సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఎటుచూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎవరికివారే కరోనా టెస్టులు చేసుకునే అవకాశం ఉండటంతో అధికారికంగా ప్రకటించే కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. రెండో డోస్ పూర్తయినవారు బూస్టర్ డోస్ (ప్రికాషనరీ) కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి మాత్రమే బూస్టర్ డోస్ వేస్తున్నారు. పైగా వీరికి రెండో డోస్ పూర్తయిన 9 నెలలకు వేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ప్రస్తుతం బూస్టర్ డోస్ వేస్తున్నారు. సుదీర్ఘ గడువు వల్ల కీలకమైన కరోనా కల్లోల సమయంలో చాలామంది బూస్టర్ డోస్ వేయించుకునే పరిస్థితి లేదు. దీంతో యాంటీబాడీస్ లేక కరోనాకు గురయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో డోస్ తర్వాత 9 నెలలకు ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసి, గడువును ఆరు నెలలకే కుదించాలని పలువురు కోరుతున్నారు. పైగా రెండో డోస్ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ వేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు.
వ్యాక్సిన్‌తోనే రక్షణ... అందుకే డిమాండ్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 5.07 కోట్ల కరోనా టీకా డోస్‌లు వేశారు. అందులో మొదటి డోస్ 100 శాతం పూర్తయింది. రెండో డోస్ కూడా 76 శాతం మందికి వేశారు. 15–17 ఏళ్ల వయస్సు పిల్లల్లో 51 శాతం మందికి వేశారు. 60 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు లక్షన్నర మందికి వేశారు. అయితే బూస్టర్ డోస్ విషయంలో ప్రభుత్వం కొందరికే పరిమితం చేయడం, అది కూడా రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలలకు వేయడంపై నిరాశ వ్యక్తపరుస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ బూస్టర్ వేయాలని కోరుతున్నారు. దేశంలో ముందుగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. తర్వాత 60 ఏళ్లు పైబడినవారికి, ఆ తర్వాత 45–59 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ జరిగింది.
గతేడాది మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వేస్తున్నారు. గత నెల నుంచి 15–17 ఏళ్ల వయసు వారికి వేస్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్లు పైబడి రెండో డోస్ పూర్తి చేసుకున్నవారు లక్షల్లో ఉన్నారు. వారందరూ ఇప్పుడు బూస్టర్ డోస్ కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో చాలామంది అధికారిక ధ్రువీకరణపత్రం అవసరం లేకపోయినా ఫర్వాలేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి బూస్టర్ డోస్ వేయించుకుంటున్నారు. దేశంలో వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నందున బూస్టర్ డోస్ ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. ఇక ఫ్రంట్‌లైన్, హెల్త్ వర్కర్లకు రెండో డోస్ వేసిన మూడు నెలలకే బూస్టర్ డోస్ ఇవ్వాలని కోరుతున్నారు.
వారికి 3 నెలలకే ఇవ్వాలి
రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలి. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలి. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా) ప్రికాషనరీ డోసు ఇవ్వాలి. ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు ఇస్తున్నాం. ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
– కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి హరీశ్
బూస్టర్ డోస్‌పై తెలంగాణ సర్కార్ కీలక ప్రతిపాదన..!
Published Wed, Jan 19 2022 2:25 AM | Last Updated on Wed, Jan 19 2022 10:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment