సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో పన్ను ఆదాయ ప్రతిపాదనలు తొలిసారి రూ. లక్ష కోట్లను మించాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 1,08,212 కోట్ల మేర సొంత పన్ను ఆదాయం వస్తుందనే అంచనాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను బట్టి చూస్తే రాష్ట్ర సొంత ఆదాయ వనరులపై సర్కారుకు పూర్తి ధీమా ఉన్నట్లు అర్థమవుతోంది. గతేడాది ప్రతిపాదించిన రూ. 92 వేల కోట్ల పన్ను రాబడుల్లో 100 శాతం రావడంతో ఈసారి అదనంగా రూ. 17 వేల కోట్లను అంచనా వేస్తూ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది.
వాహనాలపై పన్ను పద్దు మినహా...
ఈసారి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే పన్ను ఆదాయ పద్దులన్నింటిలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క వాహనాలపై పన్ను పద్దులో మాత్రమే కొంత తగ్గుదలను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమ్మకపు పన్ను అంచనాలు గతేడాది రూ. 26,500 కోట్లు చూపగా ఈసారి దాన్ని రూ.33,000 కోట్లకు పెంచారు. అలాగే జీఎస్టీ కింద రూ. 31 వేల కోట్లు వస్తాయని గతేడాది అంచనా వేయగా ఈసారి రూ. 36,203 కోట్లు ప్రతిపాదించారు.
ఎక్సైజ్ శాఖ పద్దు కూడా రూ. 500 కోట్లు పెరిగింది. గతేడాది రూ. 17,000 కోట్ల అంచనాలు ఈసారి రూ. 17,500 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కింద గతేడాది రూ. 12,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా ఈసారి రూ. 15,600 వస్తాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.
భూముల అమ్మకాలకు అదే స్థాయిలో...
అయితే ఈసారి పన్నేతర ప్రతిపాదనలను తగ్గించి చూపారు. గతేడాది పన్నేతర ఆదాయం రూపంలో రూ. 30,557 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ. 20,557 కోట్లే వచ్చాయి. అయినా ఈసారి మరో రూ. 5 వేల కోట్లు కలిపి రూ. 25,422 కోట్లకు పెంచారు. అందులో మైనింగ్ శాఖ ద్వారా రూ. 6,399 కోట్లు, భూముల అమ్మకాల ద్వారా రూ. 15,500 కోట్లు చూపారు. ఇతర పన్నేతర ఆదాయ రూపంలో రూ. 3,500 కోట్లు అంచనాలను ప్రతిపాదించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment