Online Slot Booking
-
RPO Hyderabad: పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీకి కొత్త విధానం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాలకు వెళ్లేవారికి అవసరమయ్యే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)ల జారీకి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల ద్వారా వీటిని జారీ చేయాలని నిర్ణయించింది. గతంలో పీసీసీల కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉండేది. అయితే పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టులు, పాత పాస్‌పోర్టుల రెన్యువల్ల కోసం క్యూ కట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా ఈ కేంద్రాల్లో రద్దీ కారణంగా పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సౌదీ, కువైట్ దేశాలలో ఉపాధి, ఇతర దేశాల్లో చదువు కోసం వెళ్లేవారికి పీసీసీలు తప్పనిసరి కావడంతో ఆన్లైన్లో స్లాట్‌ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయాలకు వెళ్తున్నారు. పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా పీసీసీలు పొందాలనుకుంటే స్లాట్ బుకింగ్‌కు నెలకు మించి ఎక్కువ సమయం పడుతోంది. పీసీసీలు సకాలంలో పొందని వారికి వీసాల గడువు ముగిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీల జారీని వేగవంతం చేయడానికి ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పని చేసేలా రీజనల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య చొరవ తీసుకున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రెండు వారాల పాటు ‘వాక్ ఇన్ పీసీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.సిబ్బందికి వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉన్నాయి. పీసీసీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో శనివారం కూడా పని చేయాల్సి వచ్చింది. తక్కువ సిబ్బంది ఉండడంతో పని భారం ఎక్కువైంది. దీంతో పీసీసీల కోసం శనివారం ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా కేంద్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తపాలా కార్యాలయాల్లో స్లాట్లు.. పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పని చేస్తున్న ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, భువనగిరిల తపాలా కార్యాలయాల ద్వారా పీసీసీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు స్లాట్లను కేటాయించారు. ఒక్కో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా రోజుకు 10 నుంచి 15 పీసీసీల జారీకి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. తపాలా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా గతంలో కొత్త పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేసేవారు. తాజాగా పీసీసీలకు అనుమతి ఇచ్చారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలలో పీసీసీల కోసం రద్దీని తగ్గించడానికి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. (క్లిక్: ‘మూన్ లైటింగ్’ వివాదం: ఐటీ ఆఫీసులకు పాత కళ..) -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తగ్గిన తాకిడి
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో మళ్లీ స్తబ్ధత నెలకొంది. వారం రోజులుగా కొత్త ఒప్పందాలు పెద్దగా లేకపోవడంతో దస్తావేజుల నమోదు సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌కు కనీస ఆదరణ కరువైంది. అడపాదడపా మాత్రమే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా లావాదేవీలపై ఒప్పందాల అనంతరం అధికార రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు. కానీ మార్కెట్ విలువ, దాని ప్రభావంతో రిజిస్ట్రేషన్ రసుం పెంపు నేపథ్యంలో పాత ఒప్పందాల దస్తావేజుదారులు గత నెలాఖరులోగానే పోటీ పడి దాదాపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణాల లావాదేవీలపై ప్రభావం పడింది. దీంతో కొత్త దస్తావేజుదారుల తాకిడి లేక సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు వెలవెలబోతుండగా, డాక్యుమెంట్ రైటర్స్ కేంద్రాలు బోసిపోతున్నాయి. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) తగ్గిన రిజిస్ట్రేషన్లు.. గ్రేటర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దినసరి దస్తావేజుల నమోదు సంఖ్య సింగిల్ డిజిట్ దాటడం లేదు. మహా నగర పరిధిలో హైదరాబాద్ (సౌత్), రంగారెడ్డి, మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తున్నాయి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణంగా రోజూ కనీసం 20 నుంచి 40 వరకు, కొన్నింటిలో 80 నుంచి 140 వరకు స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది. వారం రోజులుగా దస్తావేజుల నమోదు సంఖ్య ఐదు నుంచి పదికి పడిపోయింది. నిరంతరం దస్తావేజుదారులతో కిటకిటలాడే ఉప్పల్, రంగారెడ్డి ఆర్వో, కుత్బుల్లాపూర్ మహేశ్వరం, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఇబ్రహీంపట్నం, ఫరూఖ్‌నగర్, వనస్థలిపురం తదితర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెద్దగా తాకిడి లేకుండాపోయింది. (క్లిక్: ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!) -
కొవిన్ 2.0 కూడా సతాయిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం తెచ్చిన కొవిన్ 2.0 సాఫ్ట్వేర్ కూడా సతాయిస్తోంది. మొదట్లో వచ్చిన ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి అప్డేట్కు తెచ్చినా.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనివల్ల సోమవారం మొదలైన కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ సరిగా కాకపోవడం, ఇతర ఇబ్బందులతో చాలా మంది నేరుగా పంపిణీ కేంద్రాలకే వచ్చి టీకా తీసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా రెండో విడత వ్యాక్సి న్ పంపిణీ తొలిరోజున 70 కేంద్రాల్లో మొదలైంది. ఓటీపీ రాదు.. లింక్ ఓపెన్ కాదు.. సాధారణ జనంలో 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాలిక రోగులకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించగా.. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా కొన్నిచోట్ల ఓటీపీ రాకపోవడం, వచ్చినా నమోదు చేశాక లింక్ ఓపెన్‌కాకపోవడం, రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు చూపించినా సెంటర్ లో వైద్య సిబ్బందికి వివరాలు రాకపోవడం, వెబ్ పేజీ సరిగా ఓపెన్ కాకుండా ముప్పుతిప్పలు పెట్టడంతో వ్యాక్సినేషన్ ఆలస్యమైంది. కరోనా వ్యాక్సినేషన్ మొదటి దశలో జనవరి 16న వైద్య సిబ్బందికి టీకా పంపిణీ ప్రారంభించినప్పుడు కూడా కొవిన్ యాప్ ఇలాగే సమస్యలు సృష్టించింది. దాన్ని ఆధునీకరించి ఇప్పుడు కొవిన్–2.0గా తీసుకొచ్చినా అప్పటి ఇబ్బందులే మళ్లీ ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నేరుగా సెంటర్లకు వచ్చి టీకా వేసుకునే అవకాశం కల్పించడంతో.. చాలాచోట్ల లబ్ధిదారులు టీకా కేంద్రాలకే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నేరుగా వెళ్లేందుకే జనం మొగ్గు యాప్‌లో లేదా వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవడం కంటే.. నేరుగా సెంటర్లకే వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడంపై లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. యాప్‌లో వివరాల నమోదు, ఓటీపీ ఎంటర్ చేయడం, రిజిస్ట్రేషన్, తర్వాత టీకా సెంటర్లో సరిచూసుకోవడం వంటివాటిని జనం ఇబ్బందిగా భావిస్తున్నారని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం కావాలంటే సులువుగా ఉండాలని.. అంతేతప్ప విద్యార్థులు కాలేజీకి దరఖాస్తు చేసుకున్నట్లుగా అనేక కాలమ్‌లు, వివరాలతో సంక్లిష్టంగా ఉండొద్దని అంటున్నాయి. దానికితోడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో లబ్ధిదారులు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బంది పడడమేకాక.. అసలు వ్యాక్సిన్ వేయించుకోవడానికే ముందుకు రాకుండా పోయే పరిస్థితి ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రేపు స్పీకర్, చైర్మన్‌కు వ్యాక్సిన్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రెండో విడత తొలిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ హడావుడి లేకుండా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ నెల 3న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరూ టీకా వేయించుకోనున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వారు కోఠిలోని తమ కార్యాలయానికి వచ్చి టీకా తీసుకుంటారని వెల్లడించారు. నేటి నుంచి నేరుగా కూడా వెళ్లొచ్చు మంగళవారం నుంచి కొవిన్–2.0లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు నేరుగా సెంటర్లకు వచ్చి కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిజానికి యాప్ ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు నేరుగా వచ్చినా టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కానీ మొదటి వారం పాటు యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికే వ్యాక్సిన్ వేయాలని భావించారు. ఇందులో సమస్యలు తలెత్తడంతో.. రెండు విధాలుగా అమలు చేయాలని నిర్ణయించారు. రోగ ధ్రువీకరణ పత్రాలివ్వడానికి డబ్బుల వసూళ్లు నలభై ఐదు ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం పంపిన ఫార్మాట్ ప్రకారం ఎంబీబీఎస్, ఆపై చదివిన డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తేవాలి. సర్కారు నిర్ధారించిన 20 రకాల జబ్బుల్లో ఏది ఉందో పేర్కొనాలి. అయితే ఇలా ధ్రువీకరించేందుకు కొందరు ప్రైవేట్ డాక్టర్లు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ప్రైవేట్ టీకా సెంటర్లలో వ్యాక్సిన్ ధర రూ.150, సర్వీస్ చార్జి రూ.100 మొత్తం కలిపి రూ.250 మాత్రమే తీసుకోవాలి. రోగ ధ్రువీకరణ మాత్రం ఉచితంగానే చేయాలి. కానీ కొన్నిచోట్ల రోగ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వడానికి డబ్బులు వసూలు చేయడంపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఎవరైనా లబ్ధిదారుడు రోగాల ట్రీట్మెంట్ ప్రిస్కిప్షన్ తీసుకొస్తే.. దాన్ని చూసి టీకా కేంద్రంలోనే సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు.ఇక ప్రైవేట్ ఆస్పత్రులు టీకా ధర మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్ చార్జి రూ.100 వసూలు చేయకూడదని ఫోన్లు చేసి విజ్ఞప్తి చేశారు. యశోదా ఆస్పత్రి యాజమాన్యం సర్వీస్ చార్జి వసూలు చేయడం లేదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో సినీ, రాజకీయ ప్రముఖులను రంగంలోకి దింపి టీకాపై అవగాహన కల్పిస్తామన్నారు. -
ఆర్టీఏ..ఈజీయే!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అందించే వివిధ రకాల పౌరసేవల్లో పెనుమార్పులు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దాదాపు 37 రకాల సేవలను మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని.. ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అనుమతి వస్తే.. వెంటనే అమలే.. ఇంతకీ ఏంటా మార్పు.. వివరాలు ఇవిగో.. ఇప్పటివరకు.. అన్ని రకాల పౌర సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ (సమయం, తేదీ) నమోదు చేసుకొని.. ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించిన తరువాత నిర్దేశిత సమయం మేరకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వస్తుంది. సంబంధిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల కోసం అటూ ఇటూ తిరగడాలు.. మధ్యవర్తులు, దళారుల హడావుడి.. చేతికి చమురు వదలడాలు ఇవన్నీ మామూలే.. ఇకపై.. ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. దళారుల బెడద ఉండదు. పాత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, అలాగే అవసరమైన అన్ని రకాల పౌరసేవల్లో.. చిరునామాలో మార్పులు, చేర్పులు.. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను ఆన్లైన్లోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వాహనాలకు నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ఒకరి నుంచి మరొకరికి వాహన యాజమాన్యం బదిలీ, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు, లెర్నింగ్ లైసెన్స్ గడువు పొడిగింపు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ ఆర్సీ, త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ వంటి వివిధ రకాల పన్ను చెల్లింపులు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్ వంటి సుమారు 37 రకాల పౌరసేవలను ఆన్లైన్లో పొందవచ్చు. ప్రస్తుతం వీటి కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.ఆర్టీఏ అధికారులు తమకు అందిన దరఖాస్తులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం వినియోగదారులు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయం లభిస్తుంది.దీంతో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు. ఇవి మాత్రం ఎప్పటిలాగే.. ఆర్టీఏ అధికారులు స్వయంగా పరీక్షించి అందజేసే లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.లెర్నింగ్ లైసెన్సు కోసం ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని ఫీజు చెల్లించి వెళితే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇది తీసుకున్న తరువాత నెల నుంచి 6 నెలలోపు మరోసారి డ్రైవింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి. లారీలు, బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల, సరుకుల రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అందజేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. -
‘ఆన్లైన్ స్లాట్’ అగచాట్లు!
సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ స్లాట్ విధానం దస్తావేజుదారులకు చుక్కలు చూపుతోంది. సిబ్బంది కొరత, ఆన్‌లైన్‌పై అవగాహన లేకపోవడం, మంచి ముహూర్తాల కోసం వేచిచూడడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ప్లాట్ లేదా భూమి కొనుగోలు చేసి వెసులుబాటుతో మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూశాం. కానీ ఆన్లైన్ పద్ధతి వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ఎప్పుడు స్లాట్ దొరికితే అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోందని దస్తావేజుదారులు వాపోతున్నారు. స్థిరాస్తుల నమోదుకు అమావాస్య...పున్నమి, మంచి, చెడు రోజు అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణలో భాగంగా దస్తావేజుల నమోదు కోసం ఆఫ్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా దస్తావేజుదారులు ఆన్లైన్ స్లాట్‌బుక్ చేసుకొని వస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేసేది లేదని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఖరాకండిగా చేప్పేస్తున్నారు. దీంతో ఆన్లైన్లో స్లాట్ లభించేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నగర పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నెలకొంది. రోజుకు 15 నుంచి 18 వరకు నగరంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు పడిపోయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజు సుమారు 50 నుంచి 150 వరకు దస్తావేజులు నమోదు జరగగా, గత పక్షం రోజుల నుంచి పది శాతానికి మించి నమోదు కాని పరిస్ధితి నెలకొంది. ప్రతి రోజు ఒక్కో సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో 15 నుంచి 18 మించి స్లాట్ బుకింగ్ లభించడం లేదు. దీంతో ఆన్లైన్ స్టాట్ కోసం వారం, పది రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు ముహూర్తాలు పెట్టుకొని వచ్చిమరీ ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించుకొని వెళ్లేవారు. తాజాగా ఆ పరిస్ధితి కనిపించడం లేదు. సిబ్బంది కొరతేనా... రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు, పదవీ విరమణ చేసిన పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. దీంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాక ఔట్సోర్సింగ్ పద్ధతిపై సిబ్బంది సేవలు వినియోగించారు. కానీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం పెరగడంతో వారిని పెద్దఎత్తున తొలగించారు. అయితే సిబ్బంది కొరత ఏర్పడటంతో తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఇద్దరు ముగ్గురు చొప్పున తిరిగి కేటాయించింది. అయితే దస్తావేజుదారుల తాకిడి పెరిగి ప్రస్తుత సిబ్బంది ఏ మూలకు సరిపోవడం లేదు. తాజాగా టీఎన్జీవో రిజిస్ట్రేషన్ శాఖ విభాగం ప్రతినిధులు ఏకంగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్‌ను కలిసి సిబ్బంది కొరత పై వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది కొరత అధిగ మించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేయాలని, తక్షణమే ఆఫీసుకు 5 నుంచి 8 మంది చొప్పున తీసుకోవాలని విన్నవించారు. తగ్గుతున్న ఆదాయం మహానగరంలో స్థిరాస్తి భూమ్‌తో రికార్డులు సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కేవలం పక్షం రోజుల్లో పది శాతం పడిపోయింది. వాస్తవంగా నగర శివార్లలోని వరంగల్ హైవేలో యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, ఇన్ఫోసిస్ విస్తరణ, ఘట్కేసర్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ, చిత్రనగరి తదితర నిర్మాణాల ప్రకటనతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి జీవం పోసినట్లయింది. మరోవైపు నగర శివారులోని రాయదుర్గం, కోకాపేట, మణికొండ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు ప్రధాన కార్యాలయాల ఏర్పాటు, నివాస గృహాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను కొనుగోలు చేయడంతో ఒకేసారి స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరిగినట్లయింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది నగర నుంచే సుమారు 70 శాతం ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ స్లాట్లతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. -
పాస్‌పోర్ట్ తేదీల్లో మార్పు
విశాఖపట్నం: పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించడానికి నిర్దేశించిన తేదీలలో మార్పులు చేసినట్టు పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలియజేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినంలో మార్పు జరగడంతో పాస్‌పోర్ట్ సేవలు ముందుగా అందచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతి జనవరి 15న జరుపుకుంటున్న నేపథ్యంలో 14న కార్యాలయంలో సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఆన్లైన్లో ఈనెల 15న స్లాట్ బుకింగ్ పొందిన అభ్యర్థులు అందుకు బదులుగా 14వ తేదీన సేవలు పొందాలని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్ వినియోగదారులు మార్పు గమనించి సహకరించాలని ఆయన కోరారు. -
ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
కాకినాడ లీగల్ :ప్రీ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అమల్లోకి తీసుకురానుంది. ఇందుకోసం క్రయ, దానపట్టాల దస్తావేజుల రిజిస్ట్రేషన్లను ప్రయోగాత్మకంగా చేయాలని నిర్ణయించింది. వృద్ధులు, వికలాంగులు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు అనుకున్న సమయానికి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఈ ఆన్లైన్ విధానం సౌకర్యంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ ఈ విధానం ద్వారా స్లాట్ బుకింగ్‌లో ఆరు రిజిస్ట్రేషన్లు చేయించుకునే వీలుంది. ఆన్లైన్ బుకింగ్ ఇలా.. స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారు ఆన్లైన్లో డాక్యుమెంట్ నమూనాను పూర్తి చేయాలి. సంబంధిత రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఉన్న దరఖాస్తులో పేర్కొన్నచోట ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే.. ఆటోమెటిక్‌గా డేటా సెంటర్ నుంచి క్రయవిక్రయదారుల వేలిముద్రలతో పాటు సాక్షుల వివరాలు కూడావస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేయాలి. ఆస్తి మార్కెట్ విలువను కూడా ఆన్లైన్లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ ద్వారా లేదా చలానా, డీడీ తీసి.. ఆ నంబర్లను ఆన్లైన్లో ఎంటర్ చేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో అందులో పేర్కొంటే, ప్రాధాన్య క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. తద్వారా వచ్చే డాక్యుమెంట్‌ను రూ.100 స్టాంపు పేపర్లపై ప్రింట్ తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌ను సబ్‌రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళితే, స్థిరాస్తికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. మరోసారి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న క్రయవిక్రయదారులు నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే స్లాట్ బుకింగ్ రద్దవుతుంది. ఆయా అంశాలపై తిరుపతి, విజయవాడలో రిజిస్ట్రేషన్ అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. త్వరలో విశాఖపట్నంలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అందరికీ సౌకర్యవంతం ఆన్లైన్ (స్లాట్) విధానం క్రయవిక్రయదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుగోలుదారులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుంటుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. - పీజీఎస్ కల్యాణి, జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ వేగవంతంగా రిజిస్ట్రేషన్లు క్రయ, విక్రయదారులను దృష్టిలో ఉంచుకుని, చురుకుగా పనులు జరగడానికి ఆధార్‌తో లింక్ చేస్తూ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా.. భవిష్యత్తులో బాగుంటుంది. - వాకా రంగారెడ్డి, జిల్లా రిజిస్ట్రార్, రాజమండ్రి