కొవిన్‌ 2.0 కూడా సతాయిస్తోంది!‌  | Covid 2.0 Software Is Not Working Properly | Sakshi
Sakshi News home page

కొవిన్‌ 2.0 కూడా సతాయిస్తోంది!‌ 

Published Tue, Mar 2 2021 2:11 AM | Last Updated on Tue, Mar 2 2021 8:46 AM

Covid 2.0 Software Is Not Working Properly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం తెచ్చిన కొవిన్‌ 2.0 సాఫ్ట్‌వేర్‌ కూడా సతాయిస్తోంది. మొదట్లో వచ్చిన ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించి అప్‌డేట్‌కు తెచ్చినా.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనివల్ల సోమవారం మొదలైన కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ సరిగా కాకపోవడం, ఇతర ఇబ్బందులతో చాలా మంది నేరుగా పంపిణీ కేంద్రాలకే వచ్చి టీకా తీసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా రెండో విడత వ్యాక్సి న్‌ పంపిణీ తొలిరోజున 70 కేంద్రాల్లో మొదలైంది. 

ఓటీపీ రాదు.. లింక్‌ ఓపెన్‌ కాదు.. 
సాధారణ జనంలో 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాలిక రోగులకు సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా.. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుంటుండగా కొన్నిచోట్ల ఓటీపీ రాకపోవడం, వచ్చినా నమోదు చేశాక లింక్‌ ఓపెన్‌కాకపోవడం, రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్టు చూపించినా సెంటర్‌ లో వైద్య సిబ్బందికి వివరాలు రాకపోవడం, వెబ్‌ పేజీ సరిగా ఓపెన్‌ కాకుండా ముప్పుతిప్పలు పెట్టడంతో వ్యాక్సినేషన్‌ ఆలస్యమైంది. కరోనా వ్యాక్సినేషన్‌ మొదటి దశలో జనవరి 16న వైద్య సిబ్బందికి టీకా పంపిణీ ప్రారంభించినప్పుడు కూడా కొవిన్‌ యాప్‌ ఇలాగే సమస్యలు సృష్టించింది. దాన్ని ఆధునీకరించి ఇప్పుడు కొవిన్‌–2.0గా తీసుకొచ్చినా అప్పటి ఇబ్బందులే మళ్లీ ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నేరుగా సెంటర్లకు వచ్చి టీకా వేసుకునే అవకాశం కల్పించడంతో.. చాలాచోట్ల లబ్ధిదారులు టీకా కేంద్రాలకే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. 

నేరుగా వెళ్లేందుకే జనం మొగ్గు 
యాప్‌లో లేదా వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవడం కంటే.. నేరుగా సెంటర్లకే వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోవడంపై లబ్ధిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. యాప్‌లో వివరాల నమోదు, ఓటీపీ ఎంటర్‌ చేయడం, రిజిస్ట్రేషన్, తర్వాత టీకా సెంటర్‌లో సరిచూసుకోవడం వంటివాటిని జనం ఇబ్బందిగా భావిస్తున్నారని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విజయవంతం కావాలంటే సులువుగా ఉండాలని.. అంతేతప్ప విద్యార్థులు కాలేజీకి దరఖాస్తు చేసుకున్నట్లుగా అనేక కాలమ్‌లు, వివరాలతో సంక్లిష్టంగా ఉండొద్దని అంటున్నాయి. దానికితోడు సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో లబ్ధిదారులు వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇబ్బంది పడడమేకాక.. అసలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికే ముందుకు రాకుండా పోయే పరిస్థితి ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

రేపు స్పీకర్, చైర్మన్‌కు వ్యాక్సిన్‌ 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో రెండో విడత తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ హడావుడి లేకుండా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ నెల 3న అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరూ టీకా వేయించుకోనున్నారని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వారు కోఠిలోని తమ కార్యాలయానికి వచ్చి టీకా తీసుకుంటారని వెల్లడించారు. 

నేటి నుంచి నేరుగా కూడా వెళ్లొచ్చు 
మంగళవారం నుంచి కొవిన్‌–2.0లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు నేరుగా సెంటర్లకు వచ్చి కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిజానికి యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు నేరుగా వచ్చినా టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కానీ మొదటి వారం పాటు యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నవారికే వ్యాక్సిన్‌ వేయాలని భావించారు. ఇందులో సమస్యలు తలెత్తడంతో.. రెండు విధాలుగా అమలు చేయాలని నిర్ణయించారు.

రోగ ధ్రువీకరణ పత్రాలివ్వడానికి డబ్బుల వసూళ్లు
నలభై ఐదు ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం పంపిన ఫార్మాట్‌ ప్రకారం ఎంబీబీఎస్, ఆపై చదివిన డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తేవాలి. సర్కారు నిర్ధారించిన 20 రకాల జబ్బుల్లో ఏది ఉందో పేర్కొనాలి. అయితే ఇలా ధ్రువీకరించేందుకు కొందరు ప్రైవేట్‌ డాక్టర్లు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ప్రైవేట్‌ టీకా సెంటర్లలో వ్యాక్సిన్‌ ధర రూ.150, సర్వీస్‌ చార్జి రూ.100 మొత్తం కలిపి రూ.250 మాత్రమే తీసుకోవాలి. రోగ ధ్రువీకరణ మాత్రం ఉచితంగానే చేయాలి.

కానీ కొన్నిచోట్ల రోగ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి డబ్బులు వసూలు చేయడంపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఎవరైనా లబ్ధిదారుడు రోగాల ట్రీట్‌మెంట్‌ ప్రిస్కిప్షన్‌ తీసుకొస్తే.. దాన్ని చూసి టీకా కేంద్రంలోనే సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆదేశించారు.ఇక ప్రైవేట్‌ ఆస్పత్రులు టీకా ధర మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్‌ చార్జి రూ.100 వసూలు చేయకూడదని ఫోన్లు చేసి విజ్ఞప్తి చేశారు. యశోదా ఆస్పత్రి యాజమాన్యం సర్వీస్‌ చార్జి వసూలు చేయడం లేదని తెలిపారు. రెండు మూడు రోజుల్లో సినీ, రాజకీయ ప్రముఖులను రంగంలోకి దింపి టీకాపై అవగాహన కల్పిస్తామన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement