డబ్బులతో ఏసీబీకి చిక్కిన ఓం ప్రకాష్
రాజేంద్రనగర్: మాజీ ఏసీబీ కానిస్టేబుల్ చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓం ప్రకాశ్ ఏసీబీ రంగారెడ్డి జిల్లా శాఖలో కానిస్టేబుల్ విధులు నిర్వహించాడు. 2018లో హుడా ఉద్యోగి పురుషోత్తంపై జరిగిన ఏసీబీ దాడుల విషయమై సమాచారాన్ని పురుషోత్తానికి లీక్ చేసినందుకు అధికారులు విచారించి సస్పెండ్ చేశారు. కాగా, ఓంప్రకాశ్ ఈ నెల 11న చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ వద్దకు వెళ్లి నీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని, రూ.10లక్షలు ఇస్తే ఎలాంటి విచారణా జరగదని, ఉన్నతాధికారులు తనకు తెలపడంతో నీకు ముందస్తుకు చెబుతున్నానంటూ చెప్పాడు. అప్పటి నుంచి డబ్బు కావాలంటూ కార్యాలయానికి రావడంతో పాటు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. చివరకు సబ్ రిజిస్ట్రార్ రూ.లక్షా 50వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. విషయాన్ని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోదక శాఖ డీఎస్పీ సత్యనారాయణకు తెలిపారు. శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అప్పా చౌరస్తా వద్ద రాజేందర్ వద్ద ఓంప్రకాశ్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment