మోర్తాడ్: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీపై మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో రుణమాఫీపై ఒక స్పష్టత వచ్చింది. ఒక కుటుంబంలోని ఒకరి పేరున ఉన్న పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలో లోపు ఉన్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది.
ఎన్నికల హామీగా...
రైతులకు పంట రుణాల మాఫీపై టీఆర్‌ఎస్ ఎన్నిక ల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమీక్షల అనంతరం రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. బుధవారం రుణమాఫీపై స్పష్టతనిచ్చింది. మార్గదర్శకాలను పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే పరిస్థితి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఒక రైతుకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ అని పేర్కొంది.
ఈ లెక్కన జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది వరకు రైతులకు పంట రుణాలు మాఫీ కావచ్చని రైతు సంఘాల నాయకులు అంచనా వేశారు. బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం రుణమాఫీ అంచనా రూ. 1,800 కోట్ల వరకు ఉంటుందని తేలింది. రైతుల కుటుంబాల్లో ఉన్న సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉన్నాయి. ఒక రైతు కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉంటే, కుటుంబ యజమాని, అతని భార్య, కొడుకులు, కోడళ్లు ఇతరత్రా కుటుంబ సభ్యులందరి పేర్లపైన వ్యవసాయ భూమి ఉండేలా పట్టాదారు పాసుపుస్తకాలను రైతులు పొంది ఉన్నారు.
భూ పరిమితి చట్టానికి లోబడి రైతులు తమ కుటుంబంలోని సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతు కుటుంబంలోని ప్రతి సభ్యుడి పేరు మీద పంట రుణాలు ఉన్నాయి. రైతు పేరున ఉన్న పంట రుణంలో రూ. లక్ష వరకు మాఫీ అని ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేశారు. తీరా మార్గదర్శకాలు వెలువడటం, అందులో ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణం మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య 40 శాతం తగ్గనుంది.
రైతు కుటుంబంలో ఒకరికి అంటే యజమాని లేదా అతని భార్య, లేదా కొడుకు పేరున ఉన్న రుణం మాత్రమే రూ. లక్ష వరకు మాఫీ అవుతుంది. రుణమాఫీ వర్తింపు కుటుంబాన్ని యూనిట్‌గా చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో పాటు మాఫీ మొత్తం తగ్గనుంది. రైతు కుటుంబంలో యజమాని అతని భార్య, కొడుకులు, కోడళ్లు వేరువేరుగా ఉంటే మాత్రం, కొన్నిచోట్ల లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రుణమాఫీకి రేషన్‌కార్డును, ఆధార్‌కార్డును లింక్ చేయనుండటంతో లబ్ధిదారులలో బోగస్ ఉండే అవకాశం లేకుండా పోనుంది. ఏది ఏమైనా ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గనుందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.
ప్రభుత్వ నిబంధనలు...
2014 మార్చి 31లోపు బకాయిగా ఉన్న వాటికే వర్తింపు
ఎన్ని బ్యాంకులలో రుణాలు ఉన్నా వడ్డీతో కలిపి రూ. లక్ష వరకే మాఫీ
పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు మాత్రమే మాఫీ
రుణమాఫీ పరిమితం
Published Sat, Aug 16 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM
Advertisement
Advertisement