regional passport office
-
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
గంట వ్యవధిలో పాస్‌పోర్ట్!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల కల్పనలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలికకు తప్ప నిసరి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు ధ్రువీకరించడంతో చికిత్స నిమిత్తం లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కేంద్రం అధికారులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన కార్యా లయ అధికారులు అక్కడికక్కడే దరఖాస్తును ప్రాసెస్ చేసి తదుపరి చర్యలు తీసు కుని కేవలం గంట వ్యవధిలోనే పాస్‌పోర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల చూపిన అంకితభావం ఫలితం గానే గంటలో పాస్‌పోర్ట్ జారీ చేసి బాధితురాలికి అందించినట్లు చెప్పారు. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్..
సాక్షి, హైదరాబద్: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల లోపు పాస్‌పోర్టు గడువు ముగిసిపోతున్నట్లయితే దాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మైనర్ పాస్‌పోర్టులు 5 ఏళ్ల గడువుకే అందిస్తామని తల్లిదండ్రులతో పాటు మైనర్లు ప్రయాణం చేస్తున్నట్లయితే వారి పాస్‌పోర్టులు ఒక సారి చూసుకోవాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వారు జంబో పాస్‌పోర్టు ఎంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు అపాయింట్మెంట్ను 3సార్లు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుల కోసం 1800258 1800,040–277715333,040–27715115 నెంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. చదవండి: పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఏకంగా పాస్‌పోర్టే వచ్చింది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే! -
బెజవాడలో పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం మంజూరు అయినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన శనివారం కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విజయవాడలో త్వరలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు కానున్నదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఏపీలో రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. మరోవైపు రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి నేటి ఉదయం విజయవాడలో వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు. కాగా 2012లోనే విజయవాడలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విజభన నేపథ్యంలో ఏపీలో మూడు పూర్తి స్థాయి పాస్ పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.