సాక్షి, హైదరాబాద్: కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచాయి. తిరిగి ప్రారంభమైనా... హైకోర్టు ఆదేశాలతో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల విధానం పలు మార్పులకు లోనవుతోంది. కొత్త, పాత పద్ధతుల కలబోతతో పలు సమస్యలు, సందేహాలు. కిందిస్థాయి సిబ్బందికి సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం అవసరం. ఇలాంటి కీలక తరుణంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణకు ఉన్నతాధికారుల కొరత కనిపిస్తోంది. శాఖాపరమైన కేటాయింపుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 21 మంది జిల్లా రిజిస్ట్రార్ల (పాత జిల్లాల వారీగా) పోస్టులు ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చదవండి: (తెలంగాణ: డ్రై రన్ సక్సెస్)
వీరిలో ముగ్గురు సెలవుపై వెళ్లిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఐదుగురు జిల్లా రిజిస్ట్రార్లు మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు లేకపోవడంతో ఒక్కో అధికారి మూడు, నాలుగు జిల్లాలకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణ, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్, చిట్ ఆర్బిట్రేషన్, ఆడిట్ లాంటి అంశాల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఆ శాఖ అధికారులే చెపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై జోరుగా సాగుతున్న సమయంలో కీలకమైన ఈ అధికారులు లేకపోవడం క్షేత్రస్థాయిలో సమస్యగా మారుతోందని, జిల్లా రిజిస్ట్రార్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే అభిప్రాయం ఈ శాఖలో వ్యక్తమవుతోంది.
పదోన్నతి ఇచ్చారు... పోస్టింగులు మరిచారు
మరో విచిత్రమేమిటంటే... ఏ శాఖలో అయినా ఉద్యోగులు లేక పోస్టులు ఖాళీగా ఉంటాయి. కానీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అర్హత కలిగిన ఉద్యోగులు ఉండి కూడా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. గ్రేడ్–1 సబ్‌రిజిస్ట్రార్లుగా ఉన్న ఆరుగురు అధికారులకు 2019 జనవరిలో జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చారు. కానీ, 24 నెలలుగా వారికి పోస్టింగులు ఇవ్వడం లేదు. దీంతో ఈ ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్ హోదాలో తమ పాత స్థానాల్లోనే సబ్‌రిజిస్ట్రార్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతులు పొందిన వారిని పాత పోస్టుల్లోనే కొనసాగించడం రిజిస్ట్రేషన్ల శాఖలో విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుత కీలక సమయంలోనైనా పదోన్నతులు, పోస్టింగుల విషయాన్ని నాన్చకుండా వెంటనే ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment