‘తెలంగాణ’కే మాఫీ | loan waiver only for telangana people | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’కే మాఫీ

Published Fri, Sep 12 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

loan waiver only for telangana people

ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో పంటరుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు దశల్లో అర్హుల జాబితాను తుది రూపునకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న జిల్లా యంత్రాంగం కొత్త అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన తుది అర్హుల జాబితాను రెండు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి బ్యాంకర్లను ఆదే శించారు.

గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రుణమాఫీ, ఆధార్ అనుసంధానంపై జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అర్హుల జాబితా రూపకల్పనలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు మాత్రమే జిల్లాలో రుణమాఫీ వర్తింపజేయాలని, అది కూడా తెలంగాణ రికార్డుల్లో నమోదై ఉన్న భూమి అయి ఉండాలని చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల భూ వివరాలతో ఆధార్‌కు అనుసంధానాన్ని పది రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు.

పంట రుణాల మాఫీ వర్తించే జాబితాపై గ్రామాల్లో సామాజిక తనిఖీని వేగవంతం చేసి రెండు రోజుల్లో ముందస్తు జాబితాను సిద్ధం చేసి పంపాలని , మిగిలిన రైతుల నుంచి ఆధార్ నంబర్లు స్వీకరించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలను సరిచూసుకుని రైతుల చివరి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రుణమాఫీ పట్టికలో రైతుల పేర్లకు ఎదురుగా భూమికి సంబంధించిన వివరాలు, పాస్ పుస్తకం నంబర్, ఖాతా నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు.

సత్తుపల్లి, తల్లాడ, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మండలాల్లో రైతుల జాబితా తయారీలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పంట రుణమాఫీ పొందాలంటే ఆ రైతు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తుండాలని, భూములు కూడా తెలంగాణలోనే ఉండాలని స్పష్టం చేశారు.

రీ షెడ్యూల్ చేసిన రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, అయితే ఈ విషయంపై ఏం చేయాలన్నది ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఒకరైతు ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొంది ఉంటే... ఎక్కువ మొత్తం రుణంగా పొంది ఉన్న బ్యాంకులో రుణమాఫీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండో ప్రాధాన్యతగా మొదటిసారి రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాలన్నారు. నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ రుణాలు పంటల కోసమే తీసుకున్నట్టుగా రైతుల నుంచి ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే అర్హుల జాబితాలో చేర్చాలని సూచించారు.  

ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ధనుంజయ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ జీఎం నారాయణ, డీసీసీబీ సీఈవో నాగచెన్నారావు, వ్యవసాయ శాఖ జేడీ భాస్కర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీవోలు సంజీవరెడ్డి, అంజయ్య, అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement