రూ.25 కోట్ల తాగునీటి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ | drinking water project grant to manuguru municipality | Sakshi
Sakshi News home page

రూ.25 కోట్ల తాగునీటి ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

Published Fri, Aug 29 2014 2:37 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

drinking water project grant to manuguru municipality

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మణుగూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి గండం గట్టెక్కబోతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి చొరవతో మణుగూరు పట్టణ తాగునీటి ప్రాజెక్టు పనులకు మరో రెండు, మూడు రోజుల్లో ఒప్పందాలు పూర్తి కానున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనల రూపం దాల్చిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని భూ కొనుగోలు పథకం ద్వారా సేకరించేందుకు పురపాలక శాఖ కమిషనర్ అంగీకరించడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

 ప్రపంచ బ్యాంకు సాయంతో నిర్మిస్తున్న ఈ పథకానికి ఇప్పటికే రూ.25.56 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, ఈ ప్రాజెక్టుకు అవసరమైన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మించేందుకు భూమి సమస్య ఏర్పడడంతో గత ఏడాదిన్నరగా ఈ పనులు అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు ఆ భూమి సమస్య కూడా తీరడంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలతో రెండు, మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభిస్తామని జిల్లా అధికారులు చెబుతున్నారు.

 ప్రాజెక్టు స్వరూపం ఇది....
 మణుగూరు మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వాటర్ ప్రాజెక్టు కోసం 2009లో ప్రతిపాదనలు తయారుచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే తయారయిన ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన రూ.25.56 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ 2013 ఫిబ్రవరిలో ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 3 ఎకరాల 4 కుంటల భూమిని జిల్లా అధికారులు మున్సిపాలిటీకి అప్పగించేశారు.

 గోదావరి ఒడ్డునే ఉన్న చినరాయిగూడెంలో అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ఇన్‌టేక్‌వెల్ నిర్మాణం కోసం కేటాయించారు. అయితే, అందులో ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి కేవలం ఎకరం 19 కుంటలే సరిపోతుందని అధికారుల అంచనా. అయినా, మిగిలే దాదాపు రెండెకరాల భూమిని కూడా మణుగూరు మున్సిపాలిటీ  పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 11న అప్పటి కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ శంకుస్థాపన కూడా చేశారు. అప్పటికే ఈ ప్రాజెక్టు మొదటి ఫేస్‌కు సంబంధించి టెండర్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మాణం కోసం భూ సేకరణ విషయంలో సమస్య ఏర్పడడంతో ప్రాజెక్టు నిర్మాణమే నిలిచిపోయింది.

 17 కుంటల భూమి...  25 కోట్ల ప్రాజెక్టు
 ఇంతకీ ఈ వాటర్‌ప్లాంటు నిర్మాణానికి సమస్యగా మారిన భూమి ఎంతంటే.. కేవలం 17 కుంటలే. ఈ భూమిని కమలాపురం వద్ద సేకరించి అక్కడే ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ ఆ మేరకు ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. కానీ, ఆ భూమిలో ఇతర ప్రైవేటు వ్యక్తులు ఉండడంతో వారు అభ్యంతరం చెప్పారు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన సమయంలో ప్రస్తుత కలెక్టర్ ఇలంబరితి పురపాలక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.


 ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనిపై శ్రద్ధ చూపడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక కృషి జరిపారు. దీంతో ఈ భూమిని భూ కొనుగోలు పద్ధతిన సేకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు భూమి సమస్య కూడా తీరడంతో మరో రెండేళ్లలో పనులు పూర్తయిపోతాయని అధికారులు చెపుతున్నారు. పనులు ప్రారంభం అయితే, వీలైనంత త్వరగా పూర్తిచేసి మున్సిపాలిటీలోని 10వేలకు పైగా కుటుంబాలకు 24 గంటల నీటిసరఫరాను అందుబాటులోనికి తెస్తామని వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement