Waiver of crop loans
-
రుణమాఫీకి ప్రభుత్వం సమాయత్తం
సాక్షి, ఖమ్మం : పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్ష పంట రుణాన్ని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష పంట రుణాలను నాలుగు విడతలుగా 2017 నాటికి ప్రభుత్వం మాఫీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూడా పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. (ఇది ప్రగతిశీల బడ్జెట్ ) గత రుణమాఫీ ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రుణమాఫీని పటిష్టంగా అమలు చేసేందుకు విధి విధానాలను, మార్గ దర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంచనాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకోసం ప్రాథమికంగా జిల్లాలవారీగా రైతులు 2018, డిసెంబర్ 1వ తేదీ నాటికి తీసుకున్న పంట రుణాల బకాయిల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్లకు వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకు కంట్రోల్ కార్యాలయాలు జిల్లా బ్యాంకులకు పంట రుణ బకాయిల సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. (తెలంగాణ రైతులకు శుభవార్త) ఇదే అంశాన్ని ఖమ్మం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు కూడా జిల్లాలోని బ్యాంక్‌లను రైతుల పంట రుణ బకాయిల వివరాల నివేదికలను అందించాలని కోరారు. జిల్లాలో పంట రుణాలు అందించిన బ్యాంకుల్లో ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)తో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఆంధ్రాబ్యాంక్(ఏబీ)తో పాటు పలు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి రూ.లక్ష లోపు పంట రుణ బకాయిలు కలిగిన వివరాలను సేకరిస్తున్నారు. (లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్) రుణం పొందిన రైతులు 2.63 లక్షలు జిల్లాలో మొత్తం రైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. అయితే, వారిలో 2,63,434 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వం నిర్ణయించిన 2018 డిసెంబర్ నాటికి రూ.2,324 కోట్ల వరకు పంట రుణాలు తీసుకున్నారు. 2014లో ప్రకటించిన రుణమాఫీ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.59 లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హత సాధించారు. ఈ మొత్తం రైతులకు రూ.1,636 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లాలో 2.28 లక్షల మంది రైతులుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.31 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. గత రుణమాఫీలో ఒక రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే, గత రుణమాఫీ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 17 వేల మంది అర్హులైన రైతులకు సుమారు రూ.84 కోట్లు మాఫీ వర్తించలేదు. గత రుణమాఫీ ప్రక్రియను మండల స్థాయిలో తహసీల్దార్లు, మండల అధికారులు, బ్యాంకర్లు ఓ బృందంగా ఏర్పడి జాబితాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న తప్పిందంతో అర్హులైన రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి పలుసార్లు వెళ్లింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇలాంటి తప్పిదాలకు తావు లేకుండా రుణమాఫీ ప్రక్రియ జరగాలని రైతులు కోరుకుంటున్నారు. మార్గదర్శకాలు వెలువడితే జాబితా సిద్ధం ప్రభుత్వం రుణమాఫీకి మార్గదర్శకాలను తయారు చేసి వెలువరిస్తే అర్హులైన రైతుల జాబితాలను తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన రైతుల రుణమాఫీ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల ఆధారంగా ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసే అవకాశం ఉంది. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం 2018 డిసెంబర్ 1వ తేదీ నాటికి పంట రుణాల బకాయిల వివరాలను బ్యాంకుల వారీగా సేకరించే ప్రక్రియను ప్రారంభించాం. మూడు, నాలుగు రోజుల్లో పంట రుణ బకాయిల వివరాలు బ్యాంకుల నుంచి అందే అవకాశం ఉంది. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తాం. చింతా చంద్రశేఖర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఖమ్మం -
రుణ మాఫీ..వడ్డీకే సరి
దశలవారీగా మాఫీ అని ఎన్నికలప్పుడు చెప్పలేదు టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలను పట్టించుకోరు కాంగ్రెస్‌కు నాయకులు దొరకడంలేదు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి హయగ్రీవాచారి గ్రౌండ్లో భారీ బహిరంగసభ వరంగల్ : అధికారంలోకి వస్తే పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దశల వారీగా రుణాలు మాఫీ చేయడం వల్ల వడ్డీ పెరిగిపోయిందని, మాఫీ మొత్తం వడ్డీకే సరిపోతోందని ఆయన పేర్కొన్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని.. రైతులు రుణాలు చెల్లించవద్దని సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఒకేసారి కాకుండా దశల వారీగా నాలుగుసార్లు మాఫీ చేస్తానని సాధారణ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. పంట రుణాలు పూర్తిగా మాఫీ కాకపోవడంతో అవి రెన్యువల్ కాలేదని, పంట బీమా పథకం అమలుకాని పరిస్థితి నెలకొందని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర రావడంలేదని, ఈ పరిస్థితులలో వరంగల్ జిల్లాలోనే 150 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓటు వేస్తే ప్రజల ఇబ్బందులను పట్టించుకోరని చెప్పారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరఫున వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా మూడోరోజు ప్రచారం నిర్వహించారు. బుధవారం వరంగల్ తూర్పు, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ నాయకుడు వీరగోని రాజుకుమార్ ఆధ్వర్యంలో గీసుగొండ ఎంపీటీసీ సభ్యురాలు వీరగోని కవిత, ఊకల్ ఎంపీటీసీ సభ్యురాలు పులిశేరి మంజుల, గీసుగొండ పీఏసీఎస్ చైర్మన్ రాము తదితర నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గీసుగొండ సభలో, సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ప్రజల కోసం ఉప ఎన్నిక వస్తే బాగుండేదని, కేసీఆర్ మోజుపడిన వ్యక్తికి పదవి ఇచ్చేందుకు వచ్చిన ఎన్నిక వల్ల రూ.70 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని అన్నారు. వైఎస్సార్ హయాంలో గీసుగొండ, సంగెం మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువపై రూ.18 కోట్లతో తాగు, సాగునీటి పథకాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వైఎస్సార్ హయంలో రూ.9 కోట్లు విడుదల చేశారని, తర్వాత పాలకులు దీన్ని పట్టించుకోలేదని జగన్ చెప్పారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. 18 నెలల పాలనలో కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని, దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను వరంగల్ ప్రజలు కేసీఆర్‌కు గుర్తుకు చేయాలని సూచించారు. సాధారణ ఎన్నికల హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ నీచమైన పార్టీ అని, కాంగ్రెస్ వాళ్లకు అవసరం ఉంటే దండలు వేస్తారని, అవసరం తీరాక బండలు వేస్తారని జగన్మోహన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం నాయకులు కరువయ్యారని, తెలుగురాని నేతలను తీసుకువచి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోసం, అబద్ధాలు, వెన్నుపోటుతో పాలన సాగిస్తున్న టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. సాధారణ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. పేదల కోసం తపించిన వైఎస్సార్ ఇప్పటికీ అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ మేలు చేసిన వైఎస్సార్ ఆశయాలను కొనసాగించే వైఎస్సార్సీపీకే ఓటు అడిగే హక్కు ఉందని జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎస్టీల రిజర్వేషన్లు ఏవీ : ఎమ్మెల్యే పాయం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్సీపీ శాసనసభపక్ష నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్.. తర్వాత దీన్ని మరిచిపోయారని అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీకి మంచి స్పందన వచ్చిందని, నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు. అందుబాటులో ఉంటాను : సూర్యప్రకాశ్ ప్రతి పేదవాడికి మేలు చేయడం లక్ష్యంగా వైఎస్సార్ ఆశయ సాధన కోసం పనిచేస్తానని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఉప ఎన్నికలో గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వరంగల్‌కు రావడంతోనే వర్షం కురిసిందని, ఇది పార్టీకి ప్రజల్లో ఉన్న సానుకూలతను స్పష్టం చేస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డ్డి, పి.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, మతిన్‌మజాదాది, హెచ్.ఎ.రహెమాన్, గున్నం నాగిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ప్రొగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శులు బి.రఘురాంరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, జి.శ్రీ దర్‌రెడ్డి, ఎం.విలియమ్, బి.శ్రీనివాసరావు, ఎ.కుమార్, షర్మిల సంపత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాడెం శాం తికుమార్, టి.భీమయ్యగౌడ్, సంపత్, సలీం, రాష్ట్ర మైనా ర్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా ముజతబా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బీష్వ రవీందర్, రాష్ట్ర డాక్ట ర్స్ విభాగం అధ్యక్షుడు పి.ప్రపుల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు సంతోశ్‌రెడ్డి, సుమిత్‌గుప్తా, రాష్ట్ర నాయకులు అమర్నాథ్రెడ్డి, సంజీవరావు, వేల్పుల విజయప్రసాద్, క్రిస్టోలైట్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర నాయకులు మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, సందీప్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు ఎం.కళ్యాణ్‌రాజ్, చల్లా అమర్నాథ్రెడ్డి, నెమలిపురి రఘు, డి.దామోదర్‌రెడ్డి, ఎం.అశోక్, కాయిత రాజ్‌కుమార్, సాంబయ్యగౌడ్, కౌటిల్‌రెడ్డి, సంగాల ఇర్మియా, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రకాశ్, బొడ్డు శ్రవణ్, నాగపురి దయాకర్, ఉదయ్, ఆరెపల్లి రాజు, ఎం.సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ’కే మాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్ : జిల్లాలో పంటరుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదు దశల్లో అర్హుల జాబితాను తుది రూపునకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న జిల్లా యంత్రాంగం కొత్త అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన తుది అర్హుల జాబితాను రెండు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి బ్యాంకర్లను ఆదే శించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రుణమాఫీ, ఆధార్ అనుసంధానంపై జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అర్హుల జాబితా రూపకల్పనలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు మాత్రమే జిల్లాలో రుణమాఫీ వర్తింపజేయాలని, అది కూడా తెలంగాణ రికార్డుల్లో నమోదై ఉన్న భూమి అయి ఉండాలని చెప్పారు. రుణమాఫీ పొందే రైతుల భూ వివరాలతో ఆధార్‌కు అనుసంధానాన్ని పది రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. పంట రుణాల మాఫీ వర్తించే జాబితాపై గ్రామాల్లో సామాజిక తనిఖీని వేగవంతం చేసి రెండు రోజుల్లో ముందస్తు జాబితాను సిద్ధం చేసి పంపాలని , మిగిలిన రైతుల నుంచి ఆధార్ నంబర్లు స్వీకరించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అన్ని వివరాలను సరిచూసుకుని రైతుల చివరి జాబితాను సిద్ధం చేయాలన్నారు. రుణమాఫీ పట్టికలో రైతుల పేర్లకు ఎదురుగా భూమికి సంబంధించిన వివరాలు, పాస్ పుస్తకం నంబర్, ఖాతా నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సత్తుపల్లి, తల్లాడ, ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మండలాల్లో రైతుల జాబితా తయారీలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పంట రుణమాఫీ పొందాలంటే ఆ రైతు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తుండాలని, భూములు కూడా తెలంగాణలోనే ఉండాలని స్పష్టం చేశారు. రీ షెడ్యూల్ చేసిన రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, అయితే ఈ విషయంపై ఏం చేయాలన్నది ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. ఒకరైతు ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో రుణం పొంది ఉంటే... ఎక్కువ మొత్తం రుణంగా పొంది ఉన్న బ్యాంకులో రుణమాఫీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండో ప్రాధాన్యతగా మొదటిసారి రుణం పొందిన బ్యాంకుకు ఇవ్వాలన్నారు. నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు పొందిన అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఇక బంగారం విషయానికి వస్తే ఆ రుణాలు పంటల కోసమే తీసుకున్నట్టుగా రైతుల నుంచి ధ్రువీకరణ తీసుకున్న తర్వాతే అర్హుల జాబితాలో చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రాబ్యాంకు డీజీఎం ధనుంజయ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ జీఎం నారాయణ, డీసీసీబీ సీఈవో నాగచెన్నారావు, వ్యవసాయ శాఖ జేడీ భాస్కర్‌రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీవోలు సంజీవరెడ్డి, అంజయ్య, అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బంగారుణం బెంగ
పంట రుణాల మాఫీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో రైతులు అమోమయానికి గురవుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని సర్కారు ప్రకటించిన నేపథ్యంలో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. - గంగాధర - జిల్లాలో బంగారం రుణాలు రూ.234.63 కోట్లు - గ్రామాల్లో ఇవ్వరు.. పట్టణాల్లో తీసుకుంటే చెల్లదు - రుణమాఫీపై రోజుకో ప్రకటనతో రైతుల్లో ఆందోళన గంగాధర : గ్రామాల్లోని చాలా బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టుకొని వ్యవసాయానికి పంటరుణాలు ఇవ్వలేదు. ఉదాహరణకు.. గంగాధర మండలంలో ఎస్‌బీహెచ్‌తో పాటు గర్శకుర్తి, బూర్గుపల్లి, గంగాధర చౌరస్తాల్లో మూడు దక్కణ్ గ్రామీణ బ్యాంకు శాఖలు, కురిక్యాల, గంగాధరలోని రెండు సహకార సంఘాలు, గంగాధర చౌరస్తాలో కేడీసీసీ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క బ్యాంకు కూడా బంగారంైపై పంటరుణాలు ఇవ్వలేదు. అదే రైతులు బ్యాంకులో బంగారం కుదువ పెడితే సాధారణ రుణాలు ఇచ్చారు. వ్యవసాయానికి బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉంటుంది. స్థానిక బ్యాంకులు బంగారం తాకట్టుపై వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు పట్టణాల్లో ఈ రుణాలు పొందారు. పట్టణ బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఈ నిబంధనతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. కొలిక్కివచ్చేనా.. ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష పంటరుణమాఫీ పథకం అమలు కొలిక్కి రాలేదు. దీంతో కొత్తరుణ ం కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజుల క్రితం గ్రామాల్లో సభలు నిర్వహించి రుణాలు తీసుకున్న రైతుల పేర్లు చదివి , ఆ జాబితాలను పంచాతీల్లో అతికించారు.ప్రస్తుత జాబితాప్రకారం రుణమాఫీ కావడం లేదని, తుది జాబితాను రూపొందిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయినా ఇంతవరకు ఆ జాబితానే లేదు. రుణమాఫీలో తమ పేరు వస్తుందో లేదోనని రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
‘మాఫీ’ ఘోరం
సాక్షి, ఒంగోలు: పంట రుణాల మాఫీపై ప్రభుత్వ దోబూచులాట..రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపుతోంది. బంగారం, పంటలపై తీసుకున్న రుణాలన్నింటిలో కుటుంబానికి రూ.1.50 లక్ష మాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కాస్త రుణమైనా మాఫీ అవుతుందా..? అంటే ఆదీ ఒక పట్టాన తేలడం లేదు. కనీసం, రుణాల రీషెడ్యూల్ చేసి కొత్తరుణాలైనా ఇస్తారా..? అంటే, ‘మాఫీ’ ఘోరం అందుకు బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలేస్తున్నారు. ఎటూ.. ప్రీమియం చెల్లింపు లేకపోవడంతో ఈసారి పంటలబీమా పథ కాన్ని రైతులు కోల్పోయారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతులు ప్రీమియం చెల్లించి బీమా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బ్యాంకులు కొత్తరుణాలను పంపిణీ చేయనప్పుడు.. ప్రీమియం ఏవిధంగా మినహాయింపు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మంది రైతులపై ఉన్న గడువు మీరిన బకాయిల మొత్తం రూ.5.900 కోట్లుండగా, ప్రభుత్వం నిర్దేశించిన 2013 డిసెంబర్ 31లోగా ఉన్న బకాయిలు రూ.3400 కోట్లున్నాయి. రుణమాఫీ అమలుపై ప్రభుత్వం ఆలస్యం చేసిన నిర్వాకానికిగాను ప్రతీరైతుపై 12.5 శాతం వడ్డీ భారం పడింది. సాధారణంగా గడువులోగా చెల్లించే బకాయిలపై 7 శాతం వడ్డీలో ప్రభుత్వ సబ్సిడీ మినహాయిస్తే లబ్ధిదారుడు 4 శాతం వడ్డీ మాత్రమే భరించేవాడు. అయితే, ప్రభుత్వం చేసిన ఆలస్య తప్పిదానికి అదనంగా 8 శాతం వడ్డీని భరించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా రైతుల దగ్గర్నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుంటున్న బ్యాంకర్లు..కొన్ని మండలాల్లో మాత్రం ఆర్బీఐ నిబంధనలంటూ కొన్ని అంశాల్ని లేవనెత్తి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులందుతున్నాయి. -
రుణమాఫీపై కసరత్తు!
ఖమ్మం వ్యవసాయం : పంట రుణాలమాఫీపై బ్యాంకర్లు కసరత్తు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆదేశాల మేరకు బ్యాంకర్లు పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితా, వ్యవసాయ భూమి పాస్‌బుక్ ఆధారంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల జాబితాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. జిల్లాలో 4,56,286 మంది రైతులు రూ.2,682 కోట్ల పంటరుణాలు తీసుకున్నారని అధికారుల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా పంటరుణాల మాఫీకి అర్హుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ గురువారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. 2014 మార్చి 31 తేదీకి ముందు ఉన్న పంటరుణాల బకాయిలను గుర్తించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 106 సంఘాలకు చెందిన 33 బ్రాంచీలు, ఏపీజీవీబీ, వాణిజ్య బ్యాంకులైన ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఇండియన్‌బ్యాంకు తదితర బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 325 బ్రాంచీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫామ్-ఏ, ఫామ్-బీ, ఫామ్-సీల వారీగా పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నింపే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి చేపట్టారు. జిల్లాలోని ఏడు ముంపు మండలాల బ్యాంకుల్లో పంట రుణాల మాఫీని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. నిర్ణీత సమయంలో నమోదయ్యేనా..? రైతుల రుణాల వివరాలను శనివారం సాయంత్రంలోగా తామిచ్చిన ప్రఫార్మా ప్రకారం అందజేయాలని కలెక్టర్ సూచించారు. కానీ, కంప్యూటర్లు, సిబ్బంది కొరత, ఇతరత్ర కారణాలతో నిర్దేశిత గడువులోగా అది పూర్తయ్యే పరిస్థితి లేదు. అదనంగా మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారి జాబితాలను తయారు చేసి సమర్పిస్తే 24, 25, 26 తేదీల్లో మండలస్థాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హులైన వారి జాబితాపై సమీక్షించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆ తర్వాత సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాలను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. 31వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో జాబితాలను కలెక్టర్‌కు అందజేయాలి. ఆ తర్వాత రుణమాఫీకి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ ఇది నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా లేదనే ఆరోపణ లొస్తున్నాయి. -
రుణమాఫీ పరిమితం
మోర్తాడ్: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీపై మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో రుణమాఫీపై ఒక స్పష్టత వచ్చింది. ఒక కుటుంబంలోని ఒకరి పేరున ఉన్న పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలో లోపు ఉన్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది. ఎన్నికల హామీగా... రైతులకు పంట రుణాల మాఫీపై టీఆర్ఎస్ ఎన్నిక ల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమీక్షల అనంతరం రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. బుధవారం రుణమాఫీపై స్పష్టతనిచ్చింది. మార్గదర్శకాలను పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే పరిస్థితి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఒక రైతుకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ అని పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది వరకు రైతులకు పంట రుణాలు మాఫీ కావచ్చని రైతు సంఘాల నాయకులు అంచనా వేశారు. బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం రుణమాఫీ అంచనా రూ. 1,800 కోట్ల వరకు ఉంటుందని తేలింది. రైతుల కుటుంబాల్లో ఉన్న సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉన్నాయి. ఒక రైతు కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉంటే, కుటుంబ యజమాని, అతని భార్య, కొడుకులు, కోడళ్లు ఇతరత్రా కుటుంబ సభ్యులందరి పేర్లపైన వ్యవసాయ భూమి ఉండేలా పట్టాదారు పాసుపుస్తకాలను రైతులు పొంది ఉన్నారు. భూ పరిమితి చట్టానికి లోబడి రైతులు తమ కుటుంబంలోని సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతు కుటుంబంలోని ప్రతి సభ్యుడి పేరు మీద పంట రుణాలు ఉన్నాయి. రైతు పేరున ఉన్న పంట రుణంలో రూ. లక్ష వరకు మాఫీ అని ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేశారు. తీరా మార్గదర్శకాలు వెలువడటం, అందులో ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణం మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య 40 శాతం తగ్గనుంది. రైతు కుటుంబంలో ఒకరికి అంటే యజమాని లేదా అతని భార్య, లేదా కొడుకు పేరున ఉన్న రుణం మాత్రమే రూ. లక్ష వరకు మాఫీ అవుతుంది. రుణమాఫీ వర్తింపు కుటుంబాన్ని యూనిట్‌గా చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో పాటు మాఫీ మొత్తం తగ్గనుంది. రైతు కుటుంబంలో యజమాని అతని భార్య, కొడుకులు, కోడళ్లు వేరువేరుగా ఉంటే మాత్రం, కొన్నిచోట్ల లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రుణమాఫీకి రేషన్‌కార్డును, ఆధార్‌కార్డును లింక్ చేయనుండటంతో లబ్ధిదారులలో బోగస్ ఉండే అవకాశం లేకుండా పోనుంది. ఏది ఏమైనా ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గనుందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు... 2014 మార్చి 31లోపు బకాయిగా ఉన్న వాటికే వర్తింపు ఎన్ని బ్యాంకులలో రుణాలు ఉన్నా వడ్డీతో కలిపి రూ. లక్ష వరకే మాఫీ పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు మాత్రమే మాఫీ -
బీ(ధీ)మా పాయే..!
- ముగిసిన బీమా పథకం ప్రీమియం గడువు - పభుత్వం దోబూచులాటతో నష్టపోయిన రైతులు - బాధితులు అక్షరాలా 7.5 లక్షల మంది సాక్షి, ఒంగోలు : రైతుకు కలిసొచ్చే కాలం కరిగిపోతోంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటనష్టపోయినప్పుడు ఆదుకునే వాతావరణ బీమా పథకం ఈ ‘సారీ’ చేజారిపోయినట్టే. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద రైతు రిజిస్ట్రేషన్ గడువు గురువారంతో ముగిసింది. వాస్తవానికి బ్యాంకు నుంచి రైతు రుణం తీసుకునే సమయంలోనే బీమా పథకం ప్రీమియాన్ని మినహాయిస్తారు. అలాంటిది ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి రైతులు రుణాలు పొందకపోవడంతో బీమా రిజిస్ట్రేషన్లు అవకాశం కలగలేదు. పంటరుణాల మాఫీ, రుణాల రీషెడ్యూల్ అమలుపై చంద్రబాబు ప్రభుత్వం రోజుకో తీరుగా ప్రకటనలు చేస్తూ రైతుల జీవితాలతో దోబూచులాటడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార టీడీపీ ఆదిలోనే రైతుల్ని అన్ని విధాలా దగా చేయడంపై విపక్షాలతోపాటు ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు కన్నీరే.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న జిల్లా రైతులకు ఈ ఖరీఫ్ కన్నీళ్లే మిగల్చనుంది. జిల్లా నలువైపులా పంటల సాగు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వర్షాధారం, నీటి ఆధారం, వాతావరణ పరిస్థితులపై నడిచే సాగు ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. అలాంటి దుర్భిక్ష జిల్లాలో రైతులు వివిధ కారణాలతో ఏటా పంటనష్టాన్ని చవిచూసినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా గత ప్రభుత్వాలు బృహత్తర బీమా పథకాన్ని అమలు చేశాయి. ప్రధాన పంటలైన వరి, సజ్జ, మొక్కజొన్న, కంది, ఆముదం, మిరప (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), పత్తి (వాతావరణ ఆధారితం) వంటి వాటికి బీమా పథకాన్ని వర్తింపజేశాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పంటల బీమా పథకంలో మార్పులు తెచ్చారు. అప్పట్లో మండలం యూనిట్‌గా అమలయ్యే పథకాన్ని మార్పుచేసి.. గ్రామం యూనిట్‌గా వర్తింపజేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఖరీఫ్‌లో సాగయ్యే పంట విస్తీర్ణం 2.89 లక్షల హెక్టార్లుకాగా, ఇందులో పత్తి 3,096 హెక్టార్లు, వేరుశనగ 2,091 హెక్టార్లు, కంది 6,963 హెక్టార్లు సాగు చేస్తున్నారు. వర్షాభావంతో వేరుశనగ పంట అప్పుడే ఎండిపోయే దశకొచ్చింది. ఎండిపోతున్న పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించి ఉంటే నష్టపరిహారమన్నా వచ్చేదన్న భావన రైతుల్లో ఉంది. కలగా మారిన ‘మాఫీ’ ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణ మాఫీ చేస్తామని ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త రుణాలు కూడా ఇప్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తమకు కొత్త రుణాలొస్తాయని.. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించవచ్చనే ఆశతో రైతులు ఇంతకాలం ఎదురు చూశారు. కానీ పంట రుణాల మాఫీ, కొత్త రుణాల రీషెడ్యూల్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. బ్యాంకర్లు 2013-14లో కరువు ప్రభావిత 45 మండలాల్లో 2 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను రీ షెడ్యూల్ చేయలేదు. ఇక మిగిలిన 4 లక్షల మంది రైతులు పంట రుణాలుగా తీసుకున్న రూ.6,900 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధనరూపంలో అందిస్తే ఆ రుణాల్ని మాఫీ చేయగలమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతు ఖాతాల్లోని డిపాజిట్లను జప్తు చేస్తున్నారు. ఈ ఏడాది పంట రుణాలుగా రూ.3 వేల కోట్లు పంపిణీ చేయాలని బ్యాంకర్లు అంచనా వేయగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. బీమాప్రీమియం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31 (గురువారం) గడువు విధించింది. ఈ ఏడాది పంట రుణమే ఇవ్వనప్పుడు బ్యాంకర్లు ప్రీమియం మినహాయించే అవకాశం లేకపోవడంతో జిల్లా రైతులంతా బీమాపథకం వర్తింపును కోల్పోయారు. వ్యవసాయంపై మమకారం లేని ప్రభుత్వ విధానాలపై ఉద్యమించక తప్పదని ప్రధాన ప్రతిపక్షంతో పాటు రైతు సంఘాల నేతలు సన్నద్ధమవుతున్నారు. -
రుణమే బంగారమాయే
- తాజా ప్రకటనతో ఊరట - తాకట్టులో రూ.284 కోట్లు - 28,083 మంది రైతులకు ఊరట - మొత్తంగా రూ.2,984 కోట్ల మాఫీ - జిల్లాలో 5.05 లక్షల మందికి లబ్ధి బంగారం తాకట్టు పెట్టిన రైతులకు ఊరట లభించింది. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో రుణమాఫీ అయోమయానికి తాత్కాలికంగా తెరపడింది. తాజా ప్రకటనతో జిల్లాలో మొత్తం 5.05 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా రూ.2984 కోట్లు మాఫీ కానున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే రుణమాఫీ పథకం గందరగోళానికి తెరలేపింది. కేవలం గత ఏడాది తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తామని, పాత బకాయిలు పరిగణనలోకి తీసుకోరని, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదంటూ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించటంతో పాటు అదే కోణంలో బ్యాంకర్ల నుంచి సమాచారం కోరింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బెజ్జంకి మండలంలో తన రుణం మాఫీ కావటం లేదనే మానసిక వ్యథతో ఒక రైతు గుండెపోటుతో చనిపోగా.. ఎల్లారెడ్డిపేట మండలంలో మరొక తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, నిర్ణీత గడువు నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మరింత స్పష్టమైన వివరణ ఇచ్చింది. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని, శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో జిల్లాలోని బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టిన రైతులు సైతం ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. మొత్తంగా దాదాపు అయిదు లక్షల మందికి రుణమాఫీ వర్తించనుంది. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 28,083 మంది రైతులు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. మార్చి 31 వరకు బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాల మొత్తం రూ.284 కోట్లు. గత ఏడాది వ్యవధిలోనే బంగారంపై రూ.70 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. తాజా నిర్ణయంతో ఈ రుణాలన్నీ మాఫీ అయ్యే అవకాశముందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో మొత్తం రూ.4,122 కోట్ల రుణాలు రైతుల పేరిట ఉన్నాయి. వీటిలో రూ.2,700 కోట్లు పంట రుణాలు కాగా.. మిగతావి వ్యవసాయ, అనుబంధ టర్మ్ రుణాలు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను సైతం టర్మ్ రుణాలుగానే పరిగణిస్తారు. టర్మ్ రుణాలకు రుణమాఫీ వర్తించే అవకాశం లేకున్నా... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తంగా జిల్లాలో 4,77,663 మంది రైతులు వీటి పరిధిలో పంట రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రైతుల పేరిట ఉన్న పంట రుణాల మొత్తం రూ.2,700 కోట్లు. వీటితో పాటు బంగారం రుణాలు కలిపి.. మొత్తంగా రూ.2,984 కోట్లు మాఫీ చేసేందుకు సర్కారు నడుం బిగించింది. దీంతో జిల్లాలో మొత్తం 5,05,746 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. -
రైతు రుణాలు.. 12,598 కోట్లు!
ప్రభుత్వానికి బ్యాంకర్ల నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పంట రుణాల మాఫీ విషయంలో కొంత స్పష్టత వచ్చింది. లక్ష లోపు రుణాలెన్ని అనే విషయంలో బ్యాంకర్లు దాదాపు తుది అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి వారు ప్రత్యేక నివేదికను కూడా అందించినట్టు తెలిసింది. ఈ నివేదిక ప్రకారం లక్ష లోపు అన్ని రకాల పంట రుణాలు సుమారు రూ.12,598 కోట్లున్నట్టు అంచనా. ఎన్నికల హామీ మేరకు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. 2013-14లో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపజేయాలని మొదట్లో భావించారు. దానిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అందులో భాగంగా లక్ష లోపు అన్ని రకాల పంట రుణాలెంత అనేదానిపై ప్రత్యేక నివేదిక అందించాల్సిందిగా బ్యాంకర్లకు ప్రభుత్వం సూచించింది. అందుకనుగుణంగా బ్యాంకర్లు రుణాలపై సమాచారాన్ని సేకరించాయి. వారి అంచనా ప్రకారం మొత్తం రూ.12,598 కోట్లని తేలింది. వీరిలో 2013-14 ఏడాది పంట రుణాలను తీసుకున్న 16.68 లక్షల మంది రైతులు కూడా ఉన్నారు. వీరి రుణాలను రూ.7 వేల కోట్లుగా తేల్చారు. అలాగే 12.66 లక్షల మందికి చెందిన లక్ష లోపు బకాయిలు (పాత రుణాలు) రూ.4,150 కోట్లని అంచనా వేశారు. బంగారంపై తీసుకున్న రుణాలు మరో రూ.1,448 కోట్లని గుర్తించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసిన బ్యాంకర్లు... ఈ రుణాల అంచనాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం
అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్ : పంట రుణాల మాఫీపై రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని,రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాల పేరుతో రైతులను రోడ్లపైకి తేవడం సరికాదన్నారు. మంత్రులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో పంట రుణాలపై వివరాలను సేకరించ లేక పోయామని, బ్యాంకర్లతో సమావేశమై పూర్తి వివరాలను సేకరించి పంట రుణాల మాఫీ హామీని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. దరలు పెంచే ప్రసక్తే లేదని, ఖరీఫ్‌లో సోయా, పత్తి విత్తనాలు, ఎరువులను సకాలంలో రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో 70వేల క్వింటాళ్లు, ఆదిలాబాద్‌లో 90 వేల క్వింటాళ్ల సోయా విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. రానున్న ఐదేళ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సంక్షేమ ఫలితాలపై పూర్థిస్థాయిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు ఒక రైతుగా అన్ని విషయాలపై అవగాహన ఉందని, రైతులకు అన్ని విధాలు మేలు చేస్తారని, ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలకు రైతులు ఆందోళన చెందవద్దని, ఓపిక పట్టాలని సూచించారు. మంత్రి తొలిసారి ఆర్మూర్ వచ్చిన జోగు రామన్నను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పూలమాలలు, శాలువాతో సన్మానించారు. సమావేశంలో ఇచ్చోడ ఎమ్మెల్యే బాబురావు, నాయకులు ఎల్ఎంబీ రాజేశ్వర్, అల్లూరి గంగారెడ్డి, సుంకరి రంగన్న, సాజీద్ అలీ, చెన్న రవి, నయీం, జలందర్, వినయ్ పాల్గొన్నారు. -
రుణమాఫీపై రాద్దాంతం తగదు
కేసీఆర్ సీఎం కావడం సంతోషకరం: జగ్గారెడ్డి సంగారెడ్డి, న్యూస్‌లైన్: పంట రుణాలమాఫీ అంశాన్ని ఇప్పుడే రాద్దాంతం చేయటం సరికాదని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే తాను స్పందిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మెదక్ జిల్లాకు చెందిన కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన చొరవ చూపాలని కోరారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను విశ్వసించి జిల్లా ప్రజలు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినట్లు ఆయన వివరించారు. -
రుణ మాఫీపై మాట తప్పలేదు: పోచారం శ్రీనివాస్ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, వెనక్కితగ్గే ప్రశ్నే లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యాన పంటల లక్ష్యాలపై శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రుణాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లను కోరామని, మాఫీపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 44 వేల హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధద్రవ్యాలు వంటి ఉద్యాన పంటలను పండించాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు వివరించారు. గత ఏడాది 39 వేల హెక్టార్లు లక్ష్యం కాగా 26 వేల హెక్టార్లలోనే ఉద్యాన పంటలు వేశారని చెప్పారు. ఉద్యానపంటలవైపు మొగ్గుచూపే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటి పరికరాలను సబ్సిడీతో సమకూర్చుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సన్న చిన్నకారు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున పూర్తి సబ్సిడీ అందిస్తాయని వివరించారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. శనివారం నుంచి గ్రామాల్లోనే సోయా విత్తనాల పంపిణీ జరుగుతుందని, ఇప్పటికే లక్షా 10 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను జిల్లాలకు తరలించామన్నారు. ఈ నెల 10లోగా అవసరమైన రైతులందరికీ విత్తనాలు అందిస్తామన్నారు. ఖరీఫ్‌లో 17.44 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.50 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యాన వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. దీనిపై ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ఉద్యాన వర్సిటీ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వర్సిటీ ప్రతిపాదనలను ప్రధానికి అందించనున్నట్లు తెలిసింది. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి: పొన్నాల సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆరు నెలలపాటు టైమిద్దామనుకున్నాం. వాళ్లు అమలు చేసే కార్యక్రమాలను నిశితంగా పరిశీలిద్దామనుకున్నాం. కేసీఆర్ అప్పుడే మనకు చేతినిండా పని కల్పించిండు. షరతులతో కూడిన రుణమాఫీని అమలు చేస్తాన ని రైతులందరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చిండు. మనమంతా రైతుల పక్షాన నిలబడి పోరాడుదాం. మీరు కూడా ఇకపై టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రతిరోజూ ఎండగట్టండి’’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు ఆదేశించారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన అధికారుల ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యలపై అధికార ప్రతినిధులంతా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఇచ్చినమాట మేరకు రైతులందరికీ రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసే వాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీపై ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్దేనన్నారు. మాట తప్పినందుకే ఆత్మహత్యలు: వైఎస్సార్సీఎల్పీ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ, ఎన్నికల్లో లబ్ధిపొంది అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు షరతులు విధించడం తెలంగాణ రైతాంగాన్ని మోసగించడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం దుయ్యబట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిన కారణంగా తెలంగాణలోని రైతాంగం ఆందోళనకు గురవడంతో పాటు అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు పార్టీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉపనేత పాయం వెంకటేశ్వర్లు, విప్ బానోత్ మదన్‌లాల్ నాయక్‌లు సంయుక్తంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలుగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికైనా రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెనక్కు తగ్గితే ప్రజా ఉద్యమమే: కిషన్రెడ్డిసాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయాలని, వెనక్కు తగ్గితే ప్రజా ఉద్యమం చేపడుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఫలితంగా వారు రోడ్డెక్కుతున్నారని చెప్పారు. మరికొంత మంది ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై ముందే సమగ్రంగా కసరత్తు చేయాలని, కానీ ఆ హామీలతో గెలిచాక వాటి అమలుపై షరతులు విధిస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీని కోరినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, రైతులకు విద్యుత్, సాగునీటి ఇబ్బంది, హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణలో సమస్యలపై స్పందించాల్సిందిగా కోరినట్టు పలువురు కేంద్ర మంత్రులను కోరినట్లు వివరించారు. -
రెండో రోజూ రైతన్న పోరు
రుణమాఫీ ఆంక్షలపై ..రాస్తారోకోలు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు పంట రుణాల మాఫీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును నిరసిస్తూ జిల్లాలో రెండు రోజులుగా ఆందోళనలు కొనసాతున్నాయి. 2013 జూన్ నుంచి పంట రుణాలు తీసుకున్న వారికే రుణ మాఫీ వర్తింప చేస్తామనడాన్ని రైతులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇ చ్చినట్లుగా రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశా రు. ముప్కాల్, బుస్సాపూర్‌లోని 44వ నంబరు జాతీ య రహదారిపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆర్మూర్, పెర్కి ట్ శివారులోనూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నందిపేట మండల కేంద్రంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా రాస్తారోకోలు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసి రుణమాఫీపై స్పష్టత ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సదాశివనగర్ మండలం లింగంపేటలో రోడ్డుపై బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి రుణమాఫీపై స్పష్టత వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలోని నసురుల్లాబాద్‌లో రైతులు రోడ్డెక్కి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. వర్ని మండలం గోవూరు గ్రామంలో రైతులు ధర్నా చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా ఆందోళనలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఇతర నాయకులు రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతిపత్రాన్ని సమర్పించారు. పంటరుణాలు మాఫీ చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నాడని విమర్శించారు. -
ఊరించి.. ఉసూరుమనిపించారు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఊరించి ఉసూరుమనిపించినట్లు ఉంది ప్రభుత్వం తీరు. పంట రుణాల మాఫీలో కొన్ని మెలికలు పెడుతూ ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణ మాఫీ కొందరికే వ ర్తించే విధంగా ఉందని వారు పేర్కొంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ ఒకటి తర్వాత ఖరీఫ్, రబీ సీజనుల్లో లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించనుంది. దీంతో రెండు, మూడు ఏళ్లుగా అతివృష్టి, అనావృష్టిల కారణంగా పంట రుణాలు చెల్లించని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. 2013 జూన్ ఒకటో తేదీ తర్వాత పంట రుణాలు తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన జిల్లాలో 2,26,282 మంది రైతులకు సంబంధించి రూ. 1,863.65 కోట్ల పంట రుణాలు మాఫీ కానున్నాయి. పంట రుణాలను రెగ్యులర్‌గా రెన్యువల్ చేయించేవారికే రుణమాఫీ పథకం వర్తిస్తుందన్న మాట. జిల్లాలోని వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు స్వల్ప కాలిక రుణాలతోపాటు, దీర్ఘ కాలిక రుణాలు ఇచ్చాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పంపుసెట్లు, పైప్‌లైన్, వ్యవసాయ పరికరాల కోసం దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చేశాయి. లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకున్నవారికే రుణ మాఫీ పథకం వర్తిస్తుందని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ భూమి ఎంత ఉన్నా లక్ష రూపాయలలోపే రుణాలు తీసుకున్నారు. కొందరు రైతులు మాత్రమే లక్ష రూపాయలకు మించి పంట రుణం పొందారు. ఎలక్షన్ల సందర్భంగా పంట రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో చాలా మంది రైతులు రెండు మూడేళ్లుగా పంట రుణాలు చెల్లించడంలేదు. 2013 జూన్ ఒకటికి ముందుగా పంట రుణం తీసుకున్నవారు రుణం చెల్లిస్తే మాఫీ వర్తించదని భావించి రుణం చెల్లించలేదు. అలాంటి రైతులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే. కాగా ప్రభుత్వం బ్యాంకర్లతో సోమవారం మరో దఫా సమావేశం కానుండడం వారిలో ఆశలను సజీవంగా ఉంచుతుంది. రుణ మాఫీ విషయంలో మార్పు చేర్పులుండవచ్చని వారు భావిస్తున్నారు. రుణ మాఫీ విధి విధానాలు ఖరారైతే స్పష్టత వస్తుంది. ఏది ఏమైనా పంట రుణం మాఫీ విషయం లో ప్రభుత్వం చేసిన ప్రకటన కొందరు రైతులకు సంతోషం కలిగించగా మరి కొందరికి నిరాశను కలిగించింది.