K. Ilambariti
-
‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ
జూలూరుపాడు : అటవీ భూముల్లో పోడు నరికి సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోగస్ పట్టాలు జారీ చేసిన వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‘డూప్లికేటుగాళ్లు’ అనే శీర్షికన ఈనెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలపై విచారణ చేపట్టాలంటూ కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ బుధారం విచారణ చేపట్టారు. బోగస్ పట్టాతో మోసపోయిన వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా సురేష్, అతని భార్య ఉమ ఆర్డీఓను కలిశారు. తాము మోసపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుగులోతు సరోజ, బాదావత్ విజయ, గుగులోతు సుజాత, భూక్యా జ్యోతి పేరు మీద ఉన్న బోగస్ పట్టాలను ఆర్డీఓ పరిశీలించారు. పట్టాపాస్ పుస్తకాలపై ఉన్నవి కలెక్టర్, భద్రాచలం ఐటీడీఓ పీఓ సంతకాలు కావని, ఇవి ఫోర్జరీ అని గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వ ముద్ర కూడా కాదని తేల్చారు. పట్టాపాస్ పుస్తకాలపై పోడు రైతు భార్యాభర్తల ఫొటోలు ఉండాలి కానీ, ఒకరిది మాత్రమే ఉందన్నారు. వీటిపై అప్పటి జూలూరుపాడు తహశీల్దారు డి.నాగుబాయి పేరుతో సంతకం చేసి ఉందని చెప్పారు. ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎవరిచ్చారని బాధిత రైతులను ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా అనిల్ ఎకరానికి రూ.10 వేలు చొప్పున తీసుకుని చేయించాడని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తుంటే మీరేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై వారు సమాధానం ఇస్తూ తమకు ఏమీ తెలియదని, అనిల్ చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామని తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, పట్టాలు తిరిగి ఇవ్వాలని కోరారు. గుగులోతు సరోజ భర్త గుగులోతు నరసింహారావు మూడెకరాలకు రూ.30 వేలు, మల్లయ్య అనే రైతు తమ పెద్ద కూతురు బాదావత్ విజయ పేరు మీద పట్టా చేసినందుకు ఐదెకరాలకు రూ.50 వేలు, చిన్న కూతురు గుగులోతు సుజాత పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇచ్చినందుకు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు, భూక్యా జ్యోతి భర్త రాంబాబు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు పట్టా పాస్ పుస్తకాల కోసం భూక్యా అనిల్‌కు ఇచ్చినట్లు వివరించారు. తమతోపాటు వినోభానగర్, ఏన్కూరు మండలంలోని అక్కినాపురంతండా, కేసుపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పట్టాలు చేయిస్తానని అనిల్ డబ్బులు తీసుకున్నాడని తెలిపా రు. దీంతో ఆర్డీఓ వీరి నుంచి స్టేట్ మెంట్‌ను రికార్డు చేయాలని తహశీల్దారు తోట విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో ఆర్ఐలు బాధిత పోడు రైతుల నుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్థానిక ఎస్సై ఎన్.గౌతమ్‌ను పిలిపించి ఈ కేసు విషయాన్ని ఆర్డీఓ చర్చించారు. కఠిన చర్యలు తప్పవు బోగస్ పాస్ పుస్తకాలు ఇప్పించిన భూక్యా అనిల్ అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆర్డీఆఓ దేశించారు. దీనికి భూక్యా అనిల్ తనపై కావాలనే తమ గ్రామానికి చెందిన ఓ పోడు రైతు వీరందరితో ఫిర్యాదు చేయించాడని చెప్పడంతో ఆర్డీఓ స్పందించారు. వీరిద్దరిని అదుపులోకి విచారించాలని, నిజ నిజాలు తెలుస్తాయని ఎస్సైతో అన్నారు. విచారణ అనంతరం ఆర్డీఓ విలేకరులతో మాట్లాడారు. పట్టా పాస్‌పుస్తకాలు బోగస్విగా గుర్తించామని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 1,090 మందికి పోడు పట్టాలు ఇచ్చామని, వీరికి 3301.73 ఎకరాలు భూమి కేటాయించామని అన్నారు. వినోభానగర్ గ్రామంలో 32.46 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ అయ్యాయని తెలిపారు. ఏనిగ్జిర్-6లో నమోదు చేసి, స్కానింగ్ కూడా జరిగిందని, అయితే ఇంకా 30 నుంచి 40 మాత్రమే నమోదు కాలేదని అన్నారు. బోగస్ పట్టా పాస్ పుస్తకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చెందిన సంతకాలు మాత్రం కావని అన్నారు. అదేవిధంగా డీఎఫ్ఓ సంతకం అవునో కాదో తనకు తెలియదని, అప్పటి తహశీల్దారు డి.నాగుబాయి సంతకం చేశారని తెలిపారు. ఖాళీ పాస్ పుస్తకాలు ఎలా బయటకు పోయాయని అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి బోగస్ పట్టా పాస్ పుస్తకాలు చాలా ఉండే అవకాశం లేకపోలేదని, పూర్తి స్థాయిలో విచారణ జరగిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. -
‘తెలంగాణ’కే మాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో పంటరుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు దశల్లో అర్హుల జాబితాను తుది రూపునకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న జిల్లా యంత్రాంగం కొత్త అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన తుది అర్హుల జాబితాను రెండు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి బ్యాంకర్లను ఆదే శించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రుణమాఫీ, ఆధార్ అనుసంధానంపై జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అర్హుల జాబితా రూపకల్పనలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు మాత్రమే జిల్లాలో రుణమాఫీ వర్తింపజేయాలని, అది కూడా తెలంగాణ రికార్డుల్లో నమోదై ఉన్న భూమి అయి ఉండాలని చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల భూ వివరాలతో ఆధార్‌కు అనుసంధానాన్ని పది రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. పంట రుణాల మాఫీ వర్తించే జాబితాపై గ్రామాల్లో సామాజిక తనిఖీని వేగవంతం చేసి రెండు రోజుల్లో ముందస్తు జాబితాను సిద్ధం చేసి పంపాలని , మిగిలిన రైతుల నుంచి ఆధార్ నంబర్లు స్వీకరించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలను సరిచూసుకుని రైతుల చివరి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రుణమాఫీ పట్టికలో రైతుల పేర్లకు ఎదురుగా భూమికి సంబంధించిన వివరాలు, పాస్ పుస్తకం నంబర్, ఖాతా నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సత్తుపల్లి, తల్లాడ, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మండలాల్లో రైతుల జాబితా తయారీలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పంట రుణమాఫీ పొందాలంటే ఆ రైతు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తుండాలని, భూములు కూడా తెలంగాణలోనే ఉండాలని స్పష్టం చేశారు. రీ షెడ్యూల్ చేసిన రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, అయితే ఈ విషయంపై ఏం చేయాలన్నది ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఒకరైతు ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొంది ఉంటే... ఎక్కువ మొత్తం రుణంగా పొంది ఉన్న బ్యాంకులో రుణమాఫీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండో ప్రాధాన్యతగా మొదటిసారి రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాలన్నారు. నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ రుణాలు పంటల కోసమే తీసుకున్నట్టుగా రైతుల నుంచి ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే అర్హుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ధనుంజయ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ జీఎం నారాయణ, డీసీసీబీ సీఈవో నాగచెన్నారావు, వ్యవసాయ శాఖ జేడీ భాస్కర్‌రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీవోలు సంజీవరెడ్డి, అంజయ్య, అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇక హరిత వనం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హరిత వనం కానుంది. కార్పొరేషన్ పరిధిలో 40-45 పార్కులు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటికి ప్రహరీలు నిర్మించేందుకు నిధులు కూడా విడుదలయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ ఖాళీ స్థలాలను పార్కులుగా మారుస్తామని, మూడునెలల్లో జిల్లా కేంద్రంలో వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. మరోవైపు ఖమ్మం నగర శివార్లలో ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆయన ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు. కబ్జా కోరల నుంచి రక్షించేందుకే... జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముమ్మరమయినప్పటికీ ఖాళీగా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఇందులో ప్రభుత్వ భూములు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు కబ్జాకు గురయిన వాటిని పక్కనపెడితే... ఇప్పటికీ కార్పొరేషన్ ఆధీనంలోనే కొన్ని ఖాళీ స్థలాలున్నాయి. వీటిని రక్షించాలన్న ఆలోచనతో పాటు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు ఈ ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హోదాలో ఇలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ పరిధిలో 40-45 స్థలాలను గుర్తించారు. ఇప్పుడు వీటికి ప్రహరీ గోడలు ఏర్పాటు చేయించేందుకు యుద్ధప్రాతిపదికన రూ.1.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం 13వ ఆర్థిక సంఘం నిధులు కాగా, మరో సగం కార్పొరేషన్ నిధులు. వీటితో గుర్తించిన ఖాళీ స్థలాలకు ప్రహరీల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత వాటన్నింటినీ పార్కులుగా మార్చనున్నారు. జీహెచ్ఎంసీ తరహాలో... ఈ పార్కులను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని పార్కుల తీరులోనే నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు. కాలనీ, రెసిడెంట్స్ అసోసియేషన్లకు ఈ పార్కుల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. కొంత మున్సిపల్ నిధులు, మరికొంత అసోసియేషన్ నిధులతో ఈ పార్కులు నిర్వహిస్తారు. పార్కు విస్తీర్ణాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు వాచ్మెన్లను కూడా నియమించనున్నారు. ఇక.. నగర శివార్లలో భారీ పార్కు నిర్మాణానికి కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్కుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చేందుకు ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయేమో అన్న ఆలోచనతో జిల్లా కలెక్టర్ తన హయాంలోనే ఈ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఐఏఎస్ ఉంటేనే మేలు ఇక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఉంటేనే మంచిదనే కోణంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితమే కార్పొరేషన్ అయినా ఖమ్మం నగరం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు యేటా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ఈ పోస్టును ఐఏఎస్‌లకు అప్పగిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వ స్తుండడం గమనార్హం. -
కుటుంబ సర్వే కంప్యూటరీకరణ భేష్
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ విజయవంతమైందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. కలెక్టరేట నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర కుటంబ సర్వే వివరాలు కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియ తొలుత నిదానంగా ప్రారంభమైనప్పటికీ రాను రాను వేగం పుంజుకుందన్నారు. చక్కటి ప్రణాళికతో కంప్యూటీకరణ పూర్తి చేయడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ప్రశంసించారని తెలిపారు. కంప్యూటరీకరణను అంకితభావంతో పూర్తిచేసిన జేసీ సురేంద్రమోహన్, జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, డీఐఓ శ్రీనివాస్, ఆర్డీవో, తహశీల్దార్లు, కళాశాలల యజమానులు అభినందనీయులని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు చేసేందుకు సర్వే వివరాలు దోహదం చేస్తాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్, ఎన్ఐసీ డీఐఓ శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది ఖాసిం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గురువులే మార్గదర్శకులు
ఖమ్మం: భావి పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్ది దేశానికి విలువైన మానవ వనరులను తయారు చేసే గురువులే సమాజ దిశా నిర్దేశకులని కలెక్టర్ కె. ఇలంబరితి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో ఫంక్షన్హాల్లో శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే వారే గురువని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బాల్యంలో విద్యాబోధన చేసిన గురువులను స్ఫూర్తిగా తీసుకున్నవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరిపైనా గురువు ప్రభావం ఉంటుందని, ఉత్తమ గురువు లభించిన శిష్యుడు ఎంతో అదృష్టవంతుడని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ గురువులను ఎంపిక చేయడం అనవాయితీ అని, అయితే ఈ ఎంపిక కార్యాలయాల్లో కాకుండా వచ్చే సంవత్సరం నుంచి నేరుగా పాఠశాలలకు వెళ్లి అక్కడి నుంచే ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాద్యాయులు అంకిత భావంతో పనిచేసి మెరుగైన విద్యాప్రమాణాలు సాధించేందుకు పాటుపడాలని కోరారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్య వ్యాపారమయమైన ఈరోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ గురువులు ఉన్నందునే గ్రామీణ ప్రాంతాల నుంచి మెరికల్లాంటి విద్యార్థులు బయటకు వస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి ప్రభావం ఉంటుందన్నారు. నిస్వార్థంతో పనిచేసే గురువులకు ఎప్పటికీ విలువ ఉంటుందని చెప్పారు. వరంగల్ ఆర్జేడీ బాలయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడంతోపాటు సంపూర్ణ అక్షరాస్యత సాధనలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులతోపాటు, గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో బి. శ్రీనివాసరావు, ఖమ్మం, మధిర డిప్యూటీవోలు బస్వారావు, రాములు, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి మల్లికార్జున్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రూ.25 కోట్ల తాగునీటి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మణుగూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి గండం గట్టెక్కబోతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి చొరవతో మణుగూరు పట్టణ తాగునీటి ప్రాజెక్టు పనులకు మరో రెండు, మూడు రోజుల్లో ఒప్పందాలు పూర్తి కానున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనల రూపం దాల్చిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని భూ కొనుగోలు పథకం ద్వారా సేకరించేందుకు పురపాలక శాఖ కమిషనర్ అంగీకరించడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ బ్యాంకు సాయంతో నిర్మిస్తున్న ఈ పథకానికి ఇప్పటికే రూ.25.56 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఈ ప్రాజెక్టుకు అవసరమైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించేందుకు భూమి సమస్య ఏర్పడడంతో గత ఏడాదిన్నరగా ఈ పనులు అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు ఆ భూమి సమస్య కూడా తీరడంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలతో రెండు, మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభిస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు స్వరూపం ఇది.... మణుగూరు మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్రాజెక్టు కోసం 2009లో ప్రతిపాదనలు తయారుచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే తయారయిన ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన రూ.25.56 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ 2013 ఫిబ్రవరిలో ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 3 ఎకరాల 4 కుంటల భూమిని జిల్లా అధికారులు మున్సిపాలిటీకి అప్పగించేశారు. గోదావరి ఒడ్డునే ఉన్న చినరాయిగూడెంలో అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ఇన్‌టేక్‌వెల్ నిర్మాణం కోసం కేటాయించారు. అయితే, అందులో ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి కేవలం ఎకరం 19 కుంటలే సరిపోతుందని అధికారుల అంచనా. అయినా, మిగిలే దాదాపు రెండెకరాల భూమిని కూడా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 11న అప్పటి కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ శంకుస్థాపన కూడా చేశారు. అప్పటికే ఈ ప్రాజెక్టు మొదటి ఫేస్‌కు సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వాటర్ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మాణం కోసం భూ సేకరణ విషయంలో సమస్య ఏర్పడడంతో ప్రాజెక్టు నిర్మాణమే నిలిచిపోయింది. 17 కుంటల భూమి... 25 కోట్ల ప్రాజెక్టు ఇంతకీ ఈ వాటర్‌ప్లాంటు నిర్మాణానికి సమస్యగా మారిన భూమి ఎంతంటే.. కేవలం 17 కుంటలే. ఈ భూమిని కమలాపురం వద్ద సేకరించి అక్కడే ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ ఆ మేరకు ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. కానీ, ఆ భూమిలో ఇతర ప్రైవేటు వ్యక్తులు ఉండడంతో వారు అభ్యంతరం చెప్పారు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన సమయంలో ప్రస్తుత కలెక్టర్ ఇలంబరితి పురపాలక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనిపై శ్రద్ధ చూపడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక కృషి జరిపారు. దీంతో ఈ భూమిని భూ కొనుగోలు పద్ధతిన సేకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు భూమి సమస్య కూడా తీరడంతో మరో రెండేళ్లలో పనులు పూర్తయిపోతాయని అధికారులు చెపుతున్నారు. పనులు ప్రారంభం అయితే, వీలైనంత త్వరగా పూర్తిచేసి మున్సిపాలిటీలోని 10వేలకు పైగా కుటుంబాలకు 24 గంటల నీటిసరఫరాను అందుబాటులోనికి తెస్తామని వారంటున్నారు. -
నేనూ రైతు బిడ్డనే..!
వైరా :‘నేనూ రైతుబిడ్డనే..నాకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి స్పష్టం చేశారు. మండలంలోని సోమవరం పంచాయతీలో పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. రోడ్డుపక్కన పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలతో కొద్దిసేపు సంభాషించారు. వ్యవసాయ పనులు ఏవిధంగా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైరా రిజర్వాయర్ కింద నీరు విడుదల చేయక వరినాట్లు అంతగా లేవని కూలీలు బదులిచ్చారు. రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తే నాట్లు ఉంటాయని, తమకు వ్యవసాయ పనులు దొరుకుతాయని కూలీలు కలెక్టర్‌కు చెప్పారు. అరగంటపాటు ఆయన కూలీలతో మాట్లాడారు. నారు కట్టలు, వరి నాటు వేసే విధానాన్ని పరిశీలించారు. అంతకుముందు రిజర్వాయర్ వద్దకు కలెక్టర్ వెళ్లారు. రిజర్వాయర్‌లో ఎంత మేర నీరు ఉన్నది, సాగర్ జలాలు ఏ మేరకు అవసరం ఉన్నాయో అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నింపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని వైరా ఎంపీపీ బొంతు సమత కలెక్టర్‌కు విన్నవించారు. వర్షాభావ పరిస్థితులపై జిల్లాలో త్వరలో శాఖలవారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడు, జేడీఏ భాస్కర్‌రావు, మధిర ఏడీఏ బాబూరావు, ఐబీ ఏఈ రాణి, తదితరులున్నారు. -
సహకరించండి
ఖమ్మం జెడ్పీసెంటర్: నేటి సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి కోరారు. ప్రజల సామాజిక, ఆర్థికస్థితిగతులను తెలుసుకునేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. దీని నుంచి ఆంధ్రపదేశ్‌లో కలిసిన ఏడు మండలాలను మినహాయించినట్లు తెలిపారు. అక్కడ సర్వేను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే ఏడు మండలాలను ఆంధ్రపదే శ్లో కలుపుతూ ఆర్డినెన్స్ పాస్ అయిందన్నారు. న్యాయపరమైన వ్యవహారాలు, డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ అమలు, ప్రభుత్వ నిర్ణయానుసారం ముంపు ప్రాంతాల్లో సర్వే చేయటం లేదన్నారు. ఈ సర్వేతో పథకాలు రద్దు కావని, అదనపు సౌకర్యాలు కల్పించటం కోసమే అన్నారు. ప్రజలు అనుమానాలు, అపోహలకు గురికావద్దన్నారు. సమాచారం అసంపూర్తిగా కాకుండా నిజాలు వెల్లడించాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి హౌస్‌హోల్డింగ్ సర్వే చేసి, స్టిక్కర్లు అంటించామన్నారు. జిల్లావ్యాప్తంగా 99 శాతం స్టిక్కరింగ్ పూర్తయిందన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి మారుమూల ప్రాంతంలో సైతం ఎలక్షన్ మాదిరిగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 33వేల మంది ఎన్యూమరేట్లర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. రహదారులు సరిగా లేని గిరిజన గ్రామాలకు సైతం ఎన్యూమరేటర్లను కార్లు, జీపులు, లాంచీల్లో పంపించామన్నారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వేకు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచితే ఎన్యూమరేటర్ల పని సులవవుతుందన్నారు. స్టిక్కరింగ్ లేని కుటుంబాలను ప్రత్యేకంగా పరిశీలించి సర్వే చేసేందుకు మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ సర్వే ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను నియమించామన్నారు. నేడు సెలవు.. అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవుదినంగా ప్రకటించిందన్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు అన్ని సంస్థలూ ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందే అన్నారు. ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
‘సర్వే’ జనా..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మరో మూడు రోజులు...కేవలం 72 గంటలు.... మన కుటుంబ సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం వద్దకు చేర్చే సమగ్ర సర్వేకు ఉన్న గడువు ఇది. ఈ గడువులోనే జిల్లా ప్రజానీకం సర్వేకు సిద్ధం కావాల్సి ఉంది. సర్వేలో చూపించాల్సిన కాగితాలు, చెప్పాల్సిన వివరాలను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు సులువుగా ఉంటుందని అధికారులు చెపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సర్వేపై ఎవరి అభిప్రాయం... చర్చ ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం జిల్లాలో ఈ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేసుకుపోతున్నారు. కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం సర్వేను పకడ్బందీగా నిర్వహించేందకు సిద్ధమవుతోంది. ఎన్యూమరేటర్ల నుంచి ఇంటింటికీ స్టిక్కర్ల వరకు... సర్వే ఫార్మాట్ల నుంచి డాటా ఎంట్రీ వరకు అన్ని దశలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన లక్షలాది ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించే బృహత్తర ప్రణాళికకు సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో జిల్లాలోని ప్రజలంతా సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండాలని ‘సాక్షి’ కోరుకుంటోంది. ఎవరి నోట విన్నా... ఇదే మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఏ నోట విన్నా ఇదే చర్చ జరుగుతోంది. ఎక్కడ నలుగురు గుమికూడినా... ఎవరైనా కొత్తవారు వచ్చి ఇంటి తలుపు తట్టినా ఇదే చర్చ.... అసలు ఈ సర్వే ఎందుకు? ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకా? రేషన్‌కార్డులు తీసేసేందుకా? లేదా స్థానిక త నిర్ధారించేందుకా... ఇలా ప్రజల్లో అనేక రకాల సందేహాలకు తావిచ్చిన ఈ సర్వేపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సర్వే జరిగి తీరాల్సిందేనని అంటుంటే మరి కొందరు సర్వే వద్దనకపోయినా తమకున్న అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సర్వే విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత కొందరు సర్వేను నిలిపివేయాలని కోర్టుకు వెళ్లడంతో సర్వే జరుగుతుందా లేదా అనే సందేహం వచ్చినా, ఆ తర్వాత సర్వే నిలిపివేయలేమని కోర్టు చెప్పడం... సర్వేలో సమాచారం ఇవ్వడం అనేది ప్రజల ఐచ్ఛికమేనని ప్రభుత్వం చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వే జరుగుతుందనే నిర్ధారణకు వచ్చారు ప్రజలు. అధికారులు ఇళ్లకు వస్తే చూపించాల్సినవి ఇవే... సర్వే చేసే సమయంలో ప్రతి ఒక్కరు రేషన్, ఆధార్‌కార్డు, ఇంటిపన్ను రశీదు, భూమి పట్టా కాగి తం, కరెంటు బిల్లు చూపించాలి. సామాజిక లేదా ఉద్యోగ పింఛన్లు తీసుకునే వారు ఆ వివరాలు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు గుర్తింపు కార్డు చూపాలి. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉంటే మంచిది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. తర్వా త సర్వేలో అదనపు వివరాలు చేర్చవచ్చు... అవసరమైతే తొలగించుకోవచ్చు. ప్రభుత్వం అధికారి కంగా మూడు కేటగిరీలకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. ఎన్యూమరేటర్లుగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది... ఆసుపత్రులలో ఉన్నవారు, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు సర్వే సమయంలో లేకపోయినా వారి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఈ జిల్లాలో ఉంటే వారి స్వగ్రామానికైనా వెళ్లవచ్చు. లేదా ఇక్కడే నమోదు చేసుకోవచ్చు. స్టిక్కర్లొచ్చేశాయి.. సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా సర్వే నిర్వహించేవారిని, పర్యవేక్షించేవారిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. సర్వే పూర్తయిన తర్వాత డాటాఎంట్రీకి అవసరమైన సామగ్రి, సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టుకుంది. అయితే, సర్వేను పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఓ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు. ఈ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఇలంబరితి చెపుతున్నారు. జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్ల స్టిక్కర్ల పంపిణీ పూర్తయిందని, ఒకవేళ మిగిలిన ప్రాంతాల్లోని ఏ ఇంటికయినా ఇప్పటికీ స్టిక్కర్ వేయకపోతే సంబంధిత తహశీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ ‘సాక్షి’తో చెప్పారు. ఖమ్మంలో మాత్రం చివరి వరకు స్టిక్కర్ల పంపిణీ జరుగుతుందని అధికారుల అంచనా. అయితే, ఈ సర్వేలో ఓ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడమే మంచిదని, ఏదో అపోహతో సమాచారాన్ని ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ‘సాక్షి’ వంతు ప్రయత్నం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెపుతున్న తరుణంలో జిల్లాలోని ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ‘సాక్షి’ తన వంతు ప్రయత్నం చేసింది. జిల్లాలో ఉన్న నాలుగు రెవెన్యూ డివిజన్ల అధికారులతో శుక్రవారం ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 100 మందికిపైగా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం గంట పాటే సాగిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవోలు ఓపికగా సమాధానాలు చెప్పి వారికున్న సందేహాలను తీర్చారు. -
19న ఇళ్లలోనే ఉండండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న ఒకే రోజు నిర్వహిస్తున్న సమగ్ర సర్వే - 2014ను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి జిల్లా ప్రజలను కోరారు. ఆ రోజున అందరూ ఇళ్లలోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వేనే ప్రాతిపదిక అవుతుందని చెప్పారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లోని 8,07,725 కుటుంబాలను సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకే సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన అన్ని వివరాల నమోదుకు ఒక్కో సిబ్బందికి 25 ఇళ్ల చొప్పున కేటాయించామని, జిల్లాలో ఉన్న ఇళ్ల సంఖ్యను బట్టి మొత్తం 26, 266 మంది సిబ్బంది అవసరం అవుతారని చెప్పారు. ఇందుకోసం తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీడీపీవోలు, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు తదితర 24 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే గుర్తించామన్నారు. మిగిలిన సిబ్బంది కోసం జిల్లా కేంద్రంలోని మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని తెలిపారు. అన్ని ఇళ్లను సమగ్రంగా కవర్ చేసేలా రూట్, సెక్టార్ అధికారులను కూడా నియమించామని చెప్పారు. సర్వే కోసం 700 వాహనాలను వినియోగించుకుంటామని, ఇందులో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులను కూడా వాడుతున్నామని తెలిపారు. సర్వే పూర్తిగా ప్రభుత్వ సిబ్బందే చేస్తారని, ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులను ఇందుకోసం వినియోగించడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరినీ కవర్ చేస్తాం... జిల్లాలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కవర్ చే స్తామని కలెక్టర్ ఇలంబరితి స్పష్టం చేశారు. సొంత ఇల్లు ఉన్నా, లేకున్నా, మురికివాడల్లో నివాసమున్నా... అందరినీ సర్వే చేస్తామని చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో లేని వారి వివరాలు రికార్డు చేయబోమని, బోగస్ రికార్డులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వే చేసిన ఇళ్లకు స్టిక్కర్లు ఇస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన తర్వాత ఒక్కో సిబ్బందికి ఇచ్చే 25 కుటుంబాలకు సంబంధించిన బుక్లెట్లను మండల స్థాయిలో ఒక చోటకు చేర్చి పోలీస్ బందోబస్తు పెడతామని, మరుసటి రోజున డేటా బేస్ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా సర్వేలో తప్పిపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఒక్క రోజు చేసినా 99.9శాతం సర్వే పూర్తవుతుందని, అలాంటివి ఏవైనా తమ దృష్టికి వస్తే పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సర్వే జరిగే రోజున సెలవుదినంగా ప్రకటిస్తామన్నారు. రూ. 2 కోట్లు విడుదల.. సమగ్ర సర్వే కోసం జిల్లాకు రూ.2 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పది జిల్లాల్లో సర్వే కోసం రూ.20 కోట్ల నిధులిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి. ఆచార్య సోమవారం ఉత్తర్వులిచ్చారు.