రైతు రుణాలు.. 12,598 కోట్లు!
ప్రభుత్వానికి బ్యాంకర్ల నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పంట రుణాల మాఫీ విషయంలో కొంత స్పష్టత వచ్చింది. లక్ష లోపు రుణాలెన్ని అనే విషయంలో బ్యాంకర్లు దాదాపు తుది అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి వారు ప్రత్యేక నివేదికను కూడా అందించినట్టు తెలిసింది. ఈ నివేదిక ప్రకారం లక్ష లోపు అన్ని రకాల పంట రుణాలు సుమారు రూ.12,598 కోట్లున్నట్టు అంచనా. ఎన్నికల హామీ మేరకు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. 2013-14లో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తింపజేయాలని మొదట్లో భావించారు. దానిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అందులో భాగంగా లక్ష లోపు అన్ని రకాల పంట రుణాలెంత అనేదానిపై ప్రత్యేక నివేదిక అందించాల్సిందిగా బ్యాంకర్లకు ప్రభుత్వం సూచించింది. అందుకనుగుణంగా బ్యాంకర్లు రుణాలపై సమాచారాన్ని సేకరించాయి. వారి అంచనా ప్రకారం మొత్తం రూ.12,598 కోట్లని తేలింది. వీరిలో 2013-14 ఏడాది పంట రుణాలను తీసుకున్న 16.68 లక్షల మంది రైతులు కూడా ఉన్నారు. వీరి రుణాలను రూ.7 వేల కోట్లుగా తేల్చారు. అలాగే 12.66 లక్షల మందికి చెందిన లక్ష లోపు బకాయిలు (పాత రుణాలు) రూ.4,150 కోట్లని అంచనా వేశారు. బంగారంపై తీసుకున్న రుణాలు మరో రూ.1,448 కోట్లని గుర్తించారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసిన బ్యాంకర్లు... ఈ రుణాల అంచనాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని కూడా నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.