Training For One Lakh TRS Workers As Social Media Warriors - Sakshi
Sakshi News home page

TRS Party: ఎదురుదాడికి టీఆర్‌ఎస్‌ స్పెషల్ స్ట్రాటజీ

Published Wed, Nov 30 2022 3:14 AM | Last Updated on Wed, Nov 30 2022 9:40 AM

Training for One lakh TRS workers as social media warriors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సోషల్‌ మీడియా విభాగం బాధ్యులకు ‘సోషల్‌ మీడియా వ్యూహం’పై అవగాహన కల్పించింది. మరోవైపు నియోజకవర్గంలో సోషల్‌ మీడియా వేదికల వినియోగంపై అవగాహన కలిగిన వేయి మంది కార్యకర్తలను గుర్తించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలను ఆదేశించింది.

వీరిని గుర్తించే ప్రక్రియ పూర్తయిన తర్వాత నియోజకవర్గస్థాయిలో శిక్షణ ఇచ్చేలా సన్నాహాలు జరుగుతున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సోషల్‌ మీడియా ద్వారా చేసిన ప్రతికూల ప్రచారం నష్టం కలిగించిందని టీఆర్‌ఎస్‌ గుర్తించింది. సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ చేసే ప్రచార తీరుతెన్నులను విశ్లేషించి, ప్రతివ్యూహాన్ని అమలు చేయడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో పైచేయి సాధించామనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లోనూ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేక పోస్టులు పెరిగే అవకాశం ఉన్నందున దీన్ని తిప్పికొట్టేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రతీ ఓటరుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేర్చేందుకు అవసరమైన ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. 

కంటెంట్‌ వడపోత.. కంటెంట్‌ సృష్టి 
బీజేపీ జాతీయస్థాయి నేతలు మొదలుకుని ఆ పార్టీకి చెందిన బడా, చోటా నేతల పోస్టులు అభ్యంతరకరమైనవిగా పేర్కొంటూ గతంలో టీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు కూడా చేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఇతర ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యపదజాలంతో దూషణలు, కార్టూన్లు, కేరికేచర్లు, మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నవారిని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం గుర్తించే పనిలో పడింది.

వ్యక్తులు, సంఘాలతోపాటు వివిధ పేర్లతో ఉన్న సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ, అనుబంధ సంఘాలు చాపకింద నీరులా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేలా పోస్టులను సృష్టిస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసుందుకు అవసరమైన కంటెంట్‌ తయారీ కోసం కంటెంట్‌ రైటర్లు, కేరికేచరిస్టులు, కార్టూనిస్టులు, గ్రాఫిక్‌ డిజైనర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది.

వీరిలో కొందరు వేతనంపై, మరికొందరు స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతూ పని ప్రారంభించినట్లు సమాచారం. కంటెంట్‌ సృష్టి కోసం కొన్ని బృందాలు, సంస్థల సేవలను తీసుకోవడంపై కూడా టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. విపక్షాలు, టీఆర్‌ఎస్‌ వ్యతిరేకుల నుంచి వస్తున్న కంటెంట్‌ను వడపోయడం, విపక్ష పార్టీలను ఇరకాటంలోకి నెట్టేందుకు అవసరమైన కంటెంట్‌ను సృష్టించడంలో ఈ బృందాలు సేవలను అందిస్తాయి. 

‘సోషల్‌ మీడియా’వారియర్ల గుర్తింపు 
ప్రతీ వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీలను నియమించి ఫోన్‌ నంబర్లతోసహా వారి వివరాలను తెలంగాణభవన్‌లో అందజేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆదేశించారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షలమంది సభ్యులు ఉండగా, వీరిలో నియోజకవర్గానికి 2 వేల నుంచి 3 వేల మందిని ఇన్‌చార్జీలుగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

వీరిలోంచి సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన ఉన్న వేయిమందిని గుర్తించి నియోజకవర్గ స్థాయిలోనే శిక్షణ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సన్నాహాలు చేస్తోంది. పార్టీపట్ల అసత్య ప్రచారం చేస్తున్నవారిపై ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం నిబంధనల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో శిక్షణ ద్వారా అవగాహన కల్పించనుంది. సోషల్‌ మీడియా వేదికల్లో ఉన్న సాంకేతిక అవకాశాలను కూడా ఉపయోగించుకుని అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్‌ ఫొటోలను బ్లాక్‌ చేయాల్సిందిగా రిపోర్ట్‌ చేయడంపైనా శిక్షణ ఇస్తుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement