ఖమ్మం వ్యవసాయం : పంట రుణాలమాఫీపై బ్యాంకర్లు కసరత్తు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆదేశాల మేరకు బ్యాంకర్లు పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితా, వ్యవసాయ భూమి పాస్‌బుక్ ఆధారంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల జాబితాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు.
జిల్లాలో 4,56,286 మంది రైతులు రూ.2,682 కోట్ల పంటరుణాలు తీసుకున్నారని అధికారుల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా పంటరుణాల మాఫీకి అర్హుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ గురువారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు.
2014 మార్చి 31 తేదీకి ముందు ఉన్న పంటరుణాల బకాయిలను గుర్తించాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని 106 సంఘాలకు చెందిన 33 బ్రాంచీలు, ఏపీజీవీబీ, వాణిజ్య బ్యాంకులైన ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఇండియన్‌బ్యాంకు తదితర బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 325 బ్రాంచీలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫామ్-ఏ, ఫామ్-బీ, ఫామ్-సీల వారీగా పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను నింపే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి చేపట్టారు. జిల్లాలోని ఏడు ముంపు మండలాల బ్యాంకుల్లో పంట రుణాల మాఫీని ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు.
నిర్ణీత సమయంలో నమోదయ్యేనా..?
రైతుల రుణాల వివరాలను శనివారం సాయంత్రంలోగా తామిచ్చిన ప్రఫార్మా ప్రకారం అందజేయాలని కలెక్టర్ సూచించారు. కానీ, కంప్యూటర్లు, సిబ్బంది కొరత, ఇతరత్ర కారణాలతో నిర్దేశిత గడువులోగా అది పూర్తయ్యే పరిస్థితి లేదు. అదనంగా మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారి జాబితాలను తయారు చేసి సమర్పిస్తే 24, 25, 26 తేదీల్లో మండలస్థాయిలో తహశీల్దార్ల అధ్యక్షతన ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి, అర్హులైన వారి జాబితాపై సమీక్షించాలని కలెక్టర్ నిర్ణయించారు.
ఆ తర్వాత సామాజిక తనిఖీ కోసం ఈ జాబితాలను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. 31వ తేదీన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో జాబితాలను కలెక్టర్‌కు అందజేయాలి. ఆ తర్వాత రుణమాఫీకి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ ఇది నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా లేదనే ఆరోపణ లొస్తున్నాయి.
రుణమాఫీపై కసరత్తు!
Published Sat, Aug 23 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement