సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మరో మూడు రోజులు...కేవలం 72 గంటలు.... మన కుటుంబ సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం వద్దకు చేర్చే సమగ్ర సర్వేకు ఉన్న గడువు ఇది. ఈ గడువులోనే జిల్లా ప్రజానీకం సర్వేకు సిద్ధం కావాల్సి ఉంది. సర్వేలో చూపించాల్సిన కాగితాలు, చెప్పాల్సిన వివరాలను ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు సులువుగా ఉంటుందని అధికారులు చెపుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సర్వేపై ఎవరి అభిప్రాయం... చర్చ ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం జిల్లాలో ఈ సర్వే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేసుకుపోతున్నారు. కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం సర్వేను పకడ్బందీగా నిర్వహించేందకు సిద్ధమవుతోంది.
ఎన్యూమరేటర్ల నుంచి ఇంటింటికీ స్టిక్కర్ల వరకు... సర్వే ఫార్మాట్ల నుంచి డాటా ఎంట్రీ వరకు అన్ని దశలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన లక్షలాది ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించే బృహత్తర ప్రణాళికకు సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో జిల్లాలోని ప్రజలంతా సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండాలని ‘సాక్షి’ కోరుకుంటోంది.
ఎవరి నోట విన్నా... ఇదే మాట
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఏ నోట విన్నా ఇదే చర్చ జరుగుతోంది. ఎక్కడ నలుగురు గుమికూడినా... ఎవరైనా కొత్తవారు వచ్చి ఇంటి తలుపు తట్టినా ఇదే చర్చ.... అసలు ఈ సర్వే ఎందుకు? ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకా? రేషన్‌కార్డులు తీసేసేందుకా? లేదా స్థానిక త నిర్ధారించేందుకా... ఇలా ప్రజల్లో అనేక రకాల సందేహాలకు తావిచ్చిన ఈ సర్వేపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో చాలా మంది సర్వే జరిగి తీరాల్సిందేనని అంటుంటే మరి కొందరు సర్వే వద్దనకపోయినా తమకున్న అనుమానాలను మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సర్వే విషయంలో కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవడం, ఆ తర్వాత కొందరు సర్వేను నిలిపివేయాలని కోర్టుకు వెళ్లడంతో సర్వే జరుగుతుందా లేదా అనే సందేహం వచ్చినా, ఆ తర్వాత సర్వే నిలిపివేయలేమని కోర్టు చెప్పడం... సర్వేలో సమాచారం ఇవ్వడం అనేది ప్రజల ఐచ్ఛికమేనని ప్రభుత్వం చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వే జరుగుతుందనే నిర్ధారణకు వచ్చారు ప్రజలు.
అధికారులు ఇళ్లకు వస్తే చూపించాల్సినవి ఇవే...
సర్వే చేసే సమయంలో ప్రతి ఒక్కరు రేషన్, ఆధార్‌కార్డు, ఇంటిపన్ను రశీదు, భూమి పట్టా కాగి తం, కరెంటు బిల్లు చూపించాలి. సామాజిక లేదా ఉద్యోగ పింఛన్లు తీసుకునే వారు ఆ వివరాలు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు గుర్తింపు కార్డు చూపాలి. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉంటే మంచిది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. తర్వా త సర్వేలో అదనపు వివరాలు చేర్చవచ్చు... అవసరమైతే తొలగించుకోవచ్చు.
ప్రభుత్వం అధికారి కంగా మూడు కేటగిరీలకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. ఎన్యూమరేటర్లుగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది... ఆసుపత్రులలో ఉన్నవారు, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు సర్వే సమయంలో లేకపోయినా వారి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఈ జిల్లాలో ఉంటే వారి స్వగ్రామానికైనా వెళ్లవచ్చు. లేదా ఇక్కడే నమోదు చేసుకోవచ్చు.
స్టిక్కర్లొచ్చేశాయి..
సర్వే నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా సర్వే నిర్వహించేవారిని, పర్యవేక్షించేవారిని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది. సర్వే పూర్తయిన తర్వాత డాటాఎంట్రీకి అవసరమైన సామగ్రి, సిబ్బందిని కూడా రెడీ చేసి పెట్టుకుంది. అయితే, సర్వేను పకడ్బందీగా నిర్వహించడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఓ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు.
ఈ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఇలంబరితి చెపుతున్నారు. జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్ల స్టిక్కర్ల పంపిణీ పూర్తయిందని, ఒకవేళ మిగిలిన ప్రాంతాల్లోని ఏ ఇంటికయినా ఇప్పటికీ స్టిక్కర్ వేయకపోతే సంబంధిత తహశీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ ‘సాక్షి’తో చెప్పారు. ఖమ్మంలో మాత్రం చివరి వరకు స్టిక్కర్ల పంపిణీ జరుగుతుందని అధికారుల అంచనా. అయితే, ఈ సర్వేలో ఓ కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడమే మంచిదని, ఏదో అపోహతో సమాచారాన్ని ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెపుతున్నారు.
‘సాక్షి’ వంతు ప్రయత్నం
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం చెపుతున్న తరుణంలో జిల్లాలోని ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ‘సాక్షి’ తన వంతు ప్రయత్నం చేసింది. జిల్లాలో ఉన్న నాలుగు రెవెన్యూ డివిజన్ల అధికారులతో శుక్రవారం ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 100 మందికిపైగా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కేవలం గంట పాటే సాగిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవోలు ఓపికగా సమాధానాలు చెప్పి వారికున్న సందేహాలను తీర్చారు.
‘సర్వే’ జనా..
Published Sat, Aug 16 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement