విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ వెబ్‌సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్‌ను ఎంచుకుంటున్నారు.
యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్‌మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.
ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’
2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment