సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ స్లాట్ విధానం దస్తావేజుదారులకు చుక్కలు చూపుతోంది. సిబ్బంది కొరత, ఆన్‌లైన్‌పై అవగాహన లేకపోవడం, మంచి ముహూర్తాల కోసం వేచిచూడడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు ప్లాట్ లేదా భూమి కొనుగోలు చేసి వెసులుబాటుతో మంచి ముహూర్తం చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూశాం. కానీ ఆన్‌లైన్ పద్ధతి వల్ల ఇది సాధ్యం కావడం లేదు. ఎప్పుడు స్లాట్ దొరికితే అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోందని దస్తావేజుదారులు వాపోతున్నారు. స్థిరాస్తుల నమోదుకు అమావాస్య...పున్నమి, మంచి, చెడు రోజు అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణలో భాగంగా దస్తావేజుల నమోదు కోసం ఆఫ్‌లైన్ విధానానికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా దస్తావేజుదారులు ఆన్‌లైన్ స్లాట్‌బుక్ చేసుకొని వస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేసేది లేదని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది ఖరాకండిగా చేప్పేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో స్లాట్ లభించేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నగర పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నెలకొంది.
రోజుకు 15 నుంచి 18 వరకు
నగరంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు పడిపోయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి రోజు సుమారు 50 నుంచి 150 వరకు దస్తావేజులు నమోదు జరగగా, గత పక్షం రోజుల నుంచి పది శాతానికి మించి నమోదు కాని పరిస్ధితి నెలకొంది. ప్రతి రోజు ఒక్కో సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో 15 నుంచి 18 మించి స్లాట్ బుకింగ్ లభించడం లేదు. దీంతో ఆన్‌లైన్ స్టాట్ కోసం వారం, పది రోజులు వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు ముహూర్తాలు పెట్టుకొని వచ్చిమరీ ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించుకొని వెళ్లేవారు. తాజాగా ఆ పరిస్ధితి కనిపించడం లేదు.
సిబ్బంది కొరతేనా...
రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు, పదవీ విరమణ చేసిన పోస్టులు భర్తీ చేయక పోవడంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగింది. దీంతో ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాక ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై సిబ్బంది సేవలు వినియోగించారు. కానీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం పెరగడంతో వారిని పెద్దఎత్తున తొలగించారు. అయితే సిబ్బంది కొరత ఏర్పడటంతో తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఇద్దరు ముగ్గురు చొప్పున తిరిగి కేటాయించింది. అయితే దస్తావేజుదారుల తాకిడి పెరిగి ప్రస్తుత సిబ్బంది ఏ మూలకు సరిపోవడం లేదు. తాజాగా టీఎన్‌జీవో రిజిస్ట్రేషన్ శాఖ విభాగం ప్రతినిధులు ఏకంగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్‌ను కలిసి సిబ్బంది కొరత పై వినతిపత్రం సమర్పించారు. సిబ్బంది కొరత అధిగ మించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేయాలని, తక్షణమే ఆఫీసుకు 5 నుంచి 8 మంది చొప్పున తీసుకోవాలని విన్నవించారు.
తగ్గుతున్న ఆదాయం
మహానగరంలో స్థిరాస్తి భూమ్‌తో రికార్డులు సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కేవలం పక్షం రోజుల్లో పది శాతం పడిపోయింది. వాస్తవంగా నగర శివార్లలోని వరంగల్ హైవేలో యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు, ఇన్ఫోసిస్ విస్తరణ, ఘట్‌కేసర్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండ, చిత్రనగరి తదితర నిర్మాణాల ప్రకటనతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి జీవం పోసినట్లయింది. మరోవైపు నగర శివారులోని రాయదుర్గం, కోకాపేట, మణికొండ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలు ప్రధాన కార్యాలయాల ఏర్పాటు, నివాస గృహాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను కొనుగోలు చేయడంతో ఒకేసారి స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరిగినట్లయింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది నగర నుంచే సుమారు 70 శాతం ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ స్లాట్‌లతో ఆదాయం తగ్గుముఖం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment