ఖమ్మం: భావి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్ది దేశానికి విలువైన మానవ వనరులను తయారు చేసే గురువులే సమాజ దిశా నిర్దేశకులని కలెక్టర్ కె. ఇలంబరితి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వారే గురువని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బాల్యంలో విద్యాబోధన చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకున్నవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరిపైనా గురువు ప్రభావం ఉంటుందని, ఉత్తమ గురువు లభించిన శిష్యుడు ఎంతో అదృష్టవంతుడని అన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ఎంపిక చేయడం అనవాయితీ అని, అయితే ఈ ఎంపిక కార్యాలయాల్లో కాకుండా వచ్చే సంవత్సరం నుంచి నేరుగా పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయులు అంకిత భావంతో పనిచేసి మెరుగైన విద్యాప్రమాణాలు సాధించేందుకు పాటుపడాలని కోరారు.
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్య వ్యాపారమయమైన ఈరోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ గురువులు ఉన్నందునే గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి విద్యార్థులు బయటకు వస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రభావం ఉంటుందన్నారు. నిస్వార్థంతో పనిచేసే గురువులకు ఎప్పటికీ విలువ ఉంటుందని చెప్పారు. వరంగల్ ఆర్జేడీ బాలయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులతోపాటు, గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో బి. శ్రీనివాసరావు, ఖమ్మం, మధిర డిప్యూటీవోలు బస్వారావు, రాములు, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మల్లికార్జున్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
గురువులే మార్గదర్శకులు
Published Sat, Sep 6 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement
Advertisement