మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు.
రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్‌డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్‌మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది.
కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్‌పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్‌కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్‌ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్‌కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు
కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment