కూకట్‌పల్లిలో భూమాయ
► సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అరెస్టు
► మియాపూర్‌లో 693 ఎకరాల ప్రభుత్వ భూమి ధారాదత్తం కేసులో మరో ఇద్దరు కూడా అరెస్టు
► ప్రభుత్వానికి రూ.587 కోట్లకుపైగా ఆదాయానికి గండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని 693 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన కేసులో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఎన్.సైదిరెడ్డి కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో కీలక నిందితులైన ఆయనతోపాటు ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలను కూడా అరెస్టు చేశారు. అనంతరం వీరి ఇళ్లల్లో సోదాలు చేసి సంబంధిత భూడాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
అప్పటి డిప్యూటీ కలెక్టర్ గుర్తించినా ఆగని మోసం...
కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నంబర్ 20లో 109 ఎకరాల 18 గుంటలు, సర్వే నంబర్ 28లో 145 ఎకరాలు, 26 గుంటలు, సర్వే నంబర్ 100లో 207 ఎకరాలు ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అంటూ శేర్‌లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ 2007 మార్చి 30వ తేదీన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌కు క్లియర్ మెమో జారీ చేయడంతో ఈ భూ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మళ్లీ 2011లో అవి ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అంటూ మళ్లీ అదే అధికారికి ఆయన లేఖలు రాశారు. నిందితుడు పార్థసారథి, ఇతరులు కలసి అమీరున్నీసాతోపాటు మరో ఏడుగురు పేరిట 2016 జనవరి 15న జీపీఏ తయారు చేసిన పార్థసారథి మరో ఏడురోజుల వ్యవధిలోనే జనవరి 21న సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ పేరిట ఆ భూమిని బదలాయించాడు.
ట్రినిటి ఇన్‌ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, అదే కంపెనీలోనే డైరెక్టర్‌గా సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ కూడా ఉన్నారు. వీరితోపాటు అదే కంపెనీలోని ఇతర డైరెక్టర్లు కూకట్‌పల్లి ఎస్‌ఆర్‌వో రాచకొండ శ్రీనివాసరావుతో కుమ్మక్కై ప్రభుత్వానికి రూ.587.11 కోట్ల ఆదాయాన్ని నష్టం కలిగించాడు. 1908 (22ఏ) ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సెక్షన్ 82 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నిబంధనలు అతిక్రమించిన రాచకొండ శ్రీనివాసరావుతోపాటు ఈ భూదందాలో కీలకపాత్రదారులైన పీఎస్ పార్థసారథి, పీవీఎస్ శర్మలను శనివారం సాయంత్రం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నివాసాల్లోనూ సోదాలు చేసి సంబంధిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు.