సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ‘గోల్డెన్’డీల్స్ వస్తున్నాయి. 2023 సంవత్సరం ప్రారంభంలోనే మంచి బోణీ అందింది. జనవరి తొలివారంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రిజి స్ట్రేషన్‌తో ఏకంగా రూ.15.96 కోట్ల ఆదాయం సమకూరింది. గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న 75,072 చదరపు గజాల భూమిని మైనార్టీ ట్రస్టు నుంచి మరో ఎడ్యుకేషనల్ ట్రస్టుకు బదలాయిస్తూ (కన్వేయన్స్) ఈ లావాదేవీ జరిగింది.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ భూమి మొత్తం మార్కెట్ విలువను రూ.210 కోట్లుగా లెక్కించి, రూ.15.96 కోట్ల ఫీజు వసూలు చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ ఆరేడు జాక్‌పాట్ లావాదేవీలు జరిగినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తాజాగా తెలిసింది.
ఇంతకు ముందు ఇంకా పెద్ద డీల్
2022 మేలో ఒకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏకంగా రూ.35.51 కోట్ల ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వచ్చే మిస్కిపేటలో 1,54,880 చదరపు గజాల భూమిని ఓ ఆయిల్ కార్పొరేషన్, ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాయి. ఈ భూమి మార్కెట్ విలువ రూ.466 కోట్లుగా నిర్ధారించిన రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు 35.51 కోట్ల ఫీజు వసూలు చేశారు. ఇక గండిపేట, రాజేంద్రనగర్, వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ పలు భారీ లావాదేవీలు జరిగాయని.. కేవలం 5 డాక్యుమెంట్ల ద్వారానే రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరిందని అధికారవర్గాలు తెలిపాయి.
రూ.14,500 కోట్లదాకా ఆదాయం!
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 13 నాటికి రూ.12,310 కోట్ల వరకు ఖజానాకు చేరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. ఇంకో రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో పేర్కొన్న విధంగా రూ.16 వేల కోట్లు, 2023–24కు నిర్దేశించుకున్న రూ.18 వేల కోట్లు సమకూరే అవకాశం లేదని.. రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా భూ విలువలను సవరిస్తేనే లక్ష్యం చేరుకోవడం సాధ్యమని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూము లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ కలిపి రూ.14,500 కోట్ల మేరకు సమకూరవచ్చని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment