RPO Hyderabad: పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీకి కొత్త విధానం | RPO Hyderabad to Issue Police Clearance Certificate Through Postal | Sakshi
Sakshi News home page

RPO Hyderabad: పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీకి కొత్త విధానం

Published Mon, Sep 26 2022 2:45 PM | Last Updated on Mon, Sep 26 2022 2:47 PM

RPO Hyderabad to Issue Police Clearance Certificate Through Postal - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. 

అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్‌ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్‌ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్‌లైన్‌లో స్లాట్‌ను బుక్‌ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్‌ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్‌ ఇన్‌ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

తపాలా కార్యాలయాల్లో స్లాట్‌లు..
పోస్టల్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్‌లను కేటాయించారు. ఒక్కో పోస్టల్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు.  (క్లిక్: ‘మూన్‌ లైటింగ్‌’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement