యుబేషన్ సెంటర్లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఏమన్నారంటే... - రానున్న నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఐటీ రంగ ఫలాలను సామాన్యునికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వయంసహాయక సంఘాల కార్యకలాపాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. చిన్నతరహా- మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చి వాటి విస్తరణకు బాటలు వేస్తాం. - ఇంటర్నెట్ సేవలను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం గూగుల్ సంస్థకు పూర్తిగా సహకరిస్తుంది. ప్రతి ఇంటిని ఓ ఐటీ కేంద్రంగా రూపాంతరం చెందేలా చేస్తాం. - హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని తలదన్నేరీతిలో విశాఖపట్నం మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ను నిర్మిస్తాం. ఇందుకోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. విశాఖపట్నంను సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తాం. ముంబాయి తరువాత దేశానికి ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖపట్నంను తీర్చిదిద్దుతాం. - రాజకీయ- పరిపాలన రాజధానిగా విజయవాడ, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిలను అభివృద్ధి పరుస్తాం. ఈ మూడు మెగాసిటీలతోపాటు రాష్ట్రంలో 30 స్మార్ట్ సిటీలను తీర్చిదిద్దుతాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్‌తోపాటు వివిధ జిల్లాల్లో ఉన్న ఖనిజ సంపదను వెలికితీస్తాం. - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హారాష్ట్రంలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగా లు, ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఐటీ కంపెనీల స్థాపనకు వీలుగా సింగిల్ విండో విధానం ద్వారా నాలుగు వారాల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. - సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు జె.సత్యన్నారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్, మోబ్మి సీఈవో సంజయ్ విజయ్‌కుమార్‌లతోపాటు నాస్కామ్, గూగుల్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థల ప్రతినిధులు, పలు ఐటీ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. -ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ఎంపీలు కె. హరిబాబు, అవంతి శ్రీనివాస్, కొత్తపల్లి గీత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్, బండారు సత్యన్నారాయణమూర్తి, తదితరులు హాజరయ్యారు. 20 ఎకరాల్లో సిగ్నేచర్ టవర్! విశాఖశివారులోని మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ పేరిట ఐటీ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మధురవాడ ఎస్ఈజెడ్లోని హిల్-3 మీద 20 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. సీఎం సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి టవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈమేరకు భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ యువరాజ్‌తోపాటు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. సిగ్నేచర్ టవర్ డిజైన్‌ను నిర్ణయించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే విశాఖపట్నంలో ఐఐఎంతోసహా పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు కోసం భూములు గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో త్వరలో సమావేశం నిర్వహించనున్నామని, ఆలోపు భూముల గుర్తింపు పూర్తి చేయాలని చెప్పారు. ఆ సమావేశం తర్వాత విశాఖలో ఏఏ విద్యా సంస్థలు ఏర్పాటు చేసేది స్పష్టత ఇస్తామని సీఎం తెలిపారు. ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం అంతకుముందు సీఎం చంద్రబాబు విశాఖపట్నం శివారులోని మధురవాడలోని ఐటీ ఎస్ఈజెడ్లో రూ.23 కోట్లతో నిర్మిం చిన టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (సన్‌రైజ్ స్టార్ట్అప్)ను ప్రారంభిం చారు. ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి ఐటీ రంగ సమస్యలను తెలుసుకున్నారు. విశాఖపట్నంలో ఐటీ, పర్యాటక రంగాలను జోడించి అభివృద్ధి పరిచేలా ప్రణాళిక రూపొందించమని అధికారులకు సూచిం చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు నిరంత రం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందుబాటులోని టెక్నాలజీని ఉపయోగిం చి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. -
వాటర్ గ్రిడ్ అసాధ్యమే!
జిల్లాకు నీటి కష్టాలు తప్పవా? పోలవరం వస్తేనే 24 టీఎంసీల నీటికి అవకాశం తేల్చిన నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక సిద్ధం ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. జిల్లాలో గ్రిడ్ ఏర్పాటు అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. పోలవరం వస్తేనే గాని అది సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో జిల్లాకు నీటి కష్టాలు తప్పేట్టు లేవు. పరిశ్రమలు, వ్యవసాయానికే కాకుండా తాగునీటికీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. విశాఖ రూరల్: జిల్లాకు నీటివనరుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. మున్ముందు బహుళజాతి కంపెనీలు, ఐటీ, భారీ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. మానవ వనరులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నీటి వినియోగం రెట్టింపు కానుంది. ఇప్పటికే అవసరాలకు తగ్గ నీటి సరఫరా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో ఉన్న పరిశ్రమలకు, తాగునీటికి రోజుకు 90 ఎంజీడీలు అవసరం. కానీ ఏలేరు, రైవాడ, మేహాద్రిగెడ్డ, గోస్తనీ, గోదావరి, ముడసర్లోవ, గంభీరం, తాటి పూడి జలాశయాల నుంచి రోజుకు 65 నుంచి 70 ఎంజీడీలు మాత్రమే వస్తోంది. దీంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల్లో కోత విధించాల్సి వస్తోంది. తాగునీటి సరఫరాను కూడా కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఉండనే ఉన్నాయి. వాటర్ గ్రిడ్ కష్టమే : ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలను పెంచుకోడానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని, జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నీటి సరఫరా విభాగం అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు నిర్వహించన సమావేశంలో తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రుణమాఫీ తప్పించుకోడానికి, ప్రజల ఆలోచనలను మళ్లించడానికే రోజు కో ఆచరణ సాధ్యం కాని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తోందన్న విమర్శలున్నాయి. పోలవరంతోనే గ్రిడ్ సాధ్యం : గోదావరి నుంచి గాని, ఒరిస్సా, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో ఉన్న నదుల నుంచి జిల్లాకు నీరు చేరే అవకాశం లేదు. దీంతో ఇక్కడ పడిన వర్షపు నీటినే జలాశయాల్లో నిల్వ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయానికే ఈ నీటి నిల్వలు సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమని అధికారులు తేల్చారు. పోలవరం ద్వారా జిల్లాలో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో మిగిలిన జలాశయాల్లో నీటిని పరిశ్రమలు, సాగు అవసరాలకు వినియోగించుకొనే వీలు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మం: భావి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్ది దేశానికి విలువైన మానవ వనరులను తయారు చేసే గురువులే సమాజ దిశా నిర్దేశకులని కలెక్టర్ కె. ఇలంబరితి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో ఫంక్షన్హాల్లో శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వారే గురువని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బాల్యంలో విద్యాబోధన చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకున్నవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరిపైనా గురువు ప్రభావం ఉంటుందని, ఉత్తమ గురువు లభించిన శిష్యుడు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ఎంపిక చేయడం అనవాయితీ అని, అయితే ఈ ఎంపిక కార్యాలయాల్లో కాకుండా వచ్చే సంవత్సరం నుంచి నేరుగా పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయులు అంకిత భావంతో పనిచేసి మెరుగైన విద్యాప్రమాణాలు సాధించేందుకు పాటుపడాలని కోరారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్య వ్యాపారమయమైన ఈరోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ గురువులు ఉన్నందునే గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి విద్యార్థులు బయటకు వస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రభావం ఉంటుందన్నారు. నిస్వార్థంతో పనిచేసే గురువులకు ఎప్పటికీ విలువ ఉంటుందని చెప్పారు. వరంగల్ ఆర్జేడీ బాలయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులతోపాటు, గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో బి. శ్రీనివాసరావు, ఖమ్మం, మధిర డిప్యూటీవోలు బస్వారావు, రాములు, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మల్లికార్జున్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
వినూత్న కోర్సులతో అవకాశాలెన్నో..
కోర్స్ కార్నర్: ఆధునిక సమాజంలో అవసరాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. కాలానుగుణంగా ఎన్నో కొత్త రంగాలు తెరపైకి వస్తున్నాయి. ఆయా రంగాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అవసరమే. అలాంటి వనరులను సమాజానికి అందించేందుకు ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లు నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. మూస ధోరణిలో కాకుండా అందరికంటే భిన్నంగా ఆలోచించి ఇలాంటి వినూత్న కోర్సులను ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న కోర్సులు.. వాటి వివరాలు.. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ అందిస్తున్న కోర్సులు: ఎంఎస్క్యూఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్-క్వాలిటీ సర్వీస్ మేనేజ్మెంట్) అర్హత: మ్యాథ మెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ జేఆర్ఎఫ్ ఇన్ క్వాలిటీ రిలియబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ అర్హత: సంబంధిత విభాగంలోఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంఫిల్/తత్సమానం/ఎంస్టాట్స్/ఎంఎస్సీ/ఎంఏతోపాటు మ్యాథ్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్లతో మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ లేదా బీఈ/బీటెక్. పార్ట్ టైమ్ కోర్సులు (స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్) అర్హత: డిగ్రీ/డిప్లొమా ఇన్ టెక్నాలజీ లేదా మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం ఉండాలి. ప్రవేశం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ (నిర్దేశించిన కోర్సులకు) ఆధారంగా వివరాలకు: www.isihyd.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స (బిట్స్), పిలానీ-హైదరాబాద్ కోర్సు: ఎంఎస్సీ (టెక్)-ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇది మల్టిడిసిప్లినరీ కోర్సు. ఈ రంగంలో కొత్తగా మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును రూపొందించారు. ప్రవేశం: బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.bitspilani.ac.in నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా కేంద్రం.. విమానయానం, టెలికమ్యూనికేషన్, అంతరిక్ష రంగాలకు సంబంధించిన చట్టాలు, మేనేజ్మెంట్లకు సంబంధించిన కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వివరాలు.. పీజీ కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌సపోర్‌ట మేనేజ్మెంట్ స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లాస్ పీజీ డిప్లొమా కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌సపోర్‌ట మేనేజ్మెంట్, స్పేస్ అండ్ జీఐఎస్ లాస్ అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఆ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. వివరాలకు: www.nalsar.ac.in ఐఎస్బీ- హైదరాబాద్ కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ) హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు. అర్హత: ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్/తత్సమాన డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం. ప్రవేశం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ద్వారా... వివరాలకు: www.isb.edu/cee జేఎన్టీయూ-హైదరాబాద్ జేఎన్టీయూ-హైదరాబాద్, బీఈ/బీటెక్ కోర్సులతోపాటు మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. వివరాలు.. కోర్సులు: బీటెక్+ఎంటెక్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్+ఎంబీఏ, బీటెక్ ఈసీఈ+ఎంబీఏ, బీటెక్ సీఎస్ఈ+ఎంబీఏ, ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా. వివరాలకు: www.jntuh.ac.in/ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్. ఈ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉంది. ఇంగ్లిష్‌తోపాటు ప్రస్తుత తరుణంలో డిమాండ్ ఉన్న విదేశీ భాషలకు సంబంధించిన కోర్సులను అందించడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. వాటి వివరాలు.. బీఏ, బీసీజే, బీఈడీ(ఇంగ్లిష్), ఎంఈడీ, ఎంఏ, ఎంసీజే, మాస్టర్ ఇన్ కంప్యుటేషన్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, పీహెచ్డీ ప్రవేశం: రాత పరీక్ష ద్వారా.వివరాలకు: www.efluniversity.ac.in అకడెమిక్, పోటీ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా మాకు మెయిల్ చేయండి. సంబంధిత నిపుణులు మీకు సమాధానాలిస్తారు. మెయిల్ ఐడీ:sakshieducation@gmail.com -
మానవ వనరులే మన బలం: టీసీఎస్ చంద్రశేఖరన్
భువనేశ్వర్: భారత్‌లో మానవ వనరులు భారీగా ఉన్నాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. రానున్న దశాబ్దాల్లో మన బలం ప్రతిభ గల మానవ వనరులేనని ఆయన చెప్పారు. ఇక్కడి కేఐఐటీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇటీవల జరిగిన నాలుగవ నేషనల్ ఫైనాన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. భారత రూపాయి పతనం మన స్వల్పకాలిక సమస్య అని, తగ్గుతున్న ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక సమస్య అని ఆయన వివరించారు. గత 20 ఏళ్లలో దేశీయ పరిశ్రమలు చెప్పుకోదగ్గ వృద్ధి సాధించాయని, ఎగుమతుల్లో కీలక పాత్రను పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్లకు చేరడంలో ఈ పరిశ్రమలు ఇతోధికంగా తోడ్పడ్డాయని తెలిపారు. డిమాండ్ సంక్షోభం కారణంగానే అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. వర్థమాన దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్‌లు నమ్మశక్యంగాని వృద్ధిని సాధించాయని చెప్పారు.