sub registar
-
ఇదేం కక్కుర్తి! రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందు..
తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణకు సరిగ్గా ఒక్క రోజు ముందు సెయ్యారు జిల్లా రిజిస్ట్రార్ సస్పెన్సన్‌కు గురయ్యారు. వివరాలు.. తిరువణ్ణామలైలోని సెయ్యా రు జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం నియంత్రణలో సెయ్యారు, ఆరణి, వెంబాక్కం, తెల్లారు సహా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్‌గా సంపత్ పని చేస్తున్నారు. శనివారం ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ శుక్రవారం సస్పెన్సన్‌కు గురయ్యారు. ఆరణి సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సమయంలో భూమిని ప్రభుత్వం నిర్ణయించిన విలువ కన్నా తక్కువ విలువ కట్టి రిజిస్ట్రర్ చేయడంతో విజిలెన్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలో రిటైర్డ్ అయ్యే ఒకరోజు ముందు అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి.. -
అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు.. ఇదీ అక్కడి అధికారులు తీరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు సబ్రిజిస్ట్రార్లపై బదిలీ వేటు పడనుందా? గాడ్ ఫాదర్లు, రాజకీయ అండదండలతో ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి ఈసారి స్థానచలనం కలగనుందా? అవినీతి ఆరోపణలున్నా.. కోరుకున్నచోట పోస్టింగ్ పొందుతున్న వారిపై ఇంటెలిజెన్స్ నివేదికలు సిద్ధమయ్యాయా? ఇందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు పూర్తి చేసిందా? అంటే.. నిజమే అంటున్నారు కొందరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు. చాలామంది సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తుండడం, కొందరిపై అవినీతి ఆరోపణలు, కొన్నిచోట్ల పనికి తగిన రీతిలో అధికారులు లేకపోవడం వంటి పలు కారణాలపై వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు బదిలీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి రాబడి తెచ్చే వాటిలో కీలకమైన ఈశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న వారికి స్థానచలనం కలిగించాలని చూస్తున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు సంపాదనే లక్ష్యంగా వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేస్తూ.. భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆ శాఖ పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈఆరోపణలపైనే గతేడాది ఉమ్మడి వరంగల్‌లో నలుగురిని సస్పెండ్ చేసిన అధికారులు.. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జాబితాలో వారే.. వరంగల్ జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ 13 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారు. తొమ్మిదేళ్లుగా సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతుండగా.. ఇదే కార్యాలయంలో ఈయన సీనియర్ అసిస్టెంట్‌గా ఐదేళ్లు పనిచేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నానన్న ముద్రను తొలగించుకునేందుకు ఓసబ్ రిజిస్ట్రార్ జనగామ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. కొద్ది రోజులకే ‘గాడ్ ఫాదర్’ను కలిసి ప్రసన్నం చేసుకున్న సదరు అధికారి తిరిగి జనగామ జిల్లాకు మారారు. ఈయనపై కొందరు బాధితులు గతంలో జనగామ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ములుగు జిల్లాలో ఓసబ్ రిజిస్ట్రార్ పదకొండేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో వేర్వేరుచోట్ల పనిచేస్తున్న మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఒకరు ఏడు, ఒకరు ఆరేళ్లుగా ఆ కార్యాలయాలను వీడడం లేదు. చేర్యాల సబ్ రిజిస్ట్రార్ ఎనిమిదేళ్లుగా బదిలీకి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్‌లో కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఒకేచోట లేదా వివిధ హోదాల్లో ఒకే కార్యాలయంలో పని చేస్తున్నారన్న ఆరోపణలతోపాటు కీలక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలువురు సీనియర్ అసిస్టెంట్లే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆసమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, వాటిపై వచ్చి న ఫిర్యాదులు, ఆరోపణలపైనా జరిపిన విచారణ నివేదికను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బదిలీలపై కసరత్తు చేస్తున్న సమాచారంతో ఆ జాబితాలో ఉన్న వారు పోస్టింగ్‌లను పదిలపర్చుకునేందుకు ప్రయత్నాల్లో పడ్డట్లు చర్చ జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు.. బదిలీలకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం మేరకు కీలక పోస్టింగ్‌ల కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్‌లో సస్పెండ్ అయిన ఓ అధికారి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖలోనే ప్రచారం ఉంది. ఆర్డర్లు సిద్ధమయ్యేలోగా సస్పెన్షన్ ఎత్తివేయించుకునేందుకు హైదరాబాద్‌లో ‘గాడ్ ఫాదర్’ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు వరంగల్ ఆర్వోలో పనిచేస్తున్న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో సంపత్‌కుమార్, సురేంద్రబాబు, శ్రీనివాస్, రామచంద్రయ్య ఉన్నారు. పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను నియమించే వరకు సూపరింటెండెంట్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ కార్తీక్‌లకు ఇన్‌చార్జ్‌లుగా ఆ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి నలుగురు సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నారు. సస్పెన్షన్ ఎత్తివేసినా జోన్ల మా ర్పులో భాగంగా ఓసబ్ రిజిస్ట్రార్ ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండగా.. ఉద్యోగ సంఘాల కీలక నేతతో సత్సంబంధాలు కలిగిన ఓ సస్పెండ్ సబ్ రిజిస్ట్రార్ తిరిగి నియామక ఉత్తర్వులు పొందేందు కు యత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తగ్గిన తాకిడి
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో మళ్లీ స్తబ్ధత నెలకొంది. వారం రోజులుగా కొత్త ఒప్పందాలు పెద్దగా లేకపోవడంతో దస్తావేజుల నమోదు సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌కు కనీస ఆదరణ కరువైంది. అడపాదడపా మాత్రమే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా లావాదేవీలపై ఒప్పందాల అనంతరం అధికార రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు. కానీ మార్కెట్ విలువ, దాని ప్రభావంతో రిజిస్ట్రేషన్ రసుం పెంపు నేపథ్యంలో పాత ఒప్పందాల దస్తావేజుదారులు గత నెలాఖరులోగానే పోటీ పడి దాదాపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణాల లావాదేవీలపై ప్రభావం పడింది. దీంతో కొత్త దస్తావేజుదారుల తాకిడి లేక సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు వెలవెలబోతుండగా, డాక్యుమెంట్ రైటర్స్ కేంద్రాలు బోసిపోతున్నాయి. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) తగ్గిన రిజిస్ట్రేషన్లు.. గ్రేటర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దినసరి దస్తావేజుల నమోదు సంఖ్య సింగిల్ డిజిట్ దాటడం లేదు. మహా నగర పరిధిలో హైదరాబాద్ (సౌత్), రంగారెడ్డి, మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పని చేస్తున్నాయి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణంగా రోజూ కనీసం 20 నుంచి 40 వరకు, కొన్నింటిలో 80 నుంచి 140 వరకు స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ల నమోదు ప్రక్రియ పూర్తవుతోంది. వారం రోజులుగా దస్తావేజుల నమోదు సంఖ్య ఐదు నుంచి పదికి పడిపోయింది. నిరంతరం దస్తావేజుదారులతో కిటకిటలాడే ఉప్పల్, రంగారెడ్డి ఆర్వో, కుత్బుల్లాపూర్ మహేశ్వరం, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఇబ్రహీంపట్నం, ఫరూఖ్‌నగర్, వనస్థలిపురం తదితర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పెద్దగా తాకిడి లేకుండాపోయింది. (క్లిక్: ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!) -
గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై వేటు
విజయనగరం రూరల్: కొన్ని నెలలుగా నకిలీ చలానాలు వెలుగుచూస్తున్నా.. పరిశీలన జరపకుండా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరేలా వ్యవహరించిన గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌పై అధికారులు వేటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులకు వచ్చిన చలానాలను అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకూ చలానాలను అధికారులు పరిశీలించారు. దీంతో గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి చలానాలను పరిశీలించగా.. మరికొన్ని నకిలీ చలానాలు బయటపడ్డాయి. 16 నెలల కాలంలో 130 నకిలీ చలానాలు బయటపడగా, రూ. 35,18,590ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దీనితో ప్రమేయమున్న దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులపై సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం సొమ్మును వారి నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఇంత జరుగుతున్నా సరైన పరిశీలన జరపని సబ్ రిజిస్ట్రార్‌తో పాటు, సీనియర్ సహాయకుడు మహేష్, జూనియర్ అసిస్టెంట్ నర్సింగరావులను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ కళ్యాణి బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
గుడ్‌న్యూస్: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల
సాక్షి,అమరావతి: గ్రూప్-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్సైట్లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచినట్లు తెలిపారు -
జిల్లా రిజిస్ట్రార్లు లేరు
సాక్షి, హైదరాబాద్: కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచాయి. తిరిగి ప్రారంభమైనా... హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల విధానం పలు మార్పులకు లోనవుతోంది. కొత్త, పాత పద్ధతుల కలబోతతో పలు సమస్యలు, సందేహాలు. కిందిస్థాయి సిబ్బందికి సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం అవసరం. ఇలాంటి కీలక తరుణంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణకు ఉన్నతాధికారుల కొరత కనిపిస్తోంది. శాఖాపరమైన కేటాయింపుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 మంది జిల్లా రిజిస్ట్రార్ల (పాత జిల్లాల వారీగా) పోస్టులు ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చదవండి: (తెలంగాణ: డ్రై రన్ సక్సెస్) వీరిలో ముగ్గురు సెలవుపై వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఐదుగురు జిల్లా రిజిస్ట్రార్లు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో ఒక్కో అధికారి మూడు, నాలుగు జిల్లాలకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణ, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, చిట్ ఆర్బిట్రేషన్, ఆడిట్ లాంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఆ శాఖ అధికారులే చెపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై జోరుగా సాగుతున్న సమయంలో కీలకమైన ఈ అధికారులు లేకపోవడం క్షేత్రస్థాయిలో సమస్యగా మారుతోందని, జిల్లా రిజిస్ట్రార్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే అభిప్రాయం ఈ శాఖలో వ్యక్తమవుతోంది. పదోన్నతి ఇచ్చారు... పోస్టింగులు మరిచారు మరో విచిత్రమేమిటంటే... ఏ శాఖలో అయినా ఉద్యోగులు లేక పోస్టులు ఖాళీగా ఉంటాయి. కానీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అర్హత కలిగిన ఉద్యోగులు ఉండి కూడా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. గ్రేడ్–1 సబ్రిజిస్ట్రార్లుగా ఉన్న ఆరుగురు అధికారులకు 2019 జనవరిలో జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చారు. కానీ, 24 నెలలుగా వారికి పోస్టింగులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్ హోదాలో తమ పాత స్థానాల్లోనే సబ్‌రిజిస్ట్రార్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు పొందిన వారిని పాత పోస్టుల్లోనే కొనసాగించడం రిజిస్ట్రేషన్ల శాఖలో విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత కీలక సమయంలోనైనా పదోన్నతులు, పోస్టింగుల విషయాన్ని నాన్చకుండా వెంటనే ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. -
సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు వసూలు
రాజేంద్రనగర్: మాజీ ఏసీబీ కానిస్టేబుల్ చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓం ప్రకాశ్ ఏసీబీ రంగారెడ్డి జిల్లా శాఖలో కానిస్టేబుల్ విధులు నిర్వహించాడు. 2018లో హుడా ఉద్యోగి పురుషోత్తంపై జరిగిన ఏసీబీ దాడుల విషయమై సమాచారాన్ని పురుషోత్తానికి లీక్ చేసినందుకు అధికారులు విచారించి సస్పెండ్ చేశారు. కాగా, ఓంప్రకాశ్ ఈ నెల 11న చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ వద్దకు వెళ్లి నీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రూ.10లక్షలు ఇస్తే ఎలాంటి విచారణా జరగదని, ఉన్నతాధికారులు తనకు తెలపడంతో నీకు ముందస్తుకు చెబుతున్నానంటూ చెప్పాడు. అప్పటి నుంచి డబ్బు కావాలంటూ కార్యాలయానికి రావడంతో పాటు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. చివరకు సబ్ రిజిస్ట్రార్ రూ.లక్షా 50వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. విషయాన్ని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోదక శాఖ డీఎస్పీ సత్యనారాయణకు తెలిపారు. శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అప్పా చౌరస్తా వద్ద రాజేందర్ వద్ద ఓంప్రకాశ్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ భూమ్
రియల్ భూమ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు చోట్లు తప్పితే అన్నిచోట్ల దస్తావేజులు (డాక్యుమెంట్ల) సంఖ్య, రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖకు తొలిసారిగా ఆదాయం పెరగడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: రెవెన్యూ ఆదాయం, దస్తావేజుల సంఖ్య పరంగా పరిశీలిస్తే మంచిర్యాలలో రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట్, ఖానాపూర్ వరుసగా నిలిచాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న రియల్ మార్కెట్ 2018–19లో గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతం విస్తరించడం, పట్టణ శివారు గ్రామాల్లో రియల్ వెంచర్లు జోరుగా వెలుస్తుండడంతోపాటు క్రయ, విక్రయాలు పెరగడంతో మార్కెట్ ఊపందుకుంది. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వంటి ఆదాయ అభివృద్ధికి కారణం అయ్యాయి. నిర్మల్‌లో గతేడాది కంటే ఈసారి ఆదాయం తగ్గడం, అదే సమయంలో దస్తావేజుల సంఖ్య కూడా తగ్గింది. ప్రధానంగా గతంలో కుంటాల, లోకేశ్వరం, తానూర్‌కు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు నిర్మల్‌లో జరిగేవి. అయితే వాటిని భైంసాకు తరలించడంతో దస్తావేజుల సంఖ్య తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కుమురంభీం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఆసిఫాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ 2017–18 సంవత్సరంలో 3,237 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, 2018–19 సంవత్సరంలో 3,995కు పెరిగింది. మార్కెట్ విలువతో రిజిస్ట్రేషన్లు.. ఆదిలాబాద్, మంచిర్యాలలో ఓపెన్ ప్లాట్లను బహిరంగ మార్కెట్లో ఉన్న విలువతో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఫీజుల రూపంలో అధిక ఆదాయం లభిస్తుంది. ప్లాట్లకు ప్రభుత్వ ధరతో నిర్ణయించిన శాతం ధరతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. అయితే బ్యాంక్ లోన్ కోసం బహిరంగ మార్కెట్లో ఆ ప్లాట్ పలుకుతున్న ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భూయజమాని ఆసక్తి కనబర్చుతున్నారు. దీంతోనే ఆదాయం పెరిగిందని రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ శివారులో మావల, దస్నాపూర్, బట్టిసావర్గాం ప్రాంతాల్లో రియల్ వెంచర్లు జోరుగా వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇదివరకే వెలిసిన ఎన్ఓసీ ఉన్న రియల్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను గత ఆరు నెలలుగా నిలిపివేశారు. అయినా ఇక్కడ ఆదాయం పెరగడం గమనార్హం. ఒకవేళ ఎన్ఓసీ వెంచర్లలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పక్షంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగులకు రూ.10లక్షల వడ్డీ రాయితీ రుణం ఇస్తుండడంతో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దస్తావేజుల సంఖ్య మంచిర్యాలలో భారీగా పెరిగింది. నస్పూర్, క్యాతన్‌పెల్లి, తిమ్మాపూర్ ప్రాంతాల్లో రియల్ వెంచర్లలో క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు చెన్నూర్, కోటపల్లి ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం కూడా ఇవి పెరగడానికి కారణమైనట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మంచిర్యాల–మహారాష్ట్రలోని సిరొంచ వరకు ప్రాణహితపై బ్రిడ్జి కావడంతో ఛత్తీస్‌ఘడ్ వరకు రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూ క్రయ, విక్రయాలు జోరందుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు. భైంసాలో భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు అధికంగా ఉండడంతో పట్టణ పరిసరాలు వృద్ధి చెందడంతో పాటు వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో ఒకేచోట దొరికే పరిస్థితి ఉండటం కూడా రియల్ వృద్ధికి కారణమవుతోంది. 10, 20, 30, 40 ఎకరాలు ఒకేచోట లభ్యమయ్యే పరిస్థితి ఉండడం, కెనాల్ సదుపాయంతో నీరు సమృద్ధిగా ఉండడంతో పలువురు బల్క్‌గా వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల రూపంలో పలువురు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. భైంసా, బాసర, మాటెగాంలలో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయం అధికంగా ఉండటం, బాసర అమ్మవారి ఆలయం, ట్రిపుల్ఐటీ కారణంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. భైంసా పట్టణంలో రాహుల్‌నగర్, నిర్మల్రోడ్, బస్టాండ్ ఏరియాల్లో ఓపెన్ ప్లాట్ల క్రయ, విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. దస్తావేజులు, ఆదాయం పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కంటే ఈసారి రూ.15కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసాలో రెవెన్యూ ఆదాయం అధికంగా ఉంది. మిగతా చోట్ల కూడా దస్తావేజుల సంఖ్య పర్వాలేదు. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
ఏకంగా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీనంటూ మోసాలు!
-
ఇది ఘరానా మోసగాడి బాగోతం
సాక్షి, హైదరాబాద్ : చిన్నాచితక అధికారినంటే మోసం చేయలేననుకున్నాడో..ఏమో ఏకంగా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీనంటూ మోసాలకు తెగబడ్డాడో ఓ నేరగాడు. ఏకంగా ఉన్నతాధికారులనే బెదిరించాడు. పాపం పండటంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇది ఘరానా మోసగాడు విజయ్‌కుమార్ బాగోతం. డిజిటల్ సీపీ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో విజయ్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఖానామెట్‌లో వివాదాస్పదంగా ఉన్న రెండెకరాల భూమి డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని రంగారెడ్డి సబ్ రిజిస్టార్ సబ్బారావును విజయ్‌కుమార్ బెదిరించాడు. ఇందుకోసం సీఎం ఆఫీసులో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగరావు పేరును వాడుకున్నాడు. తాను ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ సబ్‌రిజిస్ట్రార్‌ను బెదిరించాడు. వేధింపులు ఎక్కువకావటంతో సబ్‌రిజిస్టార్ పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే విజయ్‌కుమార్ బండారం బయటపడింది. ఇదొక్క కేసే కాదు.. విజయ్‌కుమార్‌పై తెలంగాణ, ఏపీ, చెన్నైలో తప్పుడు డాక్యుమెంట్లు, బెదిరింపుల చేశాడంటూ 15 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణలోనూ విజయ్‌కుమార్ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కొడుకునని చెప్పుకున్నాడు. -
కూకట్‌పల్లిలో భూమాయ
► సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అరెస్టు ► మియాపూర్‌లో 693 ఎకరాల ప్రభుత్వ భూమి ధారాదత్తం కేసులో మరో ఇద్దరు కూడా అరెస్టు ► ప్రభుత్వానికి రూ.587 కోట్లకుపైగా ఆదాయానికి గండి సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 693 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన కేసులో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఎన్.సైదిరెడ్డి కూకట్పల్లి పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో కీలక నిందితులైన ఆయనతోపాటు ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలను కూడా అరెస్టు చేశారు. అనంతరం వీరి ఇళ్లల్లో సోదాలు చేసి సంబంధిత భూడాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి డిప్యూటీ కలెక్టర్ గుర్తించినా ఆగని మోసం... కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నంబర్ 20లో 109 ఎకరాల 18 గుంటలు, సర్వే నంబర్ 28లో 145 ఎకరాలు, 26 గుంటలు, సర్వే నంబర్ 100లో 207 ఎకరాలు ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అంటూ శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ 2007 మార్చి 30వ తేదీన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌కు క్లియర్ మెమో జారీ చేయడంతో ఈ భూ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మళ్లీ 2011లో అవి ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అంటూ మళ్లీ అదే అధికారికి ఆయన లేఖలు రాశారు. నిందితుడు పార్థసారథి, ఇతరులు కలసి అమీరున్నీసాతోపాటు మరో ఏడుగురు పేరిట 2016 జనవరి 15న జీపీఏ తయారు చేసిన పార్థసారథి మరో ఏడురోజుల వ్యవధిలోనే జనవరి 21న సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ పేరిట ఆ భూమిని బదలాయించాడు. ట్రినిటి ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, అదే కంపెనీలోనే డైరెక్టర్‌గా సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ కూడా ఉన్నారు. వీరితోపాటు అదే కంపెనీలోని ఇతర డైరెక్టర్లు కూకట్పల్లి ఎస్ఆర్వో రాచకొండ శ్రీనివాసరావుతో కుమ్మక్కై ప్రభుత్వానికి రూ.587.11 కోట్ల ఆదాయాన్ని నష్టం కలిగించాడు. 1908 (22ఏ) ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సెక్షన్ 82 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించిన రాచకొండ శ్రీనివాసరావుతోపాటు ఈ భూదందాలో కీలకపాత్రదారులైన పీఎస్ పార్థసారథి, పీవీఎస్ శర్మలను శనివారం సాయంత్రం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నివాసాల్లోనూ సోదాలు చేసి సంబంధిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు.