mortad
-
వలస కార్మికులకు ఉచిత ప్రయాణం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్‌హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్‌హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్‌లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది. ‘సాక్షి’కథనం వల్లే.. వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. – పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా -
‘విజిట్’కు రప్పించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు..
మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తక్కువ ధరకు లభించే బంగారాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ముఠాలు, గల్ఫ్ స్మగ్లర్లతో కలసి ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నాయి. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి తమ దందాకు పావులుగా వాడుకుంటున్నాయి. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన తర్వాత వర్క్ వీసాలు ఇప్పిస్తామని స్మగ్లర్లు నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన యువకులకు తమ పథకంలో భాగంగా ఎలాంటి పని చూపకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పని కోసం వేచిచూసి విసిగిపోతున్న యువకులు తాము ఇంటికి వెళ్తామని చెప్పగానే అలాంటి వారికి బంగారం దాచి ఉంచిన సూట్‌కేసులు, బ్యాగులను ఇచ్చి పంపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో పట్టుబడినప్పుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై అవగాహన లేని అమాయకులు కటకటాల పాలవుతున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు యువకుల నుంచి రూ.4 కోట్ల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన అస్లాం అనే 19 ఏళ్ల యువకుడి నుంచి రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే బంగారం స్మగ్లర్లు తమ దందా కోసం కొత్తగా గల్ఫ్‌కు వెళ్లాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. కంపెనీ వీసాలుంటేనే రండి..: వర్క్ వీసా ఇస్తే కంపెనీలో పని చేసుకుంటారని.. అలా కాకుండా విజిట్ వీసాతో రప్పించి పని చూపకుండా ఖాళీగా ఉంచితే ఇంటికి వెళ్తామని ఆ యువకులే స్వచ్ఛందంగా చెబుతారని స్మగ్లర్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడుతుండగా అనేక సమయాల్లో బంగారం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. కాగా, యూఏఈలో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు సులభంగా దొరకడం లేదని, కంపెనీ వీసాలు ఉంటేనే రావాలని వలస కార్మికుల సంఘాల నాయకులు సూచిస్తున్నారు. స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జైలు పాలుకావద్దని హెచ్చరిస్తున్నారు. -
వలస కార్మికులకు ‘ఖతర్’ కంపెనీ ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): వలస కార్మికులకు ఉచితంగా వీసాలు అందించేందుకు ఖతర్‌లోని ఒక క్యాటరింగ్ కంపెనీ ముందుకొచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తేరుకుంటున్న సమయంలో కార్మికులపై ఆర్థిక భారం పడకుండా వీసాలను ఉచితంగా జారీ చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది. తెలంగాణలోని ఒక లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా వీసా ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఖతర్‌లోని వివిధ కంపెనీలు, విమానయాన రంగానికి ఆహారం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ వలస కార్మికులతో ఖాళీలను భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. కిచెన్ క్లీనింగ్, వెయిటర్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకోసం ఈనెల 30న ఆర్మూర్‌లో, 31న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఆకర్షణీయమైన వేతనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నారు. 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘గతంలో వీసా కావాలంటే కార్మికులు రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కార్మికులపై ఎలాంటి భారం పడకుండా ఖతర్ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం’అని జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వలస కార్మికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
వీసాలున్నా వెళ్లలేక..
మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు. రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది. కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్‌పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్‌కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్‌ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్‌కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..
సాక్షి, నిజామాబాద్: మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డి కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు పంపుతూ ఆకర్షిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు. చదవండి: (పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ) -
బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అనధికార సూచనలు! ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్ అధికారులు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది. మాకు టార్గెట్ ఉంది మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్ నిర్ణయించారు. లైసెన్స్డ్ వ్యాపారులు ఐఎంఎల్ డిపోల నుంచి టార్గెట్ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే. – శేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మోర్తాడ్ -
పంపుసెట్లకు దొంగల బెడద
సాక్షి, మోర్తాడ్: వరద కాలువకు ఇరువైపుల ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లకు దొంగల బెడద ఎక్కువైంది. పంపుసెట్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్న దొంగలు రాగి (కాపర్) తీగెలను ఎత్తుకెళుతున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ముప్కాల్, బాల్కొండ మండలాల్లోని పలు గ్రామాల మధ్య వరద కాలువను తవ్వారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవనం పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షపు నీరు వరద కాలువలో నిలిచింది. ఆ నీటిని పంట పొలాలకు తరలించేందుకు అనేక మంది రైతులు పంపుసెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉన్న బోర్డులలోని ఫ్యూజ్లను దొంగలు తొలగించి విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లలో ఉన్న రాగి తీగలను తొలగించి వాటిని కొన్ని రోజుల నుంచి దొంగలు ఎత్తుకెళుతున్నారు. కాళేశ్వరం నీరు వరద కాలువలో చేరడంతో తాము పండిస్తున్న పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలకు సాగునీటిని అందించేందుకు రైతులు సిద్ధం కాగా ఆదివారం కాపర్ తీగెల కోసం విద్యుత్ కనెక్షన్లను తొలగించినట్లు ఆధారాలు లభించాయి. మోర్తాడ్, పాలెం, తిమ్మాపూర్, గాండ్లపేట్, దొన్కల్ తదితర గ్రామాలకు చెంది న రైతుల పంపుసెట్ల కనెక్షన్లు కట్ చేసినట్లు ఉన్నాయి. కాపర్ తీగెలు చోరీకి గురి కావడంతో పంట పొలాలకు రైతులు సాగునీటిని అందించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. కొద్ది రోజులుగా ఇలా వరుస చోరీలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఫ్యూజ్లను తొలగించి విద్యుత్ తీగెలను దొంగలు కట్ చేస్తుండటంతో తాము ఆర్థికంగాను నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాగి తీగెలను దొంగిలించే వారిని పట్టుకునేందుకు రైతులు గతంలో గస్తీ తిరిగారు. అయితే వర్షాలు కురుస్తుండటంతో గస్తీని నిలిపివేశారు. అంతలోనే మళ్లీ చోరీలు మొదలయ్యాయి. పోలీసులు స్పందించి వరద కాలువ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు
మోర్తాడ్(బాల్కొండ): పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ముగ్గురు యువకులను నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌వాసులు చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్‌లోని రథం గుడి వద్దనున్న హెయిర్‌కటింగ్ సెలూన్‌ను లీజ్‌కు తీసుకుని నడుపుకుంటున్నారు. వారు మోర్తాడ్‌కు చెందిన ఓ యువకుడితో కలసి పాక్‌కు అనుకూలంగా, మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీడియోను చిత్రీకరించారు. అనంతరం దానిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. దీంతో మోర్తాడ్ యువకుడితోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అక్కడినుంచి పరారయ్యారు. మరో యువకుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మోర్తాడ్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. -
ఆస్పత్రిలో లైంగిక వేధింపులు
నిజామాబాద్‌అర్బన్ : మోర్తాడ్ ఆస్పత్రిలో మహిళా ఉద్యోగులను ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. రెండేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఇటీవల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా.. మోర్తాడ్ ఆస్పత్రిలోని ఓ ఉద్యోగి మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. రెండేళ్లుగా తోటి ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. సదరు ఉద్యోగికి ఆస్పత్రిలో పెద్ద సైజులో నగ్నచిత్రాలను అతికించడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. తన మాట వింటేనే ఉద్యోగం ఉంటుందని, జీతాలు వస్తాయని హెచ్చరిస్తూ అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిసింది. దీంతో మహిళా ఉద్యోగులు ఆస్పత్రికి వెళ్లాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. సదరు ఉద్యోగి వేధింపులతో విసిగిపోయిన ఉద్యోగులు సమస్యను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. సంఘం నాయకులు 15 రోజుల క్రితం జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు సమర్పించారు. డీఐవో విచారణ.. మోర్తాడ్ ఆస్పత్రిలో లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్‌వో వెంకట్ ఆదేశాలతో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రవీందర్ విచారణ చేపట్టారు. వారం రోజులపాటు విచారణ జరిపారు. ఉద్యోగుల వివరాలను, వేధింపులకు సంబంధించిన అంశాలను నమోదు చేసుకున్నారు. విచారణలో సదరు ఉద్యోగి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించినట్లు తేలినట్లు సమాచారం. నేడో రేపో విచారణ నివేదికను డీఎంహెచ్‌వోకు, కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగి గతంలో మూడుసార్లు విచారణను ఎదుర్కొన్నాడు. కానీ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విచారణ నుంచి బయటపడ్డాడని ఆరోపణలున్నాయి. రెండు రోజుల్లో నివేదిక – వెంకట్, డీఎంహెచ్‌వో మోర్తాడ్ ఆస్పత్రికిలో ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని డీఐవోకు సూచించాం. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. దానిని కలెక్టర్ యోగితారాణాకు సమర్పిస్తాం. -
మాఫియా ఉచ్చులో అమాయకుడు
* నిషేధిత మందులను తీసుకువచ్చాడని * జైల్లో పెట్టిన దుబాయ్ పోలీసులు * ఎయిర్‌పోర్టులోనే అరెస్టు అయిన తడపాకల్ వాసి * పార్సిల్ పంపించిన వ్యక్తుల సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ మోర్తాడ్: గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా ముఠా ఉచ్చులో అమాయకుడు చిక్కుకున్నాడు. రెండు నెలల సెలవుపై దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ వారం రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అయితే అతని వద్ద గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల పార్సిల్ దొరకడంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మన దేశంలో విరివిగా వినియోగించే అనేక మందులను గల్ఫ్ దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి. ఒంటినొప్పులు, నిద్రమాత్రలు తదితర రకాల మందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన గల్ఫ్ దేశాలు.. ఆ మందులను నిషేధించడమేకాకుండా వాటితో పట్టుబడిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి. పూసల శ్రీనివాస్ దుబాయ్‌లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడు. ఇటీవల కంపెనీ సెలవు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతను మళ్లీ దుబాయ్‌కు వెళ్లడానికి మోర్తాడ్‌లోని ఒక ట్రావెల్స్‌లో టికెట్ బుకింగ్ చేసుకున్నాడు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి మెట్‌పల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న పార్సిల్‌ను శ్రీనివాస్‌కు అప్పగించాడు. దుబాయ్‌లో అజయ్ అనే తమ వ్యక్తి పార్సిల్‌ను రిసీవ్ చేసుకుంటాడని శ్రీనివాస్‌కు వివరించారు. పార్సిల్లో ఏం ఉందో చెప్పకుండానే పార్శిల్ ఇవ్వడంతో శ్రీనివాస్ దానిని తన లగేజీలో పెట్టుకుని దుబాయ్ చేరుకున్నాడు. నిషేధిత మందుల రవాణాపై నిఘా ను తీవ్రతరం చేసిన దుబాయ్ పోలీసులు శ్రీనివాస్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో పార్శిల్ దొరకడంతో దాన్ని పరిశీలించగా నిషేధిత మం దులు లభ్యమయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ పార్సిల్లో ఏం ఉందో తనకు తెలియదని దుబాయ్‌లో తాను ఉండే క్యాంపునకు అజయ్ అనే వ్యక్తి వచ్చి తీసుకువెళతాడని చెప్పారని శ్రీనివాస్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. అంతేకాక అజయ్ సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. శ్రీనివాస్ తన అరెస్టు విషయాన్ని తన సహచరుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించాడు. ఇక్కడ పార్శిల్ అందించిన వ్యక్తుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. విదేశాంగశాఖ ఉన్నతాధికారులు స్పందించి అమాయకుడైన శ్రీనివాస్‌ను విడిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
తినడానకి తిండీ లేదు.. నీళ్లూ లేవు!
జెడ్డా ఔట్ జైలులో 2వేల మంది భారతీయ కార్మికుల నరకయాతన మోర్తాడ్: సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని రెండువేల మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెడ్డా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు. వారి ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులను స్వదేశానికి రప్పించే చర్య లు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు. -
సౌదీలో నిజామాబాద్‌వాసి హత్య
పదహారు నెలల తర్వాత వెలుగులోకి.. మోర్తాడ్: ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి పదహారు నెలల క్రితం అదృశ్యంగా కాగా, అతడిని దారుణంగా హత్య చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ కేంద్రంగా పని చేస్తున్న గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి చాంద్‌పాష ఈ మిస్టరీని ఛేదించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సైద్ సయ్యద్ గతేడాది జూన్‌లో సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్ వెళ్లాడు. అక్కడ మున్సిపాలిటీలో క్లీనింగ్ సెక్షన్లో పని చేసేందుకు సైద్ సయ్యద్ నియమితుడయ్యారు. సౌదీకి చేరిన వెంటనే ఉద్యోగ నిబంధన ప్రకారం యాజమాన్యం అతనిని మెడికల్ టెస్ట్ కోసం పంపించింది. అలా వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయాడని అక్కడి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తర్వాత సయ్యద్ మృతదేహం రియాద్ శివార్లలో లభించింది. సయ్యద్‌తో పాటు వెళ్లిన మన దేశ కార్మికుడితో పాటు, నేపాల్ జాతీయుడు కలిసి సయ్యద్‌ను హత్య చేసినట్లు నిర్ధారించి.. వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే, ఈ విషయం ఇక్కడి సయ్యద్ బంధువులకెవరికీ సమాచారం లేకుండా పోయింది. సౌదీకి చేరిన తర్వాత సయ్యద్ నుంచి ఎలాంటి ఫోన్‌కాల్, ఉత్తరం కానీ లేకపోవడంతో అతని భార్య జరీనాబేగం ఏజెంట్లను వాకబు చేసింది. వారు చేతులెత్తేయడంతో పోలీసులను ఆశ్రయించింది. వారు సయ్యద్‌కు సంబంధించి న సమాచారం సేకరించలేకపోయారు. చివరకు జీఆర్‌ఎండబ్ల్యూఎస్ సంస్థను ఆశ్రయించగా చైర్మన్ చాంద్‌పాషా మన దేశ విదేశాంగ శాఖను సంప్రదించారు. సైద్ సయ్యద్‌కు హత్యకు గురయ్యాడని శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉందని సమాచారం రావడంతో ఈ విషయాన్ని చాంద్‌పాషా సయ్యద్ భార్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. కంపె నీ యాజమాన్యంతోపాటు, అక్కడి విదేశాంగ శాఖ నిర్లక్ష్యం కారణంగా సయ్యద్ హత్య విషయం పదహారు నెల ల తర్వాతగానీ కుటుంబ సభ్యులకు తెలియలేదు. మృతదేహం కుళ్లిపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేసినట్లు చెప్పారు. -
‘ఉపాధిహామీ’లో కొత్త పనులు..
మోర్తాడ్ : ఉపాధి హామీ పథకం కింద 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త పనులను గుర్తించి ప్రణాళికను తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. పనుల గుర్తింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. కొత్త పనుల గుర్తింపునకు మండల స్థాయిలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఉపాధి పనుల ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే పనులను బృందాలు గుర్తించాల్సి ఉంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అధికారి, ఉపాధి హామీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అధికారుల ఆధ్వర్యంలో పనుల గుర్తింపునకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే 35 రకాల పనులపై దృష్టి సారించాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల్లో గత సంవత్సరం గుర్తించిన పనుల్లో 2,75,365 పనులకు సాంకేతిక ఆమోదం లభించింది. ఇప్పుడు కూడా ఇంచు మించు అదే స్థాయిలో పనులను గుర్తించడానికి బృందాలు కసరత్తు చేస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కల పెంపకం, ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం, ఫీడర్ ఛానల్స్ మరమ్మతులు, వర్షం నీరు వృథాగా పోకుండా దానిని పరిరక్షించడం కోసం ఏర్పాట్లు చేయడం, గ్రామాల్లో ఉన్న రోడ్లపై గుంతలు ఏర్పడితే వాటిని పూరించడం, ప్రభుత్వ విభాగంలోని కార్యాలయాల ఆవరణల్లో గుంతలు ఉంటే పూడ్చటం, సాగునీటి వసతి, పశువులు నీటిని తాగడానికి కుండీలను నిర్మించడం, వ్యవసాయ క్షేత్రాల్లో ఫ్లాట్‌ఫాంలను నిర్మించడం, బీడు భూముల అభివృద్ధి, పండ్ల మొక్కలను నాటి వాటిని పరిరక్షించడం తద్వారా ఉపాధికి ఊతమివ్వడం తదితర రకాలైన 35 రకాల పనులను చేపట్టాల్సి ఉంది. గతంలో మాదిరిగా ఒకే తరహా పనులను కాకుండా ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగించే పనులను గుర్తించి వాటి ద్వారా కూలీలకు వంద రోజుల పాటు ఖచ్చితంగా పని కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. గ్రామ స్థాయిలో వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేసి పనుల గుర్తింపును పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రామంలోని సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో గుర్తించిన పనులు ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పనుల గుర్తింపు పూర్తి అయిన తరువాత మండల స్థాయిలో ఆమోదం పొందాల్సి ఉంది. కొత్త పనుల గుర్తింపును త్వరిత గతిన పూర్తి చేసి నిధుల వ్యయంపై అంచనా వేయాల్సి ఉంది. రానున్న ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుండగా ఇప్పుడు గుర్తించిన పనులను అప్పటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. నిధుల కేటాయింపు కోసం గుర్తించిన పనులకు ఎంత వ్యయం అవుతుందో అంచనావేయాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండటంతో పనుల గుర్తింపునకు అధికారులు వేగంగా దూసుకుపోతున్నారు. -
అక్రమ కనెక్షన్లు కట్
మోర్తాడ్: గడచిన ఖరీఫ్ సీజనులో విద్యుత్ కోతలతో వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కోతలు తీవ్రం కావడంతో రైతులు ఆందోళనలకు దిగారు. ప్రస్తుతం మొదలు కానున్న రబీ సీజనులోనూ వ్యవసాయానికి కరెంటు అంతంత మాత్రమే సరఫరా అయ్యే అవాశముంది. అక్రమ కనెక్షన్లను తొలగిస్తే లోడ్‌ను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అనుమతి లేకుండా ఉన్న కనెక్షన్లను తొలగించాలని ఎన్పీడీసీఎల్ ఆదేశాలిచ్చింది. దీంతో ఏఈఈలు, సబ్ ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు రంగంలోకి దిగనున్నారు. అక్రమ కనెక్షన్ల తొలగింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ నుంచి క్షేత్రస్థాయి అధికారులకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. రబీ పనులు మొదలు కాకముందే ఈ పనులు పూర్తి కావలసి ఉంది. దీంతో తమకు గ్రామాలలో ఇబ్బందులు తలెత్తుతాయని ఉద్యోగులు చెబుతున్నారు. అపుడు కోతలు విధించి అక్రమ కనెక్షన్లతో సీజనులో రోజుకు 25 మెగావాట్ల విద్యుత్ అధికంగా వినియోగమవుతోంది. ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు ఎక్కువగా సాగినపుడు రోజుకు 600మె గావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అయ్యింది. అప్పుడు గృహ అవసరాలకు, వ్యవసాయానికి కోతలు విధించి విద్యుత్‌ను సరఫరా చేశారు. అక్రమ కనెక్షన్లతో ఏర్పడిన లోడ్‌ను తగ్గిస్తే వ్యవసాయానికి కొంత మెరుగ్గా విద్యుత్‌ను సరఫరా చేసేవారమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనులు మందగించడం తో జిల్లాలో రోజుకు 200 మెగావాట్ల విద్యుత్ విని యోగమవుతోంది. రబీ పనులు మొదలైతే విద్యుత్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అందుకే అక్రమ కనెక్షన్ల తొలగించాలనే కఠిన నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. -
కరెంటు బిల్లులు కట్టలేక పంచాయతీలు విలవిల
మోర్తాడ్ : వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అవి పంచాయతీలకు గుది బండలుగా మారాయి. బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ పంచాయతీలపై ఒత్తిడి పెం చింది. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతకూ వెనుకాడడం లే దు. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. పంచాయతీల ఆదాయం తక్కువగా ఉందని భావించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన హయాంలో పంచాయతీల వీధి దీపాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తప్పింది. అయితే, రాజశేఖరరెడ్డి మరణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను చెల్లించే ఆంశాన్ని మరుగున పడేశారు. అప్పటి నుంచి పంచాయతీల కు విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. అప్పటి నుంచే 2010 నుంచి గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల విద్యుత్ బిల్లులను ఎన్పీడీసీఎల్కు చెల్లిం చడం లేదు. గతంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించేది. మేజర్ పంచాయతీల బిల్లులను మాత్రం పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాల్సి వచ్చేది. సర్పంచుల విజ్ఞప్తి మేర కు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పంచాయతీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా చ ర్యలు తీసుకున్నారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా చేశారు. తరువాత ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పంచాయతీలు భారీగా బిల్లులు బకాయి పడ్డాయి. 2010 నుంచి ఇప్పటి వరకు రూ. 108 కోట్ల బకాయిలు జిల్లాలోని పంచాయతీలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఇందులో 72 మేజర్ పంచాయతీలకు సంబంధించి రూ. 51 కోట్లు, 646 మైనర్ పంచాయతీలకు సంబంధించి రూ. 57 కోట్ల బకాయిలు ఉన్నాయి. తడిసి మోపెడు మేజర్ పంచాయతీలలో ఒక్కొక్కటి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆదాయం తక్కువగా ఉండటంతో విద్యుత్ బిల్లులను చెల్లించే స్థితిలో పంచాయతీలు లేవు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థ అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఉన్నతాధికారుల హామీతో గురువారం రాత్రి జిల్లాలోని అనేక గ్రామాల్లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఎంతో కొంత బకాయి చెల్లిస్తామని పంచాయతీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో శుక్రవా రం నుంచి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. కాగా ప్రభుత్వం విద్యుత్ బకాయిల విషయంలో స్పష్టత ఇవ్వకపోతే పంచాయతీలకు ఇబ్బం ది తప్పేలా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి విద్యుత్ బకాయిలను చెల్లించి పంచాయతీలకు ఊర ట కలిగించాలని పలువురు సర్పంచులు కోరుతు న్నారు. -
రుణమాఫీ పరిమితం
మోర్తాడ్: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పంట రుణాల మాఫీపై మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో రుణమాఫీపై ఒక స్పష్టత వచ్చింది. ఒక కుటుంబంలోని ఒకరి పేరున ఉన్న పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలో లోపు ఉన్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది. ఎన్నికల హామీగా... రైతులకు పంట రుణాల మాఫీపై టీఆర్ఎస్ ఎన్నిక ల హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమీక్షల అనంతరం రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. బుధవారం రుణమాఫీపై స్పష్టతనిచ్చింది. మార్గదర్శకాలను పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే పరిస్థితి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఒక రైతుకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ అని పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది వరకు రైతులకు పంట రుణాలు మాఫీ కావచ్చని రైతు సంఘాల నాయకులు అంచనా వేశారు. బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం రుణమాఫీ అంచనా రూ. 1,800 కోట్ల వరకు ఉంటుందని తేలింది. రైతుల కుటుంబాల్లో ఉన్న సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉన్నాయి. ఒక రైతు కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉంటే, కుటుంబ యజమాని, అతని భార్య, కొడుకులు, కోడళ్లు ఇతరత్రా కుటుంబ సభ్యులందరి పేర్లపైన వ్యవసాయ భూమి ఉండేలా పట్టాదారు పాసుపుస్తకాలను రైతులు పొంది ఉన్నారు. భూ పరిమితి చట్టానికి లోబడి రైతులు తమ కుటుంబంలోని సభ్యులందరి పేర్లపై వ్యవసాయ భూములు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రైతు కుటుంబంలోని ప్రతి సభ్యుడి పేరు మీద పంట రుణాలు ఉన్నాయి. రైతు పేరున ఉన్న పంట రుణంలో రూ. లక్ష వరకు మాఫీ అని ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేశారు. తీరా మార్గదర్శకాలు వెలువడటం, అందులో ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణం మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య 40 శాతం తగ్గనుంది. రైతు కుటుంబంలో ఒకరికి అంటే యజమాని లేదా అతని భార్య, లేదా కొడుకు పేరున ఉన్న రుణం మాత్రమే రూ. లక్ష వరకు మాఫీ అవుతుంది. రుణమాఫీ వర్తింపు కుటుంబాన్ని యూనిట్‌గా చేయడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో పాటు మాఫీ మొత్తం తగ్గనుంది. రైతు కుటుంబంలో యజమాని అతని భార్య, కొడుకులు, కోడళ్లు వేరువేరుగా ఉంటే మాత్రం, కొన్నిచోట్ల లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రుణమాఫీకి రేషన్‌కార్డును, ఆధార్‌కార్డును లింక్ చేయనుండటంతో లబ్ధిదారులలో బోగస్ ఉండే అవకాశం లేకుండా పోనుంది. ఏది ఏమైనా ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య తగ్గనుందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు... 2014 మార్చి 31లోపు బకాయిగా ఉన్న వాటికే వర్తింపు ఎన్ని బ్యాంకులలో రుణాలు ఉన్నా వడ్డీతో కలిపి రూ. లక్ష వరకే మాఫీ పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు మాత్రమే మాఫీ -
సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకాలు
మోర్తాడ్ : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ నిర్వాకం వల్ల దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భూ యజమానులకు ఊరట లభించింది. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జారీ కాకుండా ఉన్న ‘ఈ’ పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ల స్థానంలో సాధారణ (మాన్యువల్) పద్ధతిలోనే పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా... వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వీరికి 45 రోజుల వ్యవధి తర్వాత తహశీల్దార్ కార్యాలయం ద్వారా పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీచేస్తారు. గతంలో సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్లు జారీ అయ్యేవి. అయితే సాధారణ పద్ధతి ద్వారా బోగస్ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ అవుతున్నాయని భావించిన ప్రభుత్వం, బోగస్ పత్రాల జారీకి చెక్ పెట్టడం కోసం ఈ టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ యజమానులకు ఆన్లైన్ ద్వారానే పట్టా పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్లను జారీ చేయాలని భావించింది. ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాలను ప్రచురించి ఆన్లైన్ ద్వారా జారీ చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థకు కిరణ్ సర్కార్ కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు తీసుకున్న కార్పొరేట్ సంస్థ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో దృష్టిసారించలేదు. 2013 ఆగస్టులో కిరణ్ సర్కార్ ఈ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. కాగా ఇదే సంవత్సరం అక్టోబర్ నుంచి ఆన్లైన్ పట్టా పాసుపుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఇంత వరకు ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాల జారీ కాలేదు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నిజమైన హక్కు పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీతోనే లభిస్తుంది. నెలల తరబడి పట్టా పాసుపుస్తకాల జారీ నిలచిపోవడంతో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి పోయారు. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు ప్రభుత్వంకు స్పష్టం చేయడంతో సాధారణ పద్ధతిలోనే టైటిల్ డీడ్, పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పహాణీ, ప్రొసిడింగ్‌లను మాత్రం ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని నిర్ణయించారు. దాదాపు 10 నెలలుగా నిలిచిన టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను మాన్యువల్ పద్ధతిలో జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు పెద్ద బాధ తప్పింది. -
‘ఆపరేటర్ల’ నియామకంలో ప్రతిష్టంభన
మోర్తాడ్ : గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణకు సంబంధించి ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో పనులు సాగడం లేదు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీలను 477 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ పంచాయతీలలోనే కంప్యూటర్లను ఏర్పాటు చేసి పంచాయతీ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 287 క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లను కేటాయించారు. ఇంకా 190 క్లస్టర్లకు కంప్యూటర్లు అందజేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు... ఆపరేటర్లను పంచాయతీలు నేరుగా నియమించుకోకుండా ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ విధానంలో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కార్వే సంస్థ ఆపరేటర్ల నియామక బాధ్యతలను తీసుకుంది. వేసవిలోనే ఆపరేటర్లను ‘కార్వే’ సంస్థ ఎంపిక చేసి వారికి కొంత శిక్షణ ఇచ్చింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేటర్లతో పంచాయతీ పనులు సాగించాలని ‘కార్వే’ సంస్థ నిర్ణయిం చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపరేటర్ల నియామకాలకు సంబంధించిన ఏజెన్సీకి ఇంకా పచ్చజెండా ఊపలేదు. దీంతో ఆ సంస్థ ఏమి చేయడం లేదు. పంచాయతీలకు వసూలయ్యే పన్నులు, చేసే ఖర్చులు, ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యే నిధులు, చేపట్టే పనులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. పంచాయతీల ఆన్‌లైన్‌కు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రియా’ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందించింది. తాజాగా ‘మన ఊరు మన ప్రణాళిక’కు అవసరమైన పూర్తి వివరాలను ఆన్లైన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదే శించింది. ఆ న్‌లైన్ చేయడానికి గడువు ఎక్కువగా లేకపోవడం, ఆ పరేటర్ల నియామకం జరగకపోవడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నా ఆపరేటర్లు లేని కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రభుత్వం స్పందించి కంప్యూటర్ల ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంటేనే పంచాయతీల్లో పనులు సాగనున్నాయి. -
పోలింగ్ సిబ్బందికి నో ‘టీఏ’
మోర్తాడ్, న్యూస్‌లైన్ : జిల్లాలో బుధవారం నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో విధులు నిర్వహించిన తమకు డీఏ మాత్రం చెల్లించి టీఏను ఎగ్గొట్టారని ఉద్యోగులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడం, దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల రవాణా చార్జీలు తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తొమ్మిది శాసన సభ నియోజకవర్గాల్లో 2,057 పోలింగ్ కేంద్రాలు ఉండగా 18,885 మంది ఉద్యోగులు విధులు నిర్వహించారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులకు 1400 చెల్లించారు. ప్రిసైడింగ్ అధికారులు రెండు మార్లు శిక్షణకు హాజరయ్యారు. రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు కలిపి 1400 చెల్లిం చారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని గ్రామాలలో ఓటు హక్కు ఉండటం, ఉద్యో గం నిర్వహించిన వారికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బాధ్యతలను అప్పగించారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విధులను అప్పగించారు. అనేక మంది ఉద్యోగులు శిక్షణ, పోలింగ్ విధులకు రవాణా చార్జీల కోసం 400కు పైగా ఖర్చు చేశారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కూడా రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులు నిర్వహించినందుకు రోజుకు 250 చొప్పున వెయ్యి చెల్లించారు. పోలింగ్ క్లర్క్‌లకు ఒక రోజు శిక్షణ, రెండు రోజుల పోలింగ్ విధులకు హాజరైనందుకు రోజుకు 250 చొప్పున 750 చెల్లించారు. వీటితో పాటు ప్రతి ఉద్యోగికి కనీసం 300 నుంచి 400 రవాణా చార్జీలను చెల్లించాల్సి ఉంది. ఎన్నికల సంఘం కూడా టీఏ చెల్లించాలని ఆదేశించిందని ఉద్యోగులు చెబుతున్నారు. దూర ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి రవాణా చార్జీలు చెల్లించక పోవడం సరికాదన్నారు. అధికారులు మాత్రం ఎన్నికల శిక్షణకు, పోలింగ్ విధులకు హాజరైన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ట్లు చెబుతున్నారు. దీంతో రవాణా చార్జీలను చెల్లిం చలేమంటున్నారు. ఇప్పుడు చెల్లించిన సొమ్ము నుంచి రవాణా చార్జీలు భరించుకోవాలని సూచిస్తున్నారు. రవాణా చార్జీలు విధిగా చెల్లించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అధికారులు టీఏ, డీఏ చెల్లించడంలో సరైన నిబంధనలను పాటించలేదని అ ధికారులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని పోలింగ్ సిబ్బందికి టీఏ ప్రత్యేకంగా చెల్లిం చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. -
అప్పుడే విరుగుతున్న పట్టాలు
మోర్తాడ్, న్యూస్‌లైన్: నిజామాబాద్-పెద్దపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైలు ట్రయల్ రన్ కూడా జరుగక ముందే పట్టాలు విరిగిపోతున్నాయి. రైల్వేలైన్‌కు వినియోగిస్తున్న ఇనుములో నాణ్యత లేకపోవడంతో పట్టాల మధ్య పగుళ్లు చోటు చేసుకుం టున్నాయి. రైలు పట్టాల మధ్య పగుళ్లు ఏర్పడితే భవిష్యత్తులో రైలు ప్రయాణం భద్రమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్ పనులు మోర్తాడ్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాం ట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బద్దంవాడ వ్యవసా య క్షేత్రాల పరిసరాలలో రైల్వే లైన్ పనులు పూర్తి అయ్యాయి. స్టేషన్ పరిసరాలలో చిన్న చిన్న పనులు పూర్తి కావాల్సి ఉన్నందున రైలు ఇంజిన్ ట్రయల్ రన్‌ను వాయిదా వేశా రు. షెడ్యూల్ ప్రకారం గడచిన జూన్ నుంచి జగిత్యాల్, మోర్తాడ్ మధ్య ప్యాసింజర్ రైలును నడుపాల్సి ఉంది. పనులు వేగంగా సాగక పోవడంతో అది సాధ్యం కాలేదు. రైల్వే లైన్ పట్టాలకు వినియోగిస్తున్న ఇనుము విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టాలు విరి గిపోతున్నాయి. దీంతో రైలు ప్రమాదాలు సంభవిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. రైలు ఇంకా పట్టాలు ఎక్కక ముందే పరిస్థితి ఇలా ఉంటే, రైలు వచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు సంశయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే లైన్ నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘తెల్ల హంస’కు కొరతొచ్చింది
మోర్తాడ్, న్యూస్‌లైన్ : రబీలో తెల్ల హంస రకం వరిని సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రకం విత్తనం కొరత తీవ్రంగా ఉండటంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం 1010 రకం వరి సాగుకు ఇస్తు న్న ప్రాధాన్యతను తెల్ల హంస రకానికి ఇవ్వక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా ముల్కనూర్ సహకార సంఘం ఆధ్వర్యంలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో తెల్లహంస విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలను సహకార సంఘాలు సరిగా మార్కెట్ చేయడం లేదన్న కారణంతో వారు ప్రైవేట్ వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు విత్తనాల ధరను అమాంతం పెంచేశారు. 30 కిలోల సంచికి రూ. 635 ధర ఉండగా వ్యాపారులు రూ. 850లకు విక్రయిస్తున్నారు. దీంతో విత్తనాల కోసం రైతులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. రబీ సీజన్లో జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో ఎక్కువ మొత్తంలో దొడ్డు రకం వరి వేస్తారు. ఏపీ సీడ్ కార్పొరేషన్ అధికారులు 1010 రకం వరి వంగడాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నారు. రబీలో విద్యుత్ సరఫరా, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తెల్ల హంస సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 1010 రకం వరి విత్తనాన్ని సాగు చేస్తే వంద రోజుల తర్వాత కోతలు చేపట్టాల్సి వస్తుంది. తె ల్ల హంస రకం పక్షం ముందుగానే కోతకు వస్తుంది. రబీలో విద్యుత్ కోత ఏర్పడటం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చే రకం సాగు చేయాలని రైతులు భావిస్తున్నారు. తెల్ల హంస రకం వరి పాత రకం కావడంతో నిజామాబాద్ జిల్లా సారంగపూర్‌లోని ఏపీ సీడ్స్ కంపెనీలో తక్కువ ఉత్పత్తి చేశారు. దీంతో రైతులు ముల్కనూర్ సహకార సంఘం ఉత్పత్తి చేస్తున్న తెల్ల హంస విత్తనాలను పొందడానికి పోటీ పడుతున్నారు. ముల్కనూర్ సహకార సంఘంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ చేయడంతో కొరత ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి తెల్ల హంస రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. -సుదర్శన్ రెడ్డి, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ప్రభుత్వం 1010 రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని ఆదేశించింది. అందుకే ఈ రకం వరి విత్తనాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాం. తెల్ల హంస రకం వరి విత్తనాలను వెయ్యి క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేశాం. ప్రభుత్వం ఆదే శించిన విధంగా విత్తనోత్పత్తి చేయడం మా పని.