Police Clearance Certificate
-
సౌదీ వీసా.. భారతీయులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు. భారతీయులకు పీసీసీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియా- రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా.. అంటూ ఓ ట్వీట్ చేసింది. శాంతియుతంగా జీవిస్తున్న రెండు మిలియన్లకు పైగా భారతీయ పౌరుల సహకారాన్ని రాయబార కార్యాలయం అభినందిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. pic.twitter.com/AxD2hje83s — القنصلية السعودية في مومباي (@KSAconsulateBOM) November 17, 2022 వాస్తవానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాని అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే.. ప్రధాని మోదీ జీ20 సదస్సు టూర్ నేపథ్యంలో అది రద్దు అయ్యింది. -
మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు
మోర్తాడ్: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను తక్షణమే జారీ చేయడానికి హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల ముచ్చటగానే మిగిలాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండడంతో విచారణ, పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వారం వ్యవధిలో పీసీసీలను జారీ చేసేవారు. కరోనా భయాలు తొలగిపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. కొత్త పాస్‌పోర్టులు, రెన్యువల్‌తోపాటు పీసీసీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం పరిధిలోని ఐదు సెంటర్లలో రోజుకు ఐదు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త పాస్‌పోర్టులకు సంబంధించినవే ఉంటున్నాయి. గతంలో రోజుకు 2 వేల స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. ఈ సంఖ్యను ప్రస్తుతం ఐదు వేలకు పెంచారు. అయినా క్యూ తగ్గకపోవడంతో పీసీసీల కోసం గత నెలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆలస్యమవుతున్నాయి. పోస్టాఫీసులకు సేవలు విస్తరించినా.. గతంలో పీసీసీలు పూర్తిగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారానే జారీ చేసేవారు. తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా హెడ్ పోస్టాఫీసుల ద్వారా కొత్త పాస్‌పోర్టులకు దరఖాస్తులు స్వీకరించారు. పీసీసీలను వేగంగా జారీ చేయడం కోసం ప్రధాన తపాలా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించేందుకు సెప్టెంబర్ చివరివారంలో అవకాశం ఇచ్చారు. పోస్టాఫీసులకు సేవలను విస్తరించడం వల్ల పీసీసీల జారీ సులభతరం అవుతుందని భావించారు. అయితే ఈ కార్యాలయాల్లోనూ రద్దీ పెరిగింది. పీసీసీల స్లాట్ బుకింగ్‌కే మూడు వారాల సమయం పడుతోంది. పీసీసీల జారీకి నెల రోజులకంటే ఎక్కువ సమయం పడుతోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తి అవుతుండగా పోస్టాఫీసుల్లో కోసం దరఖాస్తు చేసుకున్నవారి విచారణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీల జారీ కోసం విదేశాంగ శాఖ వేగవంతమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (క్లిక్: ముగిసిన జోసా కౌన్సెలింగ్.. ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ) -
పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ మంజూరులో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) జారీ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర హోం శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులే నేరుగా పీసీసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు వివరాలను స్థానిక పోలీసులకు పంపించి వాకబు చేసే అవసరం తగ్గి సమయం ఆదా అవుతుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. చదవండి: అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్ -
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
వీసాలున్నా వెళ్లలేక..
మోర్తాడ్: విదేశీ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కువైట్ ద్వారాలు తెరచినా రాష్ట్రం నుంచి ఔత్సాహికులు వెళ్లలేకపోతున్నారు. సకాలంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, స్టాంపింగ్ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు జారీ అయ్యాక మూడు నెలల్లో కువైట్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రక్రియలు అయ్యేలోపే గడువు ముగుస్తోందని ఆందోళన చెందుతున్నారు. రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోంది కరోనా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడిన కువైట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. కోవిడ్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి కువైట్ విదేశాంగ శాఖ వీసాల జారీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. సెలవు రోజుల్లో మినహా రోజూ 2 వేల వరకు వీసాలు జారీ చేస్తోంది. కువైట్ వీసా పొందిన ప్రతి ఒక్కరు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాలి. పాస్‌పోర్టు కార్యాలయం ద్వారానే పీసీసీ పొందాల్సి ఉంటుంది. అయితే పీసీసీల జారీలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. గతంలో 2, 3 రోజుల్లో పీసీసీలను జారీ చేసేవారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి 25 రోజులవుతోంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని తరువాత ముంబై, ఢిల్లీలోని కువైట్ ఎంబసీల్లో ఎక్కడో ఓచోట స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ స్టాంపింగ్ ప్రక్రియలోనూ తీవ్ర కాలయాపన జరుగుతోందని వలస కార్మికులు చెబుతున్నారు. 5 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టాంపింగ్‌కు 20 రోజులకు మించి పడుతోందని వాపోతున్నారు. పీసీసీ, స్టాంపింగ్‌ల కోసం నెలన్నర పడుతోందని, ఒకవేళ స్లాట్ సకాలంలో బుక్ కాకపోతే మరింత ఎక్కువ సమయం అవుతోందని చెబుతున్నారు. దీంతో వీసా జారీ అయ్యాక 3 నెలల్లో కువైట్‌కు చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రక్రియలు ఆలస్యమై వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసాలను రెన్యూవల్ చేయాలని విజ్ఞప్తి చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. భారీగా పెరిగిన స్టాంపింగ్ ఫీజు కువైట్ ఎంబసీలో స్టాంపింగ్ ఫీజును భారీగాపెంచారు. గతంలో రూ.5 వేలు ఉండగా ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. కువైట్ విదేశాంగ శాఖనే భారీగా ఫీజు పెంచిందని, తమ చేతిలో ఏం లేదని మన విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వీసాల జారీకి అనుగుణంగా పీసీసీ, స్టాంపింగ్ ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని వలస కార్మికులు కోరుతున్నారు. -
రేపు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలోని హైదరాబాద్ సచివాలయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ మేళా(పీసీసీ)ను నిర్వహిస్తున్నట్లు పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం తెలిపారు. బేగంపేట్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో ఎలాంటి రుసుము లేకుండానే బ్రాంచ్ సెక్రటెరీయెట్ అధికారులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేస్తారన్నారు. ఇటీవల రాష్ట్రం నుంచి గల్ఫ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు డిమాండ్ పెరిగిందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొనే వారు వెబ్సైట్ www.passportindia.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉంచిన స్లాట్స్‌ను బుక్ చేసుకుని సరైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని సూచించారు. 1,000 స్లాట్లు అందుబాటులో ఉంచగా ఇప్పటివరకు 250 స్లాట్లు బుక్ అయ్యాయన్నారు. -
గల్ఫ్ జాబ్స్ కోసం ఇది ఉండాల్సిందే..
దుబాయ్ : గల్ఫ్ దేశాలలో ఉద్యోగం కోసం అభ్యర్థులు మంచి ప్రవర్తన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో ఒకటైన పీసీసీ (పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్)కు సంబంధించిన వివరాల కోసం పాస్‌పోర్టు, వీసా సమస్యలను పరిష్కరించే సంస్థలు ఇండియన్ మిషన్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్‌కు ఉద్యోగార్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ పీసీసీ సర్టిఫికెట్ పొందడం చాలా తేలికని బీఎస్ఎల్ ఇంటర్నేషల్ సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు. భారతీయ మిషన్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ ద్వారా వెలువడిన పీసీసీలను ఆమోదిస్తుందని కూడా తెలిపారు. పీసీసీ పొందేందుకు ఇలా చేయాలి.. ముందుగా బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అధికారిక వెబ్సైట్ నుంచి పీసీసీ ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా నేరుగా బీఎల్ఎస్ సెంటర్ నుంచి కూడా పొందవచ్చు, డౌన్లోడ్ చేసిన ఫారంతో పాటు జాబ్ ఆఫర్ లెటర్, కంపెనీ ట్రేడ్ లైసెన్స్, పాస్‌పోర్టు, వీసాల జిరాక్స్ కాపీలను నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జతచేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఆమోదం పొంది, మళ్లీ తిరిగి బీఎల్ఎస్ కార్యాలయంలో ఇవ్వాలి. ఇక్కడ ప్రాసెస్ జరగడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. సర్టిఫికెట్ సిద్ధమైతే దరఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. -
అందరికీ ఆదర్శంగా నిలవాలి
ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం మంత్రి ఉద్భోత న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ఆగస్టు 8: ఆదర్శ పోలీసు బలగంగా రూపొందాలని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను కోరారు. నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావాలతో ప్రజలకు సేవలందించినట్లయితే ఢిల్లీ పోలీసు సిబ్బందికి, వారి గౌరవాన్ని కాపాడడానికి కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు, వీసా, ఇతర సేవల కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందడానికి ఢిల్లీ పోలీసులు తమ వెబ్‌సైట్‌పై ప్రవేశపెట్టిన వెబ్ అప్లికేషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ వెబ్ అప్లికేషన్ ప్రవేశపెట్టడాన్ని ప్రజల నమ్మకాన్ని చూరగొనడం కోసం చేపట్టిన చర్యగా అభివర్ణించారు. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్ష మంది ప్రయోజనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారనడానికి ఈ కొత్త సేవ అద్దం పడ్తోందని ఆయన అభినందించారు. ఢిల్లీ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం కావాలని హోమ్ మంత్రి చెప్పారు. అలా జరిగితే యావద్దేశం ఢిల్లీని అనుకరిస్తుందని ఆయన చెప్పారు. దేశం విశ్వసనీయత అనే సమస్యను ఎదుర్కొంటోందని, ఢిల్లీ పోలీసులు దీనిని సవాలుగా స్వీకరించి నిజాయితీతో, చిత్తశుద్ధితో సేవలందించడం ద్వారా ప్రజల మనసులను, వారి మెప్పును గెలుచుకోవాలని ఆయన కోరారు. పోలీసులు అలా చేస్తే తాము వారికి పూర్తి మద్దతు అందిస్తామని, ఢిల్లీ పోలీసుల గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు, ఢిల్లీ పోలీసును అత్యాధునిక బలంగా తీర్చిదిద్దడానికి కేంద్రం అండగా నిలబడుతుందని ఆయన చెప్పారు. -
‘నో అబ్జెక్షన్’ తిప్పలు
మురళీనగర్ చెందిన ఓ యువకుడికి ఇటీవల ఎల్అండ్టీ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ సంబరపడ్డారు. కంపెనీవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. రెండు నెలలుగా మీసేవ, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా నిరాశ ఎదురైంది. దీంతో ఉద్యోగం పోయింది. తాటిచెట్లపాలేనికి చెందిన యువకుడు ఐటీఐ పూర్తి చేశాడు. ఇటీవల ఉపాధి శిక్షణకు ఎంపికయ్యాడు. ఆరు నెలల కోర్సు. శిక్షణ అనంతరం వారే ఉద్యోగం కల్పిస్తారు. ఎంతో సంతోషపడిన అతడికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రూపంలో నిరాశ ఎదురైంది. మీసేవ, పోలీస్‌స్టేషన్, స్పెషల్ బ్రాంచి పోలీసులను కలిసినా ప్రయోజనం లేకపోయింది నేడు యువతను పీడిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఎప్పుడో తీసే ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీత మైన పోటీ. దీంతో చిన్నో పెద్దో ప్రైైవేట్ ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్, ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థల్లో స్టయిఫండ్‌తో కూడిన శిక్షణ, చిన్న తరహా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అ యితే అప్రెంటిస్, ఉపాధి లభించిన వారికి భంగపాటు తప్పడం లేదు. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) లేదా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలని ఆంక్షలు విధించడంతో ఖంగుతింటున్నారు. పోలీస్స్టేషన్లలో సర్టిఫికెట్లు లభ్యం కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. నిలిచిన సేవలు గతంలో పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారి సంతకంతో క్లియరెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేసేవారు. గతేడాది ఆగస్టు నుంచి సర్టిఫికెట్ మం జూరులో ఆంక్షలు విధించారు. సేవలు మీ-సేవకు అప్పగించారు. మీ-సేవ నుంచి చేరిన దరఖాస్తులు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం పరిశీలించేది. అక్కడి నుంచి అభ్యర్థి వివరాల పరిశీలన కోసం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేది. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు వాస్తవం అని తేలితే సర్టిఫికెట్ మంజూరయ్యేది. గతేడాది డిసెంబర్ నుంచి మీ-సేవలో ఈ సేవలకు బ్రేకులు పడ్డాయి. సర్టిఫికెట్ల బాధ్యత స్పెషల్ బ్రాంచి పోలీసులకు అప్పగించారు. జనవరి నుంచి స్పెషల్ బ్రాంచి ద్వారా సేవలు లభించడం లేదు. కమిషనర్ చొరవ చూపాలి క్లియరెన్స్ సర్టిఫికెట్ల విషయంలో నగర పోలీస్ కమిషనర్ చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. చేతికి అందివచ్చిన ఉపాధి అవకాశాలు చేజారిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగాల్లో చేర్చుకోవడం లేదని వాపోతున్నారు. రోజు పదుల సంఖ్యలో నిరుద్యోగులు సర్టిఫికెట్ కోసం స్థానిక పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు లేకుండా సర్టిఫికెట్ ఇచ్చే అధికారం తమకు లేదని ఓ పోలీస్ అధికారి చెప్పారు.