సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో మళ్లీ స్తబ్ధత నెలకొంది. వారం రోజులుగా కొత్త ఒప్పందాలు పెద్దగా లేకపోవడంతో దస్తావేజుల నమోదు సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కు కనీస ఆదరణ కరువైంది. అడపాదడపా మాత్రమే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా లావాదేవీలపై ఒప్పందాల అనంతరం అధికార రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు.
కానీ మార్కెట్ విలువ, దాని ప్రభావంతో రిజిస్ట్రేషన్ రసుం పెంపు నేపథ్యంలో పాత ఒప్పందాల దస్తావేజుదారులు గత నెలాఖరులోగానే పోటీ పడి దాదాపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాల లావాదేవీలపై ప్రభావం పడింది. దీంతో కొత్త దస్తావేజుదారుల తాకిడి లేక సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు వెలవెలబోతుండగా, డాక్యుమెంట్ రైటర్స్ కేంద్రాలు బోసిపోతున్నాయి. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం)
తగ్గిన రిజిస్ట్రేషన్లు..
గ్రేటర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దినసరి దస్తావేజుల నమోదు సంఖ్య సింగిల్ డిజిట్ దాటడం లేదు. మహా నగర పరిధిలో హైదరాబాద్ (సౌత్), రంగారెడ్డి, మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తున్నాయి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణంగా రోజూ కనీసం 20 నుంచి 40 వరకు, కొన్నింటిలో 80 నుంచి 140 వరకు స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది.
వారం రోజులుగా దస్తావేజుల నమోదు సంఖ్య ఐదు నుంచి పదికి పడిపోయింది. నిరంతరం దస్తావేజుదారులతో కిటకిటలాడే ఉప్పల్, రంగారెడ్డి ఆర్వో, కుత్బుల్లాపూర్ మహేశ్వరం, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఇబ్రహీంపట్నం, ఫరూఖ్‌నగర్, వనస్థలిపురం తదితర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెద్దగా తాకిడి లేకుండాపోయింది. (క్లిక్: ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!)
Comments
Please login to add a commentAdd a comment