కాకినాడ లీగల్ :ప్రీ ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అమల్లోకి తీసుకురానుంది. ఇందుకోసం క్రయ, దానపట్టాల దస్తావేజుల రిజిస్ట్రేషన్లను ప్రయోగాత్మకంగా చేయాలని నిర్ణయించింది. వృద్ధులు, వికలాంగులు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు అనుకున్న సమయానికి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఈ ఆన్‌లైన్ విధానం సౌకర్యంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ ఈ విధానం ద్వారా స్లాట్ బుకింగ్‌లో ఆరు రిజిస్ట్రేషన్లు చేయించుకునే వీలుంది.
ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..
స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ నమూనాను పూర్తి చేయాలి. సంబంధిత రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తులో పేర్కొన్నచోట ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే.. ఆటోమెటిక్‌గా డేటా సెంటర్ నుంచి క్రయవిక్రయదారుల వేలిముద్రలతో పాటు సాక్షుల వివరాలు కూడావస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేయాలి. ఆస్తి మార్కెట్ విలువను కూడా ఆన్‌లైన్‌లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ ద్వారా లేదా చలానా, డీడీ తీసి.. ఆ నంబర్లను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో అందులో పేర్కొంటే, ప్రాధాన్య క్రమంలో స్లాట్ కేటాయిస్తారు.
తద్వారా వచ్చే డాక్యుమెంట్‌ను రూ.100 స్టాంపు పేపర్లపై ప్రింట్ తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌ను సబ్‌రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళితే, స్థిరాస్తికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. మరోసారి వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న క్రయవిక్రయదారులు నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే స్లాట్ బుకింగ్ రద్దవుతుంది. ఆయా అంశాలపై తిరుపతి, విజయవాడలో రిజిస్ట్రేషన్ అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. త్వరలో విశాఖపట్నంలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
అందరికీ సౌకర్యవంతం
ఆన్‌లైన్ (స్లాట్) విధానం క్రయవిక్రయదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుగోలుదారులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుంటుంది. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- పీజీఎస్ కల్యాణి, జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ
వేగవంతంగా రిజిస్ట్రేషన్లు
క్రయ, విక్రయదారులను దృష్టిలో ఉంచుకుని, చురుకుగా పనులు జరగడానికి ఆధార్‌తో లింక్ చేస్తూ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా.. భవిష్యత్తులో బాగుంటుంది.
- వాకా రంగారెడ్డి, జిల్లా రిజిస్ట్రార్, రాజమండ్రి
ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
Published Sun, Nov 9 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement